తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే! | Meteorological department says temperatures will rise In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మరో నెలన్నరపాటు ఇదే పరిస్థితి: వాతావరణ శాఖ

Published Wed, Apr 12 2023 3:18 AM | Last Updated on Wed, Apr 12 2023 8:10 AM

Meteorological department says temperatures will rise In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా చాప్రాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుల్లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై ముగ్గురు మృతిచెందారు. వారిలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, నిర్మల్‌ జిల్లాలో ఒక ఉపాధి కూలీ ఉన్నారు. ఎండల తీవ్రతకు వివిధ పనుల  నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు విలవిల్లాడుతున్నారు.

ఎండ వేడి కారణంగా అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. వరి కోత యంత్రాలు సైతం అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపింది. 

వేసవి ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం... 
ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వేసవి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించినా సంబంధిత శాఖలు మాత్రం దీనిపై పెద్దగా దృష్టిపెట్టడంలేదన్న ఆరోపణలున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి, ఆశ వర్కర్లు, పారామెడికల్‌ సిబ్బందికి ఎండల తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కల్పించడంతోపాటు వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇవేవీ పెద్దగా అమలు కావట్లేదన్న విమర్శలు వస్తున్నాయి.

వడదెబ్బ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను పట్టించుకొనే పరిస్థితి కనిపించట్లేదు. అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం దాదాపు ఎక్కడా అమలుకావడంలేదని ప్రజలు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు పనిచేసే చోట షెల్టర్లు కట్టించాలన్న నిబంధన కాగితాలకే పరిమితమైంది. కార్మికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు ఉల్లంఘిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. 

ఎంత ఎండకు ఏ అలర్ట్‌? 
► రెడ్‌ అలర్ట్‌ (సాధారణం కంటే 6 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు ఉంటే జారీ చేసేది) 
► ఆరెంజ్‌ అలర్ట్‌ (సాధారణం కంటే 4–5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే) 
► ఎల్లో అలర్ట్‌ (హీట్‌వేవ్‌ వార్నింగ్‌. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కాస్త ఎక్కువ నమోదైతే) 
► వైట్‌ అలర్ట్‌ (సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే జారీ చేసేది) 

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... 
► తరచూ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల సీసాను వెంట తీసుకెళ్లాలి.  
► తెలుపు, లేతవర్ణంగల పలుచటి కాటన్‌ వస్త్రాలు ధరించాలి.  
► తలకు వేడి తగలకుండా టోపీ లేదా రుమాలు చుట్టుకోవాలి. 
► వడదెబ్బ తగిలిన వారిని నీడలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తడిగుడ్డతో తుడవాలి.  
► ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.  
► వడగాడ్పులు వీస్తుంటే భవన నిర్మాణ కార్మికులకు యాజమాన్యాలు నీడ కల్పించాలి. తాగునీటి వసతి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. 
► ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి.  
► బస్టాండ్లలో, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement