sun strokes
-
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుల్లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై ముగ్గురు మృతిచెందారు. వారిలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఒక ఉపాధి కూలీ ఉన్నారు. ఎండల తీవ్రతకు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండ వేడి కారణంగా అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. వరి కోత యంత్రాలు సైతం అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపింది. వేసవి ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం... ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వేసవి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించినా సంబంధిత శాఖలు మాత్రం దీనిపై పెద్దగా దృష్టిపెట్టడంలేదన్న ఆరోపణలున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి, ఆశ వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి ఎండల తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కల్పించడంతోపాటు వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇవేవీ పెద్దగా అమలు కావట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. వడదెబ్బ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను పట్టించుకొనే పరిస్థితి కనిపించట్లేదు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం దాదాపు ఎక్కడా అమలుకావడంలేదని ప్రజలు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు పనిచేసే చోట షెల్టర్లు కట్టించాలన్న నిబంధన కాగితాలకే పరిమితమైంది. కార్మికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు ఉల్లంఘిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఎంత ఎండకు ఏ అలర్ట్? ► రెడ్ అలర్ట్ (సాధారణం కంటే 6 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు ఉంటే జారీ చేసేది) ► ఆరెంజ్ అలర్ట్ (సాధారణం కంటే 4–5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే) ► ఎల్లో అలర్ట్ (హీట్‌వేవ్ వార్నింగ్. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కాస్త ఎక్కువ నమోదైతే) ► వైట్ అలర్ట్ (సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే జారీ చేసేది) ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ► తరచూ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల సీసాను వెంట తీసుకెళ్లాలి. ► తెలుపు, లేతవర్ణంగల పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. ► తలకు వేడి తగలకుండా టోపీ లేదా రుమాలు చుట్టుకోవాలి. ► వడదెబ్బ తగిలిన వారిని నీడలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తడిగుడ్డతో తుడవాలి. ► ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. ► వడగాడ్పులు వీస్తుంటే భవన నిర్మాణ కార్మికులకు యాజమాన్యాలు నీడ కల్పించాలి. తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ► ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. ► బస్టాండ్లలో, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలి. -
సూర్య ప్రతాపం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రతతో బుధవారం 24 మంది మృత్యువాతపడ్డారు. ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో అత్యధికంగా ఆరుగురు చొప్పున వడదెబ్బ తగిలి చనిపోయారు. గుంటూరు జిల్లాలో నలుగురు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బ తగిలి మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఈ భగభగలు మరో రెండ్రోజులు కొనసాగనున్నాయి. పలుచోట్ల వడగాడ్పులు వీయనున్నాయి. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. ఆ తర్వాత రెండు రోజులు అకాల వర్షాలు కురవనున్నాయి. అకాల వర్షాలతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించనున్నాయి. ప్రస్తుతం ఉత్తర ఒడిశా నుంచి రాయలసీమ వరకు చత్తీస్‌గఢ్, తెలంగాణల మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్రలో, ఆదివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోను, గురువారం రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోను అక్కడక్కడ వడగాడ్పులు వీస్తాయని వివరించింది. రాయలసీమలో వచ్చే రెండు రోజులు పొడి వాతావరణం నెలకొననుంది. ఆ తర్వాత అక్కడ ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు/జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురం (రెంటచింతల)లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ప్రకాశం జిల్లా కురిచేడులో బుధవారం 46.50 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని ఆర్టీజీఎస్ తెలిపింది. -
ఈ సమ్మర్ సలసల!
సాక్షి, విశాఖపట్నం: భానుడు ఈ ఏడాది సెగలు కక్కనున్నాడు. మార్చి ఆఖరు నుంచి మొదలు కావలసిన ఎండలు ఫిబ్రవరి మూడో వారం నుంచే ప్రతాపం చూపడం మున్ముందు వేసవి తాపాన్ని తెలియజేస్తోంది. వాస్తవానికి మార్చి ఆఖరు నుంచి రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ అనూహ్యంగా నెల రోజుల ముందే ఆ పరిస్థితి (సాధారణంకంటే 4–5 డిగ్రీలు ఎక్కువగా) మొదలైంది. ఉత్తర భారతదేశంలో ఉష్ణ ప్రభావం మన రాష్ట్రంపై చూపుతుంది. ఈ సీజనులో కోస్తాంధ్రలో సాధారణకంటే సగటున ఒక డిగ్రీ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుందని ఐఎండీ తాజాగా అంచనా వేసింది. ఇదేమీ తేలిగ్గా తీసుకోవలసిన అంశం కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. అటు నుంచి వీచే ఉత్తర గాలుల వల్లే రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం కానున్నాయి. గత సంవత్సరం నైరుతి రుతుపవనాలు కేరళ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపలేదు. ఈశాన్య రుతుపవనాలు కూడా మరింతగా దెబ్బతీయడంతో అరకొర వానలే కురిశాయి. ఫలితంగా భూమి నుంచి ఆవిరి రూపంలో తాపం పెరగడానికి దోహదపడనుంది. మరోవైపు పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినోకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ వెరసి ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడతాయని విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం మాజీ అధిపతి ఓఎస్ఆర్యూ భానుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ సంవత్సరం ఎండలతో పాటు వడగాడ్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ తెలిపారు. -
వడదెబ్బకు మరో ఇద్దరి మృతి
అనంతపురం రూరల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం మరో ఇద్దరు వడదెబ్బకు గురై మరణించారు. అనంతపురం రూరల్ మండలం పామురాయి గ్రామానికి చెందిన మనోహర్(50) వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సోములదొడ్డిలోని ఓ ప్రైవేటు షోరూంలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే మనోహర్ వడదెబ్బకు గురై కుప్పకూలిపోయారన్నారు. గమనించిన సహచరులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య నాగలక్ష్మి ఉన్నారు. గుత్తిలో మరొకరు.. గుత్తి (గుంతకల్లు) : గుత్తి చెర్లోపల్లి కాలనీలో వడ్డే ఉలిగన్న(49) వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారని కాలనీవాసులు తెలిపారు. శనివారం రాళ్లు కొట్టేందుకు పట్టణ సమీపంలోని గుట్టకు వెళ్లిన అతను మధ్యాహ్నం సొమ్ముసిల్లి పడిపోయాడని వివరించారు. వెంటనే స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. -
వడదెబ్బకు వృద్ధుడి బలి
తాడిమర్రి (ధర్మవరం) : తాడిమర్రి మండలం కునుకుంట్లలో భూమే కాటమయ్య(65) వడదెబ్బకు గురై బుధవారం ఉదయం మరణించినట్లు బంధువులు తెలిపారు. గ్రామంలోని పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఒడ్డున ఉన్న ఓసూరమ్మ ఆలయంలో పూజారిగా పని చేస్తున్న ఆయన.. ఉదయమే ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత 11.45 గంటలకు ఇంటికొచ్చారు. రాగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య లక్ష్మీనారాయణమ్మ, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వైద్యాధికారి రవికాంత్, ఎంపీహెచ్ఈఓలు వెంకటయ్య, మనోహర్, పీహెచ్ఎన్ చంద్రకళ, ఆరోగ్య కార్యకర్తలు గ్రామానికి వెళ్లి ఘటనపై ఆరా తీశారు. -
వడదెబ్బకు ఒకరి మృతి
గుత్తి : గుత్తిలో వడదెబ్బకు మరొకరు బలయ్యారు. స్థానిక బండగేరిలో నివాసముంటున్న ఆర్.బి.రామకృష్ణ(46) అనే టైలర్ వడదెబ్బకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సొంత పనిపై రెండ్రోజుల పాటు ఎండలో తిరిగిన ఆయన సోమవారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్నపళంగా కుప్పకూలిపోయారు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. తర్వాత ఇంటికి పిల్చుకెళ్లారు. అయితే మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిలోనే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
వడదెబ్బతో కూలీ మృతి
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన శివప్రసాద్ (28) అనే కూలీ వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. శివప్రసాద్ తాడిపత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక ఒక్కసారిగా కూప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య సరోజ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
వడదెబ్బకు బాలుడి బలి
గుత్తి : గుత్తి గాంధీ నగర్‌కు చెందిన షేర్‌వలి కుమారుడు అన్సర్(17) వడదెబ్బతో ఆదివారం మరణించినట్లు బంధువులు తెలిపారు. రెండ్రోజులుగా ఎండలో బాగా తిరిగడంతో శనివారం మధ్యాహ్నం ఇంటికి రాగానే సొమ్మసిల్లి పడిపోయాడన్నారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం మళ్లీ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలోనే మృతి చెందినట్లు చెప్పారు.