హీట్ వేవ్స్.. హాట్ సేల్స్ | Significant growth in AC sales | Sakshi
Sakshi News home page

హీట్ వేవ్స్.. హాట్ సేల్స్

Aug 17 2024 6:02 AM | Updated on Aug 17 2024 6:02 AM

Significant growth in AC sales

తగ్గని ఎండ.. పెరుగుతున్న ఉక్కపోత 

ఏసీల అమ్మకాల్లో గణనీయ వృద్ధి 

2024లో ఏసీల అమ్మకాలు 1.50 కోట్ల యూనిట్లు దాటతాయని అంచనా 

అల్పపీడన ద్రోణి కారణంగా పెరుగుతున్న  ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. దీనికితోడు విపరీతమైన ఉక్కపోతతో జనం ‘చల్ల’దనం కోసం పరుగులు తీస్తున్నారు.  ఇందుకోసం ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. 

సాక్షి, అమరావతి: సాధారణంగా వేసవి తరువాత ఏసీల అమ్మకాల్లో తగ్గుదల సహజం. కానీ సెప్టెంబర్‌ వస్తున్నా రికార్డు స్థాయిలో ఏసీల అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో తయారీ కంపెనీలు భారీ లాభాల బాట పడుతున్నాయి. ఈ వేసవిలో ఏసీ అమ్మకాల్లో 60 నుంచి 70 శాతం వృద్ధి నమోదు కాగా జూలై నుంచి జరుగుతున్న అమ్మకాల్లో కూడా 30 నుంచి 40 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌) నెలల్లో పలు ఏసీ కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో లాభాలు రెండు రెట్లు పెరిగాయంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  

కంపెనీలకు భారీ లాభాలు 
అత్యధిక వాటా కలిగిన వోల్టాస్‌ లాభం ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో రెండు రెట్లు పెరిగి రూ.355 కోట్లకు చేరింది. ఈ మూడు నెలల కాలంలో వోల్టాస్‌ రికార్డు స్థాయిలో 10 లక్షల యూనిట్లు విక్రయించింది. బ్లూస్టార్‌ లాభం కూడా రెండు రెట్లు పెరిగి రూ.169 కోట్లకు చేరింది. 

గతేడాది రూ.62 కోట్ల నష్టాలను ప్రకటించిన హావెల్స్‌ ఈ ఏడాది రూ.67 కోట్ల లాభాలను ప్రకటించడం గమనార్హం. 2023లో దేశవ్యాప్తంగా 1.1 కోట్ల ఏసీల అమ్మకాలు జరిగితే 2024లో 1.5 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కన్జ్యూమర్‌ ఎల­్రక్టానిక్స్‌ అండ్‌ అప్లియన్సెస్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీమా) ప్రెసిడెంట్‌ సునిల్‌ వచాని తెలిపారు.

ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థల పోటీ 
ప్రస్తుత మార్కెట్‌ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌వంటి ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోతున్నామంటూ కొన్ని కంపెనీలు వాపోతున్నాయి.  

2037 నాటికి ప్రతి 15 సెకన్లకు ఒక ఏసీ 
2011 తర్వాత ఈ స్థాయిలో ఏసీల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారని, 2037 నాటికి ప్రతీ 15 సెకన్లకు ఒక ఏసీ విక్రయించే స్థాయికి ఇండియా ఎదుగుతుందని ప్రపంచబ్యాంకు అంచనా వేస్తోంది.  

95 శాతం తొలిసారి కొంటున్నవారే  
దేశవ్యాప్తంగా వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో వినియోగదారులు ఏసీలు, రిఫ్రిజరేటర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని, ఇప్పుడు ఏసీ అన్నది లగ్జరీ సాధనంగా కాకుండా బతకడానికి తప్పనిసరి వస్తువుగా మారిపోయిందని మార్కెట్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశంలో సొంత ఏసీ వినియోగం చాలా తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం కుటుంబాల్లో కేవలం 8 శాతం మందికి మాత్రమే సొంత ఏసీలు ఉన్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా సగటున చల్లదనం కోసం ప్రతీ వ్యక్తి 272 కేడబ్ల్యూహెచ్‌ విద్యుత్‌ను వినియోగిస్తుంటే, మన దేశంలో అది కేవలం 69 కేడబ్ల్యూహెచ్‌గా ఉంది. ఈ ఏడాది తమ సంస్థ అమ్మిన ఏసీల్లో 95 శాతం మంది తొలిసారిగా కొన్నవారే ఉన్నారని బ్లూస్టార్‌ ఎండీ బి.త్యాగరాజన్‌ తెలిపారు. ఇందులో 65 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement