KBR National Park
-
Hyderabad: కేబీఆర్ నేషనల్ పార్కు స్థలం 8వ నిజాం రాజుదే..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్క్ ఒకప్పుడు ఎనిమిదో నిజాం ముకరం జా బహదూర్‌కు చెందినదిగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఇస్తాంబుల్ లో ఆయన కన్నుమూయగా మంగళవారం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన నేపథ్యంలో బంజారాహిల్స్‌తో ఆయనకున్న జ్ఞాపకాలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. బంజారాహిల్స్‌లో 400 ఎకరాల విస్తీర్ణంలో ముకరంజా 1940లో చిరాన్ ప్యాలెస్‌ను నిర్మించుకొని దానిని తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. ముకరంజా నిర్మించుకున్న చిరాన్ మసీదు ఇందులో రెండు సెల్లార్లు కూడా ఉన్నాయి. ప్రిన్స్ ఆడుకునేందుకు అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్ తో కూడిన బిలియర్డ్స్ గదులను నిర్మించారు. ఆయుధాలను భద్రపరిచే హాలు కూడా నిర్మించారు. మొదటి అంతస్తులు ఏడు బెడ్ రూములు ఉండగా భార్య పిల్లలతో ఇక్కడే ఉండేవారు. చిరాన్ ప్యాలెస్‌ను ఆనుకొని మోర్ బంగ్లా, గోల్ బంగ్లా, గుర్రాలు ఏనుగుల కోసం షెడ్లు, వాహనాలు భద్రపరిచేందుకు మోటార్ ఖానా ఉండేవి. అలాగే రాజు వాహనాల కోసం ప్రత్యేకంగా పెట్రోల్ బంకులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయం కోసం ప్రత్యేకంగా బావులు, చెరువులను తవ్వించారు. అయితే ముకరంజా ఎక్కువగా ఆ్రస్టేలియా, టర్కీ, లండన్ దేశాలలో ఉంటుండడంతో చిరాన్ ప్యాలెస్ అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలోనే 1998లోనే ఈ 400 ఎకరాల స్థలంలో నుంచి 360 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నేషనల్ పార్కుగా నోటిఫై చేసి దీనికి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు పెట్టింది. ఇది ఇలా ఉండగా ముకరంజాకు చెందిన చిరాన్ ప్యాలెస్ నిర్మితత 11 ఎకరాలు మాత్రం ఆయనకు కేటాయించారు. ప్రస్తుతం ఈ 11 ఎకరాల్లో ఉన్న చిరాన్ ప్యాలెస్ ఆయన ఆధీనంలోనే ఉన్నది. ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసి దీనిని సంరక్షిస్తున్నారు. కొద్ది దూరంలోనే రాజు ప్రార్థనలు చేసుకునేందుకు చిరాన్ మసీద్‌ను కూడా నిర్మించారు. 20 సంవత్సరాల క్రితం ఈ మసీదును ప్రార్థనల కోసం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు ముకరంజా కోరుకున్నట్టుగానే పార్కు లో నెమలుల సంఖ్య భారీగా పెరిగింది. చిరాన్ ప్యాలెస్ చుట్టూ నెమళ్లు నిత్యం సందడి చేస్తుంటాయి. పార్కులో చిరాన్ ప్యాలెస్ ఒక అద్భుతమైన కట్టడంగా మిగిలి ఉంది. ముకరంజా మరణంతో చిరాన్ ప్యాలెస్ నిర్వహణ మరింత క్లిష్టంగా మారనుంది. 2004లో చివరిసారిగా ముకరంజా హైదరాబాద్ పర్యటనలో భాగంగా చిరాన్ ప్యాలెస్ సందర్శించి మసీదులో ప్రార్థన నిర్వహించిన స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ప్యాలెస్‌లో ఇప్పటికీ విలువైన, అరుదైన వజ్రాభరణాలు, ఖరీదైన కళాఖండాలు ఉన్నట్లు సమాచారం. -
జాతీయ పార్కుల్లో ఎస్టీపీలు తప్పనిసరి.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఆహ్లాదాన్ని అందించే జాతీయ పార్కులు కలుషిత కాటుకు గురవుతున్న వైనంపై పీసీబీ సీరియస్‌గా దృష్టి సారించింది. నగరంలోని కేబీఆర్‌పార్కు, జూపార్క్ సహా మహవీర్ హరిణ వనస్థలి తదితర జాతీయ ఉద్యానవనాల్లో మురుగు నీరు చేరకుండా నిరోధించడంతోపాటు.. ప్రతి చుక్క నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు నిర్మించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీలు నెలరోజుల్లోగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించింది. హరిణ వనస్థలిలో కలుషిత కాటు ఇలా... నగర శివార్లలో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహవీర్ హరిణ వనస్థలి జాతీయ పార్క్‌లోని సహజ సిద్ధమైన నీటికుంటలోకి ఆటోనగర్ పారిశ్రామిక వాడలోని ఆటోగ్యారేజ్లు, భారీ వాహనాల సర్వీసింగ్ సెంటర్లు, ఫెస్టిలైజర్ గోడౌన్ల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థజలాలతో కాలుష్య కాసారంగా మారింది. దీంతో ఈ పార్క్‌లోని వన్యప్రాణులకు ముంపు పొంచి ఉండడంతో పీసీబీ అప్రమత్తమైంది. నీటినమూనాలు సేకరించి పరీక్షించగా.. కలుషిత ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో విధిగా ఎస్టీపీ నిర్మించాలని..శుద్ధి చేసిన నీటిని కేవలం గార్డెనింగ్ అవసరాలకే వినియోగించాలని సంబంధిత విభాగాలకు స్పష్టం చేసింది. మిగతా వ్యర్థజలాలను పైప్లైన్లను ఏర్పాటు చేసి మూసీలోకి మళ్లించాలని సూచించింది. చుట్టూ సీసీటీవీల నిఘా తప్పనిసరి.. నగరంలో జాతీయ పార్క్‌లకు ఆనుకొని ఉన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థజలాలు ఉద్యానవనాల్లోకి చేరకుండా చూసేందుకు ఆయా వాడల్లో సీసీ టీవీలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని పీసీబీ టీఎస్ఐఐసీ, బల్దియాను ఆదేశించింది. వ్యర్థజ లాలను బహిరంగ ప్రదేశాలు, నాలాలు, చెరువులు, జాతీయ పార్కుల్లోకి వదిలిపెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎస్టీపీల ఏర్పాటుతో ఉపయోగాలివే.. ► జాతీయ పార్క్‌ల్లోకి చేరే మురుగు, వ్యర్థజలాలను శుద్ధి చేసిన తరవాతనే లోనికి ప్రవేశించే ఏర్పాటుచేయవచ్చు. ► శుద్ధిచేసిన నీటిని మొక్కల పెంపకం, గార్డెనింగ్ అవసరాలకు వినియోగించవచ్చు. ► ఆయా పార్క్‌లలోని చెరువులు, కుంటలు కాలుష్యకాసారం కాకుండా చూడవచ్చు. ► ఆయా ఉద్యానవనాల్లోకి కేవలం వర్షపునీరు మాత్రమే చేరే ఏర్పాట్లు చేయాలి. ► ప్లాస్టిక్, ఇతర ఘన వ్యర్థాలు పార్కుల్లోకి చేరకుండా నిరోధించాలి. ► జీవ వైవిధ్యాన్ని పరిరక్షణపై అన్ని వర్గాల్లో అవగాహన కల్పించాలి. -
నిఘా నీడలో కేబీఆర్ పార్క్ వాక్‌వే..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో గతేడాది నవంబర్ 14న వాకింగ్ చేస్తున్న సినీనటి షాలూ చౌరాసియాపై కొమ్ము బాబు అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు. ఆ తర్వాత మరో ఘటనలోనూ మరో నిందితుడు వాకర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడి కోసం ఎంత గాలించినా ఆధారాలు లభించలేదు. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంటే నిందితుడి జాడ క్షణాల్లో తెలిసి ఉండేది. సీసీ కెమెరాలు అక్కడ లేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ► నాలుగేళ్ల క్రితం కేబీఆర్ పార్కులో నాటకారి నరసింహ అనే చైన్‌స్నాచర్ వాకింగ్ వచ్చిన మహిళల గొలుసులు తస్కరిస్తూ గోడ దూకి వాక్‌వే నుంచి పరారయ్యేవాడు. ఇలా అయిదుసార్లు స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితు డిని పట్టుకోవడానికి పోలీసులకు కష్టతరమైంది. ► ఓ సూడో పోలీస్ ఈ ఏడాది జనవరిలో ఓ ప్రేమ జంటను జీహెచ్ఎంసీ వాక్‌వేలో బెదిరించి తాను పోలీసునని అడిగినంత ఇవ్వకపోతే ఫొటోలు బయటపెడతానని వారిని బెదిరించారు. తన బైక్‌పై ప్రేమికుడిని కూర్చుండబెట్టుకొని అమీర్‌పేట్‌కు వెళ్లి ఏటీఎంలో రూ.10 వేలు డ్రా చేయించి ఉడాయించాడు. ఆ సూడో పోలీసు గురించి ఆరా తీయగా అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో పోలీసులు పట్టుకోలేకపోయారు. .. నిత్యం వేలాది మంది వాకింగ్ చేసే కేబీఆర్ పార్కు వాక్‌వేలో జరిగిన ఉదంతాలివి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాకర్లు మూడేళ్లుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదు. తాజాగా కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఒక అడుగు ముందుకు పడింది. వాకర్లకు భద్రతను కల్పిస్తూ అసాంఘిక శక్తులకు, స్నాచర్లకు, ఆకతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీ కెమెరాలు ఒక్కటే మార్గమని భావించిన పోలీసులు పార్కు చుట్టూ 150 కెమెరాలకు శ్రీకారం చుట్టారు. ► మొదటి విడతగా 70 కెమెరాలు ఇప్పటికే బిగించారు. మొదటి విడతలో బిగించిన 70 కెమెరాలు త్వరలోనే ప్రారంభోత్సవానికి నోచుకోనున్నాయి. ఇక రెండో విడతలో ఇంకో 80 కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. మొదటి విడతలో ఏర్పాటు చేసిన 70 సీసీ కెమెరాలు కేబీఆర్ పార్కు ప్రధాన గేటు నుంచి అటు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఇటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వరకు ఏర్పాటు చేశారు. రెండో విడతలో బసవతారకం ఆస్పత్రి నుంచి జానారెడ్డి నివాసం, స్టార్‌బక్స్, సీవీఆర్ న్యూస్, బాలకృష్ణ నివాసం మీదుగా మంత్రి డెవలపర్స్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు 80 కెమెరాలు ఫిక్స్ చేస్తారు. వీటి ఏర్పాటుతో వాక్‌వే మొత్తం నిఘా నేత్రంలోకి వెళ్తుంది. (క్లిక్: అమ్నేషియా పబ్ కేసు.. మరీ ఇంత దారుణామా..?) జీహెచ్ఎంసీ వైఫల్యం... కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో వరుస సంఘటనలు జరుగుతున్నా జీహెచ్ఎంసీలో మాత్రం చలనం ఉండటం లేదు. పలుచోట్ల గేట్లు విరిగిపోయాయి. మరికొన్ని చోట్ల ఫెన్సింగ్ దొంగిలించారు. ఆరు నెలల క్రితం సంఘటన జరిగినప్పుడు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తీరా ఒక్క హామీ నెరవేరలేదు. కనీసం వాక్‌వేలో స్ట్రీట్‌లైట్లు కూడా చాలా చోట్ల వెలగడం లేదు. ఏదైనా ఘటన జరిగితే పోలీసులపైనే భారం పడుతుంది తప్పితే సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. (క్లిక్: అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం) -
ఎస్ఆర్డీపీని ఆపండి...కేబీఆర్‌ను రక్షించండి
పర్యావరణ వాదులు, వాకర్స్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘ఎస్ఆర్డీపీ ప్రాజెక్టును నిలిపేయండి.. కేబీఆర్ జాతీయ పార్క్‌ను రక్షించండి..’ ఇప్పుడు పర్యావరణవాదులు, వాకర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరిదీ ఇదే నినాదం! ఈ ప్రాజెక్టు పనులతో పార్కులోని అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొం డిగా ముందుకు వెళ్తోందని మండిపడుతున్నారు. సుమారు 400 ఎకరాల్లో విస్తరించిన కేబీఆర్ పార్కులో.. 500 అరుదైన వృక్షజాతులు, 120 అరుదైన పక్షి జాతులు, 20 క్షీరదజాతులు, సరీసృపాలు, ఉభయచరాలతోపాటు వందలాది కీటకజాతులు ఉన్నాయి. వీటన్నింటి కలయికతో పార్కు జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన ఎస్ఆర్డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్)తో పార్క్‌లోని రమణీయ దృ శ్యాలు, పక్షులు, సీతాకోక చిలుకలు, ఇతర జీవజాలం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుం దన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చెట్లు కొట్టివేయడం అవివేకం నగరంలో కాలుష్య భూతం పెరుగుతున్న తరుణంలో ఉన్న చెట్లను నరికివేయడం అవివేకం. గ్రేటర్ పరిధిలో 33 శాతం హరితం పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎస్‌ఆర్‌డీపీపై చూపే ఉత్సాహం చెట్లు నాటడంలో చూపాలి. - జీవానందరెడ్డి, ఫోరం ఫర్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ పక్షి జాతులకు ముప్పు నగరం నడిబొడ్డున స్థానికులు, వాకర్స్‌కు ప్రాణవాయువును అందించే పార్కు ఇదొక్కటే. ఈ పార్కును విధ్వంసం చేస్తూ ఎస్ఆర్డీపీ పనులను చేపడితే అరుదైన పక్షి జాతులు, వృక్ష జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. - అంబిక, హైదరాబాద్ రైజింగ్ సంస్థ ప్రతినిధి పార్కును పరిరక్షించాల్సిందే ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు పనుల నుంచి కేబీఆర్ పార్కును మినహాయించాలి. పార్కు పరిరక్షణ విషయంలో అందరం ముందుంటాం. ప్రభుత్వం మొండిగా ముందుకె ళ్తే పార్కు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. - మహేశ్, వ్యాపారి జీవవైవిధ్యం దెబ్బతింటుంది పార్కు వద్ద ఎస్ఆర్డీపీ పనులతో పార్కులో జీవవైవిధ్యం దెబ్బతింటుంది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ఈ పార్కు స్థానికులకు ఎంతో మానసిక ఉల్లాసాన్నిస్తోంది. -ప్రీతి, గృహిణి ఎస్ఆర్డీపీతో ట్రాఫిక్ తగ్గదు బహుళ అంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గదు. పలు అభివృద్ధి చెందిన నగరాల్లోనూ ఇదే విషయం నిరూపితమైంది. స్మార్ట్ సిటీ అంటే నగరంలో ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేయాలి. వాక్‌వేస్‌ను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లడం దారుణం. - కాజల్ మహేశ్వరి, పర్యావరణ నిపుణులు పచ్చదనం తగ్గిపోతోంది ఇప్పటికే నగరంలో పచ్చదనం కనుమరుగవుతోంది. ఇక్కడి పచ్చదనాన్ని మాయం చేస్తూ ఎస్ఆర్డీపీ పనులు చేపట్టడం అవివేకం. తక్షణం పనులు నిలిపివేయాలి. - ఎస్.ఎం.రెడ్డి, వాకర్ పర్యావరణాన్ని నాశనం చేయడమే కాంక్రీట్ నిర్మాణాలతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. వాక్‌వేను తొలగించి చేపట్టే పనులతో ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. పార్కులోని జంతుజాలం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. -అనిత, పర్యావరణవాది -
'కేబీఆర్ పార్క్' పాస్‌ల జారీకి దరఖాస్తులు ఆహ్వానం
బంజారాహిల్స్ (హైదరాబాద్) : బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని కేబీఆర్ నేషనల్ పార్కులో నూతనంగా జారీ చేయనున్న వార్షిక పాస్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేబీఆర్ పార్కు అటవీ శాఖ అధికారి మోహన్ శనివారం తెలిపారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం కింద పాస్‌లు జారీ చేయనున్నట్లు వివరించారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గంట పాటు కేబీఆర్ పార్కు మెయిన్‌గేటు వద్ద దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, వయసు ధృవీకరించే పత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రవేశ రుసుం సాధారణ ప్రజలకు అయితే రూ.1,500, సీనియర్ సిటిజన్లకు(60 ఏళ్లు పైబడినవారికి) రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తును వార్షిక పాస్ పొందదలచిన వారే తీసుకురావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.