సఫారీ కేంద్రాలు...
పిల్లలు ప్రకృతిలో త్వరగా మమేకం అవుతారు. పిల్లి, కుక్క, ఆవు, గేదె.. అంటేనే అమితమైన ఆసక్తి కనబరుస్తారు. అలాంటిది వేల రకాల పక్షులు, ఎన్నడూ చూడని పులులు, ఏనుగులు, జిరాఫీలు, జింకలు.. పుస్తకాల్లో చూసినవి కళ్ల ముందు కనిపిస్తుంటే ఎగిరి గంతేస్తారు. ప్రపంచాన్ని మర్చిపోయి విహరిస్తారు. పిల్లల పండగైన నేడు మన దగ్గరలోనే ఉన్న సఫారీ కేంద్రాలకు తీసుకెళితే వారి సంబరం వెయ్యింతలు అవుతుంది.
హైదరాబాద్‌లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ 360 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో 100 రకాల పక్షులు, ఖడ్గమృగం, సింహం, బెంగాల్ టైగర్, చిరుత, అడవిదున్న, ఏనుగు, కొండచిలువ, జింకలు, ఎలుగు.. ఇతర వన్యప్రాణులెన్నో ఉన్నాయి. ఈ ఉద్యానం బాలలకు విజ్ఞాన విహారకేంద్రంగా ఉపయోగపడుతుంది. మ్యూజియాన్ని చుట్టి వచ్చేందుకు టాయ్ ట్రైన్ ఇందులో అందుబాటులో ఉంది. సికింద్రాబాద్ బస్‌స్టేషన్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూ పార్క్‌కు బస్సు సదుపాయాలు ఉన్నాయి. సోమవారం మినహా అన్ని రోజులు సందర్శన. ఉదయం 9:00- సాయంత్రం 5:00 వరకు. దగ్గరలో.. విమానాశ్రయం.. 11.1 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్: 9.7 కి.మీ, కాచిగూడ రైల్వే స్టేషన్ : 7.కి.మీ
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 140 కి.మీ దూరంలో శ్రీశైలం వెళ్లేదారిలో ఉంది ఫర్హాబాద్ టైగర్ రిజర్వ్ పాయింట్. మన్ననూరు మెయిన్ రోడ్డు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వ్యూ పాయింట్‌కి అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన జీపులలో వెళ్లాల్సి ఉంటుంది. మార్గమధ్యలో అందమైన పక్షులు, జింకలు, కోతులను చూస్తూ వెళ్లవచ్చు. 200 అడుగుల లోతున ఉండే లోయ ప్రాంతం (వ్యూ పాయింట్) మాటలకందని అద్భుతంగా కళ్లకు కడుతుంది. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ పాయింట్ నాగార్జున సాగర్- శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ‘నాగార్జున సాగర్- శ్రీశైలం- హైదరాబాద్’టూరు ప్యాకేజీలో భాగంగా ఫర్హాబాద్ టైగర్ రిజర్వ్ పాయింట్ ను చూడవచ్చు. వివరాలకు: టోల్‌ఫ్రీ నెం: 1800 42545454 సం్రపదించవచ్చు.
విశాఖపట్టణంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ దేశంలోని మూడవ అతి పెద్ద ఉద్యానం. 625 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానంలో 80 నుంచి 800 జాతుల వన్యప్రాణులు ఉన్నాయి. రైల్వేస్టేషన్‌కు 7.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉద్యానంలో తెల్ల పులి, ఎలుగుబంటి, అడవిదున్న, జింకలు, మొసళ్ళతో పాటు రకరకాల అందమైన పక్షులు కనువిందు చేస్తాయి.
ఈ ఉద్యానానికి దగ్గర ప్రాంతాలు:
రుషికొండ బీచ్ .. 4.6 కి.మీ
ఫోర్ట్ ఏరియా ... 9.7 కి.మీ
విమానాశ్రయం .. 16.1 కి.మీ
రైల్వే స్టేషన్ ... 7.7 కి.మీ
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ 5,532 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండి ఆసియాలో రెండవ అతిపెద్ద ఉద్యానంగా పేరుగాంచింది. ఇందులో ఎనుగులు, జింకలు, తెల్ల పులులు, కొండచిలువలు, జిరాఫీ.. మొదలైన జంతువులు, వందల రకాల పక్షులు ఉన్నాయి. ఈ ఉద్యానానికి వలస పక్షులైనా ఫ్లెమింగోలు, పెలికాన్స్ వస్తుంటాయి. చలికాలంలో ఉదయం 9:00 గం.-సాయంకాలం 5:00 గం.ల వరకు.
ఈ ఉద్యానానికి దగ్గరి ప్రాంతాలు:
తిరుపతి... 6.5 కి.మీ
గుర్రం కొండ కోట .. 6.5 కి.మీ.
తిరుపతి విమానాశ్రయం - 19.5 కి.మీ
రేణిగుంట రైల్వే స్టేషన్ - 16.1 కి.మీ