అంతర్రాష్ట్ర సరిహద్దు దాటుతుండగా ప్రయాణికుల కంటపడ్డ పెద్ద పులి
కాలిముద్రలు సేకరించిన అధికారులు
సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతమైన సీలేరు అటవీ రేంజ్ పరిధిలో సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో రోడ్డుపై పెద్ద పులి (బెంగాల్‌టైగర్) ప్రయాణికుల కంటపడింది. రోడ్డు దాటుతుండగా అదే సమయంలో పాడేరు డిపోకు చెందిన బస్సు డొంకరాయి నుంచి సీలేరు మీదుగా పాడేరు వెళ్తుండగా సప్పర్ల రెయిన్‌గేజ్‌కు వెళ్లే సరికి పులి రోడ్డు దాటుతోంది. బస్సు రావడంతో పులి భయపడి రోడ్డుపై అటూ ఇటూ పరుగులు తీసింది. దీంతో బస్సు డ్రైవరు చాకచక్యంతో వ్యవహరించి హారన్ కొట్టడంతో అడవిలోకి పారిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇదివాస్తవమా? కాదా? అన్నదానిపై సీలేరు డెప్యూటీరేంజ్ అధికారి సీహెచ్ సింహాచలం పడాల్, తోకరాయి సెక్షన్ ఆఫీసర్ వివేకానందరావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాకేశ్ కుమార్ కలిసి పులి సంచరించిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు దాటిన ప్రాంతంలో పులి కాలిముద్రలను సేకరించి పులి జాడపై ఆరా తీశారు. పది రోజుల క్రితమే ఈ ప్రాంతానికి పులి వచ్చిందని, పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులకు నాలుగు రోజుల కిందట అరుపులు కూడా వినబడినట్లు తెలిసిందన్నారు.
ఈ మధ్య కాలంలో ఒడిశా ప్రాంతంలోనూ, అల్లూరి జిల్లా చింతూరు ఏరియాలోనూ సంచరించేదని, ఆ పులే ఈ ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనిపై రేంజ్ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీలేరు రేంజ్ పరిధిలో 50 ఏళ్లకాలంలో పెద్ద పులి లేదన్నారు. సరిహద్దులోని ఒడిశా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చినట్లు నిర్ధారించామని, చింతూరు ఏజెన్సీ పరిధిలోని కాలిముద్రలు, సీలేరు పరిధిలో కాలి ముద్రలు పరిశీలిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment