సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్క్ ఒకప్పుడు ఎనిమిదో నిజాం ముకరం జా బహదూర్‌కు చెందినదిగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఇస్తాంబుల్ లో ఆయన కన్నుమూయగా మంగళవారం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన నేపథ్యంలో బంజారాహిల్స్‌తో ఆయనకున్న జ్ఞాపకాలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. బంజారాహిల్స్‌లో 400 ఎకరాల విస్తీర్ణంలో ముకరంజా 1940లో చిరాన్ ప్యాలెస్‌ను నిర్మించుకొని దానిని తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు.
ముకరంజా నిర్మించుకున్న చిరాన్ మసీదు
ఇందులో రెండు సెల్లార్లు కూడా ఉన్నాయి. ప్రిన్స్ ఆడుకునేందుకు అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్ తో కూడిన బిలియర్డ్స్ గదులను నిర్మించారు. ఆయుధాలను భద్రపరిచే హాలు కూడా నిర్మించారు. మొదటి అంతస్తులు ఏడు బెడ్ రూములు ఉండగా భార్య పిల్లలతో ఇక్కడే ఉండేవారు. చిరాన్ ప్యాలెస్‌ను ఆనుకొని మోర్ బంగ్లా, గోల్ బంగ్లా, గుర్రాలు ఏనుగుల కోసం షెడ్లు, వాహనాలు భద్రపరిచేందుకు మోటార్ ఖానా ఉండేవి. అలాగే రాజు వాహనాల కోసం ప్రత్యేకంగా పెట్రోల్ బంకులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయం కోసం ప్రత్యేకంగా బావులు, చెరువులను తవ్వించారు.
అయితే ముకరంజా ఎక్కువగా ఆ్రస్టేలియా, టర్కీ, లండన్ దేశాలలో ఉంటుండడంతో చిరాన్ ప్యాలెస్ అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలోనే 1998లోనే ఈ 400 ఎకరాల స్థలంలో నుంచి 360 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నేషనల్ పార్కుగా నోటిఫై చేసి దీనికి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు పెట్టింది. ఇది ఇలా ఉండగా ముకరంజాకు చెందిన చిరాన్ ప్యాలెస్ నిర్మితత 11 ఎకరాలు మాత్రం ఆయనకు కేటాయించారు. ప్రస్తుతం ఈ 11 ఎకరాల్లో ఉన్న చిరాన్ ప్యాలెస్ ఆయన ఆధీనంలోనే ఉన్నది. ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసి దీనిని సంరక్షిస్తున్నారు.
కొద్ది దూరంలోనే రాజు ప్రార్థనలు చేసుకునేందుకు చిరాన్ మసీద్‌ను కూడా నిర్మించారు. 20 సంవత్సరాల క్రితం ఈ మసీదును ప్రార్థనల కోసం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు ముకరంజా కోరుకున్నట్టుగానే పార్కు లో నెమలుల సంఖ్య భారీగా పెరిగింది. చిరాన్ ప్యాలెస్ చుట్టూ నెమళ్లు నిత్యం సందడి చేస్తుంటాయి. పార్కులో చిరాన్ ప్యాలెస్ ఒక అద్భుతమైన కట్టడంగా మిగిలి ఉంది.
ముకరంజా మరణంతో చిరాన్ ప్యాలెస్ నిర్వహణ మరింత క్లిష్టంగా మారనుంది. 2004లో చివరిసారిగా ముకరంజా హైదరాబాద్ పర్యటనలో భాగంగా చిరాన్ ప్యాలెస్ సందర్శించి మసీదులో ప్రార్థన నిర్వహించిన స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ప్యాలెస్‌లో ఇప్పటికీ విలువైన, అరుదైన వజ్రాభరణాలు, ఖరీదైన కళాఖండాలు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment