tempatures
-
సుర్రుమంటున్న సూర్యుడు
కరీంనగర్: ‘భానుడి ప్రతాపం మొదలైంది.. ఇప్పటి వరకు చలితో వణికిన ప్రజలు ఎండలను తలుచుకొని భయపడుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి.. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోత మొదలైంది. ఆదివారం జిల్లాలో 36.19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడే ఇలా ఉంటే మే లో ఎలా అని జనం జంకుతున్నారు.’ఎండలు అప్పుడే మండుతున్నాయి. వాతావరణంలో మార్పులతో భూతాపం పెరుగుతోంది. పగటిపూట ఎండలు మండుతుండగా రాత్రి సమయంలో చలిగా ఉంటోంది. పగటి ఉష్ణోగత్రలు గత వారంరోజులుగా గరిష్టంగా 32 నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతున్నాయి. రాత్రి ఉషోగ్రతలు 18 నుంచి 21 డిగ్రీల వరకు పడిపోతున్నాయి. శివరాత్రికి శివశివా అంటూ చలికాలం వెళ్లిపోయి ఎండలు మండుతాయంటారు. కానీ శివరాత్రికి ముందే ఎండలు మండుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
సూర్య ప్రతాపం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రతతో బుధవారం 24 మంది మృత్యువాతపడ్డారు. ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో అత్యధికంగా ఆరుగురు చొప్పున వడదెబ్బ తగిలి చనిపోయారు. గుంటూరు జిల్లాలో నలుగురు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బ తగిలి మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఈ భగభగలు మరో రెండ్రోజులు కొనసాగనున్నాయి. పలుచోట్ల వడగాడ్పులు వీయనున్నాయి. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. ఆ తర్వాత రెండు రోజులు అకాల వర్షాలు కురవనున్నాయి. అకాల వర్షాలతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించనున్నాయి. ప్రస్తుతం ఉత్తర ఒడిశా నుంచి రాయలసీమ వరకు చత్తీస్‌గఢ్, తెలంగాణల మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్రలో, ఆదివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోను, గురువారం రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోను అక్కడక్కడ వడగాడ్పులు వీస్తాయని వివరించింది. రాయలసీమలో వచ్చే రెండు రోజులు పొడి వాతావరణం నెలకొననుంది. ఆ తర్వాత అక్కడ ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు/జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురం (రెంటచింతల)లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ప్రకాశం జిల్లా కురిచేడులో బుధవారం 46.50 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని ఆర్టీజీఎస్ తెలిపింది. -
చలి పంజా
చలి పంజా దెబ్బకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. రుతువులు కూడా సహజ కాలాన్ని మరచి మందగమనంతో సాగుతున్నాయి. చలి దుప్పటే ఎక్కువ కాలం జిల్లాను కప్పుతోంది. జనవరి ప్రారంభంలో శిశిర రుతువు (ఆకురాల్చే కాలం) ప్రారంభం కావాల్సి ఉండగా దాని ఊసే లేదు. ఉదయం పూట నులివెచ్చని గాలులు వీచి హాయి గొల్పాల్సి ఉండగా దాని జాడే లేదు. వేర్వేరు సంవత్సరాల్లో ఒకే రోజు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. చిలకలూరిపేటటౌన్: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా జీవైన శైలిలో క్రమేణా మార్పులు సంభవిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వెలువడుతున్న కర్బన ఉద్గారాల ప్రభావంతో భూతాపం పెరిగిపోతోంది. ఫలితంగా కొన్ని రుతువుల మందగమనం కనిపిస్తోంది. కొన్ని రుతువులు కాలపరిమితులు రెట్టింపు దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఏ సీజన్ ఎన్ని నెలలు కొనసాగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. శీతాకాల, వర్షాకాలాల పరిధి క్రమేణా తగ్గిపోతున్నాయి. రెండు నెలల నిడివిగా ఉండాల్సిన ఒక్కో రుతువు రెట్టింపు నెలలు కొనసాగుతున్నాయి. రుతువులు కూడా తారుమారు.. హేమంత ఋతువు (చలికాలం), గ్రీష్మ (వేసవి కాలం) రుతువుల మధ్య ఉన్న రెండు నెలల కాలాన్నే శిశిర రుతువు అని, దీన్నే ఆకురాలే కాలం అంటాం. ఈ రుతువులో చలి క్రమేణా తగ్గుముఖం పట్టి నులివెచ్చని గాలులు వీయాలిఉంది. జనవరి మాసాంతంలో ఈ రుతువు ప్రభావం ఇప్పుడు పూర్తి మారినట్లు కనిపిస్తోంది. మొదటి పక్షం రోజులు రాత్రి విపరీతమైన చలి వచ్చి తర్వాతి రోజుల్లో ఎండలు పెరుగుతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. జిల్లా అంతటా ఒకే రోజు రాత్రి ఉష్టోగ్రత 10 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పడిపోయిన రికార్డు 1936 డిసెంబర్ 31న నమోదైంది. మరో పదేళ్లకి 1946 లో ఒకరోజు 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అంత తక్కువ సగటు ఉష్ణోగ్రత ఆదివారం (21 జనవరి 2018) అర్ధరాత్రి నమోదైంది. ఈ సీజన్లో ఎప్పుడూ లేని విధంగా 16 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 25న 70 ఏళ్ల కిందట నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయని, వచ్చే గురువారం 14 డిగ్రీలకు పడిపోతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో రెండు డిగ్రీల కనిష్టానికి చేరుకున్నా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నారు. చలితో పాటు పెరుగుతున్న ఎండ.. వాస్తవానికి జనవరి ముగింపు నాటికి పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతూ చలిగాలులు, మంచు పడటం చాలా వరకు తగ్గుముఖం పడుతూ ఉండాలి. కానీ గడిచిన ఐదేళ్ల నుంచి శీతోష్ణస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2014లో జనవరిలో పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు కాగా ఈ ఏడాది జనవరిలో 32 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రత 2014లో 21 డిగ్రీలుగా నమోదు కాగా ఈ ఏడాదిలో ఈ నెలలో 16 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఎండ పెరిగే కొద్దీ చలి తగ్గాల్సి ఉండగా సమాంతరంగా చలి కూడా పెరగడం గమనార్హం. అనేక రంగాలపై తీవ్ర ప్రభావం.. జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి తయారీ, పాడి పరిశ్రమ రంగాలపై చలి ప్రభావం పడింది. విద్యారంగంలో పరీక్షల ఫీవర్ మొదలు కావడంతో విద్యార్థులు చలిలో తెల్లవారుజామున లేవలేని పరిస్థితి. పాడి పరిశ్రమపై ఆధారపడే పోషకులకు మరో నెలపోతే పాలిచ్చే పశువులన్నీ ఒట్టిపోయే పరిస్థితి. నిర్మాణం, తయారీ రంగాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీలు, నిర్మాణ స్థలాలకు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీలు తెల్లవారుజామునే గ్రామాల నుంచి పల్లెల నుంచి పట్టణాలకు రావాల్సి ఉండటంతో రవాణా కష్టతరమవుతుంది. ఇక రహదారులను మంచుతెర కప్పుకోవడంతో ఉదయం 9 వరకూ వాహనం తీయలేని పరిస్థితి. అగ్ని పరీక్షలా డ్రైవింగ్.. చలి కాలంలో సర్వీస్‌లకు వెళ్లాలంటే దేవుడు గుర్తొస్తున్నాడు. ఒక వైపు మంచు, మరోవైపు చలి. డ్రైవింగ్ చేస్తున్నంత సేపు ఎప్పుడు సూర్యోదయం అవుతుందా? అన్న ఎదురుచూపే మాకు దిక్కు. ప్రమాదాలు ఎక్కువ సంభవించే కాలం కూడా ఇదే. చలికి తట్టుకుని డ్రైవింగ్ చేయడం అగ్నిపరీక్షలా మారింది. – ఎస్.నాయక్, హైదరాబాద్ సర్వీస్ ఆర్టీసీ డ్రైవర్ రాత్రి షిప్టులు మానుకున్నా.. నెలలో 15 రోజుల మాత్రమే పరిశ్రమకు వెళ్తున్నా. రాత్రి షిఫ్టులు వేస్తే మానుకున్నా. ఈ చలిలో పనికి వెళ్లాలంటే భయమేస్తోంది. చలి తీవ్రత వల్ల ఎంతో మంది కార్మికులు పనులు మానుకుంటున్నారు. ఇది సామన్యులకు తీవ్ర నష్టం కలుగజేస్తోంది. ఆరోగ్యానికి ఓటు వేసి ఆగిపోతున్నాం. – కె.బాలు, రోజు కూలి -
భానుడి భగభగలు
- మార్చిలోనే మంటలు... అనేకచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రత -భద్రాచలం, నిజామాబాద్, రామగుండంలలో 50 డిగ్రీలకు చేరే అవకాశం -ఎలినినో వల్లే ఈ పరిస్థితి... గతేడాది వడదెబ్బతో 541 మంది మృతి -వడగాలి నుంచి రక్షణకు సర్కారు కార్యాచరణ ప్రణాళిక -చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులకు లేఖలు -ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకమంటోన్న వాతావరణశాఖ సాక్షి, హైదరాబాద్: రోహిణి ఇంకా రానేలేదు.. కానీ రాళ్లు పగలటానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మార్చిలోనే పలు చోట్ల 41 డిగ్రీలకు పైగా వేడిమి తీవ్రత నమోదవుతుండటాన్ని బట్టి అసలైన వేసవి వచ్చేనాటికి పరిస్థితి మరింత భయంకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నాటికి సేకరించిన సమాచారం మేరకు నిజామాబాద్‌లో 43 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఇంతకుముందెన్నడూ మార్చి నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. 2013 మార్చిలో గరిష్టంగా 38 డిగ్రీలకు మించలేదు. 2014 మార్చిలో 39-40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2015 మార్చి 25వ తేదీ లోపున 39.5 డి గ్రీలే నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది మార్చి నెల మొదలైనప్పటి నుంచే ఎండల తీవ్రత ఉంది. ఇకనుంచి రోజు రోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టంచేస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి రామగుండం, భద్రాచలం, నిజామాబాద్‌ల్లో 49-50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి 'సాక్షి'కి తెలిపారు. పాజిటివ్ ఎలినినో కారణంగానే... ఈ ఏడాది పాజిటివ్ ఎలినినో, ఉత్తరం నుంచి వేడి గాలుల కారణంగా ఎండలు మరింత మండనున్నాయని చెబుతున్నారు. 1973 మే 9వ తేదీన భద్రాచలంలో 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. అదే ఇప్పటివరకు గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు. గతంలో ఏ వేసవిలోనైనా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు 10 రోజుల వరకు మాత్రమే ఉంటే... ఈ వేసవిలో ఏకంగా నెల రోజులపాటు వడగాల్పులు ఉంటాయని వాతావరణశాఖ చెబుతోంది. ఇదిలావుంటే ఎలినినో ప్రభావం జూన్ నాటికి తగ్గుతుందని... ఆ తర్వాత జులై నుంచి రుతుపవనాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని వై.కె.రెడ్డి చెబుతున్నారు. గతేడాది కంటే పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఎండ నుంచి రక్షణకు సర్కారు కార్యాచరణ ప్రణాళిక ఎండల తీవ్రత నుంచి ప్రజలను రక్షించేందుకు విపత్తు నిర్వహణ శాఖ కార్యాచరణ ప్రణాళిక తయారుచేసింది. ఆ ప్రణాళికను అమలుచేయాలని కలెక్టర్లు, వివిధ శాఖాధిపతులకు లేఖలు రాసినట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్‌కుమార్ తెలిపారు. గతేడాది సాధారణ ఎండలకే 541 మంది చనిపోయారు. ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అత్యంత జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన అధిక ఉష్ణోగ్రతలు (సెంటీగ్రేడ్లలో) 1) ఆదిలాబాద్ 46.8, 1995 జూన్ 5 2) భద్రాచలం 48.6, 1973 మే 9 3) హన్మకొండ 47.8, 2003 జూన్ 3 4) హైదరాబాద్ 45.5, 1966 జూన్ 2 5) ఖమ్మం 47.6, 2015 మే 22 6) మహబూబ్‌నగర్ 45.3, 2015 మే 21,1973 ఏప్రిల్ 30 7) మెదక్ 46.3, 2006 మే 18 8) నల్లగొండ 46.8, 2015 మే 22 9) నిజామాబాద్ 47.3, 2005 మే 22 10) రామగుండం 47.3, 1984 మే 24 వడగాల్పుల కారణంగా మరణంచివారి సంఖ్య 2008 - 17 2009 - 7 2010 - 11 2012 - 144 2013 - 516 2014 - 31 2015 - 541