Bengal Tiger
-
Hockey India League 2024-25: సెమీస్‌లో బెంగాల్ టైగర్స్
రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ 2–1 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో బెంగాల్ టైగర్స్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా బెంగాల్ జట్టు టాప్-4లోనే ఉండనుంది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్.. వేదాంత కలింగ లాన్సర్స్‌పై 5-2 గోల్స్ తేడాతో గెలుపొందింది. సూర్మా హాకీ క్లబ్ తరఫున టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 32, 54 నిమిషాల్లో గోల్స్ చేయగా.. ప్రభ్‌జోత్ సింగ్ 26వ నిమిషంలో.. నికోలస్ కీనన్ 33వ నిమిషంలో.. మణిందర్ సింగ్ 51వ నిమిషంలో గోల్స్ చేశారు. లాన్సర్స్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ 5వ నిమిషంలో, థియరీ బ్రింక్‌మన్ 44వ నిమిషంలో.. గుర్సబ్జిత్ సింగ్ 56వ నిమిషంలో గోల్స్ చేశారు. ఈ గెలుపుతో సూర్మా హాకీ క్లబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇదిలా ఉంటే, మహిళా క్రీడాకారిణుల కోసం తొలిసారి నిర్వహించిన మహిళల హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెచ్ఐఎల్) టోర్నమెంట్లో ఒడిశా వారియర్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నేహా గోయల్ సారథ్యంలోని ఒడిశా వారియర్స్ 2-1 గోల్స్ తేడాతో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టును ఓడించింది. రుతుజా దాదాసో పిసాల్ (20వ, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి ఒడిశా వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సలీమా టెటె కెప్టెన్సీలో ఆడిన సూర్మా క్లబ్ జట్టుకు పెన్నీ స్క్విబ్ (28వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. విజేతగా నిలిచిన ఒడిశా వారియర్స్ జట్టుకు రూ. 1 కోటి 50 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్ సూర్మా క్లబ్ జట్టుకు రూ. 1 కోటి ప్రైజ్‌మనీ దక్కింది. మూడో స్థానంలో నిలిచిన ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. -
సీలేరు రేంజ్లో బెంగాల్ టైగర్ సంచారం
సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతమైన సీలేరు అటవీ రేంజ్ పరిధిలో సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో రోడ్డుపై పెద్ద పులి (బెంగాల్‌టైగర్) ప్రయాణికుల కంటపడింది. రోడ్డు దాటుతుండగా అదే సమయంలో పాడేరు డిపోకు చెందిన బస్సు డొంకరాయి నుంచి సీలేరు మీదుగా పాడేరు వెళ్తుండగా సప్పర్ల రెయిన్గేజ్కు వెళ్లే సరికి పులి రోడ్డు దాటుతోంది. బస్సు రావడంతో పులి భయపడి రోడ్డుపై అటూ ఇటూ పరుగులు తీసింది. దీంతో బస్సు డ్రైవరు చాకచక్యంతో వ్యవహరించి హారన్ కొట్టడంతో అడవిలోకి పారిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇదివాస్తవమా? కాదా? అన్నదానిపై సీలేరు డెప్యూటీరేంజ్ అధికారి సీహెచ్ సింహాచలం పడాల్, తోకరాయి సెక్షన్ ఆఫీసర్ వివేకానందరావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాకేశ్ కుమార్ కలిసి పులి సంచరించిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు దాటిన ప్రాంతంలో పులి కాలిముద్రలను సేకరించి పులి జాడపై ఆరా తీశారు. పది రోజుల క్రితమే ఈ ప్రాంతానికి పులి వచ్చిందని, పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులకు నాలుగు రోజుల కిందట అరుపులు కూడా వినబడినట్లు తెలిసిందన్నారు.ఈ మధ్య కాలంలో ఒడిశా ప్రాంతంలోనూ, అల్లూరి జిల్లా చింతూరు ఏరియాలోనూ సంచరించేదని, ఆ పులే ఈ ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనిపై రేంజ్ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీలేరు రేంజ్ పరిధిలో 50 ఏళ్లకాలంలో పెద్ద పులి లేదన్నారు. సరిహద్దులోని ఒడిశా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చినట్లు నిర్ధారించామని, చింతూరు ఏజెన్సీ పరిధిలోని కాలిముద్రలు, సీలేరు పరిధిలో కాలి ముద్రలు పరిశీలిస్తామన్నారు. -
ఆడపులి కోసం అడవులన్నీ..
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని అడవుల్లో బెంగాల్ టైగర్ సంచారం కొనసాగుతోంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఒకరిని చంపడంతోపాటు మరొకరిపై దాడి చేసిన పెద్దపులి.. తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మీదుగా గోదావరి తీరం వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకొని అక్కడి నుంచి తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో తిష్టవేసింది. ఈ విషయాన్ని అటవీశాఖ ధ్రువీకరించింది. ‘తాడ్వాయి మండలం బందాల అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు ఆధారాలు దొరికాయి.వారం క్రితం పంబాపురం, నర్సాపురం అడవుల్లో తిరిగిన పులి.. బందాల అడవుల్లో జంతువులను వేటాడిన ఆనవాళ్లున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’అని అటవీశాఖ రేంజ్ అధికారి సత్తయ్య హెచ్చరించారు. దీంతో గిరిజన గూడేల్లో మళ్లీ పులి కలకలం మొదలైంది. తోడు కోసం గాలిస్తూ..: ఇరవై రోజులకుపైగా అటవీ ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న మగ పులి.. ఆడపులి తోడు కోసం అడవులన్నీ తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్.. చెన్నూరు, భూపాలపల్లి, ములుగు జిల్లా తాడ్వాయి, మంగపేట, వాజేడు, వెంకటాపురం.. ఇంద్రావతి నుంచి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు అటవీ ప్రాంతం... ఇలా పులి సుమారు 10 జిల్లాల్లో చాలా దూరం నడిచినట్లు పాదముద్రల ద్వారా తెలుస్తోందని అటవీశాఖ ప్రకటించింది.అయితే 2021లో ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నుంచి ములుగు అడవులకు మేటింగ్ కోసం వచ్చిన పులే మరోసారి వచ్చి ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు. దీన్ని ధ్రువీకరించుకోవడానికి నాలుగైదేళ్ల నాటి పులుల సంచార రికార్డులు, కెమెరా ట్రాప్‌లు, వాటి ఫొటోలు పరిశీలించాల్సి ఉందంటున్నారు. ఆ తర్వాతే ఈ పులి ఎక్కడ నుంచి వచ్చిందన్నది కచ్చితంగా చెప్పగలమంటున్నారు. మూడేళ్ల కిందట ఇలాగే..: మూడేళ్ల క్రితం పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ములుగు, తాడ్వాయి, మంగపేట, కరకగూడెం, ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి పర్యటించిందని అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో ఒక ఆవును కూడా పులి చంపితిందని, ఆ తర్వాత నుంచి దాని జాడ లేదని.. తిరిగి 10 రోజులుగా పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయిల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం వరకు పులి కారిడార్‌ను ఏర్పాటు చేసుకుందని అధికారులు అంటున్నారు. -
Mulugu District: బెంగాల్ టైగర్ వచ్చేసింది!
ములుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులపాటు కలవరం సృష్టించిన పులి ములుగు జిల్లాలోకి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరు దాటుకుంటూ మంగళవారం గోదావరి తీరం వెంబడి ఉన్న వెంటాపురం(కె) మండలంలోని బోదాపురంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తమ పరిధిలోని ట్రాపింగ్ కెమెరాలు, అడుగు జాడలు, సంచారానికి సంబంధించిన విషయాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాలోకి వచ్చింది బెంగాల్ టైగర్‌గా గుర్తించారు. బెంగాల్ టైగర్ ఏజెన్సీలోకి రావడం ఇదే మొదటిసారి అని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ సంయోగానికి వచ్చి ఉంటే ఆడపులి ఏటూరునాగారం –కొత్తగూడ వైల్డ్‌లైఫ్ ఏరియాలో ఉండే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోకి వచ్చిన మగపులి గోదావరి తీరం దాటి వెంకటాపురం(కె) మండలం, మంగపేట మండలం చుంచుపల్లి ఏరియా మీదుగా మల్లూరు గుట్టవైపు వెళ్లినట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పులి జాడలను తెలుసుకోవడానికి గతంలో ఏర్పాటు చేసిన కెమెరాలతో పాటు ప్రస్తుతం వాటర్ పాయింట్ ఏరియాల్లో కెమెరాలను బిగించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పులి అలజడికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ కెమెరాల్లో క్యాప్చర్ కాలేదని అధికారులు చెబుతున్నారు. బెంగాల్ టైగర్ ఏజెన్సీలోకి ప్రవేశించిన విషయం తెలుసుకున్న గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.మేటింగ్ సీజన్..ప్రతీఏడాది చలికాలంలో పెద్దపులులు సంయోగం(మేటింగ్) కోసం సంచరిస్తూ ఉంటాయి. అటవీ రికార్డుల ప్రకారం మగపులి ఆడపులితో సంయోగం చెందడానికి వాసన ఆధారంగా ముందుకు అడుగులు వేస్తుంది. ఇదే క్రమంలో ఆడపులి సైతం మగపులి వాసనను పసిగడుతూ అటువైపుగా ఆకర్షితమవుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బెంగాల్ టైగర్‌గా భావిస్తున్న మగపులి ప్రతిరోజూ 20 కిలోమీటర్ల వరకు సంచరిస్తుంది. రాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ నుంచి 120కిలో మీటర్లు దాటి ములుగు జిల్లాలోకి వచ్చిందంటే ఈ పరిధిలో సంయోగానికి మరో ఆడపులి ఉండే ఉంటుందని వన్యప్రాణి ప్రేమికులు చెబుతున్నారు. పులి ఆరు రోజులుగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఏజెన్సీలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. పులి సంయోగ సమయంలో ఆందోళనగా ఉంటుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలియడంతో జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల ఆదివాసీ గూడేలు, గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో చలికాలంలో పులులు జిల్లాలోని ఏటూరునాగారం వైల్డ్‌లైఫ్ ఏరియాలో సంచరించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అయితే సంచార సమయంలో జిల్లాలోకి వచ్చిన పులుల్లో ఒకటి ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో వేటగాళ్ల ఉచ్చులకు బలికాగా, మరో రెండు పులులు(ఎస్–1), ఓ చిరుత పులి క్షేమంగా అడవులను దాటుకుంటూ వాటి వాటి గమ్యస్థానాలను చేరుకున్నాయి.ఉచ్చులకు బలికాకుండా చూసేందుకు ప్రయత్నాలు2022లో ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోకి వచ్చి గర్భంతో ఉన్న పులి(ఎస్–1) వేటగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలోకి వచ్చిన అరుదైన జాతికి చెందిన బెంగాల్ టైగర్ ఎక్కడ వేటగాళ్ల ఉచ్చులకు బలవుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు ముందడుగు వేసి వేటగాళ్లగా గతంలో రికార్డుల్లో ఉన్న వారితో పాటు గ్రామాల వారీగా హెచ్చరికలు జారీ చేసినట్లుగా సమాచారం.ప్రజలు భయాందోళనకు గురికావొద్దుజిల్లాలోకి బెంగాల్ టైగర్ ప్రవేశించిన మాట వాస్తవం. ప్రస్తుతం మంగపేట మండలం చుంచుపల్లి– మల్లూరుగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించాం. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఉదయం, సాయంత్రం పూట పంట పొలాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఒంటరిగా వెళ్లొద్దు. సాధ్యమైనంత వరకు గుంపులు, గుంపులుగా ఉండడం మంచింది. ఎక్కడైనా పులి సంచారం వివరాలు తెలిస్తే వెంటనే స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించాలి. అటవీ శాఖ అధికారులు ప్రజలకు అండగా ఉంటారు.– రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్ఓ -
Video: టైగర్ ఎన్‌క్లోజర్‌లోకి దూకిన మహిళ.. జస్ట్ మిస్
అమెరికాలో ఓ మహిళా హల్చల్ చేసింది. న్యూజెర్సీలోని కోహన్‌జిక్ జూ వద్ద బెంగాల్ టైగర్ ఎన్‌క్లోజర్‌లోకి కంచె ఎక్కింది. ఏమాత్రం భయం లేకుండా పులిని తాకేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెను పులి దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయితే పులికి మహిళకు మద్య మరో ఫెన్సింగ్ ఉండటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.అయినప్పటికీ మహిళ తన పిచ్చి వేషాలు మానుకోకుండా పులిని ప్రలోభపెట్టడానికి యత్నించింది. జంతువుకు చేయి చూపింది, దాన్ని రెచ్చగొట్టేందుకు చూసింది. వెంటనే పులి ఆమె చేతిని ఒరికేందుకు, దాడి చేసేందుకు యత్నించింది. దీంతో భయపడిన మహిళ అక్కడనుంచి వెనక్కి పరుగుత్తుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. జూలోని కంచెపైకి ఎక్కడం చట్ట విరుద్దమని తెలిపారు. సందర్శకుల భద్రతతోపాటు జంతువుల సంరక్షణ తమ ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. జూలో జంతువులపై సందర్శకుల ప్రమాదకరమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని తెలిపారు. సదరు యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.LOOK: Bridgeton Police want to identify this woman, who climbed over the tiger enclosure’s wooden fence at the Cohanzick Zoo “and began enticing the tiger, almost getting bit by putting her hand through the wire enclosure.” 1/4 pic.twitter.com/DPRFi5xFg1— Steve Keeley (@KeeleyFox29) August 21, 2024 ఇదిలా ఉండగా కోహన్‌జిక్ జూలో రెండు బెంగాల్ పులులు ఉన్నాయి. రిషి, మహేషా అనే సోదరులు. వీటిని 2016లో అక్కడికి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చారు. అప్పుడు కేవలం 20 పౌండ్ల బరువుతో ఉండగా.. ఇప్పుడు పులులు ఒక్కొక్కటి దాదాపు 500 పౌండ్ల బరువు కలిగి ఉన్నాయి.ఇక బెంగాల్ పులులను భారతీయ పులులు అని కూడా పిలుస్తారు. ఇవి అంతరించిపోతున్న జాతికి చెందినవి. అక్టోబర్ 2022 నాటికి దాదాపు 3,500 పులులు మాత్రమే అడవిలో ఉన్నాయి. సైబీరియన్ పులి తర్వాత బెంగాల్ పులి జాతి రెండవ అతిపెద్దదిగా పరిగణిస్తారు. -
జూలో జంతువులకు ఆయుషు ఎక్కువ.. ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: వేళకు తిండి..సేద తీరేందుకు ఆవాసం ఉంటే ఏ జీవి అయినా పదికాలాలు బాగా ఉంటుందనే సామెత మన జూ పార్కులోని జంతువులకు సరిగ్గా సరిపోతుంది. అడవి జంతువులకంటే.. జంతు ప్రదర్శనశాలలోనే పుట్టి.. ఇక్కడే పెరిగిన ఆనేక జంతువులు తమ జీవితకాలంటే ఎక్కువగా జీవిస్తున్నాయి. పోషకాహారం.. అలనాపాలన బాగుండడంతో ఈ జీవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతున్నాయి. అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు వయోభారంతో వేటను కొనసాగించలేవు. ఒంట్లో సత్తువ తగ్గడం.. ఇతర ప్రాణులతో పోటీపడలేక ఆకలితో అలమటిస్తాయి. నీరసంతో కన్నుమూస్తాయి. అదే జూలో అయితే.. సహజసిద్ధమైన ఆహారానికి కొరత ఉండదు. బలవర్ధకమైన ఆహారం.. సప్లిమెంట్లు, ఆనారోగ్యానికి గురైతే ఔషధాలు అందిస్తుండడంతో ఈ ప్రాణుల జీవనకాలం పెరుగుతుందని జూ క్యూరేటర్ రాజశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. జూలో వేట లేదు, ఇతర జంతువులతో పోరాటాలు ఉండకపోవడం కూడా వీటి జీవితకాలం పెరగడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అడవిలో పెరిగే జంతువులకంటే అధికకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కొ న్ని జంతువుల వివరాలు మీ కోసం... ఆహార ఆవసరాలకు అనుగుణంగా డైట్ జూలో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. వాటి ఆహార అవసరాలకు అనుగుణంగా పోషకాలతో కూడిన ఆహారం అందిస్తాం. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటిస్తాం. ఒక్కో వన్యప్రాణి ఒక్కోతీరుగా ఆహారం తీసుకుటుంది. సమయం, సరిపడా మోతాదులో ఆహారం అందజేస్తాం.ఆడవుల్లో ఉండే వన్యప్రాణుల కంటే జూలో ఉంటున్న వన్యప్రాణుల వయో పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటికి ఆహారం సమయానికి అందుతుంది. రోగాల బారినపడకుండా చూసుకుంటాం. – డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం, జూ డిప్యూటీ డైరెకర్ట్ (వెటర్నరీ) ఆపర్ణ (బెంగాల్ టైగర్) పుట్టినరోజు : డిసెంబర్ 3, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు జిరాఫీ ( సునామీ బసంత్) పుట్టినరోజు : ఫిబ్రవరి 13, 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు కునాల్, సమీరా (తెల్లపులులు) పుట్టినరోజు : సెప్టెంబర్ 9, 2006 వయసు : 16 ఏళ్లు సగటు జీవితకాలం : 12–15 ఏళ్లు సులేమాన్ (జాగ్వార్) పుట్టినరోజు : ఏప్రిల్ 5, 1998 వయసు : 24 ఏళ్లు సగటు జీవితకాలం : 20 ఏళ్లు బారసింగా (చిత్తడి జింక) పుట్టినరోజు : 27, ఏప్రిల్ 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 12 ఏళ్లు ఎలుగుబంటి పుట్టినరోజు : ఫిబ్రవరి 18, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు 30 ఏళ్ల నుంచి పక్షుల్లో కూడా హరన్బెల్ పక్షి, తెల్ల కొకాటో పక్షి వయస్సు కూడా దాదాపు 30 ఏళ్లు ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 20–25 ఏళ్లు వరకు ఈ సంతతి పక్షులు జీవిస్తాయి. (క్లిక్ చేయండి: డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!) -
రూటు మార్చింది.. అనకాపల్లిలో ప్రవేశించిన పెద్దపులి
సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లాకు పులి టెన్షన్ మొదలైంది. కాకినాడ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాలోకి పులి ప్రవేశించింది. నక్కపల్లి మండలం తిరుపతిపాలెం దగ్గర పులి అడుగుజాడలు గుర్తించారు. తటపర్తి దగ్గర గేదెపై పులి దాడి చేసింది. పులి సంచారంతో పాయకరావుపేట పరిధిలోని శ్రీరామపురం, తిరుపతిపాలెం, తడపర్తి, వెంకటాపురం గ్రామాల్లో ఆందోళన నెలకొంది. దీంతో గ్రామస్తులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. చదవండి: మీ బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడం లేదా..? కారణం ఇదే.. కాగా, సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ సమీపంలోని కుచ్చులకొండ నుంచి తాండవ నది పరివాహక ప్రాంతానికి వెళుతూ తుని-కొట్టాం రోడ్డుపై పులి చేరుకున్నట్లు సమాచారం. అదే సమయంలో బెండపూడి నుంచి రొయ్యల ఫ్యాక్టరీ బస్సులో ఇళ్లకు వెళుతున్న కార్మికులు దీనిని గుర్తించారు. బస్సు లైట్ల కాంతికి కొంతసేపు పులి రహదారిపైనే ఉన్నట్లు వీరు తెలిపారు. తర్వాత తాండవ నదిలోకి దిగేందుకు మార్గం కనిపించకపోవడంతో కుచ్చులకొండపైకి వెళ్లినట్లు పేర్కొన్నారు. -
విశాఖ జూ పార్కులో పులి మృతి
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ జూ పార్కులో ఓ ఆడ పులి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. 20 ఏళ్ల వయసు గల ఈ రాయల్ బెంగాల్ టైగర్(సీత) వృద్ధాప్యంతో పాటు కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం పులుల ఎన్‌క్లోజర్‌లో మృతి చెందింది. యానిమల్ కీపర్ ద్వారా విషయం తెలుసుకున్న జూ అధికారులు పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. -
పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు
బెంగాల్ పులులున్నాయ్.. బంగారు బల్లులూ తిరుగుతున్నాయ్.. గిరి నాగులు చెట్టంత ఎత్తున తోకపై నిలబడి ఈలలేస్తున్నాయ్.. అలుగులు అలరారుతున్నాయ్.. కొమ్ము కత్తిరి పక్షులు కిలకిలరావాలు ఆలపిస్తున్నాయ్.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆరంజ్ ఓకలీఫ్ సీతాకోక చిలుకలు సందడి చేస్తున్నాయ్. ఇలాంటి ఎన్నో.. ఎన్నెన్నో అరుదైన జీవజాలానికి పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించిన పాపికొండలు అభయారణ్యం నిలయంగా నిలుస్తోంది. జాతీయ పార్కుకు వన్నె తెస్తోంది. బుట్టాయగూడెం: ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండలు అభయారణ్యం జీవ వైవిధ్యంతో అలరారుతోంది. పాపికొండలు అభయారణ్య ప్రాంతాన్ని 2008 నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతం మధ్య గలగల పారే గోదావరి నదికి ఇరువైపులా సుమారు 1,01,200 హెక్టార్ల పరిధిలో ఇది విస్తరించి ఉంది. 1978లో పాపికొండల అభయారణ్యం 591 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే రిజర్వు ఫారెస్ట్‌గా ఉండేది. జాతీయ పార్కుగా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడ జంతు జాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1,045 రకాల జంతువులున్నట్టు గుర్తించారు. వీటిలో 4 పెద్ద (బెంగాల్) పులులు, 6 చిరుత పులులు, 30 అలుగులు (పాంగోలిన్), 4 గిరి నాగులు (కింగ్ కోబ్రా) ఉన్నట్టు గణించారు. చదవండి: సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి అభయారణ్యంలో అరుదైన కొమ్ము కత్తిరి పక్షి జింకలు.. చుక్కల దుప్పులు ఇక్కడ ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, కురుడు పందులు, చుక్కల దుప్పులు, సాంబాలు, అడవి గొర్రెలు, ముళ్ల పందులు, అడవి కుక్కలు, కుందేళ్లు, ముంగిసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్టు వన్యప్రాణి విభాగం సర్వేల్లో తేలింది. వీటితో పాటు నెమలి, గద్ద, చిలకలు, పావురాలు, కోకిల, వడ్రంగి పిట్ట, గుడ్లగూబ, కొమ్ము కత్తిరి తదితర పక్షులూ ఉన్నాయి. అభయారణ్యంలో విలువైన వృక్ష సంపద ఎంతో ఉంది. ముఖ్యంగా వేగిస, మద్ది, బండారు, తబిస, సోమి, తాని, బెన్నంగి, గరుగుడు, గుంపెన, బిల్లుడు, తునికి, మారేడు తదితర వృక్ష సంపద ఉంది. ఇవిగాక విలువైన వెదురు వనాలు విరివిగా ఉన్నాయి. నేషనల్ విన్నర్ ‘ఆరంజ్ ఓకలీఫ్’ ఇక్కడ సుమారు 130 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. గత ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉత్తమ సీతాకోక చిలుకల పోటీలకు పాపికొండలు నేషనల్ పార్క్‌లో ఉన్న మూడు రకాల సీతాకోక చిలుకలు పోటీ పడ్డాయి. ఫైనల్స్‌లో దేశవ్యాప్తంగా ఏడు రకాల సీతాకోక చిలుకలు ఎంపిక కాగా.. ఈ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఆరంజ్ ఓకలీఫ్ జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికైన ఆరెంజ్ ఓకలీఫ్ అభయారణ్యంలో అలుగులు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో అరుదైన వన్యప్రాణులైన అలుగులు (పాంగోలిన్లు) ఉన్నాయి. వీటి మూతి మొసలిని పోలి ఉంటుంది. వీటి జీవిత కాలం 20 సంవత్సరాలు. ఈ అరుదైన వన్యప్రాణులు ఇక్కడ 30కి పైగా ఉన్నట్టు గుర్తించారు. ట్రాప్ కెమెరాకు చిక్కిన ఎలుగుబంటి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా అభయారణ్య పరిధిలోని పశ్చిమ అటవీ ప్రాంతంలో అనేక సర్ప జాతులు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది కింగ్ కోబ్రా (గిరి నాగు). దట్టమైన అడవిలో గల జలతారు వాగు ప్రాంతంలో సుమారు 30 అడుగుల గిరినాగు తిరుగుతున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. పగటిపూట చెట్లపై మాత్రమే ఉండే గిరి నాగులు రాత్రివేళ తోకపై నిటారుగా చెట్టు మాదిరిగా నిలబడి ఈల వేసినట్టుగా శబ్దాలు చేస్తుంటాయని గిరిజనులు చెబుతుంటారు. చదవండి: Raksha Bandhan: ఆవుపేడతో అందమైన రాఖీలు -
హాయ్.. నేనే అసలైన పులిరాజాని!
పులుల దినోత్సవం సందర్భంగా బాస్ ఆదేశాలతో పెద్దపులిని ఇంటర్వ్యూ చేయడానికి అడవికి చేరాడు సాంబడు. భయం భయంగానే అంతటా తిరుగుతున్నాడు. ఇంతలో సాంబడి కష్టం చూసి జాలిపడి ముందుకు దూకింది ఓ పెద్దపులి. సాంబడికి గుండె ఆగినంత పని అయ్యింది. కదలకుండా అలాగే ఉండిపోయాడు. ‘హాయ్.. ఐ యామ్ పులి రాజా’ అంటూ తనని పరిచయం చేసుకున్నాడు. భయం నుంచి తేరుకుంటూ.. ‘అంటే నువ్వు..’ అంటూ సాగదీశాడు సాంబడు. ‘ఛీ.. ఛీ.. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’ అంటూ యాడ్‌లో చూపించే కక్కుర్తి వ్యక్తిని కాదు నేను. అడవికి మృగరాజు తర్వాత అంతటి తోపునని చెప్పడం నా ఉద్దేశం. ఇవాళ అంతర్జాతీయ పులుల దినోత్సవం కదా. మా మంచి కోసం ఓరోజును పెట్టిన మంచి మనుషులకు థ్యాంక్స్. అందుకే నా అంతరంగం నీతో పంచుకునేందుకు మీ ముందుకొచ్చా. పదా.. అలా వనంలో విహరిద్దూ ముచ్చటించుకుందాం అంటూ పులిరాజు ముందు వెళ్తుండగా.. ఆ వెనకే కదిలాడు సాంబడు. నా పేరు పెద్దపులి. మాది ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబం అండీ. ‘జగమంత కుటుంబం’.. అని పాడుకుంటూ సరదాగా అడవుల్లో గడిపేవాళ్లం. కానీ, మా సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. అది ఎందుకు తెలుసు కదా!. సర్కస్‌లు, జూలు, సఫారీలు, కాంక్రీట్ అరణ్యాలు, కార్పొరేట్ కుట్రలు.. అబ్బో కమర్షియల్ మార్కెట్ విస్తరిస్తున్నా కొద్దీ మాకీ అవస్థలు తప్పడం లేదు. ఒకప్పుడు మావి స్వేచ్ఛా రాజ్యాలు. ఎన్నో దేశాలు పట్టుకుని తిరిగినమ్. కానీ, ఏం జేస్తం. ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తంది. ఎక్కడికి వెళ్లినా సరిహద్దు గుర్తులుగా పెట్టుకునేవాళ్లం ఏదీ మీ మనుషులు కంచెలు ఏర్పాటు చేసుకున్నట్లు. సాంబా నువ్వు నవ్వనంటే ఒకటి చెప్తా. మా మూత్రంతోనే మేం హద్దులు గీసుకుంటాం. వాసన గీతల్ని గుర్తుపెట్టుకుంటాం. మగవాళ్లం 60 నుంచి వంద చ.కి.మీటర్ల దాకా, ఇక ఆడ పులులేమో 20. చ.కి.మీటర్ల వరకు బార్డర్స్ ఏర్పాటు చేసుకుంటాం. కానీ, గత వందేళ్లలో ఎన్నో మార్పులు. లక్షల్లో ఉండే నా కుటుంబ సభ్యుల సంఖ్య.. ఇప్పుడు వేలల్లోకి పడిపోయింది. తొమ్మిది జాతులు కాస్త.. ఆరుకి చేరి అంతరించిపోయే స్టేజ్‌కు చేరుకున్నాం. కాస్త కూస్తో ఈ దేశంలోనే(భారత్) మా కౌంట్ బెటర్‌గా ఉందని మొన్నటి లెక్కలైతే చెప్తున్నయ్. యాభై ఏళ్ల క్రితం 2,000 ఉన్న మా జనాభా.. ఇప్పుడు మూడు వేల దాకా(2967) చేరిందట. సంతోషం! కానీ, మూడు లక్షల చదరపు కిలోమీటర్ల రేంజ్లో.. 15,000 పులుల దాకా ఉండే జీవించే హక్కు అవకాశం ఉందంటున్నారు. మరి దాని సంగతి.. (పరధ్యానంలోకి వెళ్లిపోయాడు పులిగాడు) ఏం మనుషులబ్బా.. అలా మాట్లాడుతుండగానే పులిరాజాగాడికి కళ్ల ముందు వాగు కనిపించింది. అదేం ఆనందమో ఒక్క దూకున ‘దబేల్’మని దూకాడు వాడి సిగదరగ. అలా ఈదుతూనే.. ‘సాంబా.. మీ మనుషుల్లాగే సంతోషం, బాధ, కోరికలు.. అన్నీ ఉంటాయి మాకూ. కానీ, మేం మీ అంత తెలివైనోళ్లం కాదు కదా అబ్బా. అందుకే మా భావోద్వేగాలు డిఫరెంట్‌గా ఉంటాయి. మేం గాండ్రించేది కమ్యూనికేషన్ పర్పస్ కోసం. మాలో మేం మాట్లాడుకోవడానికి. అంతేగానీ సినిమాల్లో చూపెట్టినట్లు వేటాడడానికో.. భయపెట్టడానికో కాదు. సంతోషం వేస్తే కళ్లు మిటకరిస్తాం. బాధేస్తే మూలుగుతాం. ఎక్స్ట్రీమ్ ఆనందం వస్తే కళ్లు మూసుకుంటాం. మా విశ్రాంతి కూడా ధ్యానం తరహాలోనే ఉంటుంది. కోరికల టైంలో మా కూత సెపరేట్‌గా ఉంటుంది(అటుగా వెళ్తున్న ఆడపులిని చూసి సిగ్గుపడుతూ..). ఇక మా లైఫ్ స్టయిల్ అంటావా?.. మీలాగా డైట్లు గట్రా మాకేం ఉంటాయి?. ఆకలేస్తే వేటాడతాం. దొరికింది తింటాం. అరగకపోతే వాంతి చేసుకుంటాం. ఒక్కోసారి గడ్డి నమిలి జీర్ణం కానిదాన్ని బయటకు రప్పించుకుంటాం. అంతేకానీ మీ మనుషుల్లా దుర్మార్గంగా ప్రవర్తించడం. ఉత్త పుణ్యానికే మేం వేటాడం. అయినా మేం మనుషుల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తామబ్బా?. మమ్మల్ని ఎవరైనా కెలిగితేనే దాడి చేస్తాం కదా! భలే లెక్కలు వాగులోంచి బయటకొచ్చిన పులిగాడికి ఎదురుగా ఓ చెట్టు కనబడింది. ఆప్యాయంగా దానిని రుద్దేసి.. మూత్రాన్ని చిమ్మిచ్చి కొట్టేశాడు. ముసిముసి నవ్వులతో మళ్లీ సాంబడితో ముచ్చట్లు మొదలుపెట్టాడు. ‘పులి ఎదురుగా వచ్చిందంటే.. మనిషికి ప్యాంట్ తడిసిపోతుంటుంది. అదే బలహీన స్థితిలో పులి పక్కన ఫొటో దిగితే వాళ్లు ‘హీరోలు-షీరోలు’ అయిపోతారు. మాకు ఇదేం కర్మో అర్థం కాదు. అన్నట్లు మా లెక్క భలే చిత్రంగా ఉంటుంది సాంబో. అటవీశాఖవాళ్లు 1973 నుంచి ‘ప్రాజెక్టు టైగర్’ ద్వారా.. మా పాద ముద్రలతో మమ్మల్ని లెక్కపెడుతూ వస్తున్నారు. మీ వేలి ముద్రలు మనిషికీ మనిషికీ మధ్య ఎలా తేడా ఉంటాయో.. అట్లే మా పాదముద్రలు డిఫరెంట్. మా అడుగుజాడ కనిపిస్తే, దాని అంచుల ఆకృతిని కాగితం మీద ట్రేస్‌లా గీసుకుని ప్లాస్టర్ ద్రవాన్ని ఆ ట్రేస్ నుంచి తీసిన మూసలో పోసి, అది గట్టి పడ్డాక భద్రపరుస్తారు. మొత్తం మీద ఎన్ని రకాల పాద ముద్రలు లభించిందీ లెక్క చూసుకుని.. వాటి ఆధారంగా మా కౌంట్ చెప్తారు. అయితే అంతటా ఇలా చేస్తారనేం లేదు. కంప్యూటర్ల సాయంతో, రేడియో కాలర్ విధానం, రహస్య కెమెరాల సాయం, పరారుణ కిరణాల ఆధారంగా అభరణ్యాల్లో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్‌ను లెక్కగడ్తారు. ప్చ్.. టెక్నాలజీ మహిమ అంతా..(పులిగాడి నాలెడ్జ్‌కి సాంబడు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు) మీకు దణ్ణం పెడ్తాం ‘లైఫ్ ఆఫ్ పై’ అని ఏదో సినిమా వచ్చిందట కదా. నువ్వు చూశావా. ఆ.. మావోళ్లు మాట్లాడుకుంటుంటే విన్నా. అందులో మా కులపోడు ఇరగదీశాడు అంట కదా!. ‘హా.. అదంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ లేండి’ అంటూ వంకరగా నవ్వుతూ చెప్పాడు సాంబడు. ఆ మాటతో పులిరాజాగాడు ‘ష్...’ అంటూ ఓ నిట్టూర్పు విదిల్చాడు. ‘అయినా ఏం ఉంది లే.. మా జంతువుల ఎమోషన్స్‌తో ఆడుకోవడం.. కమర్షియల్‌గా వాడుకోవడం మీకేమైనా కొత్తా?. ఒకప్పుడు సర్కస్‌లు, ఆ తర్వాత జూలు, ఇప్పుడు సఫారీలు, సినిమాలు.. వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) అమెండ్మెంట్ యాక్ట్ లాంటి చట్టాలున్నా మాలో చాలామంది బతుకులు మాత్రం అర్థాంతరంగా ముగుస్తున్నాయి. పేరుకే మేం పులులం. కానీ, వేటాడడం మాత్రం ఎంత ఈజీనో. వలేస్తారు. బోనుల్లో ఎరలేస్తారు. అడవి బిడ్డలకు డబ్బు ఆశ చూపెట్టి మమ్మల్ని మట్టుపెడతారు. కుట్ర చేసి తూటాలు-బళ్లాలు దొంగచాటుగా మా శరీరంలో దింపుతారు. చర్మం వొలిచి, గోళ్లు-కోరలు పీకేసి, ఎముకలు లాగేసి.. అబ్బో ఆ క్రూరత్వం మాకన్నా మనిషి వేటలోనే ఎక్కువ కనిపిస్తుంటుంది. అంతెందుకు నా చెల్లి అవనిని ఎంత ఘోరంగా చంపారో తెలిదా?, మా ముందు తరం సాఖీని జూలోనే ఘోరంగా చంపింది గుర్తు లేదా? మాలాంటోళ్లకు భద్రత-రక్షణ ఎక్కడ దొరుకుతుంది? అడవుల్లోనా? జూలోనా?.. ఇంక యాడ?.. మనుషులకు దణ్ణం పెడుతున్నా. మా మామాన మమ్మల్ని వదిలేయండి. (చెమ్మగిల్లిన కళ్లతో పులిగాడు.. ఆ మాటలతో సాంబడికీ కళ్లలో నీళ్లు తిరిగాయి) అవని మృతదేహాం వాళ్లకు వందనాలు ఇద్దరికీ కన్నీళ్లు చెదిరిపోయాయి. ‘‘మనుషుల దృష్టిలో మేం దేవతా వాహనాలం. ‘పులిలా బతకరా. నువ్వు ఆడపులివి. పులి కడుపున పులే పుడుతుంద’ంటూ సొల్లు కబుర్లు చెప్తుంటారు. మరి మా జీవనాన్ని ఎందుకు గౌరవించరు. మామాన మమ్మల్ని వదిలేయొచ్చు కదా. కనిపిస్తే ఆడుకుంటారు. వెంటాడి మరీ దాడులు చేస్తారు. కన్ఫ్యూజ్ చేసి వాళ్లూ ఇబ్బంది పడతారు. రెచ్చగొడితే పిల్లి అయినా పులే అవుతుందనే విషయం మనిషికి తెలీదా. మా బతుకుల్ని ఆగం చేయకుండా ఉంటే.. ఊర్ల మీద పడాల్సిన అవసరం మాకేముండేది(ఆవేశంతో ఊగిపోతూ పులిగాడు..)’’. అంతలోనే తేరుకుని ‘‘సరేగానీ సాంబా ఇవాళ మా పండుగ Global Tiger Day. మా జాతి సంరక్షణ కోసం పదకొండేళ్ల కోసం పుట్టింది ఈ రోజు. మా మీద ప్రేమతో కొందరు ఈ డేని జరుపుతున్నారు. మా జోలికి రాకుండా మమ్మల్ని ఎలా బతకనివ్వాలనే విషయాన్ని వాళ్లు ప్రచారం చేస్తుంటారు. మమ్మల్ని అడవి బిడ్డలుగా గుర్తించమని చెప్తారు. హ్యూమన్-టైగర్ కాన్ఫ్లిక్ట్ గురించి గ్రామీణ, అడవులకు దగ్గరగా ఉండే ఊర్లు, గూడెం, తండాల్లో అవగాహన కల్పిస్తారు. వాళ్లకు మా వందనలు. మా మంచి కోసం ఆలోచించే నలుగురు ఉన్నారనే ఆనందంతో ఇలా గడిపేస్తాం. సరే మరి.. నీకు బాగా లేట్ అయ్యింది. ఎక్కువసేపు ఉంటే నిజంగానే లేట్సాంబడివి అయిపోతావ్..త్వరగా వెళ్లిపో.. బై బై.. ఉంటా మరి!’’ అంటూ అలా పులిరాజుగాడు దట్టమైన చెట్ల నడుమకు పయనమయ్యాడు. ఇంతలో ‘Happy World Tiger Day’ అంటూ సాంబడు అనడంతో.. పులిరాజా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి మళ్లీ ముందుకు వడివడిగా అడుగులేశాడు. -ఆర్కే నారాయణ్ ఏ టైగర్ కమ్స్ టు టౌన్ స్ఫూర్తితో.. సాక్షి వెబ్ డెస్క్ ప్రత్యేకం #InternationalTigerDay | Here are some of the parks and sanctuaries in India where you can spot the magnificent cat in its element.🐅🐯 #TigerDay | #InternationalTigerDay2021 pic.twitter.com/Am1mvkWnFU — 𝙍𝙖𝙟𝙚𝙨𝙝 𝘾𝙝𝙖𝙪𝙝𝙖𝙣 (@twitt_chauhan) July 28, 2021 -
అటు కాదురా బాబూ.. ఇటూ..
పొలోమని వెళ్లిందేమో.. బెంగాల్ టైగర్‌ను చూడటానికి.. కనిపిస్తే.. వెంటనే కెమెరాతో క్లిక్మనిపించేయడానికి.. ఇక్కడ చూడండి.. పులి వచ్చి ఎదురుగా నిల్చుంటే.. వీళ్లంతా ఎటు చూస్తున్నారో.. రాజస్తాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ‘పార్కుకు వచ్చిన జనమంతా ఏదో పొదల వెనుక పులి ఉన్నట్లు అనిపిస్తే.. అటు చూస్తూ ఉండిపోయారు.. ఇటేమో.. ఈ పులి అకస్మాత్తుగా వాహనం ముందుకు వచ్చింది. చివరికి అది కూడా ఆశ్చర్యపోయినట్లుంది.. అందుకే నేనిక్కడ ఉంటే.. వీళ్లంతా ఎటు చూస్తున్నారబ్బా అంటూ.. వెనక్కి ఓసారి లుక్కిచ్చుకుని ముందుకు సాగింది’ అని ఈ చిత్రాన్ని తీసిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ అర్పిత్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మధ్య మెక్సికోలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.. తిమింగలాలను చూడ్డానికి బయల్దేరిన కొందరు.. మనోళ్లలాగే.. ఎటో దిక్కులు చూస్తూ ఉండిపోయారు.. ఆ తర్వాత ఏం జరిగింది అంటే.. ఫొటో చూడండి.. మీకు అర్థమవుతుంది.. -
జూ సిబ్బంది పై రాయల్ బెంగాల్ టైగర్ ఎటాక్..
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని బయోలాజికల్ పార్కులో దారుణం చోటు చేసుకుంది. 35 ఏండ్ల వయసున్న పౌలాష్ కర్మకర్ అనే జూ అటెండెంట్‌పై రాయల్ బెంగాల్ టైగర్ దాడి చేసి చంపేసింది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో టైగర్ ఉన్న కేజ్‌లోకి పౌలాష్ ప్రవేశించి వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా పులి అతనిపై దాడి చేసింది. అయితే పులి ఉన్న బోను మూడు గేట్లు తెరిచి నిర్లక్ష్యంగా వ్యవరించడంతో ఈ ఘటన జరిగినట్లు జూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు అస్సాంలోని లఖింపూర్ జిల్లాలోని ధేకిజులికి చెందిన వ్యక్తిగా జూ అధికారులు తెలిపారు .ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి:దారుణం: ఎంత పని చేశావు తల్లీ! -
పులులు ఈదితే, మొసళ్లు ఒడ్డున సేద తీరుతాయి
అడవంటే పూర్తిగా అడవీ కాదు, నది పాయ అందామంటే అవి మాత్రమే కాదు. సముద్రతీరం అనుకుందామంటే కచ్చితంగా అలా కూడా చెప్పలేం. గంగ, మేఘన, బ్రహ్మపుత్ర వేటికవి తమ దారిన తాము పయనిస్తూ అటవీప్రాంతానికి పచ్చదనాన్ని అద్దుతూ ఉంటాయి. నదులు పాయలు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంటాయి. నీటి పాయల తీరాన ఎల్తైన మడ అడువులు తెచ్చిన ప్రాకృతిక సౌందర్యం మాటల్లో వర్ణించలేనిది. ఆ చెట్ల వల్లనే ఈ అడవికి సుందర్వన్ అనే పేరు వచ్చింది. బెంగాలీ, ఒడిషా భాషల్లో ‘వ’ అనే అక్షరం ఉండదు. ‘వ’ కు బదులుగా ‘బ’ ఉపయోగిస్తారు. అందుకే ఈ సుందరవనం సుందర్బన్ అయింది. నీటిలో పులి నేల మీద మొసలి అడవి అంటే... పులి అడవిలో ధీరగంభీరంగా సంచరిస్తూ ఉంటుందని కరెక్ట్‌గానే ఊహిస్తాం. నీటి మడుగులో అడుగు పెట్టాలంటే మొసలి ఉంటుందేమోనని భయపడతాం కూడా. అయితే... సుందర్బన్లో పులులు నీటిలో ఈదుతూ కనిపిస్తాయి. మొసళ్లు ఒడ్డున సేద దీరుతుంటాయి. ఆ దృశ్యం కంటపడగానే గుండె ఆగిపోయినట్లవుతుంది. రకరకాల పక్షులు... మొత్తం రెండొందల యాభై రకాలకు పైగా జాతులుంటాయని అంచనా. ఈ టైగర్ రిజర్వ్‌లో నాలుగు వందల బెంగాల్ రాయల్ టైగర్‌లుంటాయి. రాత్రి బస చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. అడవిలో ఊళ్లు మొత్తం పదివేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అడవి ఇది. నాలుగువేలకు పైగా చదరపు కిలోమీటర్లు మనదేశంలో ఉంది. దాదాపు ఆరు వేల చదరపు కిలోమీటర్లు బంగ్లాదేశ్‌లో ఉంది. ఇది మనదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. విశాలమైన ఈ అటవీప్రాంతంలో నదులు, నీటి పాయల మధ్య మొత్తం నూట రెండు దీవులున్నాయి. నూటా రెండు దీవులకు గాను యాభై నాలుగు దీవులు జనావాసాలు. అడవి మధ్య ఊర్లన్నమాట. ఈ దీవుల్లో పంటలు పండిస్తారు. అడవి మధ్య ప్రవహించే నదుల్లో జాలరులు చేపలు పడుతుంటారు. రోజూ ఉదయం సాయంత్రం ఇక్కడ బంగాళాఖాతం చేసే అల్లరిని చూడవచ్చు. అలలు ఆరడుగుల నుంచి పదడుగుల ఎత్తుకు లేస్తాయి. ఆ భారీ అలలతో నీటితోపాటు ఇసుక కూడా అడవిలోకి కొట్టుకు వచ్చి మేట వేస్తుంటుంది. పడవలు, లాంచీలలో దీవులన్నింటినీ చుట్టి రావచ్చు. సరిహద్దు దీవి మనదేశానికి సరిహద్దులో ఉన్న దీవి పేరు ‘గోసాబా’ ఇది నీటి మట్టానికి 13 అడుగుల ఎత్తులో ఉంది. ఇది నిజానికి భారత ప్రధాన భూభాగానికి ఆనుకుని ఉండదు. విడిగా ఉంటుంది. నీటి ఎల్లలో మన సరిహద్దుకు లోపల ఉంది. ఇది ఒక పంచాయితీ. ఇందులో నివసించే ప్రజల కోసం స్కూలు, హాస్పిటల్ కూడా ఉన్నాయి. ప్రధాన భూభాగంలోకి రావాల్సిన అవసరం లేకనే హాయిగా జీవించేయవచ్చు. సాహిత్యవనం సుందర్బన్ అటవీప్రదేశం కోల్‌కతాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ‘న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ నేచర్’ కేటగిరీలో లిస్ట్ అయింది. బెంగాలీ రచయితలు సుందర్బన్ అటవీ ప్రదేశం, ఇక్కడి దీవుల్లోని జన జీవనమే కథాంశంగా అనేక రచనలు చేశారు. సుందరబన్‌కు ప్రత్యేక హోదాలు ► 1973 టైగర్ రిజర్వ్ ► 1987 వరల్డ్ హెరిటేజ్ సైట్ ► 1989 నేషనల్ పార్క్ -
తెల్ల పులులను చూడాలా..?
సాక్షి, బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కుకు ప్రత్యేకమైన రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు కొత్త సంవత్సరం నుంచి జూ సందర్శకులను అలరించనున్నాయి. జూపార్కు వ్యవస్థాపక దినమైన అక్టోబర్ 6న కునాల్, దివ్యానీ దంపతులకు నాలుగు పులి కూనలు జన్మించాయి. వాటిని కలుపుకొని జూలో మొత్తం 14 రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు ఉన్నాయి. ఇందులో మగవి ఆరు, ఆడవి మూడు ఉన్నాయి. జూపార్కులో చేపట్టిన సంతానోత్పత్తిలో పుట్టిన ఈ పులులకు జూ అధికారులు, అటవీ శాఖ మంత్రులు పేర్లు పె ట్టారు. జూలో తెల్ల పులుల పేర్లు నాగమణి, కవి, సమీరా, అభిమన్యు, శంకర్ పేర్లు పెట్టారు. మన దేశంలో రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు ప్రత్యేకమైనవి. ఇతర దేశాల్లో ఇవి అరుదు. -
వైరల్ ఫొటోలో ఏముందో గుర్తించడమే అదృష్టం!
సాధారణంగా కొన్ని ఫొటోల్లో ఏం దాగుందో చెప్పడం కొంత కష్టంగానే అనిపిస్తుంది. ఒక పజిల్ రూపంలో ఉన్న ఫొటోలో ఏం కనిపిస్తోందని ఎవరైనా అడిగితే మన కంటికి కాస్త పని చెప్పాల్సిందే. ఇక అంటువంటి ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాగర్ డామ్లే అనే ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తాను తీసిన రెండు ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన మొదటి ఫొటోను చూస్తే ముందుగా అడవిలో ఉన్న దట్టమైన పొదలు కనిపిస్తాయి. కానీ, అలానే నిశితంగా పరిశీలిస్తే పొదల్లో దాక్కొని ఉనక్న ఓ జంతువు శరీరంపై చారలు ఉన్నట్లు గమనించవచ్చు. దాన్ని స్పష్టంగా గుర్తించాలంటే మాత్రం కొంత కష్టపడాల్సిందే. అప్పుడే మాత్రమే ఆ పొదల్లో కనిపిస్తున్న జంతువు టైగర్ అని తెలుస్తుంది. ‘మొదటి ఫొటో సాధరణమైంది. రెండోది నైపుణ్యంతో నా కెమెరాలో బంధించింది. రెండు ఫొటోల్లోనూ ఆ బెంగాల్ టైగర్ మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. మీరు పులిని చూశారా? లేదా? అనేది మీ అదృష్టం’ అని సాగర్ డామ్లే కాప్షన్ జతచేశారు. ఈ చిత్రాన్ని ఆయన కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో తీసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సాగర్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘పులులు చుట్టు పక్కల ఉన్నాయని గుర్తించినప్పుడు మాత్రమే వాటిని చూడగలం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. రెండు వేర్వేరు యాంగిల్స్‌లో ఉన్న ఫొటోలను ఎలా తీశారు’, ‘కొన్ని జంతువులు ఆడవిలో మనల్ని ఎక్కడి నుంచైనా చూడగలవు’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. -
బెంగాల్ టైగర్‌కు బంగారు పన్ను
న్యూఢిల్లీ : కారాకు ఐదేళ్లు. దాదాపు 57 కిలోల బరువు. కారా అంటే అమ్మాయి కాదు, ఆ మాటకొస్తే మనిషే కాదు. బెంగాల్ టైగర్ పిల్ల. అది జర్మనీలోని పులుల సంరక్షణ కేంద్రంలో ఉంటోంది. అది దాని కోసం కేటాయించిన బొమ్మలతో ఆడుకుంటూ ఓ కోర పన్నును ఊడ గొట్టుకుంది. డెన్మార్క్ చెందిన డెంటిస్టులను సంరక్షణ కేంద్రం అధికారులు పిలిపించారు. వారు అగస్టు నెలలో కారా ఉంటోన్న పశ్చిమ జర్మనీలోని మాస్వీలర్ పులుల సంరక్షణ కేంద్రానికి వచ్చారు. రెండున్నర గంటలపాటు శస్త్ర చికిత్స చేసి దెబ్బతిన్న కోర పన్నును తొలగించి తీసుకెళ్లారు. మళ్లీ 15 రోజుల క్రితం సంరక్షణ కేంద్రానికి వచ్చారు. వారు పులి కోర పన్ను స్థానంలో బంగారంతో చేసిన పన్నును తీసుకొచ్చారు. దాదాపు గంటసేపు శస్త్ర చికిత్స చేసి దానికి ఈ పన్నును అమర్చారు. ఇప్పటికీ పులి పూర్తిగా కోలుకుంది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా సంరక్షణ కేంద్రం అధికారులు దానికి బోన్‌లెస్ మటనే పెడుతున్నారు. 2013లో ఇటలీలో ఓ ప్రైవేటు వ్యక్తి నిర్బంధంలో ఉన్న ఈ పులిని విడిపించి జర్మనీ తీసుకొచ్చారు. బంగారు పన్ను పెట్టడానికి కారణం, అది సమర్థంగా బిగుసుకుపోతుంది. పులి జీవిత కాలం పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బెంగాల్ టైగర్లు అంతరించిపోతుంటే ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ద్వారా వాటిని పరిరక్షించేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. -
అయ్యో, పులికెంత కష్టం వచ్చింది..!
పులి చూపే ఒక గాంభీర్యం. పులి నడకే ఒక రాజసం. పులి ఒక సాహస సంకేతం. పులుల ఉనికి అడవికే ఒక అందం. పులుల మనుగడ ఇప్పుడొక ప్రశ్నార్థకం.. పులులు తారసపడితే ఒకప్పుడు మనుషులు భయంతో వణికిపోయి హడలి చచ్చేవారు. వీలైనంత వరకు పులుల కంటబడకుండా వాటికి దూరంగా ఉండేవారు. క్రమంగా కాలం మారింది. పులులకు భయపడే మనుషులే ఎలాంటి జంకుగొంకు లేకుండా వాటిని వేటాడటం మొదలైంది. నాగరికత ముదిరి ఆధునికత విస్తరించడంతో అడవుల నరికివేత నిత్యకృత్యంగా మారింది. పులులకు సహజ ఆవాసాలైన అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో అడవుల్లో పులుల సంఖ్య దారుణంగా క్షీణించింది. మనుషుల విచక్షణారాహిత్యం ఫలితంగా పులుల్లోని కొన్ని ఉపజాతులు ఇప్పటికే పూర్తిగా అంతరించిపోయాయి. ప్రపంచంలో ఇంకా మిగిలి ఉన్న పులులు పూర్తిగా అంతరించిపోకుండా ఉండటానికి వివిధ దేశాల ప్రభుత్వాలు నిషేధాజ్ఞలను అమలులోకి తెచ్చాయి. నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాక పులుల శరీరభాగాలకు, వాటి చర్మానికి మరింతగా గిరాకీ పెరిగింది. నిషేధాలు లేనికాలంలో స్వేచ్ఛగా సాగే పులుల వేట నిషేధాలు అమలులోకి వచ్చాక దొంగచాటుగా సాగుతోంది. పులుల చర్మాలు, గోళ్లు, ఇతర శరీరభాగాలు అక్రమమార్గాల్లో దేశదేశాలకు తరలిపోతున్నాయి. పులుల పరిరక్షణ కోసం దేశదేశాల ప్రభుత్వాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, పులుల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది. పులులు జంతుజాలంలోని ‘ఫెలిడే’ కుటుంబానికి చెందుతాయి. పిల్లులు కూడా ఇదే కుటుంబానికి చెందుతాయి. ‘ఫెలిడే’ కుటుంబంలో పరిమాణంలో భారీగా కనిపించే నాలుగుజాతుల జంతువుల్లో ఒకటి పులుల జాతి. పులి శాస్త్రీయనామం ‘పాంథెరా టైగ్రిస్’. పులిని ఇంగ్లిష్‌లో ‘టైగర్’ అంటారు. ఈ మాటకు మూలం గ్రీకుపదమైన ‘టైగ్రిస్’. చరిత్రపూర్వ యుగంలో పులులు ఆసియాలోని కాకసస్ నుంచి కాస్పియన్ సముద్ర తీరం వరకు, సైబీరియా నుంచి ఇండోనేసియా వరకు విస్తరించి ఉండేవని వివిధ శాస్త్ర పరిశోధనల్లో తేలింది. పంతొమ్మిదో శతాబ్ది నాటికి పశ్చిమాసియాలో పులులు పూర్తిగా అంతరించాయి. ప్రాచీన పులుల శ్రేణి విడిపోయి పశ్చిమాన భారత్ నుంచి తూర్పున చైనా, ఇండోనేసియా ప్రాంతాల వరకు విస్తరించాయి. పులుల సామ్రాజ్యానికి పడమటి సరిహద్దు సైబీరియాలోని అముర్ నదికి చేరువలో ఉంది. ఇవరయ్యో శతాబ్దిలో ఇండోనేసియాలోని జావా, బాలి దీవుల్లో పులులు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పులులు అత్యధిక సంఖ్యలో మిగిలి ఉన్న దీవి సుమత్రా మాత్రమే. పులులు ఏనాటివంటే..? ‘ఫెలిడే’ కుటుంబానికి చెందిన ‘పాంథెరా పాలియోసినేన్సిస్’ అనే జంతువులు ఒకప్పుడు చైనా, జావా ప్రాంతాల్లో ఉండేవి. ప్రస్తుతం ఉండే పులుల కంటే పరిమాణంలో ఇవి కొంత చిన్నగా ఉండేవి. ఇవి దాదాపు ఇరవై లక్షల ఏళ్ల కిందట భూమ్మీద సంచరించేవని చైనా, జావాల్లో లభించిన వీటి శిలాజాలను పరీక్షించిన శాస్త్రవేత్తల అంచనా. ‘ట్రినిల్ టైగర్’ (పాంథెరా టైగ్రిస్ ట్రినిలెన్సిస్) అనే ఉపజాతి చైనా, సుమత్రా అడవుల్లో పన్నెండు లక్షల ఏళ్ల కిందట సంచరించేవి. ఇప్పటి పులులకు బహుశా ఇవే పూర్వీకులు కావచ్చు. పూర్వ భౌగోళిక యుగం చివరి దశలో పులులు తొలుత భారత్‌లోను, అక్కడి నుంచి ఉత్తరాసియా, పశ్చిమాసియా ప్రాంతాల్లోను అడుగుపెట్టాయి. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభమయ్యే నాటికి ఎనిమిది ఉపజాతులకు చెందిన పులులు మిగిలినా, వాటిలో రెండు ఉపజాతులు అంతరించిపోయాయి. 20వ శతాబ్దిలో అంతరించిపోయిన పులుల ఉపజాతుల్లో బాలి పులి, జావా పులి ఉన్నాయి. చిట్టచివరి బాలి పులి 1937 సెప్టెంబరు 27న వేటగాళ్ల చేతిలో బలైపోయింది. అది మధ్యవయసులోనున్న ఆడపులి. జావాపులి చివరిసారిగా 1979లో చూసినట్లు అధికారికంగా ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత 1990లలో కూడా కొందరు ఈ పులిని చూసినట్లు చెప్పారు. ఆ తర్వాత జావాపులి జాడ కనిపించలేదు. ఇప్పటికి మిగిలి ఉన్న పులుల జాతుల్లో బెంగాల్ పులి (రాయల్ బెంగాల్ టైగర్), ఇండో చైనీస్ పులి, మలయా పులి, సుమత్రా పులి, సైబీరియన్ పులి, దక్షిణ చైనా పులి మాత్రమే ఉన్నాయి. బెంగాల్ పులి బెంగాల్ పులులు ఎక్కువగా భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌లలో కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో కనిపించే పులుల కంటే ఉత్తరభారత్, నేపాల్‌లలో కనిపించే పులులు పరిమాణంలో కాస్త పెద్దగా ఉంటాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలి పాతికేళ్లలోనే దేశంలోని పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పులుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం 1972 నుంచి ‘ప్రాజెక్ట్ టైగర్’ కింద చర్యలు ప్రారంభించింది. దీని అమలు కోసం జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థను (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) ప్రారంభించింది. బెంగాల్ పులుల సంఖ్య మన దేశంలో దాదాపు రెండువేల వరకు ఉన్నట్లు వన్యప్రాణుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు భావిస్తున్నా, వీటి సంఖ్య 1411 మాత్రమేనని 2014లో పులుల జనాభా సేకరణ చేపట్టిన జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థ అధికారికంగా ప్రకటించింది. మన దేశంలో పులుల జనాభాను నాలుగేళ్లకు ఒకసారి లెక్కిస్తారు. ఆ లెక్కన 2018లో కూడా పులుల జనాభా సేకరణ జరిపినా, ఇంతవరకు తాజా లెక్కలను ప్రకటించలేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలోని పులుల సంఖ్యపై ప్రకటనలు చేయడంతో కొంత గందరగోళం ఏర్పడింది. దీంతో తాము అధికారికంగా వెల్లడించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలేవీ పులుల సంఖ్యపై ప్రకటనలు చేయరాదంటూ జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థ అన్ని రాష్ట్రాలకూ తాఖీదులు పంపింది. ఇదిలా ఉంటే, తెలంగాణ ప్రభుత్వం ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం పరిసరాల్లో అణు విద్యుత్తు ఉత్పాదన కోసం యురేనియం తవ్వకాలను తలపెట్టింది. యురేనియం తవ్వకాలు ఇక్కడి పులుల మనుగడకు ముప్పు కలిగించే ప్రమాదం ఉంది. మహారాష్ట్రలో ఇటీవల ఒక రైతు కుక్కలను చంపడానికి చనిపోయిన ఆవుదూడపై విషం చల్లితే, దానిని తిన్న మూడు పులులు మృత్యువాత పడ్డాయి. తెలిసీ తెలియని పొరపాట్లు, విచక్షణలేని చర్యలు పులుల మనుగడకు సవాలు విసురుతున్నాయి. ఇండో చైనీస్ పులి ఇండో చైనీస్ పులులు ఎక్కువగా కంబోడియా, చైనా, లావోస్, బర్మా, థాయ్‌లాండ్, వియత్నాంలలో కనిపిస్తాయి. వీటి జనాభా 1200 నుంచి 1800 వరకు ఉండవచ్చని అంచనా. బెంగాల్ పులుల కంటే పరిమాణంలో ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి. వీటికి ఆవాసాలుగా ఉన్న అరణ్యాలు తగ్గిపోవడంతో పాటు, చైనా సంప్రదాయక ఔషధాల తయారీ కోసం ఎడాపెడా వేటాడుతూ పోవడంతో ఇండోచైనీస్ పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మలయ పులి మలయ ద్వీపకల్పంలోని దక్షిణ భాగంలోనే మలయ పులులు కనిపిస్తాయి. ప్రధాన భూభాగపు పులుల ఉపజాతులన్నింటిలోనూ మలయ పులులే పరిమాణంలో చిన్నవి. ఇప్పటికి జీవించి ఉన్న అన్ని పులుల ఉపజాతులనూ తీసుకుంటే, అతిచిన్న పులుల్లో ఇవి రెండోస్థానంలో నిలుస్తాయి. వీటి సంఖ్య దాదాపు 600 నుంచి 800 వరకు ఉండవచ్చని అంచనా. మలయ పులిని మలేసియా ప్రభుత్వం జాతీయ చిహ్నంగా ఉపయోగించుకుంటోంది. సుమత్రా పులి ప్రస్తుతానికి భూమ్మీద మిగిలిన అన్ని పులుల ఉపజాతుల్లోనూ సుమత్రా పులులు అతి చిన్నవి. ప్రస్తుతం ఇవి దాదాపు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో వీటి సంఖ్య ప్రస్తుతం 400 నుంచి 500 వరకు ఉండవచ్చని అంచనా. సైబీరియన్ పులి తూర్పు సైబీరియాలోని అముర్–ఉస్సురి ప్రాంతంలో ఇవి సురక్షితంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో మిగిలి ఉన్న అన్ని పులుల ఉపజాతుల్లోనూ ఇవే అతిపెద్దవి. వీటి సంఖ్య దాదాపు 450 నుంచి 500 వరకు ఉంటుందని అంచనా. దక్షిణ చైనా పులి దక్షిణచైనా పులులు దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అంతరించిపోయే దశకు చేరుకున్న పది జంతువుల జాబితాలో దక్షణచైనా పులిని కూడా చేర్చారు. పులుల వేటను అరికట్టడానికి 1977లో చైనా ప్రభుత్వం చట్టాన్ని తెచ్చినా, ఈ పులుల ఉపజాతి క్షీణించిపోవడాన్ని నిరోధించలేకపోయింది. దక్షిణ చైనాలో ఈ ఉపజాతికి చెందిన 59 పులులను నిర్బంధంలో ఉంచారు. ఇవి ఆరు పులుల సంతానానికి చెందినవి కావడంతో, వీటిలో జన్యు వైవిధ్యం తక్కువేనని, అందువల్ల ఇవి నశించిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటి జనాభాను పెంచేందుకు తిరిగి వీటిని అడవుల్లోకి విడిచిపెట్టాలని వారు సూచిస్తున్నారు. తెల్లపులి తెల్లపులులు ప్రత్యేకమైన ఉపజాతికి చెందినవేమీ కావు. తల్లి పులిలోనూ తండ్రి పులిలోనూ ఒక అరుదైన జన్యువు ఉన్నట్లయితే, వాటికి తెల్లపులులు పుడతాయి. దాదాపు పదివేల పులుల్లో ఒకటి తెల్లగా పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. తెల్లపులులకు జనాకర్షణ ఎక్కువగా ఉండటం వల్ల జంతుప్రదర్శనశాలల్లో సంకరం చేయడం ద్వారా తెల్లపులుల పునరుత్పత్తి కొనసాగేలా చూస్తున్నారు. తెల్లపులులు మామూలు పులుల కంటే తక్కువకాలం జీవిస్తాయి. వీటిలో తరచుగా అంగిలి చీలి ఉండటం, వెన్నెముక వంకరటింకరగా ఉండటం వంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి. బంగారు మచ్చల పులి బంగారు మచ్చల పులులు కూడా ప్రత్యేకమైన ఉపజాతికి చెందినవి కావు. బెంగాల్ పులుల్లోని ఒక అరుదైన జన్యు పరివర్తనం వల్లనే ఇలాంటి పులులు పుడతాయి. వీటి ఒంటిపై లేత బంగారు రంగులోని ఉన్ని, వెలిసిపోయిన కాషాయ చారలు ఉంటాయి. తెల్లపులులు, బంగారు మచ్చల పులులే కాకుండా, చాలా అరుదుగా నీలం పులులు కూడా కనిపిస్తాయి. అడవి పులుల్లో టాప్ – 5 భారత్ 2,226 రష్యా 433 ఇండోనేసియా 371 మలేసియా 250 నేపాల్ 198 (అడవుల్లో సంచరించే పులుల సంఖ్యపై ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ 2014 నాటి లెక్కల ఆధారంగా వెల్లడించిన వివరాలు ఇవి. తిరిగి 2018లో పులుల జనాభా లెక్కల సేకరణ జరిపినా, ఆ లెక్కలను ఇంతవరకు వెల్లడించలేదు.) పులుల సంఖ్యను రెట్టింపు చేసే దిశగా చాలా దేశాలు చర్యలు ప్రారంభించాయి. వీటిలో కొన్ని కొంత పురోగతిని కూడా సాధించాయి. 2010 నాటి లెక్కలతో పోలిస్తే, భారత్‌లో పులుల సంఖ్య అదనంగా 520 వరకు పెరిగింది. ఇదే కాలంలోరష్యాలో పులుల సంఖ్య అదనంగా 73 మేరకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో సంచరించే పులుల సంఖ్య 2014 నాటి లెక్కల ప్రకారం 3,980 వరకు ఉంది. పులుల వేట రాచరికాలు ఉన్నప్పటి నుంచి పులుల వేట కొనసాగేది. వేటగాళ్లు ఏనుగులు, గుర్రాలపై అడవుల్లోకి వెళ్లి బాణాలు, బల్లేలతో పులులను వేటాడేవారు. వేటాడి చంపి తెచ్చిన పులుల చర్మాలను ఇంటి గోడలకు విజయ చిహ్నాల్లా వేలాడదీసేవారు. పంతొమ్మిది, ఇరవయ్యో శతాబ్దాల్లో పులుల వేట మరింత ఉధృతంగా సాగింది. తుపాకుల వంటివి అందుబాటులోకి రావడంతో సంపన్నులైన కొందరు పులుల వేటను సాహస క్రీడగా సాగించేవారు. మన దేశంలో బ్రిటిష్ హయాంలో పులుల వేట విపరీతంగా కొనసాగేది. వేటాడిన పులుల కళేబరాలను పక్కన పెట్టుకుని ఫొటోలు దిగడం అప్పటి కులీనులకు ఫ్యాషన్‌గా ఉండేది. పులులు జనావాసాల మీద దాడి చేయడం కూడా పరిపాటిగా ఉండేది. జనావాసాలకు పులుల బెడద తప్పించడానికి కూడా పులులను వేటాడేవారు. పులులను వేటాడిన వారికి సమాజంలో భయభక్తులతో కూడిన గౌరవం కూడా ఉండేది. భారత్‌లో పులుల వేట ఎంతగా కొనసాగిందంటే కేవలం వందేళ్ల వ్యవధిలోనే పులుల జనాభా 40 వేల నుంచి 1800కు పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన పాతికేళ్ల తర్వాత ప్రభుత్వం మెలకువ తెచ్చుకుని పులుల సంరక్షణకు నడుం బిగించిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రభుత్వాలు పులుల వేటపై నిషేధాజ్ఞలను అమలులోకి తెచ్చినా, దొంగచాటుగా పులుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. పులుల ఎముకలు, ఇతర శరీర భాగాలను తూర్పు ఆసియా దేశాల్లోని సంప్రదాయ వైద్య చికిత్సల్లో వాడుతుండటమే ఈ వేటకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సంప్రదాయ ఔషధాలను తయారు చేసేవారు ఎంత ధరనైనా చెల్లించి పులుల శరీర భాగాలను కొనుగోలు చేస్తున్నారు. వాటితో తయారు చేసే ఔషధాలను రెట్టింపు లాభాలకు అమ్ముకుంటున్నారు. పులుల శరీర భాగాలను ఏయే వ్యాధుల చికిత్సలకు వాడతారంటే... పులితోక: పులితోకను స్కిన్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. పులితోకను మూలికలతో నూరి తయారు చేసిన ఆయింట్మెంట్ పూసినట్లయితే స్కిన్ క్యాన్సర్ సహా ఎలాంటి మొండి చర్మవ్యాధులైనా నయమవుతాయని సంప్రదాయ చైనా వైద్యుల నమ్మకం. పులి ఎముకలు: పులి ఎముకలను నూరి, వైన్‌లో కలిపి తీసుకుంటే టానిక్‌లా పనిచేస్తుందని తైవాన్ సంప్రదాయ వైద్యుల నమ్మకం. పులి ఎముకలను దుష్టశక్తులను పారదోలడానికి భూతవైద్యులు కూడా ఉపయోగిస్తారు. పులికాళ్లు: పులి కాళ్లను పామాయిల్లో నానబెట్టి, వాటిని గుమ్మానికి వేలాడదీస్తే ఇంట్లోకి దుష్టశక్తులు చొరబడవని తూర్పు ఆసియా దేశాల్లో చాలామంది నమ్మకం. పులిచర్మం: పులి చర్మాన్ని విషజ్వరాలకు విరుగుడుగా ఉపయోగిస్తారు. పులి చర్మాన్ని దీర్ఘకాలం ఉపయోగించే వ్యక్తి పులితో సమానమైన శక్తి పొందుతాడని తూర్పు ఆసియా దేశాల్లో నమ్మకం. పులి పిత్తాశయం: పులి పిత్తాశయాన్ని, పిత్తాశయంలోని రాళ్లను తేనెలో కలిపి సేవిస్తే చర్మవ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. పులి వెంట్రుకలు: పులి వెంట్రుకలను కాల్చితే వచ్చే పొగ జెర్రులను పారదోలుతుందని నమ్ముతారు. జెర్రులు చేరిన ఇళ్లల్లో తరచుగా పులి వెంట్రుకలను కాల్చడం చైనాలోను, పరిసర తూర్పు ఆసియా దేశాల్లోను ఆచారంగా ఉండేది. పులి మెదడు: పులిమెదడును నూనెలో వేయించి, మెత్తగా ముద్దలా నూరి తయారు చేసుకున్న లేహ్యాన్ని ఒంటికి పట్టించుకుంటే బద్ధకం వదిలిపోతుందని, మొటిమలు మొదలైన చర్మవ్యాధులు దూరమవుతాయని నమ్ముతారు. పులి కళ్లు: పులి కనుగుడ్లను నూరి తయారు చేసిన మాత్రలు జ్వరాలలో వచ్చే సంధిప్రేలాపనలకు విరుగుడుగా పనిచేస్తాయని నమ్ముతారు. పులి మీసాలు: పులి మీసాలను పంటినొప్పులకు విరుగుడుగా ఉపయోగిస్తారు. పులి పంజా: పులి పంజాను మెడలో ఆభరణంలా ధరించినా, జేబులో దాచుకుని తిరిగినా భయాలు తొలగిపోయి, గొప్ప ధైర్యం వస్తుందని నమ్ముతారు. పులి పంజా మొత్తం కాకున్నా, పులి గోళ్లను ధరించినా ఇవే ఫలితాలు ఉంటాయని చెబుతారు. పులి గుండె: పులి గుండెను తిన్నట్లయితే పులిలో ఉండే ధైర్యం, తెగువ, తెలివితేటలు వస్తాయని నమ్ముతారు. పులి పురుషాంగం: పులి పురుషాంగాన్ని వాజీకరణ ఔషధంగా ఉపయోగిస్తారు. -
పాన్పుపై సేదతీరిన పులి!
అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కు ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామమది. పేరు హర్మోతి. మోతీలాల్ ఎప్పటిలాగే గురువారం ఉదయాన్నే తన పాత సామాను దుకాణంలో కూర్చున్నాడు. అంతలో బయట నుంచి ‘పులి పులి’ అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. ఎంటో చూద్దామని దుకాణం బయటకొచ్చిన మోతీలాల్‌కు గుండె ఆగినంత పనైంది. ఆయనకు ఎదురుగా కేవలం 20 అడుగుల దూరంలో బెంగాల్ టైగర్ ఉంది. అది మోతీలాల్ వైపే వస్తోంది. గాండ్రిస్తూ పెద్ద పులి తనవైపే వస్తుండటంతో మోతీలాల్ శరీరం భయంతో మొద్దుబారి అక్కడే అలాగే నిల్చుండిపోయాడు. అయితే, బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్న ఆ పులి అతని కళ్లల్లోకి ఓసారి చూసి నెమ్మదిగా.. అతని పక్కనుంచి దుకాణంలోపలికి వెళ్లింది. విశ్రాంతి తీసుకునేందుకు దుకాణంలోపల ఉన్న మంచంపై సెటిలైంది. పులి లోపలికి వెళ్లిపోగానే బతికితే చాలురా బాబు అనుకుంటూ అక్కడి నుంచి పరుగెత్తాడు మోతీలాల్. గ్రామంలోని పశువైద్యుడు శాంశుల్ అలీ అటవీ శాఖ అధికారులకు వెంటనే ఈ విషయం చేరవేశాడు. దీంతో అధికారుల బృందం హుటాహుటిన అక్కడికొచ్చింది. భారీ వర్షాల కారణంగా కజిరంగా జాతీయ పార్కు భూభాగం 95శాతం నీట మునిగిందని, దాంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతర వన్యప్రాణుల్లాగే పులి కూడా జనావాసాల్లోకి వచ్చిందని అధికారుల అంచనా. పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి మళ్లీ పార్కులోకి తీసుకెళ్లి వదిలేయాలా? లేక తన దారిని అది పోయేదాకా వేచిఉందామా అని అధికారులు ఆలోచిస్తున్నారు. -
‘బెంగాల్ టైగర్’ వారసులొచ్చాయి
ఆస్ట్రియా: కాకుల కావ్‌కావ్‌లు కానరావట్లేదు. కోకిల కిలకిలలు తగ్గిపోయాయి. పాలపిట్ట జాడైనా తెలియరావట్లేదు. పక్షులే కాదు జంతువులూ ఈ కోవలోకే వస్తున్నాయి. మనిషి తన స్వార్థానికి చేస్తున్న విధ్వంస రచన వల్ల అనేక జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందులో భాగంగానే ఎన్నో జంతువులు ఇప్పటికే అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేరాయి. అందులో ‘బెంగాల్ టైగర్’ మొదటి స్థానంలో ఉంది. అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవడానికి భారత్‌తో పాటు ఇతర దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రియాలోని కెర్నాఫ్ జూ సంరక్షణలో ఉన్న పదమూడేళ్ల ఆడపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకొస్తున్న జూ సిబ్బంది పులిపిల్లలు పుట్టిన నెలన్నర తర్వాత వాటిని సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. జూ అధికారి రేయినర్ ఎడర్ మాట్లాడుతూ.. పదమూడేళ్ల ముసలి వయసులో ఒక పులి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం తమకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించిందన్నారు. పుట్టినప్పుడు అవి ఒక్కోటి కిలో బరువు ఉండగా ఇప్పుడు దాదాపు నాలుగు కేజీల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. హెక్టార్, పాషా, జీయస్ అని వాటికి నామకరణం కూడా చేశారు. ఈ జూలో ఇప్పుడు పులిపిల్లలు వచ్చి చేరడంతో జూకి కొత్త అందం వచ్చినట్టయింది. దీంతో కెర్నాఫ్ జూ మంచి టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఒక ఏడాది తర్వాత ఈ పిల్లలను వేరే జూకి దత్తత ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అక్కడి అధికారులు. భారతదేశంలో ఎక్కువగా ఉండే ఈ జాతి పులుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2500కు పడిపోయిందని వరల్డ్ వైల్డ్ లైఫ్ అనే వెబ్సైట అంచనా వేసింది. మరోవైపు ఈ పులిపిల్లలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి ముచ్చట పడిపోతున్న జంతు ప్రేమికులు ‘బెంగాల్ టైగర్ వారసులొచ్చాయి’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బెంగాల్ టైగర్‌కు ముగ్గురు పిల్లలు
-
వేటగాళ్ల ఉచ్చుకు బలైన పులి
మంచిర్యాలఅర్బన్(చెన్నూర్): జాతీయ జంతువు, అత్యంత అరుదైన జాతికి చెందిన రాయల్ బెంగాల్ టైగర్ వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన ఉచ్చుకు తగిలి నేలకొరిగింది. మందమర్రిలో స్వాధీనం చేసుకున్న పులి చర్మానికి సంబంధించిన చిక్కుముడి వీడింది. చెన్నూర్ అటవీ డివిజన్ శివ్వారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన పులి అవశేషాల(కళేబరం)ను శుక్రవారం కనుగొన్నారు. గత మూడు రోజులుగా మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ, అటవీశాఖ సంయుక్తంగా దాడి నిర్వహించి మందమర్రి రామన్‌కాలనీలో గురువారం పులిచర్మాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పులి చర్మం విక్రయించే ముఠాకు చెందిన పెద్దపల్లి జిల్లా రామరావుపేట్కు చెందిన నర్సయ్యతోపాటు ముగ్గురిని, చర్మం, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకుని మంచిర్యాల అటవీశాఖ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. శుక్రవారం పోలీసు టాస్క్‌పోర్సు, అటవీశాఖ అధికారులు శివ్వారం గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో పులి మృతి విషయం వెలుగుచూసింది. పులి చనిపోయిన సంఘటన స్థలానికి వెళ్లి చూడగా కళేబరం పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. పక్షం రోజుల క్రితం అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు అమర్చగా మరో వన్యప్రాణిని తరుముకుంటూ వచ్చి పులి విద్యుత్ షాక్‌తో మృతిచెందినట్లు నిందితుడు చెబుతున్నాడని అటవీ అధికారులు తెలిపారు. దుండగులు విలువైన పెద్దపులి చర్మాన్ని, గోళ్లను తీసుకుని అటవీ ప్రాంతంలో కళేబరాన్ని వదిలి వెళ్లారు. ఇదే కేసులో శివ్వారం గ్రామానికి చెందిన మల్లయ్య, బుచ్చిరాజయ్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరిఖనికి చెందిన టాక్సీ డ్రైవర్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది పాత్ర ఉన్నట్లు అటవీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అటవీశాఖ అదుపులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ పులి చనిపోయిన సంఘటన స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ వేణుగోపాల్, అడిషనల్ డీసీపీ రవికుమార్, మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి రామలింగం, మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. పదిహేను రోజుల క్రితం పులి చనిపోయిందని భావిస్తున్నట్లు మంచిర్యాల ఎఫ్‌డీవో వెంకటేశ్వరావు తెలిపారు. నాలుగేళ్ల వయస్సు కలిగి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పశువైద్యులతో పులి కొంత భాగాన్ని కత్తిరించి పులికి సంబం«ధించిన పూర్తి వివరాల సేకరణకు ఫోరెనిక్స్ ల్యాబ్, సీసీఎంబీలకు పంపిస్తామని తెలిపారు. ఇంకా కేసుపై విచారణ సాగుతోందని, రెండు మూడు రోజుల్లో అన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్, అటవీశాఖ సంయుక్తంగా పెద్దపులి మరణంపై విచారణ చేపడుతున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. పెద్దపులి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అటవీ ప్రాంతంలో ఉందా లేదా అన్న అంశాలపై విచారణ చేపట్టి కీలకమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నాలుగేళ్ల వయస్సు గల పెద్దపులి 12నుంచి 13 ఫీట్ల పొడవు ఉందని, దీనికి మార్కెట్లో విలువ ఉంటుందని భావించిన దుండగులు చర్మం, గోళ్లు తీసుకున్నారని తెలిపారు. విద్యుత్ ఉచ్చులతో చనిపోతే హత్య కేసులుగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో తొమ్మిది మంది దుండగులను గుర్తించగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
టైగర్ నిఖిల్ పరిస్థితి విషమం
- జూపార్కులో వరుసగా మృతి చెందుతున్న వన్యప్రాణులు హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులోని రాయల్ బెంగాల్ టైగర్ (నిఖిల్–18) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని జూపార్కు క్యూరేటర్ శివానీడోగ్రా తెలిపారు. జూపార్కులో 1999 అక్టోబర్ 8న జన్మించిన నిఖిల్ రెండు నెలల నుంచి నిమోనియా వ్యాధితో బాధపడుతుందన్నారు. జూపార్కు విశ్రాంత డాక్టర్ నవీన్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామని తెలి పారు. వారం రోజుల నుంచి వైద్యానికి నిఖిల్ శరీరం స్పందించడం లేదని అన్నారు. కొన్ని నెలల నుంచి జూపార్కులో వరుసగా అదురైన వన్యప్రాణులు మృతి చెందుతున్నాయి. వృద్ధాప్యంతో నీటి గుర్రం మృతి చెందగా... వ్యాధులతో చిరుతపులి, అడవి దున్న మృతి చెందాయి. జూపార్కులో ప్రతి ఏడాది 100కు పైగా కొత్త వన్యప్రాణులు జీవం పోసుకుంటున్నాయని చెప్పుకుంటున్న జూ అధికారులు వృద్ధాప్యంతో ఉన్న వన్యప్రాణుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. తరుచూ వన్యప్రాణులు వ్యాధులతో మృతి చెందితే వృద్ధాప్యం కారణమంటూ పేర్కొంటున్నారు. -
నితిన్ హీరోగా భారీ చిత్రం
‘అఆ’ చిత్రం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రంతో పాటు కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ఆ రెండు చిత్రాలు సెట్స్‌పైన ఉండగానే నితిన్ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన కె.కె.రాధామోహన్ హీరో నితిన్‌తో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రాధామోహన్ మాట్లాడుతూ – ‘‘నితిన్‌తో ఓ సూపర్‌హిట్ సినిమా తీయాలని కథ తయారు చేస్తున్నాం. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న రెండు సినిమాల తర్వాత ఆగస్ట్‌లో మా చిత్రం ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాం’’ అన్నారు. -
మాస్ మహరాజ ఎప్పుడు మొదలెడతాడో..?
మాస్ మహరాజ రవితేజ హీరోగా తెరకెక్కిన బెంగాల్ టైగర్ విడుదలై చాలాకాలమే అవుతోంది.ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించిన రవితేజ, ఇంతవరకు ఆ సినిమాను స్టార్ట్ చేయలేదు. బెంగాల్ టైగర్ డీసెంట్ కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్నా.. రవితేజ నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొంతకాలంగా భారీ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న రవితేజ, తన రేంజ్ మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఓ పక్కా మాస్ కథతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన రవితేజ, జూలైలోనే ఈ సినిమాను ప్రారంభించాలని భావించాడు. అయితే కథా కథనాల విషయంలో ఇంకా పూర్తి నమ్మకం రాకపోవటంతో ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది ఈ సినిమా. తను చేయబోయే నెక్ట్స్ సినిమా రాబిన్ హుడ్ అంటూ క్లారిటీ ఇచ్చిన రవితేజ, ఆ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లేది మాత్రం చెప్పలేకపోతున్నాడు. -
ఏడు నెలల తర్వాత మేకప్ వేసుకుంటున్నాడు
ఒకప్పుడు ఏడాదికి మూడు సినిమాలు చేసిన మాస్ మహరాజ్ రవితేజ, ఇప్పుడు స్పీడు తగ్గించేశాడు. కుర్ర హీరోల నుంచి భారీ పోటీ ఉండటంతో పాటు, వరుస ఫ్లాప్‌లు ఇబ్బంది పెట్టడంతో ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. గత డిసెంబర్లో బెంగాల్ టైగర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ, ఆ తరువాత ఇంత వరకు సినిమా ప్రారంభించలేదు. ఈ మధ్యలో దిల్‌రాజు నిర్మాణంలో ఎవడో ఒకడు సినిమా చేయాల్సి ఉన్నా, అది క్యాన్సిల్ అయ్యింది. దీంతో మరో సినిమా అంగీకరించకుండా తన లుక్ మార్చుకునేందుకు టైమ్ తీసుకున్నాడు. గత సినిమాల్లో బాగా సన్నగా కనిపించటం, ఫేస్‌లో ఏజ్ బాగా తెలుస్తుండటంతో గెటప్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేసి కాస్త బరువు పెరగటంతో పాటు నిపుణుల సూచనలతో గ్లామర్ కూడా ఇంప్రూవ్ చేసే పనిలో ఉన్నాడు. రాబిన్ హుడ్ అనే టైటిల్‌తో రవితేజ చేయనున్న సినిమా జూన్ రెండో వారంలో పట్టాలెక్కనుంది. చక్రీ అనే కొత్త దర్శకుణ్ని పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా, రవితేజ కెరీర్‌కు మరోసారి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
జూ పార్క్ లో బెంగాల్ టైగర్ మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని కరాచీ జూ పార్క్‌లో బెంగాల్ టైగర్ మృతిచెందినట్టు శుక్రవారం అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. గత కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యానికి గురైన పులికి కిడ్నీ చెడిపోవడంతో మృతిచెందినట్టు జీయో న్యూస్ నివేదించింది. సాధారణంగా పులల జీవితం కాలం 17 నుంచి 18 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ బెంగాల్ టైగర్ 16 ఏళ్లకే మృతిచెందినట్టు జూ డైరెక్టర్ మహమ్మద్ ఫహీమ్ ఖాన్ చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత జూ లో పులి చనిపోవడం ఇది రెండోసారిగా పేర్కొన్నారు. గత 2014 జూన్ నెలలో బెల్జియం నుంచి తీసుకవచ్చిన చిన్న పులి జీర్ణశయాంతర సంబంధిత సమస్యలతో మృతిచెందినట్టు తెలిపారు. గడిచిన సంవత్సరాల్లో కరాచీ జూలో పులులే కాకుండా నక్కలు, జింకలు, ఒంటెలు వంటి మిగతా జంతు జాతులు క్రమక్రమంగా అంతరించిపోతూ వస్తున్నాయని ఫహీమ్ ఖాన్ వెల్లడించారు. -
రవితేజ, ఆ రీమేక్ చేస్తున్నాడు
టాలీవుడ్లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సీనియర్ హీరో రవితేజ. ఒకప్పుడు టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న రవితేజ, ఇటీవల తన స్థాయికి తగ్గ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. అయితే ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కిన బెంగాల్ టైగర్ కమర్షియల్‌గా ఆకట్టుకోవటంతో ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే కొత్త దర్శకుడితో రాబిన్‌హుడ్ సినిమా చేస్తున్న మాస్ మహరాజ్, మరో రీమేక్ సినిమాకు రెడీ అవుతున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన కనిదన్ సినిమాను రవితేజ రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు అఫీషియల్‌గా మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా కనిదన్ చిత్ర దర్శకుడు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. రవితేజకు ఉన్న మాస్ ఇమేజ్‌కు ఈ సినిమా ఫర్ఫెక్ట్గా సూట్ అవుతుందని కితాబిచ్చాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. -
మాస్ మహరాజ్ 6 ప్యాక్ లుక్
సినిమా సెలక్షన్ విషయంలోనే కాదు, లుక్ విషయంలో కూడా సీనియర్ హీరోలు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. యంగ్ జనరేషన్ కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడానికి ఆలోచిస్తుంటే సీనియర్లు మాత్రం సూపర్ బాడీతో షాక్ ఇస్తున్నారు. తాజాగా మాస్ మహరాజ్ రవితేజ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. ఇటీవల బెంగాల్ టైగర్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ సాధించిన రవితేజ తన నెక్ట్స్ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రవితేజ ఈమధ్య స్టైలిష్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అయితే ఆ ప్రయత్నంలో మరీ సన్నగా అయిన రవితేజ లుక్‌పై విమర్శలు రావడం, అదే లుక్‌లో కనిపించిన కిక్ 2 భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో తిరిగి ఫాంలోకి రావాలని భావించిన రవితేజ 6 ప్యాక్‌తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నాడు. -
టాలీవుడ్ 'రాబిన్‌హుడ్'
-
టాలీవుడ్ 'రాబిన్‌హుడ్'
బెంగాల్ టైగర్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన రవితేజ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ అనే కొత్త దర్శకుడితో 'ఎవడో ఒకడు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇంకా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఎవడో ఒకడు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు రవితేజ. తన మార్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. కిక్ 2 సినిమాలో రవితేజ క్యారెక్టర్ పేరు రాబిన్ హుడ్. ఇప్పుడు ఇదే పేరును తన నెక్ట్స్ సినిమాకు టైటిల్‌గా ఫైనల్ చేశాడు రవితేజ. చక్రి అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్న ఈ సినిమాను ఎవడో ఒకడు పూర్తి కాగానే సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమాతో కలెక్షన్లపరంగా పరవాలేదనిపించిన మాస్ మహరాజ్, తరువాత చేయబోయే సినిమాలతో అయినా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. -
ప్రయోగానికి రెడీ అవుతున్నాడు
మాస్ మహరాజ్ రవితేజ అంటేనే కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటివరకు తన కెరీర్లో ఎక్కువగా ఆ తరహా సినిమాలే చేస్తూ వస్తున్న రవితేజ త్వరలో ఓ ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల బెంగాల్ టైగర్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న రవితేజ, నెక్ట్స్ సినిమాల విషయంలో స్పీడు పెంచాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఎవడో ఒకడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ద్విపాత్రభినయం చేయనున్న రవితేజ, ఒక పాత్రలో 50 ఏళ్ల వ్యక్తిగా, మరో పాత్రలో 20 ఏళ్ల కుర్రాడిగా కనిపించనున్నాడట. ముందుగా 20 ఏళ్ల కుర్రాడి పాత్రను షూట్ చేయనున్నారట, అందుకోసం ఇప్పటినుంచే రెడీ అవుతున్నాడు రవితేజ. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ప్రయోగానికి దిగుతున్న రవితేజకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. -
సంపత్‌నందితో మళ్లీ చేస్తా!
‘‘ఈ సినిమా మళ్లీ ఇంకోసారి ప్రేక్షకుల మధ్యలో చూడాలనుంది. అవకాశం వస్తే, మళ్లీ సంపత్‌నందితో సినిమా చేస్తా’’ అని రవితేజ చెప్పారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నాలతో సంపత్‌నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ‘బెంగాల్ టైగర్’ విజయోత్సవం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంపత్‌నంది మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా నాకు హ్యాట్రిక్ కావాలని హీరో రవితేజ పదేపదే మనస్ఫూర్తిగా అన్నారు. పైన తథాస్తు దేవతలు ఉన్నారేమో అందుకే హిట్ అయింది. బురదలో తీసిన ఫైట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది’’అని అన్నారు. సంపత్‌నంది హ్యాట్రిక్ ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు. ఈ వేడుకలో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, నాయిక తమన్నా పాల్గొన్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ -బెంగాల్‌టైగర్
-
అన్నిటికీ సిద్ధపడే వచ్చాను!
‘‘మంచి స్టోరీ, మంచి కాంబినేషన్ కుదిరితే సినిమా చిన్నదా, పెద్దదా అని చూడను. ఏ సినిమా అయినా తీస్తాను. ఏ చిత్రం నిర్మించినా అది అందరికీ నచ్చేలా ఉండాలనుకుంటాను’’ అని నిర్మాత కేకే రాధామోహన్ అన్నారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘బెంగాల్ టైగర్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని రాధామోహన్ అన్నారు. మరిన్ని విశేషాలను ఈ విధంగా తెలియజేశారు. ‘బెంగాల్ టైగర్’ రెండు రాష్ట్రాల్లోనూ సూపర్ హిట్ టాక్‌తో నడుస్తోంది. రవితేజ కెరీర్లోనే అత్యధిక గ్రాస్ సాధించింది. ఈ సినిమాతో సంపత్ నంది హ్యాట్రిక్ సాధించారు. ఇందులో హీరో పాత్ర కొత్తగా ఉంటుంది. వందలాది కథలు సృష్టించలేం. కాన్సెప్ట్ పాతదైనా ఎంత కొత్తగా, ఆసక్తికరంగా చెప్పామనేది ముఖ్యం. ఈ సినిమా స్క్రీన్‌ప్లే కొత్తగా ఉన్నందువల్లే అందరికీ నచ్చింది. ‘కిక్-2’ మీద భారీ అంచనాలు నెలకొనడంతో కాస్త నిరాశపరిచింది. ఆ చిత్రం విడుదలకు ముందే మా ‘బెంగాల్ టైగర్’ బిజినెస్ అయ్యుంటే కలిసొచ్చేది. కానీ అలా జరగలేదు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ తక్కువ రేట్ ఇచ్చి ఈ సినిమా కొనుకున్నారు. అయితే, ఈ చిత్రవిజయం మీద మేం ముందు నుంచీ నమ్మకంగా ఉన్నాం. ఆ నమ్మకం నిజమైంది. విచిత్రం ఏంటంటే, నేను ఇప్పటివరకూ తీసిన సినిమాల పరిస్థితి దాదాపు ఇంతే. వాళ్ల ముందు సినిమా ఫ్లాప్ కావడం, దాని ప్రభావం నేను తీసే సినిమా మీద పడటం జరుగుతుంది. అయితే, నా సినిమా సక్సెస్ కావడం వల్ల తర్వాతి చిత్రనిర్మాతలు హ్యాపీగా ఉంటారు. ‘బెంగాల్’ టైగర్ని అక్టోబర్‌లోనే విడుదల చేయాల్సి ఉంది. కానీ పరిశ్రమలో అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో మాది పెద్ద సినిమా అయినా విడుదలను వాయిదా వేశాం. దీపావళి టైంలో రిలీజ్ చేద్దామనుకున్నా, రెండు పెద్ద సినిమాలు ఒకే డిస్ట్రిబ్యూటర్ కొనడంతో మా సినిమా విడుదలను వాయిదా వేశాం. అయినా డిసెంబరు 10 కరెక్ట్ టైమ్ అనిపిస్తోంది. నవంబరు 5న రిలీజ్ చేసుంటే అప్పుడు చెన్నైలో, నెల్లూరులో ఉన్న భారీ వర్షాల కారణంగా వసూళ్లకు దెబ్బపడేది. {పస్తుతం సినిమా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. హై రిస్క్, హై ఇన్వెస్ట్మెంట్. సినిమాకి పెట్టే పెట్టుబడి పోతుందనుకునే నిర్మాణం మొదలుపెడతాను. రిస్క్ అని తెలుసు. అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికొచ్చాను. ప్యాషన్‌తో సినిమాలు తీస్తున్నా. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నెలలో మూడు వారాల పాటు ఇక్కడే ఉంటాను. అన్నీ నా కంట్రోల్లో ఉండేలా చూసుకుంటాను. టెక్నాలజీ పెరగడం వల్ల ఎక్కడ ఉన్నా ప్రొడక్షన్ వ్యవహారాలను చాలా ఈజీగా మానిటర్ చేయగలుగుతున్నా. ప్రస్తుతం కొన్ని చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. జనవరిలో ప్రకటిస్తాను. -
టైగర్స్‌తో చిట్‌చాట్
-
పవన్‌ను వాడేసుకుంటున్న యంగ్‌హీరోలు
-
ఫార్ములా టైగర్ రోరింగ్
తారాగణం: రవితేజ, తమన్నా, రాశీఖన్నా, బొమన్ ఇరానీ కెమేరా : ఎస్. సౌందరరాజన్ ఎడిటింగ్: గౌతంరాజు సంగీతం: భీమ్స్ సిసిరోలియో నిర్మాత: కె.కె. రాధామోహన్ కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్ నంది ‘‘డబ్బున్నవాడితో పెట్టుకోవచ్చు, పవరున్న వాడితో పెట్టుకోవచ్చు.. కానీ తెలివైనవాడితో పెట్టుకోకూడదు.’’ తాజా ‘బెంగాల్ టైగర్’లో డైలాగ్ ఇది. అలాంటి తెలి వైన హీరో పాత్ర, పాత్రచిత్రణ - మనకు కొత్తేమీ కాదు. కాకపోతే దాన్నెలా ప్యాకేజ్ చేసి, తెరపై చెప్పారన్నదే కీలకం. ఆ ఫార్ములా అరువు తెచ్చుకొని, కొత్త రేపర్లో ప్యాక్ చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘బెంగాల్ టైగర్’. గోదావరి జిల్లాలోని గ్రామంలో ఆకాశ్ నారాయణ్ (రవితేజ) కుటుంబం. అతనికి అమ్మ (ప్రభ), ఇద్దర న్నలు - వదినలు, అమ్మమ్మ (రమాప్రభ). ఒకసారి పెళ్ళిచూపుల్లో పెళ్ళికూతురు (అక్ష) పాపులరైనవాణ్ణే పెళ్ళి చేసుకుంటాననడంతో హీరో కంగు తింటాడు. పేపర్లో పేరు, ఫోటో వచ్చేలా పాపులరయ్యేందుకు ప్రయత్నం మొదలుపెడతాడు. మంత్రి సాంబ (సాయాజీ షిండే)ను పబ్లిక్ మీటింగ్‌లో రాయి పెట్టి కొట్టి, పాపులరైపోతాడు. రక్తం కారేలా గాయమైన మంత్రి తీరా హీరో గారి మాట తీరు, ధైర్యం నచ్చి, తన దగ్గరే పనికి పెట్టుకుంటాడు. అలా అక్కడ జీతానికి పని చేస్తూనే హోమ్ మంత్రి నాగప్ప (రావు రమేశ్) కూతురు శ్రద్ధ (రాశీఖన్నా)ను ఫ్యాక్షనిస్ట్ ప్రత్యర్థుల బారి నుంచి కాపాడతాడు. అలా హోమ్ మంత్రి మనసునూ చూర గొంటాడు. ఆయన నాలుగింతల జీతామిస్తాననే సరికి, మొదటి మంత్రిని నడిరోడ్డుపై వదిలేసి, హోమ్ మంత్రి దగ్గర ప్రత్యేక అధికారిగా హీరో చేరతాడు. మరింత ఫేమస్ అవుతాడు. పెళ్ళి ఫిక్సయిన శ్రద్ధను సైతం ప్రేమలో పడేస్తాడు. తీరా ఆమెనిచ్చి పెళ్ళి చేయడానికి సిద్ధపడితే, ముఖ్యమంత్రి గజపతి (బొమన్ ఇరానీ) సాక్షిగా హీరో ప్లేటు తిప్పేస్తాడు. తాను ఇప్పటికే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానీ, కాకపోతే తనది వన్‌సైడ్ లవ్ అనీ చెబుతాడు. ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్ళి చేస్తా మని ముఖ్యమంత్రే హామీ ఇచ్చాక, హీరో ఆ అమ్మాయె వరో చెబుతాడు. అందరూ షాకవుతారు. ఆ అమ్మాయి - మీరా (తమన్నా). ఆ షాక్ దగ్గర ఇంటర్వెల్ కార్డు. తీరా అది కూడా హీరో ఆడిన నాటకమేనని తెలిసీ తెలియగానే, అతని తెలివికి ఆ పెద్దింటి అమ్మాయి ఫ్లాటైపోతుంది. ‘ఐ లవ్ యు’ చెప్పేస్తుంది. అది నచ్చని సి.ఎం. ఈ హీరో బ్యాక్‌గ్రౌండ్ ఎంక్వైరీ చేయిస్తాడు. ఆత్రేయపురంలో అందరి బాగు కోసం పనిచేసిన స్వర్గీయ జయనారాయణ్ (నాగినీడు) కొడుకే హీరో అని తెలిసి, షాకవుతాడు. రౌడీలతో హీరోను వేటాడతాడు. వాళ్ళ నుంచి తప్పించుకొని, సి.ఎం.తో 24 గంటల పందెం గెల్చిన హీరో- చివరకి రూ. 500 కోట్ల బేరానికి ప్రేమను వదులుకోవడానికి సిద్ధమవుతాడు. అతనలా ఎందుకు చేశాడు? ఇంతకీ హీరో తండ్రి ఎవరు? ఈ సి.ఎం.కూ, చనిపోయిన ఆయనకూ సంబంధం ఏమిటి? ఇలా ఒక్కొక్కరినీ మెట్లుగా చేసుకుంటూ సి.ఎం. కూతురి దాకా వెళ్ళిన హీరో అసలు లక్ష్యం ఏమిటన్నది సెకండాఫ్ చివరలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్, ఆ తరువాత జరిగే క్లైమాక్స్ ఫైట్, సీన్. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, చిన్నా పెద్దా కలిపి ముగ్గురు విలన్లు, నలుగురైదుగురు కమెడియన్లు, ఒక సెంటిమెంటల్ తండ్రి పాత్రధారి - ఇలా చాలామంది తెరపై వచ్చి పోతుంటారు. కానీ, హీరో పాత్ర చుట్టూ, అతని భుజాల మీద మొత్తం నడుస్తుంది. ప్రత్యర్థిని తెలివిగా పడేసే తరహా పాత్రచిత్రణ రవితేజకు అలవాటే. అందుకే, ఆయన అనాయాసంగా చేశారు. ఇటు నిర్మాణ విలువలు, అటు కెమేరా పనితనం, డి.ఐ. వర్క్ స్పెషల్‌గా ఉన్న ఈ సినిమాలో మొన్నటి ‘కిక్2’లా కాకుండా, రవితేజ తెరపై పుంజుకున్నట్లనిపిస్తారు. నిడివిపరంగా చూస్తే రాశీఖన్నా ఎక్కువ, తమన్నా తక్కువ అన్న మాటే కానీ, నటన, పరిధి ప్రకారం చూస్తే ఈ పాత్రలు రెండూ రెండే! మంత్రుల మొదలు సి.ఎం. దాకా ప్రతి ఒక్కరూ హీరో చేతిలో బకరాలే కాబట్టి, విలనిజమ్‌ను మరీ అతిగా ఆశించకూడదు. అప్పటికీ, (మాజీ) సి.ఎం. పాత్ర రౌడీలతో కలసి ఆఖరులో గొడ్డలి కూడా పట్టి, హీరోతో పోరాడుతుంది. బురదలో కూరుకున్న రౌడీల దేహాల మీద నుంచి హీరో వెళ్ళే థ్రిల్లింగ్ విజువల్‌తో మొదలయ్యే ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే సినిమాటిక్‌గా, కథాగమనానికి కన్వీనియంట్‌గా నడిచిపోతాయి. రైతే వెన్నెముకంటూ ‘వ్యవసాయంలో సాయం ఉంది. అగ్రికల్చర్లో కల్చర్ ఉంది. అసలు ప్రపంచానికి సేవ చేసే గుణం రైతుకే ఉంది’ (సాయాజీ షిండే), ‘ఆస్తులు, వాస్తుల్ని కాదు.. దోస్తుల్ని నమ్ముతా’ (రవితేజ) లాంటి మంచి మాటలు చాలానే ఉన్నాయి. మెగాఫ్యామిలీ, పవర్‌స్టార్ ప్రస్తావ నలు, త్రివిక్రమ్ మార్కు హిట్ డైలాగ్‌లకు పేరడీలు సరేసరి. భీమ్స్ బాణీల్లో మాస్ పాటలున్నా, మెలొడీ ‘చూపులతో దీపాలా’ చాలాకాలం గుర్తుంటుంది. చిన్నా నేపథ్య సంగీతం, పదేపదే వచ్చే థీమ్ మ్యూజిక్ హాల్ నుంచి బయటకొచ్చాకా చెవుల్లో రింగుమంటాయి. ఈ సినిమాకు, ముఖ్యంగా ఎక్కువ శాతం మంది మెచ్చే ఫస్టాఫ్‌కు వినోదం బలం. పురోహితుడు ‘సెల బ్రిటీ శాస్త్రి’గా పోసాని కొంత, హీరో కావాలని తపించే ‘ఫ్యూచర్‌స్టార్ సిద్ధప్ప’గా పృథ్వి చాలావరకు సినిమాను నిలబెట్టారు. రిపోర్టర్ అమలాపురం పాల్ అలియాస్ అమలాపాల్‌గా బ్రహ్మానందం కనిపిస్తారు. కామెడీతో ఫస్టాఫ్ వినోదాత్మకంగా ఉందనిపిస్తుంది. హీరో ప్రవ ర్తనకు కారణం చెప్పే సెకండాఫ్‌కొచ్చేసరికి పాత్రలకు క్లారిటీ వస్తుంది. ప్రేక్షకులకూ సినిమాపై స్పష్టతొస్తుంది. గడచిన హిట్ ‘రచ్చ’ను దర్శకుడు ఈసారీ కొంత అనుసరించినట్లు కనిపిస్తుంది. శంకర్ ‘ఒకే ఒక్కడు’ నుంచి పాపులరైన సి.ఎం (చీఫ్ మినిస్టర్) వర్సెస్ సి.ఎం (కామన్‌మ్యాన్) ఫార్ములా వినడానికెప్పుడూ బాగుం టుంది. లాజిక్‌లందకపోయినా, గేవ్‌ునెంత తెలివిగా అల్లుకుంటే అంత కిక్. ఆ క్రమంలో సెకండాఫ్ కొంత బిగువైతే, రెండున్నర గంటల ‘బెంగాల్ టైగర్’ మన తెలివికి పనిపెట్టని మాస్ కామెడీ. ఒకరికి ఇద్దరు హీరో యిన్ల గ్లామరస్ ఎంటర్టైనర్. - రెంటాల జయదేవ -
గతం గురించి మాట్లాడను! భవిష్యత్తు ఊహించను!
రవితేజ ఏదైనా ఓపెన్‌గా మాట్లాడతారు. ఫ్రాంక్‌గా మాట్లాడతారు. నచ్చిన పని చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. చిటికెలో డెసిషన్ తీసేసుకుంటారు. ఫలితం గురించి బెంగపడటం అస్సలు తెలియదాయనకు. కాన్సెప్ట్ నచ్చితే బడ్జెట్ లిమిట్స్ కూడా పెట్టుకోరు. రవితేజ నేడు ‘బెంగాల్ టైగర్’ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా రవితేజతో భేటీ... హలో రవితేజగారూ... ఆ మధ్య స్లిమ్‌గా ఉండి, ఇప్పుడు కొంచెం వెయిట్ పెరిగినట్లున్నారు...? అవునండి. కొంచెం పెరిగాను. ఒక్కోసారి తగ్గుతాం.. పెరుగుతాం. ఏది జరిగినా హెల్తీ వేలోనే ఉండాలి. ఆ మధ్య నేను సన్నబడాలనుకున్న విషయం నాకు క్లోజ్‌గా ఉన్నవాళ్లందరికీ తెలుసు. నా వర్కవుట్ ప్రాసెస్ గురించి కూడా వాళ్లకు చెబుతుంటాను. అందుకని నేను తగ్గినప్పుడు వాళ్లకేం అనిపించలేదు. సడన్‌గా చూసినవాళ్లు షాకయ్యారు. ఇప్పుడు బరువు పెరిగాక చూసినవాళ్లు ‘ఇదేంటి’ అనుకుంటున్నారు. నేను ఆర్టిస్ట్‌ని కాబట్టి, చూడ్డానికి బాగుండాలి. ఫిజిక్ మెయిన్టైన్ చేయాలి. ఆ ప్రాసెస్‌లో వర్కవుట్స్ గట్రా చేస్తుంటాను. నాకైతే ఇప్పుడు హ్యాపీగా ఉంది. హెల్త్వైజ్ కూడా చాలా బాగుంది. మీ డైట్ గురించి చెబుతారా? అన్నీ తింటాను. రోజుకి జస్ట్ 45 నిమిషాలు వర్కవుట్స్ చేస్తానంతే. నాన్‌వెజ్ బాగా తింటాను. మన ఆరోగ్యం మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎంత ప్రశాంతంగా ఉంటే అంత హెల్తీగా కనిపిస్తాం. మీ ఫిజికల్ ఛేంజెస్‌ని చూసి మీ అబ్బాయి, అమ్మాయి ఏమంటారు? మా అబ్బాయికైతే తెగ నచ్చేసింది. నేనేం చేసినా ‘నాన్నా.. ఇలాగే ఉండు’ అంటాడు. నా స్టయిల్ ప్రతీదీ వాడికి ఇష్టమే. ఓకే.. ‘బెంగాల్ టైగర్’ గురించి మాట్లాడుకుందాం. రిలీజులు మీకు కొత్త కాకపోయినా ఏ సినిమాకి ఆ సినిమాకి కొత్తే కదా. ఏమనిపిస్తోంది? సినిమా గురించి పాజిటివ్‌గా ఉన్నాం. ఓ ప్రేక్షకుడిగా ఈ ట్రైలర్ చూసి, ఏమేం ఎక్స్పెక్ట్ చేస్తానో ఆ అంశాలన్నీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. పవన్ కల్యాణ్‌తో తీయాలనుకున్న చిత్రకథనే సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’గా మీతో తీశారనే టాక్ ఉంది? ఈ పాయింట్‌ను సంపత్ నంది నాకు ‘రచ్చ’ చిత్రానికి ముందే చెప్పాడు. నచ్చి, వర్కవుట్ చేయమన్నా. అసలా ైటె మ్‌లోనే స్టార్ట్ కావాల్సి ఉంది. ఎవరి కమిట్మెంట్స్తో వాళ్లం బిజీగా ఉండటంవల్ల కుదర్లేదు. ‘ఖుషి’ సినిమాలో ‘అయామ్ రాయల్ బెంగాల్ టైగర్.. సిద్ధూ... సిద్ధార్థ రాయ్’ అనే డైలాగ్ ఉంది. పవన్ కల్యాణ్‌తో తీయాలనుకున్న సినిమాకి సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’ టైటిల్ అనుకున్నారు కదా? అవును. టైటిల్ ఆయన కోసం అనుకున్నదే. కానీ, సంపత్ నంది ఆయనకీ విషయం చెప్పలేదట. నాతో అనుకున్న పాయింట్‌ని కథగా మలిచిన తర్వాత దీనికి ‘బెంగాల్ టైగర్’ బాగుంటుందని దాన్నే పెట్టాడు. ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలంటే ‘కిక్-2’ డిజప్పాయింట్ చేసింది కదా? ‘కిక్-2’ ఫలితం అందరికీ తెలిసిందే. ఫస్టాఫ్ బాగానే ఉన్నా, సెకండాఫ్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. గతం వద్దండి. నాకైతే ప్రెజెంట్లో బతకడం అంటేనే ఇష్టం. గతం గురించి, ఫ్యూచర్ గురించి పెద్దగా ఆలోచించను. ఆ సినిమా కోసం కష్టపడి బాగా వ ర్కవుట్ చేసి తగ్గారు. మరి ఫలితం అనుకూలంగా లేకపోవడం బాధగా అనిపించలేదా? ఇష్టంతో కష్టపడ్డాను. అయినా ఏ సినిమాకైనా నేను ఎఫర్ట్ పెడతాను. ప్రేమించి చేస్తాను కాబట్టి, దాన్ని కష్టమనుకోను. ఒక కథ విన్నాక ఫైనలైజ్ చేయడానికి రోజులూ, నెలలూ తీసుకుంటారా? స్పాట్ డెసిషన్ తీసేసుకుంటా. ఒక్కసారి ఫిక్స్ అయితే చేసేస్తా. స్పాట్ డెసిషన్స్ వల్ల ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురవుతాయేమో? కొన్నిసార్లు రిజల్ట్ బ్యాడ్‌గా వచ్చింది. కాదనడం లేదు. ఒక్కోసారి నచ్చకపోయినా ఎందుకో చేసేస్తాను. కొన్ని ప్రాజెక్ట్స్ విన్నప్పుడు బాగానే ఉన్నా, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్‌లో తేడా కొట్టేస్తుంది. అప్పుడే సినిమా రిజల్ట్ తెలిసిపోతుంది. ఏది ఏమైనా స్పాట్ డెసిషన్స్ తీసుకోవడం నా అలవాటు. సంపత్ నంది ఇప్పటివరకూ రెండు సినిమాలు మాత్రమే చేశారు కదా. ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి కారణం? ఎన్ని సినిమాలు చేశారన్నది ముఖ్యం కాదు. ఎంత నేర్చుకున్నారన్నది పాయింట్. వాళ్ల కాన్ఫిడెన్స్ దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయినా సంపత్ నందికి ఇప్పటివరకూ ఫెయిల్యూర్ లేదు. ఈ సినిమాతో తను హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నా. మీ ఇన్నేళ్ల కె రీర్‌ను విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది? అలా జరిగిందేంటి.. ఇలా అయిందేంటి? అని గతం గురించి ఆలోచించను. కానీ హాయిగా, సంతోషంగా అనిపిస్తుంది. ఒక వేళ సినిమా ఇండస్ట్రీలోకి రాకపోయుంటే ఏంటి పరిస్థితి? అవన్నీ ఊహాత్మకమైన ప్రశ్నలు. హీరోగా కాకపోతే ఇంకో రకంగా వచ్చి ఉండేవాణ్ణి. కానీ రావడం మాత్రం ఖాయం. మీకు ఎందులో బాగా ఎంజాయ్మెంట్ లభిస్తుంది? సినిమాలంటే పిచ్చి. వాటిలోనే ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. బుర్ర ఉన్నవాళ్లతో టైం స్పెండ్ చేస్తా. బుర్ర తక్కువ వాళ్లకి దూరంగా ఉంటాను. అంటే.. మీరు బాగా ఇంటెలిజెంటా? మీకన్నా తెలివైనవాళ్లతో కనెక్ట్ కాగలరా? నేను ఇంటెలిజెంటో కాదో నేను చెప్పకూడదు. ఎవరెలాంటి వాళ్లో తెలుసుకోగలను. కనీసం నా లెవల్ వరకైనా ఉండాలి. లేకపోతే లెక్క తేడా వచ్చేస్తుంది. నా కన్నా ఎక్కువైనా ఫరవాలేదు. వాళ్లతో కచ్చితంగా కనెక్ట్ అయిపోతాను. నాకా కాన్ఫిడెన్స్ ఉంది. మీ తొమ్మిదేళ్ల వయసులో మీకున్నట్లుగానే ఇప్పుడు తొమ్మిదేళ్ల వయసులో ఉన్న మీ అబ్బాయి మహాధన్‌కు కూడా సినిమా పిచ్చి ఉందా? ఫుల్ పిచ్చి. సినిమాలు తెగ చూస్తాడు. అన్ని స్టయిల్స్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారు. అయితే మహాధన్ ఫ్యూచర్ స్టార్ అనుకోవచ్చా? గతం గురించి మాట్లాడను. భవిష్యత్తును ఊహించను. అయితే మనం వద్దనుకున్నా ఆ జీన్స్‌లో ఉంటుంది. చూద్దాం... ఫ్యూచర్లో ఏమవుతాడో. మీరు లవ్లీ డాడీయా? స్ట్రిక్టా? ఈ తరం పిల్లల దగ్గర స్ట్రిక్ట్‌గా ఉంటే కుదరదు. తిట్టడమే కష్టం. ఇక కొట్టడం కూడానా. నాకైతే నా పిల్లలను కొట్టడానికి చేతులు రావు. ఏది చెప్పాలన్నా స్వీట్‌గా చెబుతా. మీ పిల్లలకు మీరు లవ్లీ ఫాదర్... మీ పేరెం్టట్స్తో లవ్లీ సన్ అనిపించుకున్నారా? ఓ.. మా అమ్మానాన్న నాతో పాటు హైదరాబాద్‌లోనే ఉంటారు. వాళ్లు నాతోనే ఉండాలన్నది నా కోరిక. నా సక్సెస్‌ని ఆనందిస్తారు. ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వినాయక్ మీ అమ్మగారి లక్షణాలను మీలో బాగా చూశానని చెప్పారు.. మీ మదర్ని రోల్ మోడల్‌గా తీసుకుంటారా? రోల్ మోడల్ అని చెప్పలేను. అమ్మా, నాన్న అంటే నాకిష్టం.. గౌరవం. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లల్లో ఉండటం సహజం. అందుకని ప్రత్యేకంగా వాళ్ల నుంచి తీసుకోవాల్సిన అవసరంలేదు. ‘మీ నాన్న కష్టపడి పైకొచ్చాడు’ అని మీ పిల్లల దగ్గర మీ పేరెంట్స్ చెబుతుంటారా? అమ్మ చెబుతుంటుంది. నా కష్టాలను దగ్గరుండి చూసింది కదా. నేను పడిన కష్టాలు నా పిల్లలు పడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కష్టం విలువ తెలియాలని అమ్మ నా గురించి వాళ్ళకు చెబుతుంటుంది. పూరి జగన్నాథ్ మీ బాడీ లాంగ్వేజ్ బాగా అర్థం చేసుకున్నారు.. అందుకే ఆయన ఏర్పరిచిన ఆ స్టయిల్‌నే ఇప్పటికీ ఫాలో అవుతున్నారనుకోవచ్చా? నా బాడీ లాంగ్వేజ్‌ని ముందు అర్థం చేసుకున్నది కృష్ణవంశీ. ఆ తర్వాత పూరి జగన్నాథ్. ఆ స్టయిల్ బాగుండటంతో కంటిన్యూ అవుతున్నా. అయినా కొత్తగా చేద్దామని ‘నా ఆటోగ్రాఫ్’, ‘శంభో శివ శంభో’, ‘నేనింతే’ చేస్తే జనాలకు నచ్చలేదు. అలాంటి కథలు ఇప్పుడు వచ్చినా చేయడానికి రెడీ. ఏమో... ఒక్కోసారి అవి నచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. మీ గురించి వదంతులు వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఒకడు గొప్పోడు, మంచోడు అంటే ఎవరికీ నచ్చదు. ‘వాడు ఇదంట.. అదంట...’ అని మసాలా యాడ్ చేసి చెబితే అప్పుడు మజా వస్తుంది. అందుకోసం ఏదేదో చెబుతారు. నేనేంటో నాకు తెలుసు. నాకా క్లారిటీ ఉంది. - డి.జి. భవాని -
'ముఠామేస్త్రీ' సీక్వెల్లో రామ్‌చరణ్..?
బ్రూస్ లీ పరాజయంతో ఆలోచనలో పడ్డ యంగ్ హీరో రామ్‌చరణ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్న మెగా పవర్‌స్టార్ ఆ సినిమా తర్వాత కూడా సేఫ్ గేమ్ ఆడాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే ఫారిన్ ట్రిప్ ముగించుకొని వచ్చిన చెర్రీ.. ప్రస్తుతం తనీఒరువన్ రీమేక్‌ను సెట్స్ మీదకు తేవాలని భావిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నటీనటులు ఎంపిక కొనసాగుతోంది. ఈ సినిమా తరువాత మెగా చరిష్మాను కంటిన్యూ చేస్తూ, ఓ సీక్వెల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట మగధీరుడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ముఠామేస్త్రీ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రచ్చ సినిమా ఘనవిజయం సాధించింది. అదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నాడు చెర్రీ. రచ్చ సినిమాతో మాస్కు నచ్చే హీరోయిజాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసిన సంపత్ నంది, లాంగ్ గ్యాప్ తరువాత బెంగాల్ టైగర్ సినిమా చేశాడు. రిలీజ్‌కు ముందునుంచే ఈ సినిమా మీద కూడా పాజిటివ్ టాక్ వస్తుండటంతో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు సంపత్. ముఠామేస్త్రీ సీక్వెల్‌కు ఛోటా మేస్త్రీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. -
ఈసారి బ్రహ్మి గెటప్ ఏంటో తెలుసా?
హైదరాబాద్: విలక్షణ నటనతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇపుడు వెరైటీ గెటప్‌లో కనిపించనున్నారు. ఈ వారంలో థియేటర్లను పలకరించనున్న మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం 'బెంగాల్ టైగర్' లో ఆయన అమలపాల్గా అలరించనున్నారు. ఈ మూవీలో బ్రహ్మానందం క్యారెక్టర్ పేరు అమలాపాల్ అట. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు నెట్లో చక్కర్లు కొడుతోంది. దీంతోపాటుగా ఈ చిత్రంలోని ఓ పాట మేకింగ్ వీడియోను చిత్ర దర్శకుడు సంపత్‌నంది తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అరగుండు, ఖాన్ దాదా, కత్తి రాందాసు, శంకర్‌దాదా ఆర్ఎంపీ, జిలేబి, హింసరాజ్, పీకే ఇలా వైవిధ్యమైన పాత్రల పేర్లుతో పాటు తన నటనతో బ్రహ్మానందం ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే. తాజా గెటప్‌తో బ్రహ్మానందం ఎలా అలరిస్తాడో చూడాలి. ఇప్పటికే అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న బ్రహ్మానందం రీసెంట్గా 1000 సినిమాల రికార్డును సైతం బ్రేక్ చేశాడు. కాగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రలు పోషించిన బెంగాల్ టైగర్ ఈ నెల 10న విడుదలకు సిద్ధం అవుతోంది. -
ఈసారి బ్రహ్మి గెటప్ ఏంటో తెలుసా?
-
డేటింగా..? ఎప్పుడు కలిశానో గుర్తే లేదు
రాశీ ఖన్నాకు తెలుగు పరిశ్రమ తెగ నచ్చేసినట్లుంది. అందుకే ఢిల్లీ నుంచి ఇక్కడకు షిఫ్ట్ అయిపోయారు. ఒంటరిగా కాదు.. అమ్మా, నాన్నతో కలిసి ఇక్కడే ఉంటున్నారు. తెలివైన నిర్ణయం అనే చెప్పాలి. నిర్మాతలకు అందుబాటులో ఉంటారు కాబట్టి, అవకాశాలు ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక, ఆమె నటించిన తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’ ఈ నెల 10న విడుదల కానుంది. రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో రాధామోహన్ ఈ చిత్రం నిర్మించారు. ఇక.. రాశీ ఖన్నా చెప్పిన ముచ్చట్లు తెలుసుకుందాం... ► నేను యాక్ట్ చేసిన ‘జిల్’ చూసి, సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’లో నటించే అవకాశం ఇచ్చారు. అప్పటికే తమన్నాను సెలక్ట్ చేశారు. అయినప్పటికీ కథ వింటానన్నాను. 20 నిమిషాలు నేరేట్ చేశారు. రవితేజతో అంటే బిగ్ ప్రాజెక్ట్ కదా. అందుకే ఒప్పుకున్నా. ఈ సినిమాలో తమన్నా పాత్ర ఎలా ఉంటుంది? అని దర్శకుణ్ణి అడగలేదు. నా పాత్ర బాగుంది. అది చాలనుకున్నాను. ► షూటింగ్ చేయడం మొదలుపెట్టాక తమన్నా ఎంత స్వీట్ పర్సనో నాకర్థమైంది. హెయిర్ స్టయిల్స్, డ్యాన్స్ మూమెంట్స్ పరంగా టిప్స్ ఇచ్చేది. రవితేజ, తమన్నా మంచి డ్యాన్సర్స్. ‘రాయె.. రాయె...’ పాటలో వాళ్లకు దీటుగా డ్యాన్స్ చేయడానికి నేను చాలా రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది. వాళ్లేమో సునాయాసంగా చేసేశారు. తమన్నాకు ఎన్నో చిత్రాల అనుభవం ఉంది. మానిటర్లో నా సీన్ చూసి, ‘చాలా బాగా చేశావ్. అందంగా ఉన్నావ్’ అని ప్రశంసించేది. నాకు డ్యాన్స్ స్టెప్స్ కూడా నేర్పించింది. ఏ కథానాయిక అలా చేస్తుందో చెప్పండి. ఇద్దరు కథానాయికలు కలిసి సినిమా చేస్తే, ఇద్దరికీ పడదు కదా అని నాతో చాలామంది అన్నారు. కానీ, తమన్నాకూ, నాకూ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ సినిమా నాకో పార్టీలా అనిపించింది. ► రవితేజ మంచి ఎనర్జీ ఉన్న బాంబులాంటి వ్యక్తి. నేను ఎవరికీ అంత ఈజీగా ఫ్యాన్ అయిపోను. రవితేజకు అయ్యాను. ఎందుకంటే ఆయన మంచి హీరో మాత్రమే కాదు.. మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. రవితేజతో ఉన్నప్పుడు ఆయనకన్నా మనం పెద్దవాళ్లమేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆయన ఎనర్జీ లెవల్స్ అలాంటివి. ► రకుల్ ప్రీత్‌సింగ్ నటించిన హీరోలందరితోనూ నేను సినిమాలు చేస్తుండటంతో తనేమైనా రికమండ్ చేస్తోందా? అని అడుగుతున్నారు. అసలు ఒక హీరోయిన్‌కి ఇంకో హీరోయిన్ రికమండ్ చేసే పరిస్థితి ఉంటుందా? రకుల్ నాకు మంచి ఫ్రెండే. కాదనడంలేదు. కానీ, రాశీఖన్నాని పెట్టుకోండని ఎలా చెప్పగలుగుతుంది? ప్రొఫెషనల్ మ్యాటర్ గురించి పక్కనపెడితే విడిగా మేం చాలా బాగుంటాం. నేను పార్టీలే చేసుకోను. ఈసారి బర్త్‌డేని పండగలా చేసుకుందామని సందీప్, రకుల్, రవితేజ.. ఇలా అందరూ అన్నారు. దాంతో పార్టీ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. ► కథానాయికలను గ్లామరస్‌గా చూడాలని అందరూ కోరుకుంటారు. అలా కనిపించడానికి నాకేం అభ్యంతరం లేదు. ప్రేక్షకుల కోసం గ్లామరస్‌గా కనిపించడంతో పాటు నటిగా నా సంతృప్తి కోసం డీ-గ్లామరస్ రోల్స్ కూడా చేయాలనుకుంటా. నా మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడె’లో మామూలుగా కనిపించా. ఇప్పుడు ‘సుప్రీమ్’ సినిమాలో పోలీస్‌గా చేస్తున్నాను. సినిమా మొత్తం ప్యాంటు, షర్ట్‌తో కనిపిస్తా. ఈ మధ్య నా డ్రెస్సింగ్ స్టయిల్ మార్చాను. ట్రెండ్‌కి తగ్గట్గు ఉండాలని స్టయిలిస్ట్‌ని పెట్టుకున్నాను. ► జీవితం అన్నాక జయాపజయాలు రెండూ ఉండాలి. నేను నటించిన సినిమా ఫెయిల్ అయితే అది పూర్తిగా నా చేతుల్లో ఉండదు. ఫెయిల్యూర్ చాలా ఇంపార్టెంట్. అవి ఉంటేనే ఎదగగలుగుతాం. వ్యక్తిగా బెటర్ అవుతాం. నేను చేసిన ప్రతి సినిమా నా కెరీర్‌కి హెల్ప్ అయ్యింది. నా గత చిత్రం ‘శివమ్’తో నటిగా ఇంకా ఎదిగాను. ఇప్పడు ‘బెంగాల్ టైగర్’తో ఇంకా మెరుగయ్యాను. ఇలా సినిమా సినిమాకీ డెవలప్ అవుతూనే ఉంటాను. ► నాగశౌర్యతో డేటింగ్ చేస్తున్నాననే వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్త నిజం కాదు కాబట్టి, నేను స్పందించలేదు. ఇప్పుడు అడిగారు కాబట్టి.. చెబుతున్నా. చివరిసారి తనను ఎప్పుడు కలిశానో కూడా గుర్తు లేదు. దాన్నిబట్టి మా మధ్య ఏమీ లేదని అర్థం చేసుకోవచ్చు. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదు. సింగిల్‌గా ఉన్నాను. హ్యాపీగా ఉంది. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల పైనే. అందుకే హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. మరో ఏడాది లోపు ఇక్కడ సొంత ఇల్లు కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను. -
పాట మీద ప్రేమతోనే ఇక్కడకు వచ్చాను!
‘నువ్వా-నేనా’తో సంగీతదర్శకునిగా భీమ్స్ సిసిరోలియా ప్రయాణం ఆరంభమైంది. ‘అలా ఎలా’, ‘జోరు’, ‘కెవ్వు కేక’, ‘గాలిపటం’ చిత్రాలకు స్వరాలందించారు. ఆ చిత్రాల్లోని పాటలు బాగున్నాయనే టాక్ వచ్చినా ఎందుకో భీమ్స్కు రావాల్సినంత గుర్తింపు రాలేదు. చొచ్చుకుపోయే మనస్తత్వం లేకపోవడంవల్ల, స్వతహాగా బిడియస్తుణ్ణి కావడంవల్లే లైమ్‌లైట్‌లోకి రాలేకపోయానని భీమ్స్ అంటున్నారు. ‘బెంగాల్ టైగర్’తో ఆయన టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు భీమ్స్ మనోభావాలు... ► పాట అంటే నాకు ప్రాణం. అదే నన్ను సినిమా రంగంవైపు లాక్కొచ్చింది. సూర్యనారాయణ రాజు (నటుడు, సహాయ దర్శకుడు) ద్వారా దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డిగారితో, ఆయన ద్వారా దర్శకుడు ఎన్. శంకర్‌గారితో పరిచయం ఏర్పడింది. అప్పుడు శంకర్‌గారు ‘ఆయుధం’ సినిమా తీస్తున్నారు. ఆ చిత్రం కోసం నాతో ‘వొయ్ రాజు కన్నుల్లో నువ్వే..’ పాట రాయించారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు రాశాను. ‘నువ్వా-నేనా’కి పని చేస్తున్నప్పుడు సంపత్ నందిగారితో పరిచయం ఏర్పడింది. ఆయన తొలి చిత్రం ‘ఏమైంది ఈవేళకు’ నేనే పాటలు స్వరపరచాల్సింది. అనివార్య కారణాల వల్ల కుదర్లేదు. ‘బెంగాల్ టైగర్’కి అవకాశం ఇచ్చారు. ► ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లోని పాటలు హిట్టయ్యాయి. కానీ, సామాజిక మాధ్యమం ద్వారా యాక్టివ్‌గా ఉండకపోవడంవల్ల నా గురించి చాలామందికి తెలియదు. నా పాటలు మాత్రం వినిపిస్తుంటాయి. మనం తెలియక పోయినా మన పాట తెలిసింది కదా.. ఆ విధంగా సక్సెస్ అయినట్లే అని సంతృప్తి పడుతుంటాను. అయితే, కొంచెం ధోరణి మార్చుకోవాలనుకుంటున్నాను. అడగకపోతే అమ్మ అయినా పెట్టదంటారు కాబట్టి, చొరవగా వ్యవహరించాలనుకుంటున్నాను. ► ‘బెంగాల్ టైగర్’ నాకు పెద్ద బాధ్యత. సంపత్ నందిగారు, రవితేజగారు, రాధామోహన్గార్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో రాత్రీ, పగలూ తేడా లేకుండా పని చేశాను. పాటలు విని, చాలా బాగున్నాయని అభినందించారు. బయటివాళ్లు కూడా ప్రశంసించడంతో చాలా ఆనందపడ్డాను. ► ఒక పెద్ద సినిమా చేసినప్పుడు పబ్లిసిటీ బాగా వస్తుంది. ఆ విధంగా ‘బెంగాల్ టైగర్’ నా మైలేజ్‌ని పెంచింది. ‘బెంగాల్ టైగర్’ సంగీతదర్శకుడు అనే గుర్తింపు వచ్చింది. కొంతమంది పెద్ద దర్శక-నిర్మాతలు అవకాశం ఇస్తున్నారు. తదుపరి అడుగులు జాగ్రత్తగా వేయాలనుకుంటున్నా. ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటాను. ► చిన్నప్పుడు ఏం చదువుకుంటావ్? అనడిగితే.. ‘పీజీ’ అని చెప్పేవాణ్ణి. దానర్థం కూడా తెలియని వయసది. చదువంటే ఉన్న ఇష్టంతో ఎం.ఎ. బీఎడ్ చేశాను. ఆ చదువు ఇచ్చిన జ్ఞానంతోనే పాటలు రాయగలిగాను. కానీ, సంగీతదర్శకునిగా అ..ఆలు, ఎక్కాలు అన్నీ నేను సినిమా పరిశ్రమలోనే నేర్చుకున్నా. నాకు మానసిక పరిపక్వత వచ్చింది కూడా సినిమా పరిశ్రమ కారణంగానే. ఇక్కడికి రాకపోయి ఉంటే ఓ సాదా సీదా వ్యక్తిగా మిలిగిపోయే వాణ్ణి. ధనార్జనే ధ్యేయంగా నేనిక్కడకు రాలేదు. పాట మీద ప్రేమతో వచ్చాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు. క్వాలిటీ ట్యూన్స్ ఇవ్వడానికే ట్రై చేశాను. నా నిజాయతీ నన్ను నిలబెడుతుందని నమ్మాను. ‘బెంగాల్ టైగర్’వంటి పెద్ద అవకాశం దక్కడంతో నా నమ్మకం నిజమైంది. -
బెంగాల్ టైగర్ ప్లాటినమ్ డిస్క్ వేడుక
-
ఈ సినిమానే ఓ పండగ!
- సంపత్ నంది ‘‘డిసెంబరు 25న క్రిస్మస్.. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి రాబోతోంది. అంతకన్నా ముందే డిసెంబరు 10న ‘బెంగాల్ టైగర్’ పండగ రాబోతోంది. బాక్సాఫీస్‌ను కచ్చితంగా షేక్ చేస్తుంది. ఎవరినీ డిజప్పాయింట్ చేయదు’’ అని దర్శకుడు సంపత్ నంది అన్నారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నా నాయకానాయికలుగా సంపత్ నంది దర్శకత్వంలో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ- ‘‘పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అతనికి కంగ్రాట్స్. మేం మాట్లాడటం కన్నా డిసెంబరు 10న మా సినిమా మాట్లాడుతుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ- ‘‘ఈ పాటలను హిట్ చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ఆడియో చార్ట్స్‌లో టాప్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి. త్వరలో ఫస్ట్ ప్లేస్‌కు వస్తాయి. ‘చూపులతో దీపాల పాట...’ అందరికీ బాగా నచ్చేసింది’’ అని అన్నారు. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ -‘‘అప్పట్లో చిన్న రచయితనైనా ‘దుబాయ్ శీను’లో రవితేజ నాకు ఐదు పాటలు రాసే అవకాశమిచ్చారు. నే నీ సినిమాలో టైటిల్ సాంగ్ రాశాను. రవితేజ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తారు. భీమ్స్కు మంచి భవిష్యత్తు ఉంది’’ అని చెప్పారు. భాస్కరభట్ల మాట్లాడుతూ- ‘‘నా కెరీర్లో అత్యధికంగా రవితేజ సినిమాలకే రాశాను. ఆయన నటించినవాటిలో దాదాపు 28 సినిమాలకు రాశాను. రవితేజకు టీజింగ్ సాంగ్స్ రాయడమంటే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా ఓ లాంగ్ జర్నీ. సంపత్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. దర్శకుడిగా అతని తొలి సినిమా నేనే చేశాను. సంపత్ మంచి సినిమా ఇచ్చారు. కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుంది’’ అని నిర్మాత రాధామోహన్ అన్నారు. ‘‘నాకు మంచి అవకామిచ్చిన సంపత్ నందిగారికి చాలా థ్యాంక్స్. నా పుట్టినరోజున ఈ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరగడం చాలా ఆనందంగా ఉంది’’ అని రాశీ ఖన్నా అన్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తమన్నా చెప్పారు. ఈ సినిమా పాటల కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు రవితేజ, తమన్నా, రాశీఖన్నా, నిర్మాత రాధామోహన్ బహుమతులు అందజేశారు. -
‘బెంగాల్ టైగర్’ బంపర్ ఆఫర్
రవితేజ ‘బెంగాల్‌టైగర్’గా డిసెంబరు 10న సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాతలు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. నిర్మాత కేకే రాధా మోహన్ మాట్లాడుతూ-‘‘ మా చిత్రంలోని ఐదు పాటల్లో ఏదో ఒక పాటను పాడి HTTPS://SOUNDCLOUD.COMలో అప్లోడ్ చేసి srisatyasaiarts@gmail.comకు పంపించాలి. వారిలో ముగ్గురిని ఎంపిక చేసి ఈ నెల 30న జరగనున్న ఆడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లో బహుమతులను నటీనటులతో అందజేయిస్తాం’’ అని తెలిపారు. ‘‘ఈ ముగ్గురిలో బెస్ట్ సింగర్‌ను ఎంపిక చేసి భీమ్స్‌తో నేను చేయబోయే మరో చిత్రంలో పాట పాడే ఛాన్సిస్తా. ఈ నెల 28 వరకు ఎంట్రీలను స్వీకరిస్తాం’’ అని ‘బెంగాల్ టైగర్’ దర్శకుడు సంపత్‌నంది చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు బీమ్స్ కూడా మాట్లాడారు. -
సర్దుకు పోతున్నారు..!
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా థియేటర్లో ఉండగా మరో సినిమాను రిలీజ్ చేసి కలెక్షన్లు సాధించటం కష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే సీజన్లో రిలీజ్ చేసే పరిస్థితి అసలే కనిపించటం లేదు. చిన్న సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే చాలామంది నిర్మాతలు బరిలో దిగి తేల్చుకుందాం అనే కన్నా, సింపుల్‌గా సర్దుకుపోందాం అంటున్నారు. ఈ డిసెంబర్లో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కిన మూడు సినిమాలు, ఒకేసారి రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మూడు సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన నిర్మాతలు వారం, వారం గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగా పివిపి సంస్థ నిర్మిస్తున్న సైజ్ జీరో సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు రిలీజ్‌కు రెడీ అయిన నిఖిల్, కోన వెంకట్ల 'శంకారాభరణం'ను ఒక వారం ఆలస్యంగా డిసెంబర్ 4న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా, వాయిదా పడుతూ వస్తున్న 'బెంగాల్ టైగర్' కూడా పోటీ పడటానికి సిద్ధంగా లేడు. అందుకే మరింత గ్యాప్ తీసుకుని, డిసెంబర్ 10న ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సంపత్‌నంది దర్శకుడు. థియేటర్లలో క్లాష్ లేకుండా నిర్మాతలు అడ్జస్ట్ అయిపోవటం మంచి పరిణామమే అయినా, ఎంతమంది నిర్మాతలు ఈ ఫార్ములాను ఫాలో అవుతారో చూడాలి. -
డేట్స్ క్లాష్ వద్దు గురూ!
సినిమా విడుదలైందా? వారంలోపే వసూళ్లు రాబట్టేశామా? అన్న చందంగా ప్రస్తుతం సినిమా మార్కెట్ ఉంది. వారం, పది రోజుల్లోనే వసూళ్లు రాబట్టేయాలంటే అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేయాలి. ఫలితంగా వేరే సినిమాకు థియేటర్లు అంతగా దక్కవు. మరి, ఒకేరోజు రెండు, మూడు పెద్ద సినిమాలంటే థియేటర్లు కష్టమే. అదేగనక నిర్మాతలందరూ ఒక అవగాహనతో ఉంటే... కలిసి మాట్లాడుకుంటే... ఏ సినిమాకీ నష్టం కలగని రీతిలో రిలీజ్లు ప్లాన్ చేయొచ్చు. ‘బాహుబలి’ కోసం ‘శ్రీమంతుడు’ విడుదలను వాయిదా వేసుకొన్న విషయం తెలిసిందే. రానున్న ఇరవై రోజుల్లో విడుదల కావాల్సిన మూడు సినిమాల విడుదల తేదీల విషయంలో ఇప్పుడిదే జరిగింది. ఆ చిత్ర నిర్మాతలు మాట్లాడుకొని, తమలో తాము పోటీ పడకుండా... తమ చిత్రాల రిలీజ్ డేట్స్ మార్చుకున్నారు. ఆ విశేషాల్లోకి వస్తే... ఈ 27నే... ‘సైజ్ జీరో’ ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘సైజ్ జీరో’ ఒకటి. ఈ చిత్రం కోసం అనుష్క బరువు పెరగడం ప్రధాన ఆకర్షణ. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఆర్య, అనుష్క కాంబినేషన్లో ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, అనుష్క నటించిన ‘రుద్రమదేవి’ని కూడా చిత్ర దర్శక-నిర్మాత గుణశేఖర్ అదే సమయంలో విడుదల చేయాలనుకోవడంతో ‘సైజ్ జీరో’ను వాయిదా వేశారు ప్రసాద్ వి. పొట్లూరి. ఆ వెనువెంటనే రావడానికి రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’, అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం ‘అఖిల్’ ఇవన్నీ ఉండడంతో ‘సైజ్ జీరో’ ఆగాల్సి వచ్చింది. దాంతో, నవంబర్ 27న విడుదల చేస్తున్నట్లు అప్పుడే పీవీపీ ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ డేటే సినిమాకు ఖాయమైంది. డిసెంబర్ 10కి మారిన ‘బెంగాల్ టైగర్’ వాస్తవానికి ఈ నెల 26, 27తేదీల్లో ఒక రోజున ‘బెంగాల్ టైగర్’ను విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత కేకే రాధామోహన్ అనుకున్నారు. కానీ, సరిగ్గా అప్పుడే ‘సైజ్ జీరో’ ఉంది. ‘బెంగాల్ టైగర్’ను దర్శకుడు సంపత్ నంది రవితేజ మార్క్ భారీ కమర్షి యల్ చిత్రంగా తీర్చిదిద్దారు. ఈ రెండు చిత్రాలూ ఒకేరోజు విడుదలైతే వసూళ్లు డివైడ్ అవుతాయి. ఫలితంగా సినిమాలు పూర్తిస్థాయి బాక్సాఫీస్ సత్తా చాటుకొనే వీలుండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉభయతారకంగా ఉండేలా, రాధామోహన్ ‘బెంగాల్ టైగర్’ను వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ 10వ తేదీని రిలీజ్ డేట్‌గా ఖరారు చేశారు. మధ్యలో డిసెంబర్ 4 శుక్రవారమైనా, ‘శంకరాభరణం’ రిలీజ్‌కు ఉండడంతో 10వ తేదీకి వస్తున్నారు. ప్రకటించిన డిసెంబర్ 4కే... ‘శంకరాభరణం’ నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. టైటిల్ ప్రకటన నుంచే ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకట్టుకోగలిగింది. మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే ఈ సినిమాకు న్యాయం జరుగుతుందన్నది కోన వెంకట్ అభిప్రాయం. ‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ ఒకే రోజు రిలీజై, ఒకదానికి మరొకటి పోటీ కావడం కరెక్ట్ కాదని నిర్మాతలు ఒక అంగీకారానికి వచ్చారు. ‘సైజ్ జీర్’ డేట్‌తో క్లాష్ కాకుండా చూసుకున్న నిర్మాత రాధామోహన్ ‘శంకరాభరణం’తో కూడా డేట్స్ క్లాష్ లేకుండా సహాయపడ్డారు. ఫలితంగా, ముందుగా ప్రకటించిన డిసెంబర్ 4నే ‘శంకరాభరణం’ వస్తుంది. ఆ వెంటనే 10న ‘బెంగాల్ టైగర్’ పలకరిస్తుంది. మొత్తం మీద ఇరవై రోజుల గ్యాప్‌లో ‘సైజ్ జీరో’, ‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ తెర మీదకొచ్చేస్తాయ్. ఒకే తేదీకి ఒకదానిపై మరొకటి పోటీ పడకుండా జాగ్రత్త పడ్డాయి. వసూళ్ళు డివైడ్ కాకుండా, ఒక వారం పాటు ఏ సినిమాకు ఆ సినిమాకు పూర్తి ఎడ్వాంటేజ్ ఉండేలా ఈ మూడు చిత్రాల నిర్మాతలూ కలసి ఒక నిర్ణయానికి రావడం విశేషమే. సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మరీ పీవీపీ, రాధామోహన్, కోన వెంకట్లు తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. అవగాహనతో ఉంటే... అందరికీ లాభం! ప్రస్తుతం ఏ సినిమా స్పాన్ అయినా వారం రోజులు మాత్రమే ఉంటోంది. అందుకే మేము ముగ్గురం కలిసి, మాట్లాడుకున్నాం. రాధామోహన్ రియల్ హీరో అనాలి. ఎందుకంటే, ‘అఖిల్’ చిత్రం కోసం ఆయన ‘బెంగాల్ టైగర్’ విడుదలను వాయిదా వేశారు. నవంబర్ 27న విడుదల చేయాలనుకున్నారు కానీ, అప్పటికే మేం విడుదల తేదీ ప్రకటించేశాం. దాంతో మళ్లీ వాయిదా వేశారు. ‘శంకరాభరణం’ కోసం ఏకంగా డిసెంబర్ 10ని విడుదల తేదీగా ఫిక్స్ చేశారు. నిర్మాతలందరూ ఇలా మంచి అవగాహనతో ముందుకెళితే అందరికీ మంచి జరుగుతుంది - పొట్లూరి వి. ప్రసాద్ నిర్మాతలందరూ బాగుండాలి! అసలు ఈ నెల 5న ‘బెంగాల్ టైగర్’ని విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ‘అఖిల్’ సినిమా పోస్ట్‌పోన్ అయింది. మా సినిమాకూ, ‘అఖిల్’కూ డిస్ట్రిబ్యూటర్స్ ఒకరే కావడంతో మా చిత్రాన్ని అనివార్యంగా 27కి వాయిదా వేశాం. ఆ డేట్ అనుకు న్నాక ‘సైజ్ జీరో’ గురించి తెలిసింది. పీవీపీగారు కలిసి, మాట్లాడిన తర్వాత ఓ అవగాహనకు వచ్చాం. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మా ‘బెంగాల్ టైగర్’ని డిసెంబర్ 10న రిలీజ్ చేస్తున్నాం. నిర్మాతలందరూ బాగుండాలన్నది నా ఆకాంక్ష. - కేకే రాధామోహన్ ఆ అపోహ వద్దు! ఒకేరోజు రెండు, మూడు సినిమాలు విడుదలైతే థియేటర్ల విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందుకే క్లారిటీగా మేం నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 20న ‘శంకరాభరణం’ను విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ‘సైజ్ జీరో’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాల విడుదల ఉండటంతో డిసెంబర్ 4కి వాయిదా వేశాం. రాధామోహన్‌గారు పెద్ద మనసు చేసుకుని ‘బెంగాల్ టైగర్’ని వాయిదా వేశారు. ఒక సినిమా వాయిదా పడిందంటే.. కచ్చితంగా రీషూట్ చేయడం కోసమే అని అపోహపడే అవకాశం ఉంది. కానీ, అలాంటిదేమీ లేదు. కేవలం మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే మేం ముగ్గురం కలసి ఈ నిర్ణయం తీసుకున్నాం. - కోన వెంకట్ -
బెంగాల్ టైగర్
అతని పేరు ఆకాశ్ నారాయణ్. ఫుల్ పవర్ ప్యాక్డ్. కంప్యూటర్స్‌లో మాస్టర్స్ చేసిన ఓ ఇడియట్. అలాంటివాడి కథే ఈ ‘బెంగాల్ టైగర్’ అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. ఇది బెంగాల్లో జరిగే కథ కాదనీ, అలాగే పోలీస్ స్టోరీ కూడా కాదనీ, హీరో క్యాలిబర్‌ను రిప్రెజెంట్ చేయడం కోసమే ఈ టైటిల్ పెట్టామని, ఇదొక పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అని సంపత్ నంది పేర్కొన్నారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నా కాంబినేషన్లో సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26 లేదా 27న విడుదల కానుంది. -
రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్
భారీ అంచనాల మధ్య విడుదలైన 'కిక్ 2' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం, రవితేజ కెరీర్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపినట్టుగా లేదు. గతంలో బలుపు, పవర్ సినిమాలతో మంచి సక్సెస్‌లు సాధించిన మాస్ మహరాజ్, ఆ తరువాత కిక్ 2తో అలరించలేకపోయినా, ప్రస్తుతం చేస్తున్న బెంగాల్ టైగర్ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా మినిమమ్ గ్యారెంటీ హీరోగా రవితేజకు ఉన్న ఇమేజ్ ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంగాళ్ టైగర్ సినిమాలో తమన్నా, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సంపత్ నంది. కిక్ 2 రిజల్ట్‌తో బెంగాల్ టైగర్ బిజినెస్‌పై ఎన్నో అనుమానాలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ పక్కకు నెట్టి రవితేజ సత్తా చాటుతున్నాడట. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బిజినెస్ పూర్తయిన ఈ సినిమా, టేబుల్ ప్రాఫిట్ దిశగా సాగుతుందని టాక్. -
ఈ టైగర్ చాలా స్పెషల్!
ఫైర్‌బ్రాండ్‌లా దూసుకెళ్లిపోవడం అతని హాబీ. మాటల్లో హుషారు, చేతల్లో స్పీడ్ మాత్రం మిస్ కాడు. ఈ స్పీడ్, హుషారు చూసి ఇద్దరు అందమైన భామలు అతనికి కనెక్ట్ అయిపోయారు. లక్ష్యాన్ని చేరుకుంటూనే ఈ యువకుడు ఎవరి ప్రేమలో పడ్డాడు? ఆ సంగతి తెలియాలంటే ‘బెంగాల్ టైగర్’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. రవితేజ, తమన్నా, రాశీఖన్నా నాయకా నాయికలుగా కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ చివరి వారంలో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘భీమ్స్ స్వరపరిచిన పాటలు టాప్ చార్ట్‌లో ఉన్నాయి. రవితేజ, తమన్నా, రాశీఖన్నా పోటీపడి మరీ డాన్స్ చేశారు. ట్యూన్స్‌కు తగ్గట్టే డ్యాన్స్ మూమెంట్స్ కూడా హుషారుగా ఉంటాయి’’ అని చెప్పారు. ఈ నెల 26 లేదా 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. తమన్నా మాట్లాడుతూ- ‘‘నిర్మాత రాధామోహన్‌కు సినిమా అంటే చాలా ప్యాషన్. అందుకు తగ్గట్టే ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా తీశారు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు. ఈ సినిమా తమకు చాలా స్పెషల్ అని రాశీఖన్నా అన్నారు. ‘‘నేను సంగీతం అందించిన ఆరో సినిమా ఇది. రవితేజ లాంటి స్టార్ సినిమాకు పనిచేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు భీమ్స్ చెప్పారు. -
‘బెంగాల్ టైగర్’ మూవీ స్టిల్స్
-
ఎప్పుడైనా రెడీ!
అతను క్లయిమేట్ లాంటోడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఒకసారి కూల్‌గా... ఆ వెంటనే హాట్‌గా... ఉంటాడు. ఎవరికైనా ఎదురెళ్తాడు. భయంతో పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఓ పెద్ద కోరిక ఉంటుంది. గూగుల్‌లో తనకంటూ నాలుగు పేజీలు ఉండాలన్నదే ఆ కోరిక. దాని కోసం సమాజంలో ఉన్న చెడుపై ఎలాంటి పోరాటం చేశాడో తెలియాలంటే ‘బెంగాల్ టైగర్’ చూడాల్సిందే. రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో, హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కానీ, కొన్ని సన్నివేశాలను రీ-షూట్ చేస్తున్నారనే వార్త ప్రచారం అవుతోంది. ఈ వార్తలో నిజం లేదని రాధామోహన్ స్పష్టం చేశారు.‘‘అక్టోబర్ 22న రిలీజ్ కావాల్సిన ‘అఖిల్’ చిత్రం విడుదల వాయిదా కావడంతో ‘బెంగాల్ టైగర్’ని ముందు అనుకున్నట్టు నవంబర్ 5న రిలీజ్ చేయడం కుదరడం లేదు. విడుదల వాయిదా వేయడానికి కారణం ఇదే. నైజామ్ ఏరియాలో ‘అఖిల్’ చిత్రం, మాది ఒకరే కొన్నారు. అందుకే, రిలీజ్ డేట్స్ క్లాష్ కాకుండా చూసుకుంటున్నాం. షూటిం గంతా పూర్తయిపోయింది. గుమ్మడికాయ కొట్టేశాం. నిర్మాణానంతర కార్యక్రమాలూ పూర్తి అయ్యాయి. డేట్ కుదిరితే చాలు... ఎప్పుడైనా మా సినిమా రిలీజ్‌కి రెడీగా ఉన్నాం. ఎప్పుడు రిలీజైనా రవితేజ కెరీర్లో ఇది హిట్‌గా నిలుస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రక టిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్, సంగీతం: భీమ్స్. -
నవంబర్‌లో బెంగాల్ టైగర్
తిరుమల: రవితేజ హీరోగా రూపొందిం చిన బెంగాల్ టైగర్ చిత్రాన్ని నవంబరులో విడుదల చేస్తామని ఆ చిత్ర దర్శకుడు సంపత్‌నంది అన్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ఆడియో విడుదల చేశామని, మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ఈ చిత్రం విడుదలయ్యాకే కొత్త ప్రాజెక్టులు చేపడతామన్నారు. పవన్‌కల్యాణ్‌తో పాటు మరి కొన్ని చిత్రాల గురించి త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. -
ఆయన బంగారు కొండ : సంపత్ నంది
‘‘ఈ వేడుకకు హీరో భీమ్స్. అతనిలో మంచి విషయం ఉంది. ఈ సినిమాతో భీమ్స్ స్టార్ మ్యూజిక్ డెరైక్టర్ అయిపోతాడు. మా నిర్మాతకు చాలా లాభాలు వస్తాయి. ఈ చిత్రంతో ఆయన పెద్ద నిర్మాత అయిపోతారు. నా లెక్క ప్రకారం ఈ చిత్రం నీకు హ్యాట్రిక్ అవుతుంది (సంపత్ నందిని ఉద్దేశించి)’’ అని రవితేజ అన్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా హీరో, హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హిందీ నటుడు బొమన్ ఇరానీ ఆడియో సీడీని ఆవిష్కరించి రవితేజకు ఇచ్చారు. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ - ‘‘రవితేజ ఎనర్జీ గురించి చెప్పాలంటే నా ఎనర్జీ చాలదు. ఆయన బంగారు కొండ. కరెక్టుగా ఆకలి వేసినప్పుడు నాకు అన్నం పెట్టిన వ్యక్తి. నాకు ఇంత మంచి అవకాశమిచ్చిన రవితేజగారికి కృతజ్ఞతలు. సింగిల్ సిట్టింగ్‌లో ఆయన ఈ కథను ఓకే చేశారు. రవితేజగారి అభిమానులను 1000 పర్సెంట్ శాటిస్ఫై చేసే చిత్రం. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రేపటి నుంచి భీమ్స్ పేరు మారుమ్రోగిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ రోజు మాట్లాడాలంటే కన్నీళ్లు ఆగడం లేదు. మాటలు రావడం లేదు. నేనీ రోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే సంపత్గారే కారణం. ఆయన మాట మీద రవితేజగారు నాకీ ఛాన్స్ ఇచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు’’ అని భీమ్స్ చెప్పారు. రాధామోహన్ మాట్లాడుతూ - ‘‘ఇంతకుముందు చిన్న సినిమాలు చేశాను. రవితేజగారు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉండేది. రెండు మూడు సిట్టింగ్స్‌తో నా మీద ఆయనకు నమ్మకం వచ్చింది. సంపత్లో టాలెంట్ ఉంది. అందుకే ‘ఏమైంది ఈవేళ’ సినిమాకి అవకాశమిచ్చాను. భీమ్స్‌కి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. బొమన్ మాట్లాడుతూ - ‘‘సంపత్ చెప్పిన కథ విని, 15 నిముషాల్లో ఓకే చెప్పాను. రవితేజకు ఎనర్జీ ఎక్కణ్ణుంచి వస్తుంది అంటే.. ఆయన ఫ్యాన్స్ దగ్గర నుంచే వస్తుంది’’ అన్నారు. కెరీర్ ఆరంభించినప్పట్నుంచీ రవితేజతో సినిమా చేయాలనుకున్నాననీ, ఇప్పటికి కుదిరిందనీ తమన్నా చెప్పారు. గౌతంరాజు, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, పృథ్వీరాజ్, సమీర్, రాశీ ఖన్నా, అక్ష, హంసా నందిని తదితరులు పాల్గొన్నారు. -
రవితేజ 'ఎవడో ఒకడు'
హిట్ ఫ్లాప్‌లతో సంబందం లేకుండా టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో మాస్ మహరాజ్ రవితేజ. ప్రస్తుతం యంగ్ హీరోల నుంచి గట్టి పోటి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా వరుస సినిమాలతో హవా చూపిస్తున్నాడు రవితేజ. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. రవితేజ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తున్నాడు. 'కిక్ 2' ఫెయిల్యూర్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. సంపత్ నంది కూడా పవన్ సినిమా నుంచి బయటి రావాల్సి రావటంతో ఈ సినిమాతో బిగ్ హిట్ సాదించి తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేశాడు రవితేజ. దిల్‌రాజు నిర్మాతగా 'ఓ మై ఫ్రెండ్' ఫేం వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు 'ఎవడో ఒకడు' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. విజయ దశమి సందర్భంగా లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా 'బెంగాల్ టైగర్' రిలీజ్ తరువాత రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. -
బాహుబలి నా క్రేజ్‌ను మరింత పెంచింది
ఖమ్మం : బాహుబలి చిత్రం తన క్రేజ్‌ను మరింత పెంచిందని మిల్కీ బ్యూటీ తమన్నా తెలిపింది. ప్రతి మనిషికీ ఓ డ్రీమ్ ఉంటుందని, అది తనకు కూడా ఉందని ఆమె చెప్పింది. బాహుబలిలో నటించే వరకు తనకూ ఓ డ్రీమ్ ఉండేదని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే బాహుబలి సినిమాలో లీడ్ రోల్ ద్వారా రాజమౌళి మంచి అవకాశం ఇచ్చి తన స్థాయిని, క్రేజ్‌ను పెంచారని తెలిపింది. దీంతో తన డ్రీమ్.. బాహుబలిలో వచ్చిన క్రేజ్ ముందు చిన్నబోయిందని, అందుకే ప్రస్తుతం తన డ్రీమ్ రోల్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. తమన్నా శుక్రవారం ఖమ్మంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు విచ్చేసింది. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతానికి సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నానని, త్వరలోనే తన డ్రీమ్ రోల్ ఏంటో నిర్దేశించుకుని దాని కోసం కృషి చేస్తానని తెలిపింది. తాను ముంబయిలో పుట్టి పెరిగినా, తెలుగు భాష, ఇక్కడ ప్రజలంతే చాలా ఇష్టమని చెప్పింది. ప్రస్తుతానికి తమిళంలో 'తోడా' సినిమా, తెలుగులో రవితేజ హీరోగా బెంగాల్ టైగర్‌తో పాటు కార్తీక్,నాగ్ ప్రధాన పాత్రల్లో ఊపిరి సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నట్లు తమన్నా వెల్లడించింది. మరో తెలుగు సినిమాలో నటించడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆమె పేర్కొంది. ఆ కార్యక్రమం అనంతరం తమన్నా బతుకమ్మను ఎత్తుకుని ఫొటోలకు ఫోజులు ఇస్తూ కాసేపు అభిమానుల సమక్షంలో సందడి చేశారు. -
మాస్ పంచ్‌లతో 'బెంగాల్ టైగర్'
'కిక్ 2' ఫెయిల్యూర్ నుంచి త్వరగానే కోలుకున్నాడు మాస్ మహరాజ రవితేజ. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ మార్క్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. 'నేను క్లైమేట్ లాంటోన్ని, అప్పుడప్పుడు చల్లగా ఉంటా.. అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా... అప్పుడప్పుడూ వణికిస్తూ ఉంటా..' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. 'కిక్ 2' ఫెయిల్యూర్ తరువాత ఫుల్ ఎనర్జీతో వస్తున్న రవితేజ ఈసారి గ్యారెంటీ హిట్ మీద కన్నేశాడు. తమన్నా అందం సినిమాకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది. రవితేజ సరసన తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది దర్శకత్వంలో కెకె రాధమోహన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న 'బెంగాల్ టైగర్' నవంబర్ 6న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
బెంగాల్ టైగర్
కొంచెం అల్లరి.... మరి కొంత వెటకారం... ఇంకాస్త చిలిపితనం... ఇవన్నీ రవితేజ పాత్రల్లో ఉరకలెత్తుతూ ఉంటాయి. సీమటపాకాయ్‌లా సందడి చేస్తూ ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ప్రతి ఫ్రేములోనూ ఫైర్ బ్రాండ్లా రెచ్చిపోయే రవితేజ ఇప్పుడు... ‘బెంగాల్ టైగర్’ రెడీ అవుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. ఈ నెల 18న పాటలు, నవంబరు 5న సినిమా విడుదల కానున్నాయి. -
దీపావళికి టైగర్ బాంబ్
రవితేజ అంటే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడాయన ‘బెంగాల్ టైగర్’ గా తనదైన శైలిలో యాక్షన్‌ను, వినోదాన్నీ ప్రేక్షకులకు పంచడానికి సిద్ధమవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా ముఖ్యతారలుగా కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ- ‘‘దీపావళి కానుకగా నవంబరు 5న ‘బెంగాల్ టైగర్’ను రిలీజ్ చేయనున్నాం. అక్టోబరు 17న పాటలను విడుదల చేస్తాం. రవితేజ ఎనర్జీకి తగ్గ పాత్ర ఇది. సంగీత దర్శకుడు భీమ్స్ మంచి స్వరాలందించారు. బ్రహ్మానందం కామెడీ, బొమన్ ఇరానీ విలనిజమ్ ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. -
టైగర్‌తో లవ్‌లో..!
మీరా చాలా క్యూట్‌గా ఉంటుంది. మోడ్రన్ అమ్మాయి. ఆధునిక దుస్తుల్లో అదిరిపోయేలా ఉంటుంది. సంప్రదాయ దుస్తుల్లో శెభాష్ అనేలా ఉంటుంది. మొత్తం మీద మీరా గొప్ప అందగత్తె. ఈ పాల బుగ్గల సుందరి చాకులాంటి అబ్బాయితో ప్రేమలో పడుతుంది. అతను టైగర్ అంత పవర్ఫుల్. మీరాతో ఈ టైగర్ లవ్‌స్టోరీ ఎలా ఉంటుందో ‘బెంగాల్ టైగర్’లో చూడాల్సిందే. బెంగాల్ టైగర్‌గా రవితేజ, మీరా పాత్రను తమన్నా చేశారు. రాశీ ఖన్నా మరో కథానాయిక. సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తయిపోతాయి. ‘‘రవితేజ నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమా కోరుకుంటారో అలా ఈ చిత్రం ఉంటుంది. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. తమన్నా, రాశీఖన్నా ఓ హైలైట్‌గా నిలుస్తారు. బొమన్ ఇరానీ పాత్ర ప్రత్యేక ఆకర్షణ అవుతుంది’’ అని దర్శకుడు తెలిపారు. ‘‘స్విట్జర్లాండ్‌లో ఎవరూ తీయని అందమైన లొకేషన్స్‌లో ఇటీవల రెండు పాటలు చిత్రీకరించాం. వచ్చే నెల పాటలను విడుదల చేస్తాం. రవితేజ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది’’ అని నిర్మాత చెప్పారు. -
హంసానందినితో పోటా పోటీగా...
మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ఇస్తే, రవితేజ ఓ రేంజ్లో రెచ్చిపోతారు. చాలా ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేస్తారు. ప్రస్తుతం రవితేజ ఆ పని మీదే ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘బెంగాల్ టైగర్’. ఈ చిత్రంలో రవితేజ ఇంట్రడక్షన్ సాంగ్‌ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో రవితేజతో కలిసి కాలు కదుపుతున్నది ఎవరో కాదు ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చిలాంటి కుర్రాడే...’ పాటలో చాలా హాట్‌గా కపిపించడంతో పాటు డ్యాన్స్ అదరగొట్టి, ఆ తర్వాత పలు ఐటమ్ సాంగ్స్ చేసిన హంసా నందిని డ్యాన్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు 120 మంది డ్యాన్సర్లు పాల్గొనగా కన్నడ కొరియోగ్రాఫర్, దర్శకుడు హర్ష నేతృత్వంలో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పరిచయ పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, మాస్ పల్స్ తెలిసిన సంపత్ నంది ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నా రని నిర్మాత తెలిపారు. రవితేజ. హంసా నందిని పోటాపోటీగా డ్యాన్స్ చేస్తున్నారని, ఎనర్జీ లెవల్స్‌కి తగ్గ సినిమా ఇదని దర్శకుడు అన్నారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: భీమ్స్, ఎడిటింగ్: గౌతంరాజు. -
అక్షరాలా ఆరు కిలోలు కట్!
చక్కనమ్మ చిక్కినా అందమే అనేది పాత నానుడే అయినా... అమ్మాయిల బరువు గురించి చెప్పేటప్పుడు ఇలా అనక తప్పదు. వెండితెరపై ఇప్పటివరకూ వచ్చిన కథానాయికల్లో ముందు బొద్దుగా ఉండి, ఆ తర్వాత సన్నబడ్డ తారల్లో ఇప్పుడు రాశీ ఖన్నా చేరారు. ‘ఊహలు గుసగుసలాడె’, ‘జోరు’, ‘జిల్’ చిత్రాల్లో బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ రాబోయే ‘బెంగాల్ టైగర్’, ‘శివమ్’లో సన్నగా కనిపించనున్నారు. ఎందుకంటే, ఆరు కిలోలు బరువు తగ్గారామె. రాశీ సహజ సిద్ధంగానే సన్నబడ్డారు. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలోని హరిద్వార్‌లో గల ఓ స్పాకి వెళ్లారామె. ఆ స్పాలో ఉన్నన్నాళ్లూ యోగా, ధ్యానం, వాకింగ్, వారంలో రెండు రోజులు జిమ్ చేశారు. వీటివల్ల తాను అనుకున్నట్లు సన్నబడగలిగారు. ఇప్పుడు తన శరీరానికి ఎలాంటి వ్యాయామాలు కరెక్ట్ అనే విషయంపై రాశీఖన్నాకి ఓ అవగాహన వచ్చేసిందట. అందుకని తగ్గిన ఈ ఆరు కిలోలు పెరగకుండా ఎప్పుడూ స్లిమ్‌గా మెయిన్టైన్ అయిపోతానని అంటున్నారు. -
ఫుల్ జోష్‌తో..!
రవితేజ అంటేనే ఎనర్జీ. ఆ ఎనర్జీకి నిలువెత్తు నిదర్శనంగా ‘బెంగాల్ టైగర్’ చిత్రం రూపొందుతోంది. ‘రచ్చ’ ఫేం సంపత్ నంది దర్శకుడు. రాధామోహన్ నిర్మాత. ఇందులో రవితేజ సరసన తొలిసారిగా తమన్నా, రాశీ ఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత ప్రముఖ హిందీ నటుడు బొమన్ ఇరానీ నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ చేస్తున్నామనీ, వినాయక చవితికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని, ఇందులో రవితేజ పాత్ర చిత్రణ ఫుల్ జోష్‌తో ఉంటుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. -
వినాయకచవితికి రెడీ
రవితేజ శరవేగంగా ‘బెంగాల్ టైగర్’ గా సిద్ధమవుతున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. ‘రచ్చ’ తర్వాత సంపత్ నంది డెరైక్ట్ చేస్తున్న సినిమా ఇదే. కె.కె. రాధామోహన్ నిర్మాత. -
పవర్ఫుల్ టైగర్
‘‘బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్..! కోల్‌కతా కాళీఘాట్‌లో ఏసీపీగా డ్యూటీ చేస్తోంది’’ అనే డైలాగ్ వినబడగానే మనకు గుర్తొచ్చేది ‘పవర్ ’ చిత్రం లో రవితేజ పోషించిన బలదేవ్ సహాయ్ పాత్ర. ఇప్పుడా ‘బెంగాల్ టైగర్’ టైటిల్‌తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘రచ్చ' ఫేం సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఓ ప్రధాన పాత్రధారి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆర్.ఎఫ్.సీలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. బొమన్ ఇరానీ, సాయాజీ షిండేలతో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ రవితేజతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పటికి ఆ కోరిక తీరుతోంది. రవితేజ పాత్రను చాలా శక్తిమంతంగా డిజైన్ చేశాం. ఈ నెల 14 వర కు షెడ్యూల్ కొనసాగుతుంది’’అని చెప్పారు. -
ఫుల్ ఎనర్జీ
రవితేజ అంటేనే మాస్ మహరాజా. ఆయన ఏ తరహా సినిమా చేసినా మాస్ అంశాలు నిబిడీకృతమై ఉండాల్సిందే. ‘రచ్చ’ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ, తమన్నాపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు వీవీ వినాయక్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ - ‘‘రవితేజ చిత్రాలు ఎనర్జిటిక్‌గా ఉంటాయి. ఈ చిత్రం కూడా ఆ తరహాలో ఫుల్ ఎనర్జీతో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్. మార్చి 2 నుంచి చిత్రీకరణ మొదలుపెట్టి, సెప్టెంబర్ లేక అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. తమన్నా మాట్లాడుతూ - ‘‘రవితేజ సరసన ఎప్పుట్నుంచో ఓ చిత్రం చేయాలనుకుంటున్నాను. ఈ చిత్రంతో అది నెరవేరింది. ‘రచ్చ’ తర్వాత మళ్లీ సంపత్ నంది దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. బొమన్ ఇరానీ, నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్, ఎడిటింగ్: గౌతంరాజు, లైన్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్. కుమార్. -
ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
విభిన్నమైన శీతోష్ణస్థితులు, భౌగోళిక లక్షణాలు ఉండటం వల్ల భారతదేశం అనాదిగా అనేక రకాల పశుపక్షాదులకు నిలయంగా ఉంది. తద్వారా ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాయల్ బెంగాల్ టైగర్, ఒంటికొమ్ము ఖడ్గమృగం లాంటివి భారతదేశ వన్యప్రాణి సంపద ప్రత్యేకతను సగర్వంగా చాటుతున్నాయి. కానీ మానవ కార్యకలాపాలు, మారుతున్న పర్యావరణ పరిస్థితుల వల్ల ప్రాణి ప్రపంచం మనుగడ ప్రమాదంలో పడింది. ఇక ఎంతమాత్రం నిర్లక్ష్యం చేసినా అనేక జీవజాతులు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. మనతో పాటు జంతుజాలం స్వేచ్ఛగా జీవించేలా చూడాలనే కనీస ధర్మాన్ని గుర్తించి, అందుకనుగుణమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉంది. ఇండియన్ జాగ్రఫీ భారతదేశం - జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఒకప్పుడు స్థానీయమైన అత్యధిక జీవ వైవిధ్యంతో కూడిన భౌగోళిక ప్రదేశాలు ప్రస్తుతం మానవ చర్యల వల్ల ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి ప్రాంతాలను ‘ఎకలాజికల్ హాట్ స్పాట్స్’గా పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకూ ఇలాంటి 34 ప్రాంతాలను గుర్తించారు. భారతదేశంలో గుర్తించిన ఎకలాజికల్ హాట్ స్పాట్ల సంఖ్య 2. అవి.. 1) ఈశాన్య హిమాలయాలు 2) పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి కింద పేర్కొన్న రెండు రకాల వ్యూహాలను రూపొందించారు. 1. ఆవాసేతర రక్షణ: ఏదైనా భౌగోళిక ప్రాంతంలో అంతరించి పోయే స్థితిలో ఉన్న జీవజాతులను వాటి సహజ సిద్ధ పరిసరాలకు వెలుపల మానవ ప్రమేయంతో సంరక్షించే విధానాన్ని ‘ఆవాసేతర రక్షణ’ అంటారు. ఇందులో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు: 1) బోటానికల్ గార్డెన్స, జంతు ప్రదర్శన శాలలను ఏర్పాటు చేయడం. 2) జన్యు బ్యాంకుల ఏర్పాటు. 3) బీజ ద్రవ్య బ్యాంకులను ఏర్పాటు చేయడం. 4) విత్తన, పిండ నిల్వల బ్యాంకులను ఏర్పాటు చేయడం. 2. ఆవాసాంతర రక్షణ: ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను అవే సహజసిద్ధ పరిసరాల్లో సంరక్షించడాన్ని ‘ఆవాసాంతర రక్షణ’ అంటారు. దీంట్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు: 1) బయోస్పియర్ రిజర్‌వల ఏర్పాటు. 2) జాతీయ పార్కుల ఏర్పాటు. 3) వన్యమృగ సంరక్షణ కేంద్రాల నిర్వహణ. బయోస్పియర్ రిజర్వలు ఠి జంతువులతో పాటు అన్ని రకాల జీవజాతులను పరిరక్షించడానికి వీటిని ఏర్పాటు చేశారు. ఠి భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్‌వను 1986లో నీలగిరి (తమిళనాడు)లో ఏర్పాటు చేశారు. ఠి {పస్తుతం మనదేశంలో ఉన్న బయోస్పియర్ రిజర్‌వల సంఖ్య 18. ఠి మనదేశంలో చివరగా ప్రకటించిన బయోస్పియర్ రిజర్వ - ‘పన్నా’. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. దీన్ని 2011లో ప్రకటించారు. ఠి యునెస్కో జాబితాలో చేర్చిన భారతదేశ బయోస్పియర్ రిజర్‌వల సంఖ్య 4. అవి: 1) నీలగిరి 2) సుందర్‌బన్‌స 3) మన్నార్ సింధుశాఖ 4) నందాదేవి ఠి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బయోస్పియర్ రిజర్వ - శేషాచలం (2010) జాతీయ పార్కులు సాధారణంగా వృక్ష, జంతు జాతులు, ప్రకృతి సముదాయాన్ని సంరక్షించి, అభివృద్ధి చేసే ప్రాంతాలను జాతీయ పార్కులు అంటారు. ఈ ప్రాంతాల్లో అడవులను నరకడం, పశువులను మేపడం, వ్యవసాయం చేయడం లాంటి కార్యకలాపాలను ప్రభుత్వం నిషేధించింది. ఠి భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి జాతీయ పార్కు ‘హేలీ’. ఇది ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉంది. దీన్ని 1935లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్ని ‘జిమ్‌కార్బెట్ నేషనల్ పార్కు’గా వ్యవహరిస్తున్నారు. ఠి మనదేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ పార్కుల సంఖ్య 102. ఠి జాతీయ పార్కులు అధికంగా ఉన్న ప్రాంతాలు: 1. అండమాన్ - నికోబార్ దీవులు 2. మధ్యప్రదేశ్ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు జంతువుల పరిరక్షణ.. ముఖ్యంగా అంతరించిపోయే ప్రమాదమున్నవాటి కోసమే కేటాయించిన ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ కేంద్రం (శాంక్చుయరీ) అంటారు. ఈ ప్రాంతాల్లో కలప సేకరించడం, అటవీ ఉత్పత్తులను సమీకరించడం లాంటి కార్యకలాపాలతో పాటు ప్రైవేట్ యాజమాన్య హక్కులను అనుమతిస్తారు. ఇక్కడ పరిశోధనలకు ప్రోత్సాహం ఉంటుంది. ఠి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలు: 1. అండమాన్ - నికోబార్ దీవులు 2. మహారాష్ట్ర ఠి {పస్తుతం దేశంలో ఉన్న వన్య మృగ సంరక్షణ కేంద్రాల సంఖ్య 514. ఠి భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి పక్షి సంరక్షణ కేంద్రం ‘వేదాంతంగల్’. ఇది తమిళనాడులో ఉంది. దీన్ని 1895లో ఏర్పాటు చేశారు. ఠి 1972లో ‘వన్యప్రాణి సంరక్షణ చట్టం’ రూపొందించారు. దీని ద్వారా దేశంలో వన్యమృగ సంరక్షణకు చట్టబద్ధత ఏర్పడింది. ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశమంతా వర్తిస్తుంది. ఠి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, 51(ఎ) లను అనుసరించి వన్యమృగ సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందిస్తోంది. 1972 వన్యమృగ సంరక్షణ చట్టం ద్వారా భారతదేశంలో అంతరించిపోతున్న జంతువులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టారు. అవి: 1. {పాజెక్టు టైగర్: భారతదేశంలో పులులు అంతరించి పోకుండా కాపాడటానికి 1973 ఏప్రిల్ 1న ‘ఆపరేషన్ టైగర్’ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. దీంతోపాటు 9 టైగర్ రిజర్వలను ప్రకటించారు. ఠి భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి టైగర్ రిజర్వ ‘బందీపూర్’. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఠి {పస్తుతం దేశంలో మొత్తం 47 టైగర్ రిజర్వలున్నాయి. ఠి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ‘నాగార్జునసాగర్ - శ్రీశైలం రిజర్వ’ దేశంలోనే అతి పెద్దది. దీన్ని రాజీవ్‌గాంధీ టైగర్ రిజర్వగా పిలుస్తారు. 2. {పాజెక్టు ఎలిఫెంట్: ఏనుగుల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం 8వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1992-97) ‘ఆపరేషన్ ఎలిఫెంట్’ను ప్రారంభించింది. దీన్నే ‘కౌండిన్య ప్రాజెక్టు’గా వ్యవహరిస్తారు. ఠి భారతదేశంలో ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం - కేరళ. ఠి {పస్తుతం భారతదేశంలో 32 ఎలిఫెంట్ రిజర్వలు ఉన్నాయి. 3. ఆపరేషన్ క్రోకోడైల్: 1974లో యూఎన్డీపీ సహకారంతో ఈ ప్రాజెక్టును ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ప్రారంభించారు. భారతదేశంలో దీన్ని 1975లో ప్రారంభించారు. ఠి దేశంలో మొసళ్ల సంరక్షణ కోసం ‘క్రోకోడైల్ బ్యాంక్’ను ఏర్పాటు చేసిన ప్రాంతం - చెన్నై. 4. ఆపరేషన్ సీ-టర్టిల్: తాబేళ్ల సంరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని 1975లో ప్రారంభించారు. తాబేళ్లను పరిరక్షిస్తున్న ప్రాంతాలు: 1) గహిర్మాత, ఒడిశా - ఆలివ్‌రిడ్లీ తాబేళ్లు 2) ట్యుటికోరిన్, తమిళనాడు - హాక్సీబిల్ తాబేళ్లు. ముఖ్యమైన టైగర్ రిజర్వలు - రాష్ట్రాలు 1. కజిరంగా టైగర్ రిజర్వ - అసోం 2. మానస టైగర్ రిజర్వ - అసోం 3. కవ్వాల్ టైగర్ రిజర్వ - తెలంగాణ 4. వాల్మీకి టైగర్ రిజర్వ - బీహార్ 5. బందీపూర్ టైగర్ రిజర్వ - కర్ణాటక 6. పెరియార్ టైగర్ రిజర్వ - కేరళ 7. పన్నా టైగర్ రిజర్వ - మధ్యప్రదేశ్ 8. బాందవ్‌ఘర్ టైగర్ రిజర్వ - మధ్యప్రదేశ్ 9. కన్హా టైగర్ రిజర్వ - మధ్యప్రదేశ్ 10. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ - ఒడిశా 11. రణతంబోర్ టైగర్ రిజర్వ - రాజస్థాన్ 12. దుద్వా టైగర్ రిజర్వ - ఉత్తరప్రదేశ్ 13. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ - ఉత్తరాంచల్ 14. బుక్సా (బక్సార్) టైగర్ రిజర్వ - పశ్చిమ బెంగాల్ 15. సుందర్ బన్స(24 పరగణాలు) టైగర్ రిజర్వ - పశ్చిమ బెంగాల్ ముఖ్యమైన జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు 1. జమ్మూ-కాశ్మీర్: 1) దచిగామ్ (హంగుల్ అనే దుప్పిని సంరక్షిస్తున్నారు) 2) సలీం అలీ (పక్షి సంరక్షణ కేంద్రం) 2. ఉత్తరాంచల్: 1) రాజాజీ 2) నందాదేవి 3) గంగోత్రి 3. పశ్చిమ బెంగాల్: 1) జల్దపార (ఖడ్గమృగాల సంరక్షణ కేంద్రం) 2) నిమోరా (పెద్దపులి సంరక్షణ కేంద్రం) 4. కర్ణాటక: 1) రంగన్ తిట్టూ 2) బన్నార్ గట్టి (సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం) 3) బందీపూర్ 5. మహారాష్ట్ర: 1) బోర్విల్లీ (అరిచే జింకల సంరక్షణ కేంద్రం). దీన్ని సంజయ్‌గాంధీ నేషనల్ పార్కు అని కూడా అంటారు. 2) నవగావ్ 6. గుజరాత్: 1) ససన్గిర్ (ఆసియా సింహాలను సంరక్షిస్తున్నారు) 2) వైల్డ్ యాస్ పార్కు (కంచర గాడిదల సంరక్షణ కేంద్రం) 3) గిర్ నేషనల్ పార్కు 7. రాజస్థాన్: 1) డిజర్‌ట 2) కియోల్దేవ్ ఘనా/ భరత్పూర్ (సైబీరియన్ కొంగల సంరక్షణ కేంద్రం) 8. మధ్యప్రదేశ్: 1) శివపురి 2) మాధవ్ 9. అసోం: 1) కజిరంగా (1905లో లార్డ కర్జన్ ఏర్పాటు చేశాడు. ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణ కేంద్రం) 2) దిబ్రూ సైకోవా గతంలో అడిగిన ప్రశ్నలు 1. బక్సార్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? (డిప్యూటీ జైలర్‌స-2012) 1) రాజస్థాన్ 2) మధ్యప్రదేశ్ 3) బీహార్ 4) పశ్చిమ బెంగాల్ 2. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ‘ఘన’ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది? (ఎస్.ఐ. -2012) 1) ఒడిశా 2) కర్ణాటక 3) రాజస్థాన్ 4) పశ్చిమ బెంగాల్ 3. బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది? (ఎస్.ఐ. -2011) 1) మధ్యప్రదేశ్ 2) రాజస్థాన్ 3) బీహార్ 4) ఒడిశా 5) ఉత్తరప్రదేశ్ 4. రాజాజీ జాతీయ పార్కుగా పేరు పొందిన పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? (ఎస్.ఐ. -2011) 1) ఉత్తరాఖండ్ 2) మధ్యప్రదేశ్ 3) రాజస్థాన్ 4) బీహార్ 5) జమ్మూ - కాశ్మీర్ 5. {Mూర ప్రాణుల సంరక్షణ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? (ఎస్.ఐ. -2011) 1) 1970 2) 1974 3) 1968 4) 1980 5) 1972 సమాధానాలు 1) 4; 2) 3; 3) 1; 4) 1; 5) 5. -
స్పెషల్ 26...
రవితేజ తొలిసారిగా ఓ హిందీ సినిమా రీమేక్‌లో నటించడానికి పచ్చజెండా ఊపినట్టుగా తెలిసింది. ఆ చిత్రం పేరు ‘స్పెషల్ 26’. అక్షయ్‌కుమార్ కెరీర్లో మంచి హిట్‌గా నిలిచిపోయిన సినిమా అది. విభిన్న కథాంశంతో రూపొందిన ఆ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ దక్కించుకున్నారు. తెలుగులో ఆ చిత్రానికి ఎవరు సరిపోతారా అని ఆలోచిస్తే, త్యాగరాజన్‌కు తొలుత తట్టిన పేరు రవితేజ. అక్షయ్‌కుమార్, రవితేజల శారీరక భాష దాదాపు ఒకే రీతిలో ఉంటుంది. ఇద్దరూ మాస్ ఎంటర్టైనర్లు చేయడంలో సిద్ధహస్తులు. ఈ నేపథ్యంలో త్యాగరాజన్, రవితేజను సంప్రదిస్తే ఆయన కూడా ఓకే చెప్పారని సమాచారం. రవితేజకు రీమేక్స్ చేయడం కొత్త కాదు కానీ, హిందీ రీమేక్ చేయడం మాత్రం ఇదే ప్రథమం. రవితేజ ఇమేజ్‌కి అనుగుణంగా తెలుగు చిత్రంలో పలు వాణిజ్య అంశాలను జోడించనున్నారట. రవితేజ ప్రస్తుతం ‘కిక్-2’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘బెంగాల్ టైగర్’ ఆరంభమవుతుంది. ఆ తర్వాత ‘స్పెషల్ 26’ సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం. -
బెంగాల్ టైగర్ సరసన!
మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా రంగప్రవేశం చేసి, పదేళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించిన తమన్నా ఒక్క రవితేజతో మాత్రమే నటించలేదు. వచ్చే ఏడాది ఈ మాస్ హీరోతో తెరపై కనిపించనున్నారామె. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘బెంగాల్ టైగర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఫిబ్రవరిలో ఆరంభం కానుంది. ఈ సినిమా గురించి తమన్నా చెబుతూ - ‘‘రవితేజతో మొదటిసారి నటించనున్నా. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ‘రచ్చ’ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే చేశానని రవితేజ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు మీడియమ్ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన నాకు రవితేజ డేట్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నా’’ అన్నారు. రవితేజ ఎనర్జీకి తగ్గ కథ ఇదని సంపత్ నంది తెలిపారు. -
సఫారీ కేంద్రాలు...
పిల్లలు ప్రకృతిలో త్వరగా మమేకం అవుతారు. పిల్లి, కుక్క, ఆవు, గేదె.. అంటేనే అమితమైన ఆసక్తి కనబరుస్తారు. అలాంటిది వేల రకాల పక్షులు, ఎన్నడూ చూడని పులులు, ఏనుగులు, జిరాఫీలు, జింకలు.. పుస్తకాల్లో చూసినవి కళ్ల ముందు కనిపిస్తుంటే ఎగిరి గంతేస్తారు. ప్రపంచాన్ని మర్చిపోయి విహరిస్తారు. పిల్లల పండగైన నేడు మన దగ్గరలోనే ఉన్న సఫారీ కేంద్రాలకు తీసుకెళితే వారి సంబరం వెయ్యింతలు అవుతుంది. హైదరాబాద్‌లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ 360 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో 100 రకాల పక్షులు, ఖడ్గమృగం, సింహం, బెంగాల్ టైగర్, చిరుత, అడవిదున్న, ఏనుగు, కొండచిలువ, జింకలు, ఎలుగు.. ఇతర వన్యప్రాణులెన్నో ఉన్నాయి. ఈ ఉద్యానం బాలలకు విజ్ఞాన విహారకేంద్రంగా ఉపయోగపడుతుంది. మ్యూజియాన్ని చుట్టి వచ్చేందుకు టాయ్ ట్రైన్ ఇందులో అందుబాటులో ఉంది. సికింద్రాబాద్ బస్‌స్టేషన్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూ పార్క్‌కు బస్సు సదుపాయాలు ఉన్నాయి. సోమవారం మినహా అన్ని రోజులు సందర్శన. ఉదయం 9:00- సాయంత్రం 5:00 వరకు. దగ్గరలో.. విమానాశ్రయం.. 11.1 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్: 9.7 కి.మీ, కాచిగూడ రైల్వే స్టేషన్ : 7.కి.మీ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 140 కి.మీ దూరంలో శ్రీశైలం వెళ్లేదారిలో ఉంది ఫర్హాబాద్ టైగర్ రిజర్వ్ పాయింట్. మన్ననూరు మెయిన్ రోడ్డు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వ్యూ పాయింట్‌కి అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన జీపులలో వెళ్లాల్సి ఉంటుంది. మార్గమధ్యలో అందమైన పక్షులు, జింకలు, కోతులను చూస్తూ వెళ్లవచ్చు. 200 అడుగుల లోతున ఉండే లోయ ప్రాంతం (వ్యూ పాయింట్) మాటలకందని అద్భుతంగా కళ్లకు కడుతుంది. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ పాయింట్ నాగార్జున సాగర్- శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ‘నాగార్జున సాగర్- శ్రీశైలం- హైదరాబాద్’టూరు ప్యాకేజీలో భాగంగా ఫర్హాబాద్ టైగర్ రిజర్వ్ పాయింట్ ను చూడవచ్చు. వివరాలకు: టోల్‌ఫ్రీ నెం: 1800 42545454 సం్రపదించవచ్చు. విశాఖపట్టణంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ దేశంలోని మూడవ అతి పెద్ద ఉద్యానం. 625 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానంలో 80 నుంచి 800 జాతుల వన్యప్రాణులు ఉన్నాయి. రైల్వేస్టేషన్‌కు 7.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉద్యానంలో తెల్ల పులి, ఎలుగుబంటి, అడవిదున్న, జింకలు, మొసళ్ళతో పాటు రకరకాల అందమైన పక్షులు కనువిందు చేస్తాయి. ఈ ఉద్యానానికి దగ్గర ప్రాంతాలు: రుషికొండ బీచ్ .. 4.6 కి.మీ ఫోర్ట్ ఏరియా ... 9.7 కి.మీ విమానాశ్రయం .. 16.1 కి.మీ రైల్వే స్టేషన్ ... 7.7 కి.మీ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ 5,532 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండి ఆసియాలో రెండవ అతిపెద్ద ఉద్యానంగా పేరుగాంచింది. ఇందులో ఎనుగులు, జింకలు, తెల్ల పులులు, కొండచిలువలు, జిరాఫీ.. మొదలైన జంతువులు, వందల రకాల పక్షులు ఉన్నాయి. ఈ ఉద్యానానికి వలస పక్షులైనా ఫ్లెమింగోలు, పెలికాన్స్ వస్తుంటాయి. చలికాలంలో ఉదయం 9:00 గం.-సాయంకాలం 5:00 గం.ల వరకు. ఈ ఉద్యానానికి దగ్గరి ప్రాంతాలు: తిరుపతి... 6.5 కి.మీ గుర్రం కొండ కోట .. 6.5 కి.మీ. తిరుపతి విమానాశ్రయం - 19.5 కి.మీ రేణిగుంట రైల్వే స్టేషన్ - 16.1 కి.మీ -
హేలీ.. రెండు పెంపుడు పులులు!
పులితో కలసి హాయిగా నిద్రపోతున్న ఈమె పేరు జేనిస్ హేలీ. ఫ్లోరిడాలోని ఓర్లాండో నివాసి. సాధారణంగా చాలామంది ఏ కుక్కనో, పిల్లినో పెంచుకుంటారు. కానీ హేలీ మాత్రం ఏకంగా పులులను పెంచుకుంటున్నారు. జండా అనే ఈ ఆడ బెంగాల్ టైగర్‌తోపాటు సబర్ అనే మగ తెల్లపులి కూడా ఈమె ఇంట్లో ఉంది. ఈ రెండు వ్యాఘ్రాల కోసం 57 ఏళ్ల హేలీ తన పెరట్లో అన్ని ఏర్పాట్లూ చేశారు. రోజూ వాటి పనులన్నీ స్వయంగా చూసుకుంటారు. తిండి తినిపించడం దగ్గర నుంచి నిద్రపుచ్చడం వరకు అన్నీ చేస్తారు. అడ్మిన్ అసిస్టెంట్‌గా పనిచేసిన హేలీ.. 20 ఏళ్ల క్రితం తన ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేసి పులుల శిక్షణ కోర్సులో చేరారు. రెండేళ్ల తర్వాత చ ప్ఫర్ అనే పులి పిల్లను ఇంటికి తీసుకొచ్చి పెంచుకోవడం ప్రారంభించారు. 2002లో దానికి జతగా జండాను తీసుకొచ్చారు. 2007లో చప్ఫర్ చనిపోవడంతో రెండు వారాల వయసున్న సబర్‌ను జండాకు పరిచయం చేశారు. ప్రస్తుతం జండా వయసు 12 ఏళ్లు. ఈ రెండు బెంగాల్ వ్యాఘ్రాలు ఆ ఇంట్లో చేసే అల్లరి అంతా ఇంతా కాదండోయ్. హేలీ పెంపుడు కుక్కతో కూడా ఇవి ఆడుకుంటాయి. ఇక హేలీకి, వీటితో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేం. అంతగా ఇవి రెండూ ఆమెతో కలిసిపోయాయి.