
ఫుల్ ఎనర్జీ
రవితేజ అంటేనే మాస్ మహరాజా. ఆయన ఏ తరహా సినిమా చేసినా మాస్ అంశాలు నిబిడీకృతమై ఉండాల్సిందే. ‘రచ్చ’ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ, తమన్నాపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు వీవీ వినాయక్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ - ‘‘రవితేజ చిత్రాలు ఎనర్జిటిక్‌గా ఉంటాయి. ఈ చిత్రం కూడా ఆ తరహాలో ఫుల్ ఎనర్జీతో సాగే కమర్షియల్ ఎంటర్‌టైనర్. మార్చి 2 నుంచి చిత్రీకరణ మొదలుపెట్టి, సెప్టెంబర్ లేక అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు.
తమన్నా మాట్లాడుతూ - ‘‘రవితేజ సరసన ఎప్పుట్నుంచో ఓ చిత్రం చేయాలనుకుంటున్నాను. ఈ చిత్రంతో అది నెరవేరింది. ‘రచ్చ’ తర్వాత మళ్లీ సంపత్ నంది దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. బొమన్ ఇరానీ, నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్, ఎడిటింగ్: గౌతంరాజు, లైన్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్. కుమార్.