సాధారణంకంటే పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
అత్యల్పంగా సిర్పూర్‌లో 6.5 డిగ్రీల సెల్సియస్ నమోదు
అల్పపీడన ప్రభావం తొలగిపోవటంతో పెరిగిన చలి
గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంకంటే అధికంగానే..
సాక్షి, హైదరాబాద్/ తిర్యాణి (ఆసిఫాబాద్): రాష్ట్రంలో చలి గజగజ వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే దిగువకు పడిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావాలతో గతవారం వరకు సాధారణ స్థితి కంటే కాస్త అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి.
ప్రస్తుతం ఆ ప్రభావం తొలగిపోవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే కాస్త ఎక్కువగానే నమోదైనప్పటికీ.. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ), తిర్యాణి మండలం గిన్నెధరిలో 6.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5.6 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం నల్లగొండ మినహా అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల మేర అధికంగా నమోదు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment