
బాబోయ్.. చలి
రాష్ట్రవ్యాప్తంగా భారీగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర, ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితి మరో రెండు రోజులపాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో రాత్రి వేళల్లో 4 నుంచి 8 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. మెదక్లో కనిష్టంగా 11 డిగ్రీలు, హైదరాబాద్లో 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 8 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. మెదక్, నల్లగొండ, హైదరాబాద్, హన్మకొండల్లో సాధారణం కంటే 7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈ ప్రభావంతో రాత్రి వేళలో చలిగాలులు వీస్తున్నాయి. మధ్యలో ఉష్ణోగ్రతలు కొద్దిగా అటుఇటుగా ఉన్నా సంక్రాంతి వరకు చలి తీవ్రత ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య భారీ తేడా..
పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య భారీ తేడా కనిపిస్తోంది. ఆదిలాబాద్లో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీలు కాగా, రాత్రి 13 డిగ్రీలుగా ఉంది. మెదక్లో పగలు 31 డిగ్రీలు, రాత్రి ఏకంగా 11 డిగ్రీలకు పడిపోయాయి. హైదరాబాద్లో గరిష్టంగా 31 డిగ్రీలు ఉండగా.. కనిష్టంగా 12 డిగ్రీలు ఉండటం గమనార్హం. మారిన వాతావరణ పరిస్థితులు, చలి గాలుల తీవ్రత, గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఎక్కువ తేడా వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారిపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.
కనిష్ట ఉష్ణోగ్రతల వల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోతుందని, వేడి పెరిగిన సమయంలో దీనివల్ల పగుళ్లు ఏర్పడతాయని చర్మ నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు శరీరానికి చలి తగలకుండా, శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరం మొత్తం కప్పి ఉంచేలా ఉన్ని దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. సూర్యుడు ఉదయించిన తర్వాతే నడక, ఇతర పనుల కోసం బయటకెళ్లాలని పేర్కొంటున్నారు.