చల్లటి వాతావరణంలో ముడుచుకుని వాకింగ్..
చలి పంజా దెబ్బకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. రుతువులు కూడా సహజ కాలాన్ని మరచి మందగమనంతో సాగుతున్నాయి. చలి దుప్పటే ఎక్కువ కాలం జిల్లాను కప్పుతోంది. జనవరి ప్రారంభంలో శిశిర రుతువు (ఆకురాల్చే కాలం) ప్రారంభం కావాల్సి ఉండగా దాని ఊసే లేదు. ఉదయం పూట నులివెచ్చని గాలులు వీచి హాయి గొల్పాల్సి ఉండగా దాని జాడే లేదు. వేర్వేరు సంవత్సరాల్లో ఒకే రోజు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి.
చిలకలూరిపేటటౌన్: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా జీవైన శైలిలో క్రమేణా మార్పులు సంభవిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వెలువడుతున్న కర్బన ఉద్గారాల ప్రభావంతో భూతాపం పెరిగిపోతోంది. ఫలితంగా కొన్ని రుతువుల మందగమనం కనిపిస్తోంది. కొన్ని రుతువులు కాలపరిమితులు రెట్టింపు దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఏ సీజన్ ఎన్ని నెలలు కొనసాగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. శీతాకాల, వర్షాకాలాల పరిధి క్రమేణా తగ్గిపోతున్నాయి. రెండు నెలల నిడివిగా ఉండాల్సిన ఒక్కో రుతువు రెట్టింపు నెలలు కొనసాగుతున్నాయి.
రుతువులు కూడా తారుమారు..
హేమంత ఋతువు (చలికాలం), గ్రీష్మ (వేసవి కాలం) రుతువుల మధ్య ఉన్న రెండు నెలల కాలాన్నే శిశిర రుతువు అని, దీన్నే ఆకురాలే కాలం అంటాం. ఈ రుతువులో చలి క్రమేణా తగ్గుముఖం పట్టి నులివెచ్చని గాలులు వీయాలిఉంది. జనవరి మాసాంతంలో ఈ రుతువు ప్రభావం ఇప్పుడు పూర్తి మారినట్లు కనిపిస్తోంది. మొదటి పక్షం రోజులు రాత్రి విపరీతమైన చలి వచ్చి తర్వాతి రోజుల్లో ఎండలు పెరుగుతున్నాయి.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
జిల్లా అంతటా ఒకే రోజు రాత్రి ఉష్టోగ్రత 10 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పడిపోయిన రికార్డు 1936 డిసెంబర్ 31న నమోదైంది. మరో పదేళ్లకి 1946 లో ఒకరోజు 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అంత తక్కువ సగటు ఉష్ణోగ్రత ఆదివారం (21 జనవరి 2018) అర్ధరాత్రి నమోదైంది. ఈ సీజన్‌లో ఎప్పుడూ లేని విధంగా 16 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 25న 70 ఏళ్ల కిందట నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయని, వచ్చే గురువారం 14 డిగ్రీలకు పడిపోతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో రెండు డిగ్రీల కనిష్టానికి చేరుకున్నా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నారు.
చలితో పాటు పెరుగుతున్న ఎండ..
వాస్తవానికి జనవరి ముగింపు నాటికి పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతూ చలిగాలులు, మంచు పడటం చాలా వరకు తగ్గుముఖం పడుతూ ఉండాలి. కానీ గడిచిన ఐదేళ్ల నుంచి శీతోష్ణస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2014లో జనవరిలో పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు కాగా ఈ ఏడాది జనవరిలో 32 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రత 2014లో 21 డిగ్రీలుగా నమోదు కాగా ఈ ఏడాదిలో ఈ నెలలో 16 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఎండ పెరిగే కొద్దీ చలి తగ్గాల్సి ఉండగా సమాంతరంగా చలి కూడా పెరగడం గమనార్హం.
అనేక రంగాలపై తీవ్ర ప్రభావం..
జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి తయారీ, పాడి పరిశ్రమ రంగాలపై చలి ప్రభావం పడింది. విద్యారంగంలో పరీక్షల ఫీవర్ మొదలు కావడంతో విద్యార్థులు చలిలో తెల్లవారుజామున లేవలేని పరిస్థితి. పాడి పరిశ్రమపై ఆధారపడే పోషకులకు మరో నెలపోతే పాలిచ్చే పశువులన్నీ ఒట్టిపోయే పరిస్థితి. నిర్మాణం, తయారీ రంగాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీలు, నిర్మాణ స్థలాలకు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీలు తెల్లవారుజామునే గ్రామాల నుంచి పల్లెల నుంచి పట్టణాలకు రావాల్సి ఉండటంతో రవాణా కష్టతరమవుతుంది. ఇక రహదారులను మంచుతెర కప్పుకోవడంతో ఉదయం 9 వరకూ వాహనం తీయలేని పరిస్థితి.
అగ్ని పరీక్షలా డ్రైవింగ్..
చలి కాలంలో సర్వీస్‌లకు వెళ్లాలంటే దేవుడు గుర్తొస్తున్నాడు. ఒక వైపు మంచు, మరోవైపు చలి. డ్రైవింగ్ చేస్తున్నంత సేపు ఎప్పుడు సూర్యోదయం అవుతుందా? అన్న ఎదురుచూపే మాకు దిక్కు. ప్రమాదాలు ఎక్కువ సంభవించే కాలం కూడా ఇదే. చలికి తట్టుకుని డ్రైవింగ్ చేయడం అగ్నిపరీక్షలా మారింది. – ఎస్.నాయక్, హైదరాబాద్ సర్వీస్ ఆర్టీసీ డ్రైవర్
రాత్రి షిప్టులు మానుకున్నా..
నెలలో 15 రోజుల మాత్రమే పరిశ్రమకు వెళ్తున్నా. రాత్రి షిఫ్టులు వేస్తే మానుకున్నా. ఈ చలిలో పనికి వెళ్లాలంటే భయమేస్తోంది. చలి తీవ్రత వల్ల ఎంతో మంది కార్మికులు పనులు మానుకుంటున్నారు. ఇది సామన్యులకు తీవ్ర నష్టం కలుగజేస్తోంది. ఆరోగ్యానికి ఓటు వేసి ఆగిపోతున్నాం. – కె.బాలు, రోజు కూలి
Comments
Please login to add a commentAdd a comment