
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను చలి వణికిస్తోంది. హిమాలయాల నుంచి వీస్తున్న శీతల గాలులు, మధ్య భారతంలో అధిక పీడనంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గాయి. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. మెదక్‌లో సాధారణం కన్నా 6 డిగ్రీలు తక్కువగా 7 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం, భద్రాచలంలో 8 డిగ్రీలు తక్కువగా 9 డిగ్రీలు రికార్డయింది. భద్రాచలంలో 1962 జనవరి 5న 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఆ తర్వాత ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి.
ఖమ్మంలో 1946 జనవరి 8న 9.4 డిగ్రీలు నమోదవగా, తాజాగా ఆ రికార్డు బద్దలైంది. ఇక రామగుండంలో 10 డిగ్రీలు, నిజామాబాద్, హైదరాబాద్‌లలో 11, హన్మకొండలో 12, హకీంపేటలో 13, మహబూబ్‌నగర్‌లో 14, నల్లగొండలో 15 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పాత ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గురువారం చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మంలో తీవ్రమైన చలి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.