సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఆహ్లాదాన్ని అందించే జాతీయ పార్కులు కలుషిత కాటుకు గురవుతున్న వైనంపై పీసీబీ సీరియస్‌గా దృష్టి సారించింది. నగరంలోని కేబీఆర్‌పార్కు, జూపార్క్ సహా మహవీర్ హరిణ వనస్థలి తదితర జాతీయ ఉద్యానవనాల్లో మురుగు నీరు చేరకుండా నిరోధించడంతోపాటు.. ప్రతి చుక్క నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు నిర్మించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఐఐసీలు నెలరోజుల్లోగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించింది.
హరిణ వనస్థలిలో కలుషిత కాటు ఇలా...
నగర శివార్లలో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహవీర్ హరిణ వనస్థలి జాతీయ పార్క్‌లోని సహజ సిద్ధమైన నీటికుంటలోకి ఆటోనగర్ పారిశ్రామిక వాడలోని ఆటోగ్యారేజ్‌లు, భారీ వాహనాల సర్వీసింగ్ సెంటర్లు, ఫెస్టిలైజర్ గోడౌన్ల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థజలాలతో కాలుష్య కాసారంగా మారింది. దీంతో ఈ పార్క్‌లోని వన్యప్రాణులకు ముంపు పొంచి ఉండడంతో పీసీబీ అప్రమత్తమైంది. నీటినమూనాలు సేకరించి పరీక్షించగా.. కలుషిత ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో విధిగా ఎస్టీపీ నిర్మించాలని..శుద్ధి చేసిన నీటిని కేవలం గార్డెనింగ్ అవసరాలకే వినియోగించాలని సంబంధిత విభాగాలకు స్పష్టం చేసింది. మిగతా వ్యర్థజలాలను పైప్‌లైన్లను ఏర్పాటు చేసి మూసీలోకి మళ్లించాలని సూచించింది.
చుట్టూ సీసీటీవీల నిఘా తప్పనిసరి..
నగరంలో జాతీయ పార్క్‌లకు ఆనుకొని ఉన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థజలాలు ఉద్యానవనాల్లోకి చేరకుండా చూసేందుకు ఆయా వాడల్లో సీసీ టీవీలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని పీసీబీ టీఎస్‌ఐఐసీ, బల్దియాను ఆదేశించింది. వ్యర్థజ లాలను బహిరంగ ప్రదేశాలు, నాలాలు, చెరువులు, జాతీయ పార్కుల్లోకి వదిలిపెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఎస్టీపీల ఏర్పాటుతో ఉపయోగాలివే..
► జాతీయ పార్క్‌ల్లోకి చేరే మురుగు, వ్యర్థజలాలను శుద్ధి చేసిన తరవాతనే లోనికి ప్రవేశించే ఏర్పాటుచేయవచ్చు.
► శుద్ధిచేసిన నీటిని మొక్కల పెంపకం, గార్డెనింగ్ అవసరాలకు వినియోగించవచ్చు.
► ఆయా పార్క్‌లలోని చెరువులు, కుంటలు కాలుష్యకాసారం కాకుండా చూడవచ్చు.
► ఆయా ఉద్యానవనాల్లోకి కేవలం వర్షపునీరు మాత్రమే చేరే ఏర్పాట్లు చేయాలి.
► ప్లాస్టిక్, ఇతర ఘన వ్యర్థాలు పార్కుల్లోకి చేరకుండా నిరోధించాలి.
► జీవ వైవిధ్యాన్ని పరిరక్షణపై అన్ని వర్గాల్లో అవగాహన కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment