గణనీయంగా తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు
గతేడాది కన్నా ఐదు డిగ్రీల తక్కువ నమోదు
డుంబ్రిగూడలో 8.6 డిగ్రీలు..
జి.మాడుగుల, జీకే వీధిలలో 8.7 డిగ్రీలు..
తీవ్రంగా పెరిగిన చలిగాలులు, పొగమంచు
చింతపల్లి: మన్యంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దట్టంగా పొగమంచు కురవడంతోపాటు శీతల గాలులు, చలి తీవ్రత పెరిగాయి. దీంతో మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు. గురువారం డుంబ్రిగూడలో 8.6 డిగ్రీలు, జి.మాడుగుల, జీకే వీధిల్లో 8.7 డిగ్రీలు, హుకుంపేటలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ ఉష్ణోగ్రతల విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
అదేవిధంగా అరకులోయలో 9.1, డిగ్రీలు, పెదబయలులో 9.5, చింతపల్లిలో 9.4, పాడేరులో 9.8, ముంచింగ్‌పుట్టులో 11.2, కొయ్యూరులో 13.3, అనంతగిరిలో 15.5 డిగ్రీలు చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించారు. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం నుంచి ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది నవంబర్ 10, 12, 29, 30 తేదీల్లో 13 నుంచి 13.5 డిగ్రీలు మాత్రమే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ ఏడాది డిసెంబర్ నెలలో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు ముందుగానే నమోదు కావడంతో మన్యం ప్రాంత ప్రజలు వణుకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలులు బాగా వీస్తున్నాయి. ఉదయం 9.30 గంటలు దాటే వరకు పొగమంచు వదలడం లేదు. పొగమంచు, చలి తీవ్రత వల్ల వాహనచోదకులు, విద్యార్థులు, పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment