సాక్షి, హైదరాబాద్: హమ్మయ్య! ఈ నెలలో దక్షిణాది రాష్ట్రాలు కొంచెం నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటారా? దేశం మొత్తమ్మీద మార్చి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. కానీ, దేశ ద్వీపకల్ప ప్రాంతంలో మాత్రం వేడి సాధారణం నుంచి అంతకంటే తక్కువ ఉండనుంది. భారతీయ వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ విషయం తెలిపింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మాత్రం ఎన్నడూ లేనంతగా, స్పష్టంగా చెప్పాలంటే 1877 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా రికార్డు సృష్టించింది.
వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐఎండీ మంగళవారం వర్చువల్ పద్ధతిలో విలేకరుల సమావేశం నిర్వహించింది. మార్చి నుంచి మే నెల వరకూ వేసవి తీరుతెన్నులపై తన అంచనాలను వెలువరించింది. దీని ప్రకారం.. మార్చిలో గరిష్ట ఉష్ణోగ్రతలు దేశ ఈశాన్య, తూర్పు, మధ్య ప్రాంతాలతోపాటు వాయువ్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి. మిగిలిన ప్రాంతాలు అంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం తక్కువగా ఉంటాయి.
కనిష్ట ఉష్ణోగ్రతల్లోనూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు మినహా మిగిలిన అన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. మార్చి నుంచి మే నెల మధ్యభాగంలో దేశ మధ్య ప్రాంతం దానికి అనుకుని ఉండే వాయవ్య ప్రాంతాల్లో వడగాడ్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉండనుంది. మార్చిలో దేశంలోని మధ్య ప్రదేశంలో వడగాడ్పుల ప్రభావం అంతగా ఉండకపోవచ్చు.
సాధారణ స్థాయిలోనే వర్షాలు..
మార్చి నెలలో వర్షపాతం కూడా దేశం మొత్తమ్మీద సాధారణంగానే ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలిక అంచనాలతో పోల్చినప్పుడు ఈ నెల వర్షాలు 83 –117 శాతం మధ్యలో ఉంటాయని తెలిపింది. దేశ వాయవ్య ప్రాంతాల విషయానికి వస్తే అక్కడ సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షాలు నమోదు కావచ్చునని, సెంట్రల్ ఇండియా పశ్చిమ దిక్కున, ఈశాన్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. దేశ ద్వీపకల్ప ప్రాంతంలో మార్చి నెల వానలు సాధారణం లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయని తెలిపింది.
ఎల్‌నినో, లానినాలపై ఇప్పుడే చెప్పలేం
ఈ ఏడాది రుతుపవనాల పరిస్థితులపై స్పష్టంగా చెప్పడం ప్రస్తుతానికి వీలుకాదని ఐఎండీ తెలిపింది. ‘‘పసఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని ఉపరితల జలాల ఉష్ణోగ్రతల దృష్ట్యా లానినా పరిస్థితులున్నాయి. రానున్న రోజుల్లో ఇది బలహీనపడి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది’’ అని వివరించింది. రుతుపవనాల సీజన్‌కు ముందు ఈ పరిస్థితులు ఏర్పడవచ్చంది. అంతేకాకుండా... రుతుపవనాలపై ప్రభా వం చూపగల హిందూ మహాసముద్ర ఉపరి తల జలాల ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థితిలోనే ఉండే అవకాశమున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment