
అడవి జంతువులకంటే.. జంతు ప్రదర్శనశాలలోనే పుట్టి.. ఇక్కడే పెరిగిన ఆనేక జంతువులు తమ జీవితకాలంటే ఎక్కువగా జీవిస్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్: వేళకు తిండి..సేద తీరేందుకు ఆవాసం ఉంటే ఏ జీవి అయినా పదికాలాలు బాగా ఉంటుందనే సామెత మన జూ పార్కులోని జంతువులకు సరిగ్గా సరిపోతుంది. అడవి జంతువులకంటే.. జంతు ప్రదర్శనశాలలోనే పుట్టి.. ఇక్కడే పెరిగిన ఆనేక జంతువులు తమ జీవితకాలంటే ఎక్కువగా జీవిస్తున్నాయి. పోషకాహారం.. అలనాపాలన బాగుండడంతో ఈ జీవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతున్నాయి.
అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు వయోభారంతో వేటను కొనసాగించలేవు. ఒంట్లో సత్తువ తగ్గడం.. ఇతర ప్రాణులతో పోటీపడలేక ఆకలితో అలమటిస్తాయి. నీరసంతో కన్నుమూస్తాయి. అదే జూలో అయితే.. సహజసిద్ధమైన ఆహారానికి కొరత ఉండదు. బలవర్ధకమైన ఆహారం.. సప్లిమెంట్లు, ఆనారోగ్యానికి గురైతే ఔషధాలు అందిస్తుండడంతో ఈ ప్రాణుల జీవనకాలం పెరుగుతుందని జూ క్యూరేటర్ రాజశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. జూలో వేట లేదు, ఇతర జంతువులతో పోరాటాలు ఉండకపోవడం కూడా వీటి జీవితకాలం పెరగడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అడవిలో పెరిగే జంతువులకంటే అధికకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కొ న్ని జంతువుల వివరాలు మీ కోసం...
ఆహార ఆవసరాలకు అనుగుణంగా డైట్
జూలో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. వాటి ఆహార అవసరాలకు అనుగుణంగా పోషకాలతో కూడిన ఆహారం అందిస్తాం. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటిస్తాం. ఒక్కో వన్యప్రాణి ఒక్కోతీరుగా ఆహారం తీసుకుటుంది. సమయం, సరిపడా మోతాదులో ఆహారం అందజేస్తాం.ఆడవుల్లో ఉండే వన్యప్రాణుల కంటే జూలో ఉంటున్న వన్యప్రాణుల వయో పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటికి ఆహారం సమయానికి అందుతుంది. రోగాల బారినపడకుండా చూసుకుంటాం.
– డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం, జూ డిప్యూటీ డైరెకర్ట్ (వెటర్నరీ)
ఆపర్ణ (బెంగాల్ టైగర్)
పుట్టినరోజు : డిసెంబర్ 3, 2001
వయసు : 20 ఏళ్లు
సగటు జీవితకాలం : 15 ఏళ్లు
జిరాఫీ ( సునామీ బసంత్)
పుట్టినరోజు : ఫిబ్రవరి 13, 2005
వయసు : 17 ఏళ్లు
సగటు జీవితకాలం : 15 ఏళ్లు
కునాల్, సమీరా (తెల్లపులులు)
పుట్టినరోజు : సెప్టెంబర్ 9, 2006
వయసు : 16 ఏళ్లు
సగటు జీవితకాలం : 12–15 ఏళ్లు
సులేమాన్ (జాగ్వార్)
పుట్టినరోజు : ఏప్రిల్ 5, 1998
వయసు : 24 ఏళ్లు
సగటు జీవితకాలం : 20 ఏళ్లు
బారసింగా (చిత్తడి జింక)
పుట్టినరోజు : 27, ఏప్రిల్ 2005
వయసు : 17 ఏళ్లు
సగటు జీవితకాలం : 12 ఏళ్లు
ఎలుగుబంటి
పుట్టినరోజు : ఫిబ్రవరి 18, 2001
వయసు : 20 ఏళ్లు
సగటు జీవితకాలం : 15 ఏళ్లు
30 ఏళ్ల నుంచి
పక్షుల్లో కూడా హరన్‌బెల్ పక్షి, తెల్ల కొకాటో పక్షి వయస్సు కూడా దాదాపు 30 ఏళ్లు ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 20–25 ఏళ్లు వరకు ఈ సంతతి పక్షులు జీవిస్తాయి. (క్లిక్ చేయండి: డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!)