సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. గ్రామాలు, నగరాలు గజగజ వణుకుతున్నాయి. విజయవాడ నగరంలో చలిపులి పంజా విసురుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా నగరంలో కొద్దిరోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడలో బుధవారం తెల్లవారుజామున 13 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. 50 ఏళ్ల తరువాత విజయవాడలో నమోదైన అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణశాఖ చెబుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి నగరంలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. పదిరోజులుగా విశాఖ, తిరుపతి నగరాల కంటే విజయవాడలోనే ఎక్కువ చలి వాతావరణం ఉంటోంది.
1970లో డిసెంబర్ 14న అత్యల్పంగా 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 1995, 1984, 2010 సంవత్సరాల్లో 13.7, 13.4, 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఈ సంవత్సరం నగరంలో చలితీవ్రత పెరిగింది. రాబోయే రెండురోజులు నగరంలో చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కృష్ణాజిల్లా అంతా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోను చలిగాలులు కొనసాగుతున్నాయి. బుధవారం విశాఖ జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 5.4 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. పెదబయలులో 5.7, ముంచంగిపుట్టులో 6.3, డుంబ్రిగూడలో 6.8, అరకు వ్యాలీలో 7, గుంటూరులో 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్య భారతదేశం నుంచి చల్లటిగాలులు నేరుగా ఏపీ వైపు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment