అన్నిటికీ సిద్ధపడే వచ్చాను!
‘‘మంచి స్టోరీ, మంచి కాంబినేషన్ కుదిరితే సినిమా చిన్నదా, పెద్దదా అని చూడను. ఏ సినిమా అయినా తీస్తాను. ఏ చిత్రం నిర్మించినా అది అందరికీ నచ్చేలా ఉండాలనుకుంటాను’’ అని నిర్మాత కేకే రాధామోహన్ అన్నారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘బెంగాల్ టైగర్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని రాధామోహన్ అన్నారు. మరిన్ని విశేషాలను ఈ విధంగా తెలియజేశారు.
‘బెంగాల్ టైగర్’ రెండు రాష్ట్రాల్లోనూ సూపర్ హిట్ టాక్‌తో నడుస్తోంది. రవితేజ కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ సాధించింది. ఈ సినిమాతో సంపత్ నంది హ్యాట్రిక్ సాధించారు. ఇందులో హీరో పాత్ర కొత్తగా ఉంటుంది. వందలాది కథలు సృష్టించలేం. కాన్సెప్ట్ పాతదైనా ఎంత కొత్తగా, ఆసక్తికరంగా చెప్పామనేది ముఖ్యం. ఈ సినిమా స్క్రీన్‌ప్లే కొత్తగా ఉన్నందువల్లే అందరికీ నచ్చింది. ‘కిక్-2’ మీద భారీ అంచనాలు నెలకొనడంతో కాస్త నిరాశపరిచింది. ఆ చిత్రం విడుదలకు ముందే మా ‘బెంగాల్ టైగర్’ బిజినెస్ అయ్యుంటే కలిసొచ్చేది. కానీ అలా జరగలేదు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ తక్కువ రేట్ ఇచ్చి ఈ సినిమా కొనుకున్నారు. అయితే, ఈ చిత్రవిజయం మీద మేం ముందు నుంచీ నమ్మకంగా ఉన్నాం. ఆ నమ్మకం నిజమైంది.
విచిత్రం ఏంటంటే, నేను ఇప్పటివరకూ తీసిన సినిమాల పరిస్థితి దాదాపు ఇంతే. వాళ్ల ముందు సినిమా ఫ్లాప్ కావడం, దాని ప్రభావం నేను తీసే సినిమా మీద పడటం జరుగుతుంది. అయితే, నా సినిమా సక్సెస్ కావడం వల్ల తర్వాతి చిత్రనిర్మాతలు హ్యాపీగా ఉంటారు. ‘బెంగాల్’ టైగర్‌ని అక్టోబర్‌లోనే విడుదల చేయాల్సి ఉంది. కానీ పరిశ్రమలో అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో మాది పెద్ద సినిమా అయినా విడుదలను వాయిదా వేశాం. దీపావళి టైంలో రిలీజ్ చేద్దామనుకున్నా, రెండు పెద్ద సినిమాలు ఒకే డిస్ట్రిబ్యూటర్ కొనడంతో మా సినిమా విడుదలను వాయిదా వేశాం. అయినా డిసెంబరు 10 కరెక్ట్ టైమ్ అనిపిస్తోంది. నవంబరు 5న రిలీజ్ చేసుంటే అప్పుడు చెన్నైలో, నెల్లూరులో ఉన్న భారీ వర్షాల కారణంగా వసూళ్లకు దెబ్బపడేది.
{పస్తుతం సినిమా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. హై రిస్క్, హై ఇన్వెస్ట్‌మెంట్. సినిమాకి పెట్టే పెట్టుబడి పోతుందనుకునే నిర్మాణం మొదలుపెడతాను. రిస్క్ అని తెలుసు. అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికొచ్చాను. ప్యాషన్‌తో సినిమాలు తీస్తున్నా. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నెలలో మూడు వారాల పాటు ఇక్కడే ఉంటాను. అన్నీ నా కంట్రోల్‌లో ఉండేలా చూసుకుంటాను. టెక్నాలజీ పెరగడం వల్ల ఎక్కడ ఉన్నా ప్రొడక్షన్ వ్యవహారాలను చాలా ఈజీగా మానిటర్ చేయగలుగుతున్నా. ప్రస్తుతం కొన్ని చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. జనవరిలో ప్రకటిస్తాను.