లేదంటే మానసిక ఒత్తిడి తప్పదంటున్న వైద్యులు
సీజనల్ అఫెక్టివ్ సిండ్రోమ్(ఎస్‌ఏడీ)గా నామకరణం
కొన్ని పదాలు పలకలేకపోవడం.. తెలిసిన విషయాన్నీ మర్చిపోయే ప్రమాదం
ఇతరులతో కలిసేందుకు ఇష్టపడకపోవడమూ దీని ప్రభావమే
ఉదయం 10లోపే అరగంట ఎండలో ఉండాలని సూచన
హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హోవార్డ్ లీవైన్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చలికాలమని ముసుగుతన్ని ఇంట్లోనే పడుకుని కాలక్షేపం చేద్దామనుకుంటున్నారా? చలికి భయపడి మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేశారా? ఇంట్లోంచి నేరుగా ఉదయం 10 తర్వాత కార్యాలయానికి బయలుదేరుతున్నారా? ఉదయం బాగా చలేస్తోందని.. సాయంత్రం వాకింగ్ చేస్తున్నారా? చలి పేరుతో ఇలా చేస్తుంటే వెంటనే మీ అలవాటును మార్చుకోండి. లేదంటే మానసిక ఒత్తిడి తప్పదని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) హోవార్డ్ లీవైన్ చెబుతున్నారు.
చలికాలంలో వచ్చే వాతావరణ మార్పులతో మెదడులో కొన్ని రసాయన మార్పులు జరిగి.. శారీరకంగా నీరసంగా ఉన్నామనే భావన వస్తుందని.. ఈ భావనతో బయటకు వెళ్లి ఇతరులను కలవడం కూడా తగ్గిపోతుందని ఆయన పేర్కొంటున్నారు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తెలిసిన విషయాన్ని మర్చిపోవడం.. కొన్ని పదాలను అసలు పలికేందుకు ఇబ్బంది పడి.. వేరే పదాలను పలకడం వంటివి కూడా చేస్తారని ఆయన అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోపు అరగంట పాటు సూర్యరశ్మిలో ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ సూర్యరశ్మి అందుబాటులో లేని రోజుల్లో ప్రత్యేకంగా కాంతిని ప్రసరింపచేసేందుకు ఉపయోగించే లైట్ బాక్సుల ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చని ఆయన చెబుతున్నారు.
ఎస్‌ఏడీ.. ఎలా వస్తుందంటే..
చలికాలంలో కాంతి లేకపోవడం వల్ల మన మానసిక, శారీరక ప్రవర్తనపై ప్రభావం పడుతుంది. దీనిని సీజనల్ అఫెక్టివ్ సిండ్రోమ్ (ఎస్‌ఏడీ) అని.. వైద్య పరిభాషలో ‘సిర్కాడియల్ రిథమ్స్’ అని అంటారు. ఎస్‌ఏడీ మన మెదడులోని నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేసే మరో ఎంజైమ్ సెరోటోనిన్ తక్కువ విడుదల కావడానికి దోహదం చేస్తుంది.
ఈ రసాయన అసమతుల్యత వల్ల నీరసంగా మారిపోతాం. తద్వారా ఎక్కువగా తినడం.. ప్రధానంగా కార్బొహైడ్రేట్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని.. ప్రోటీన్ ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం కూడా జరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఇతరులతో కలవడంపై దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీంతో ఇంటికే పరిమితమై మానసికంగా ఇబ్బంది పడతారని లీవైన్ స్పష్టం చేశారు.
ఎస్‌ఏడీ అనేది కేవలం మానసిక స్థితి మాత్రమే కాదని అంతకుమించి ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తుందని ఆయన పేర్కొంటున్నారు. జ్ఞాపకశక్తి వంటి సమస్యలతో పాటు మన పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఈ సిండ్రోమ్ మన ఉచ్ఛారణలో సరైన పదాలు పలకలేకపోవడంతో పాటు.. సరైన సమాచారం కూడా సకాలానికి గుర్తుకురాకపోవడం జరుగుతుందని ఆయన చెబుతున్నారు.
సూర్యరశ్మి లేదా లైట్ థెరపీ
సీజనల్‌గా వచ్చే ఈ సిండ్రోమ్‌కు సాధారణంగా డోపమైన్ స్థాయిని పెంచే యాంటీ డిప్రెసెంట్స్ మందులను వాడతారు. అయితే, దీనికంటే మంచి మందు ఏమిటంటే.. ప్రతిరోజూ అరగంట పాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉండటమేనని హోవార్డ్ లీవైన్ చెబుతున్నారు. అది కూడా ఉదయం 10 గంటలలోపు అరగంటపాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉంటే ఈ సిండ్రోమ్ నుంచి బయటపడవచ్చని ఆయన జరిపిన అధ్యయనంలో తేలింది.
ఒకవేళ చలికాలంలో వాతావరణ ప్రభావంతో సూర్యరశ్మి లేనిపక్షంలో లైట్ థెరపీని ఆయన సూచిస్తున్నారు. తెల్లని కాంతిని ఉత్పత్తి చేసే లైట్ బాక్సులను కొనుగోలు చేసి ఉపయోగించడమే ఈ లైట్ థెరపీ. ఆన్‌లైన్‌లో ఈ లైట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. మీ లైట్ బాక్స్‌లో 10,000 లక్స్ (‘లక్స్’ అంటే నిర్దేశిత ప్రదేశంలో ఎంతమేర లైట్ పడుతుందని తెలిపేది.
దీనిని కాంతి తీవ్రత/కాంతి ప్రకాశం అని పేర్కొంటారు) ఎక్స్‌పోజర్ ఉండాలి. సాధారణంగా సూర్యుడు బాగా ప్రకాశించే సమయంలో 50 వేల కాంతి ప్రకాశాలు ఉంటాయి. అందులో పదో వంతు కాంతి తీవ్రత ఉండేలా చూసుకుంటే చాలని ఆయన స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment