
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రతతో బుధవారం 24 మంది మృత్యువాతపడ్డారు. ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో అత్యధికంగా ఆరుగురు చొప్పున వడదెబ్బ తగిలి చనిపోయారు. గుంటూరు జిల్లాలో నలుగురు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బ తగిలి మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఈ భగభగలు మరో రెండ్రోజులు కొనసాగనున్నాయి. పలుచోట్ల వడగాడ్పులు వీయనున్నాయి. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది.
ఆ తర్వాత రెండు రోజులు అకాల వర్షాలు కురవనున్నాయి. అకాల వర్షాలతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించనున్నాయి. ప్రస్తుతం ఉత్తర ఒడిశా నుంచి రాయలసీమ వరకు చత్తీస్‌గఢ్, తెలంగాణల మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్రలో, ఆదివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
మరోవైపు గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోను, గురువారం రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోను అక్కడక్కడ వడగాడ్పులు వీస్తాయని వివరించింది. రాయలసీమలో వచ్చే రెండు రోజులు పొడి వాతావరణం నెలకొననుంది. ఆ తర్వాత అక్కడ ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు/జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురం (రెంటచింతల)లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ప్రకాశం జిల్లా కురిచేడులో బుధవారం 46.50 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని ఆర్టీజీఎస్ తెలిపింది.