ఆంధ్రప్రదేశ్ హీటెక్కిపోతోంది. వేసవిలో వడగాడ్పుల రోజుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోకెల్లా ఎక్కువ రోజులు వడగాడ్పులు వీచే రాష్ట్రంగా రాజస్థాన్ నిలుస్తుండగా.. రెండో స్థానంలో ఒడిశా ఉండేది. దశాబ్దకాలంగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒడిశాను పక్కకు నెట్టేసి ఆ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది. దక్షిణ భారతదేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలుస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: పదేళ్లుగా రాష్ట్రంలో వేసవి గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కొనసాగుతోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అంతేకాదు.. వడగాడ్పులు కొనసాగే రోజులూ అధికమవుతున్నాయి. 2011–2021 సంవత్సరాల మధ్య వేసవి ఉష్ణోగ్రతల గణాంకాలను బట్టి రాజస్థాన్ తర్వాత అత్యధిక హీట్‌వేవ్స్ రోజులు ఆంధ్రప్రదేశ్‌లోనే రికార్డవుతున్నాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు.
గడచిన దశాబ్ద కాలంలో నడి వేసవి కాలంలో రాజస్థాన్‌లో 119, ఆంధ్రప్రదేశ్‌లో 106, ఒడిశాలో 103 వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. ఈ దశాబ్దంలోని ఆరేళ్లలో సగటున ఏడాదికి పది కంటే ఎక్కువ హీట్‌వేవ్స్ రోజులు నమోదైన ఏకైక రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ రికార్డులకెక్కింది. ఈ దశాబ్దంలో పొరుగున ఉన్న తెలంగాణాలో 69, తమిళనాడులో 56 వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి.
వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలకంటే 4.5 డిగ్రీలకు మించి అధికంగా రికార్డయితే వడగాడ్పులు వీస్తాయి. రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదైతే వేసవి తాపం ప్రభావం మొదలవుతుంది. అలా అవి పెరిగే కొద్దీ వడగాడ్పుల తీవ్రత కూడా పెరుగుతుంది. మరోవైపు 2014–17 మధ్య రాష్ట్రంలో వడదెబ్బకు 2,776 మంది మృత్యువాతపడ్డారు.
కాకినాడ, కళింగపట్నాల్లో భిన్నంగా..
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ పరిధిలో 8 వాతావరణ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 6 స్టేషన్లలో వేసవి సీజన్‌లో హీట్‌వేవ్ సరళి పెరుగుదల నమోదైంది. కానీ.. కాకినాడ, కళింగపట్నం స్టేషన్లలో మాత్రం అందుకు భిన్నంగా హీట్‌వేవ్ రోజులు తగ్గుతున్నట్టు గుర్తించారు. 1961 నుంచి 2021 సంవత్సరాల మధ్య వేసవిలో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చారు.
మరోవైపు అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, మచిలీపట్నం, విశాఖపట్నం ప్రాంతాలలో హీట్‌వేవ్ ట్రెండ్ పెరుగుతున్నట్టు తేల్చారు. ప్రకాశం జిల్లా వెలిగండ్లలో 2016 మే రెండో తేదీన 48.6 (49) డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయినట్టు రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికల సంస్థ పేర్కొంది.
ఇప్పటివరకు రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. దేశవ్యాప్తంగా 103 వాతావరణ స్టేష్టన్లలో వేసవి తాపం, వడగాడ్పుల తీవ్రతపై సమీక్షించగా కేవలం 20 స్టేషన్ల పరిధిలోనే హీట్‌వేవ్ తగ్గుదల నమోదవుతున్నట్టు నిర్ధారించారు.
వేసవిలో వడగాలులు (హీట్‌వేవ్స్) రాజస్థాన్ నుంచి తెలంగాణ మీదుగా రాష్ట్రంపైకి వీస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో 974 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. వేసవిలో మధ్యాహ్నం తర్వాత సముద్రం నుంచి గాలులు వీస్తుంటాయి. అవి ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. కానీ.. కొన్నేళ్లుగా ఈ గాలులు సక్రమంగా వీయకపోవడం, ఆలస్యంగా వీయడం వంటివి జరుగుతున్నాయి.
ఫలితంగా ఉష్ణ తీవ్రత పెరిగి వడగాడ్పుల ఉధృతిని, ఉక్కపోత తీవ్రతను పెంచుతున్నాయని భారత వాతావరణ విభాగం రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. అదే సమయంలో ఏప్రిల్‌కు కొద్దిరోజుల ముందు నుంచే వేసవి ఛాయలు మొదలవడం, నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం వంటివి రాష్ట్రంలో హీట్‌వేవ్స్ రోజులు పెరగడానికి దోహదపడుతున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment