సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో గత రెండ్రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల మేర తగ్గాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 30 డిగ్రీల కన్నా తక్కువగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో అతి తక్కువగా 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డవగా, మెదక్‌లో అతి ఎక్కువగా 32.6 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ శీతాకాలంలో ఇప్పటివరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం.
రెండ్రోజులు పొడి వాతావరణం
ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, హన్మకొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల మేర పడిపోయాయి. రానున్న 4 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ రెండ్రోజులు పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేకున్నా ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో కనిష్ణ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రేపు దక్షిణ అండమాన్‌లో అల్పపీడనం
దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 48 గంటల తర్వాత అల్పపీడనం బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment