Nizam king
-
ముకరం జా అంతిమ సంస్కారాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో కన్నుమూసిన ఎనిమిదో నిజాం ముకరం జా అంతిమ సంస్కారాలు బుధవారం మక్కా మసీదు ప్రాంగణంలో జరగనున్నాయి. వీటి నేపథ్యంలో పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ జి.సుధీర్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 నుంచి అంతిమ సంస్కారాల తంతు పూర్తయ్యే వరకు ఓల్గా జంక్షన్, ముర్గీ చౌక్, చెలాపుర మహిళ ఠాణా, మిట్టీకా షేర్, మూసాబౌలి జంక్షన్, హిమ్మత్‌పుర జంక్షన్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోపక్క బుధవారం ఉప్పల్‌లో జరిగే భారత్–న్యూజిల్యాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. నగరంలోని వివిధ హోటళ్లలో బస చేసిన క్రికెటర్లు రోడ్డు మార్గంలో ఉప్పల్ వెళ్తున్నారు. వీరి రాకపోకల నేపథ్యంలో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల మధ్య సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట, రసూల్‌పురా, సీటీఓ, ఎస్బీఐ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, ఆలుగడ్డ బావి, మెట్టగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్ మార్గంలో కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. -
Hyderabad: కేబీఆర్ నేషనల్ పార్కు స్థలం 8వ నిజాం రాజుదే..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్క్ ఒకప్పుడు ఎనిమిదో నిజాం ముకరం జా బహదూర్‌కు చెందినదిగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఇస్తాంబుల్ లో ఆయన కన్నుమూయగా మంగళవారం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన నేపథ్యంలో బంజారాహిల్స్‌తో ఆయనకున్న జ్ఞాపకాలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. బంజారాహిల్స్‌లో 400 ఎకరాల విస్తీర్ణంలో ముకరంజా 1940లో చిరాన్ ప్యాలెస్‌ను నిర్మించుకొని దానిని తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. ముకరంజా నిర్మించుకున్న చిరాన్ మసీదు ఇందులో రెండు సెల్లార్లు కూడా ఉన్నాయి. ప్రిన్స్ ఆడుకునేందుకు అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్ తో కూడిన బిలియర్డ్స్ గదులను నిర్మించారు. ఆయుధాలను భద్రపరిచే హాలు కూడా నిర్మించారు. మొదటి అంతస్తులు ఏడు బెడ్ రూములు ఉండగా భార్య పిల్లలతో ఇక్కడే ఉండేవారు. చిరాన్ ప్యాలెస్‌ను ఆనుకొని మోర్ బంగ్లా, గోల్ బంగ్లా, గుర్రాలు ఏనుగుల కోసం షెడ్లు, వాహనాలు భద్రపరిచేందుకు మోటార్ ఖానా ఉండేవి. అలాగే రాజు వాహనాల కోసం ప్రత్యేకంగా పెట్రోల్ బంకులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయం కోసం ప్రత్యేకంగా బావులు, చెరువులను తవ్వించారు. అయితే ముకరంజా ఎక్కువగా ఆ్రస్టేలియా, టర్కీ, లండన్ దేశాలలో ఉంటుండడంతో చిరాన్ ప్యాలెస్ అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలోనే 1998లోనే ఈ 400 ఎకరాల స్థలంలో నుంచి 360 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నేషనల్ పార్కుగా నోటిఫై చేసి దీనికి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు పెట్టింది. ఇది ఇలా ఉండగా ముకరంజాకు చెందిన చిరాన్ ప్యాలెస్ నిర్మితత 11 ఎకరాలు మాత్రం ఆయనకు కేటాయించారు. ప్రస్తుతం ఈ 11 ఎకరాల్లో ఉన్న చిరాన్ ప్యాలెస్ ఆయన ఆధీనంలోనే ఉన్నది. ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసి దీనిని సంరక్షిస్తున్నారు. కొద్ది దూరంలోనే రాజు ప్రార్థనలు చేసుకునేందుకు చిరాన్ మసీద్‌ను కూడా నిర్మించారు. 20 సంవత్సరాల క్రితం ఈ మసీదును ప్రార్థనల కోసం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు ముకరంజా కోరుకున్నట్టుగానే పార్కు లో నెమలుల సంఖ్య భారీగా పెరిగింది. చిరాన్ ప్యాలెస్ చుట్టూ నెమళ్లు నిత్యం సందడి చేస్తుంటాయి. పార్కులో చిరాన్ ప్యాలెస్ ఒక అద్భుతమైన కట్టడంగా మిగిలి ఉంది. ముకరంజా మరణంతో చిరాన్ ప్యాలెస్ నిర్వహణ మరింత క్లిష్టంగా మారనుంది. 2004లో చివరిసారిగా ముకరంజా హైదరాబాద్ పర్యటనలో భాగంగా చిరాన్ ప్యాలెస్ సందర్శించి మసీదులో ప్రార్థన నిర్వహించిన స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ప్యాలెస్‌లో ఇప్పటికీ విలువైన, అరుదైన వజ్రాభరణాలు, ఖరీదైన కళాఖండాలు ఉన్నట్లు సమాచారం. -
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. అద్దె ఇంట్లో మరణించాడు
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన హైదరాబాద్ సంస్థానం 8వ నిజాం రాజు టర్కీలో అద్దె ఇంట్లో మరణించాడు. ఇస్తాంబుల్ నగరంలోని ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో జనవరి 14న మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజా బహదూర్ (89) కన్నుమూసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 1967లో కుబేరుడిగా ఉన్న ఆయన తన చివరి రోజుల్లో ఓ సామాన్యుడిలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 1971లో భారత ప్రభుత్వ రాజాభరణాలు రద్దు చేసేంత వరకు ‘ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్’గా ఉన్నారు. అత్యంత విలాసాలు, నలుగురు భార్యలు, పిల్లలో ఆస్తి వివాదాలతో ముకరంజా దివాళా తీశారు. ఆస్తులు అమ్మకుండా కోర్టు ఆంక్షలు విధించడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయి. 30 ఏళ్ల వయసులోనే 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు వారసుడైన ముకరంజా ఆ తర్వాత నిర్లక్ష్యం కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. కాగా ముకరంజా భౌతికకాయం మంగళవారం హైదరాబాద్ చేరుకుంటుందని నిజాంట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. తన అంతిమ సంస్కారాలను హైదరాబాద్ మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల వద్ద నిర్వహించాలన్న ఆయన కోరిక మేరకు పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనుమడే ముకరంజా. 1933 అక్టోబర్ 6న ఫ్రాన్స్‌లో ఆయన జన్మించారు. డెహ్రాడూన్‌లో పాఠశాల విద్య, లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1967లో 8వ అసఫ్ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం 1967లో ఎనిమిదవ నిజాంగా.. భారత యూనియన్‌లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్ 6, 1967లో ఎనిమిదవ అసఫ్ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా 1967 భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. కాగా, మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల ప్రాంగణంలో ముకరంజా ఖననం కోసం నిజాం ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న నిర్వహించే ముకరంజా అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు సోమవారం పరిశీలించారు. ముందుగా చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించిన అధికారుల బృందం సభ్యులు అక్కడ ఏర్పాట్లు పరిశీలించింది. ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో.. మంగళవారం ముకరంజా భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకు వచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించనున్నారు. 18న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చౌమహాల్లా ప్యాలెస్‌లో ఆయన పార్థివదేహాన్ని సందర్శించడానికి ప్రజలను అనుమతించనున్నారు. తర్వాత అంత్యక్రియలకోసం పార్థీవ దేహాన్ని తరలిస్తారు. -
చివరి నిజాం రాజు మనవడు కన్నుమూత.. స్పందించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం రాజు, అసఫ్ జాహీ వంశానికి చెందిన ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు మీర్ అలీ ఖాన్ ముకర్రం ఝా (నిజాం 8వ రాజు) మరణించారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. పార్థీవదేహాన్ని హైదరాబాద్ తీసుకువస్తారు. అంత్యక్రియలు మక్కా మసీదులో మంగళవారం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా 1933లో జన్మించారు. డెహ్రాడూన్, లండన్‌లో చదువుకున్నారు. 1971 వరకు ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్‌గా ఉన్నారు. 1980ల్లో ఈయన దేశంలోనే అత్యంత ధనవంతుడు కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ స్పందన ముకరం ఝా మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ముకర్రమ్ ఝా పార్థివ దేహం హైద్రాబాద్‌కు చేరుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్దారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్‌కు కేసీఆర్ సూచించారు. చదవండి: ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం -
మిగిలిన ఆ నిధులు వద్దు: ప్రిన్స్ ముఖరం
లండన్: నిజాం వారసుడు ప్రిన్స్ ముఖరం ఝా యూకేలో తమకు మిగిలి ఉన్న కొన్ని నిధులపై హక్కును కోల్పోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లండ్‌లోని ఒక హైకోర్టులో దీనికి సంబంధించి సాగుతున్న వ్యాజ్యం నుంచి తప్పుకోవాలని ముఖరం ఝా నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లోని ఒక బ్యాంక్‌లో ఉన్న నిధుల్లో తమకూ వాటా ఉందన్న ఆయన కుటుంబ సభ్యుల వాదనను బుధవారం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్స్ తరఫు న్యాయవాది పాల్ హ్యూవిట్ ప్రకటించారు. ఈ కేసు దాదాపు తన క్లయింట్ జీవిత కాలమంతా కొనసాగిందని, ఇకనైనా దీని నుంచి విముక్తిని ఆయన కోరుకున్నారని తెలిపారు. ఆ మిగిలిన నిధులను కుటుంబం లోని మొత్తం సభ్యులకు పంచాలని ఆయన ప్రతిపాదించారన్నారు. ఇందులో తన వారసత్వ హక్కును ఆయన కోల్పోవడానికి సిద్ధమయ్యారన్నారు. లండన్ బ్యాంక్‌లో ఉన్న సుమారు 3.5 కోట్ల పౌండ్లకు భారత ప్రభుత్వం, ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన సోదరుడు హక్కుదారులని 2019 అక్టోబర్‌లో అక్కడి కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నజాఫ్ అలీ ఖాన్, హిమాయత్ అలీ మీర్జా వేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు కొట్టివేసింది. -
మరోసారి కోర్టుకెక్కిన నిజాం వారసులు..
లండన్: ఏడవ నిజాం రాజు వారసులు మరోసారి లండన్ కోర్టు మెట్లెక్కారు. 35 మిలియన్ పౌండ్ల విషయంలో తలెత్తిన వివాదం వారిని మరోసారి కోర్టును ఆశ్రయించేలా చేసింది. గతేడాది 8 వ నిజాంకు ఆయన సోదరుడికి ఈ సంపద చెందుతుందని ఇంగ్లాండ్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా నిజాం ఎస్టేట్ కార్యనిర్వహణాధికారి నమ్మకద్రోహానికి పాల్పడ్డాడంటూ ఏడవ నిజాంకు చెందిన 116 మంది వారసుల తరపున నజఫ్ అలీఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నిధులను భారతదేశానికి సరిగ్గా విడుదల చేయలేదని ఖాన్ కోర్టుకు తెలిపారు. అదేవిధంగా ఇద్దరు యువరాజులు - ప్రిన్స్ ముఖరంఝా, అతని తమ్ముడు ముఫఖం ఝా దీర్ఘకాలిక ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి 2019లో తీర్పునిచ్చిన న్యాయమూర్తి స్మిత్ కేసును తిరిగి తెరవడాన్ని తోసిపుచ్చారు. ‘ఆ సంపదకు వారసులెవరో తీర్పు వెలువరిచాం. కేసును తిరిగి తెరవడానికి వారికి అర్హత లేదు. దీనిని అంగీకరించడం అసాధ్యం’ అని పేర్కొన్నారు. అయినప్పటికీ ఏడవ నిజాం ఎస్టేట్ నిర్వాహకుడి చేత అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలపై న్యాయస్థానం వాదనలు విననుంది. ముకర్రంజ పరివారం: భార్యలు: ఎస్త్రా(టర్కీ)హెలెన్, మనోలియా ఒనూర్, జమీల (మొరాకో), ఒర్చిడ్ (టర్కీ), వీరందరికీ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరంతా ఇప్పుడు టర్కీ, ఆస్ట్రేలియా, లండన్‌లో స్థిరపడ్డారు. ముఫకంజ: భార్య ఏసెస్(టర్కీ), పిల్లలు: రఫత్ జా, ఫర్హత్ జా వీరు కాకుండా నిజాం వారసులుగా మరో 3,600 మంది చలామణి అవుతున్నారు. ప్రస్తుతం ముకర్రంజ ఆస్ట్రేలియా, టర్కీలలో, ముఫకంజ లండన్, హైదరాబాద్‌లలో నివసిస్తున్నారు. అసలేం జరిగిందంటే: హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసే దిశగా భారత సైన్యాలు వస్తున్నాయన్న సమాచారంతో ఆరో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1948లో 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్ (సుమారు ఒక మిలియన్ పౌండ్లు)లను పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి బదిలీ చేశారు. అయితే ఈ నిధులపై అప్పటి నుంచి భారత్, పాకిస్తాన్‌లు న్యాయ పోరాటం చేస్తుండగా, ఇందులో నిజాం వారసులు ముకర్రంజ, ముఫకంజ కూడా నిధులు తమకే చెందుతాయంటూ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న బ్రిటన్ హైకోర్టు వచ్చే నెలలో తీర్పు ఇవ్వనుందని నిజాం వారసులు పేర్కొంటున్నారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌లో బ్యాంక్‌లో జమ అయిన నిధులు.. ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.304 కోట్లకు చేరాయి. ఈ నిధులు మావంటే, మావేనని ఇరు దేశాలు నాలుగున్నర దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాయి. 306 కోట్లకు చేరిన నిధులు.. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనానికి కొన్ని గంటల ముందు నాటి ఆర్థికమంత్రిగా పనిచేసిన మీర్ నవాజ్ ఝంగ్‌కు చెందిన హైదరాబాద్‌లోని ఎస్బీహెచ్ అకౌంట్ నుంచి రూ.3.5 కోట్లు (1,007,940 పౌండ్ల 9 షిల్లింగ్లు) లండన్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ రహమ తుల్లా అకౌంట్లోకి బదిలీ అయ్యాయి. భారత్‌లో హైదరాబాద్ విలీనం కావటం, ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్‌గా నియామకం అయ్యాక ఈ నిధులు తిరిగి తనకు పంపాలంటూ ఉస్మాన్ అలీఖాన్ పాకిస్తాన్‌ను కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న ఆ నిధులు, వడ్డీలు కలుపుకుని ప్రస్తుతానికి రూ.306 కోట్లకు చేరాయి. అయితే ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్ చేసిన వాదనను జస్టిస్ మార్కస్ స్మిత్ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు. భారత ప్రభుత్వం ఇంప్లీడ్.. ఈ నిధుల వివాదంపై పాకిస్తాన్‌తో న్యాయపరంగా కొట్లాడుతున్న నిజాం మనుమలు ముకర్రం ఝా, ముఫకం ఝాలకు మద్దతుగా 2013లో భారత ప్రభుత్వం లండన్ కోర్టులో ఇంప్లీడ్ అయింది. దీంతో పాకిస్తాన్ తన వాదనల వేగాన్ని పెంచి ‘భారత్ మాపై ఆక్రమణ చేస్తున్న సమయంలో ఆయుధాల కోసం నిజాం ఆ నిధుల్ని మాకు పంపారు.’ అని వాదనలను వినిపించినా.. కోర్టు కొట్టేసి నిధులను భారత్, నిజాం వారసులకు కేటాయించింది. అయితే ఈ విషయం సమసిపోయిందకున్న సమయంలో నిజాం వారసులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చదవండి: లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు -
నిజాం నిధులపై పాక్‌కు చుక్కెదురు
లండన్: 1948 నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో డిపాజిట్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుకు చెందిన 35 మిలియన్ పౌండ్ల (రూ. 306.5 వందల కోట్లు)పై దశాబ్దాలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రస్తుతానికి భారత్‌కు అనుకూలంగా ముగిసింది. ఆ నిధులపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదని యూకే హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అవి భారత్‌కు, నిజాం వారసులకే చెందాలని స్పష్టం చేసింది. 1948లో ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్ (సుమారు ఒక మిలియన్ పౌండ్లు)లను బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోని పాకిస్తాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికి అవి దాదాపు 35 మిలియన్ పౌండ్లకు చేరాయి. ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్ చేసిన వాదనను జస్టిస్ మార్కస్ స్మిత్ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు. ‘ఈ వివాదం ప్రారంభమైనప్పుడు నా క్లయింట్లు చిన్నపిల్లలు.. ఇప్పుడు వారి వయస్సు 80 ఏళ్లకు పైగానే. ఇప్పటికైనా, వారి జీవిత కాలంలోనే ఈ తీర్పు రావడం, అదీ వారికి అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది’అని నిజాం వారసుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పాల్ హెవిట్ వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా పాక్ రెండు వాదనలు వినిపించింది. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలుకు సంబంధించిన డబ్బును లండన్ బ్యాంక్‌లో ఏడవ నిజాం జమ చేశారని, అందువల్ల ఆ నిధులు తమకే చెందుతాయన్నది ఒక వాదన. భారత్‌కు ఆ నిధులు చెందకూడదనే ఉద్దేశంతోనే లండన్ బ్యాంక్‌కు బదిలీ చేశారన్నది రెండవ వాదన. అలాగే, భారత ప్రభుత్వ ఆధీనంలోకి రాకముందు నిజాం రాజ్యం ప్రభుత్వ హోదాలో ఆ నిధుల బదిలీ చేసిందని కూడా పాక్ వాదించింది. హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కూడా చట్టవ్యతిరేక చర్య అని పేర్కొంది. ఈ వాదనలన్నింటిని కోర్టు తోసిపుచ్చింది. పాక్ నుంచి ఆయుధాల కొనుగోలు నిజమే అని నమ్ముతున్నప్పటికీ.. ఈ నిధులు వాటికి సంబంధించినవే అనేది నిర్ధారణ కాలేదని పేర్కొంది. భారత్‌కు చెందకూడదనే నిధుల బదిలీ జరిగిందని భావించినా.. దానర్థం ఆ నిధులు ఏదో ట్రస్ట్‌కు కాకుండా పాకిస్తాన్‌కే చెందాలనేందుకు ఆధారాలు లేవంది. హైదరాబాద్ రాజ్యం భారత్‌లో కలిసిన విషయం ఈ కేసుకు అప్రస్తుతమని స్పష్టం చేసింది. ఆ నిధులను తిరిగి తనకు ట్రాన్స్ఫర్ చేయాలని ఆ తరువాత నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ కోరిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం, నిజాం వారసులు గత సంవత్సరం ఒక రహస్య ఒప్పందానికి రావడంతో.. ఈ కేసు భారత్– పాక్‌ల మధ్య వ్యాజ్యంగా మారింది. తీర్పుపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. తీర్పును అధ్యయనం చేస్తున్నామని, న్యాయ సలహా తీసుకుని తదుపరి ఏం చేయాలనే విషయం నిర్ణయిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌ను భారత ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించిన విషయాన్ని కోర్టు విస్మరించిందని వ్యాఖ్యానించింది. ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ -
నిజాం‘ఖాన్’దాన్
సాక్షి, హైదరాబాద్: మీర్ ఉస్మాన్ అలీఖాన్.. ప్రపంచంలోనే ధనికుడు. హైదరాబాద్ సంస్థానాన్ని 1911 నుంచి 1948 సెప్టెంబర్ వరకు పాలించిన నిజాం రాజుల్లో చివరివాడు. ఉస్మాన్ అలీఖాన్‌కు ఇద్దరు కుమారులు.. ఆజంజా, మౌజంజా. వీరిని కాదని ఆజంజా కుమారుడు ముకర్రం జాను 8వ నిజాంగా ప్రకటించాడు. హైదరాబాద్ సంస్థానంపై భారత సైనిక చర్యకు కొద్ది రోజుల ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుంచి పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ రహమతుల్లా ఖాతాల్లోకి పలు దఫాలుగా రూ.3.5 కోట్ల నగదు (1,007,940 పౌండ్ల 9 షిల్లాంగ్‌లు) బదిలీ అయింది. ఈ నిధులు తిరిగి ఇవ్వాలని అప్పట్లోనే ఉస్మాన్ అలీఖాన్ కోరినా.. పాకిస్తాన్ పేచీతో వివాదం అరవై ఏళ్లు నలిగింది. ఎట్టకేలకు లండన్ బిజినెస్ అండ్ ప్రాపర్టీ హైకోర్టు ఇటీవల 140 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో ఉస్మాన్ అలీఖాన్ తరఫున అప్పటి హైదరాబాద్ ఆర్థిక మంత్రి మీర్ నవాజ్ జంగ్ జమ చేసిన నిధులకు ఆయన కొడుకులు ఆజంజా, మౌజంజా వారసులని (మనుమలు ముకర్రం జా, ముఫకం జా) తేల్చి, పాకిస్తాన్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అయితే అప్పట్లో జమ చేసిన రూ. 3.5 కోట్లు ప్రస్తుతం రూ.306 కోట్లకు పెరిగాయి. ఈ మొత్తం వారసులకే దక్కనున్న నేపథ్యంలో మళ్లీ హైదరాబాద్ ప్రపంచవ్యాప్త చర్చల్లోకి వచ్చింది. ప్రస్తుతం 8వ నిజాం ముకర్రం జా ఐదవ భార్యతో ఆస్ట్రేలియాలో నివసిస్తుండగా, ముఫకం జా ఫ్రాన్స్, లండన్‌లో నివాసం ఉంటూ అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. -
ఆ రాత్రి హైదరాబాద్‌లో ఏం జరిగింది?
1947, ఆగస్టు 14 అర్ధరాత్రి... హైదరాబాద్ సంస్థానం భారత్‌లో భాగంగా లేదు. దేశమంతటా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనతో సతమతం అవుతోంది. అటు పాకిస్తాన్‌లోనూ, ఇటు భారత్‌లోనూ భాగం కాబోమనీ, హైదరాబాద్ స్వతంత్రంగానే కొనసాగుతుందని నిజాం రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించుకున్నాడు. అంతకు ముందే ఎలాగైనా దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంకేతంగా ఆగస్టు 15న హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగురవేయాలని భావించిన నాటి కాంగ్రెస్ నాయకులు రామానంద తీర్థ తదితరులు ఢిల్లీ వెళ్లారు. స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ జాతీయ జెండాని రామానంద తీర్థకి ఇచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చి ఆగస్టు 15న హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు రామానంద తీర్థ ఇతర కాంగ్రెస్ సభ్యులతో కలసి రహస్యంగా అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే అప్పటికే హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలులో ఉంది. కాంగ్రెస్ పార్టీ, ఆర్య సమాజ్ కార్యకర్తల రహస్య స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఆగస్టు 15 తెల్లవారు ఝామున 3 గంటలకు రామానంద తీర్థని అరెస్టు చేశారు. ఆ తరువాత జీ.ఎస్. మేల్కొటేని సైతం అదుపులోకి తీసుకున్నారు. కృష్ణమాచార్య జోషిని కూడా అరెస్టు చేశారు. ఇంకా హైదరాబాద్ అంతటా అరెస్టుల పర్వం కొనసాగింది. అరెస్టు చేసిన వారిని చెంచల్‌గూడ జైలులో ఉంచారు. అయితే అరెస్టయిన వారు జైలు గోడల మధ్యనుంచి సైతం నినాదాలతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆహ్వానించారు. 1947, ఆగస్టు 14న యావత్ భారతదేశం ఆ అమూల్యమైన ఘడియల కోసం ఎదురుచూస్తోంది. అర్ధరాత్రి 12 గంటలకు అన్ని రేడియోలూ ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ ఉపన్యాసం కోసం వేచి చూస్తున్నాయి. నెహ్రూ, డాక్టర్ రాధాక్రిష్ణన్ నవభారత నిర్మాణం ఆవిష్కృతమవుతోందని ప్రకటించినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాము అంటూ రామానంద తీర్థ తన పుస్తకంలో రాసుకున్నారు. -
‘ఉస్మానియా’ డ్రెస్ కోడ్ షేర్వాణీ
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు స్టైలిష్ రాజు అని పేరు. ఎందుకంటే ఆయన ఒక్కసారి ధరించిన దుస్తులను మళ్లీ ధరించరు. ఆ రోజుల్లో దేశవిదేశీ మార్కెట్లలోకి వచ్చే ప్రతి డిజైన్‌ను ఆయన ధరించేవారు. దేశవిదేశీ డిజైనర్లను రప్పించి పురానీహవేలీలోని తన నివాసంలోనే దుస్తులు తయారు చేయించేవారు. ఇందుకు ఓ పెద్ద భవనాన్ని కూడా కేటాయించారు. ఈ క్రమంలో 1893లో రాజు ఓ వేడుకలో వేసుకునేందుకు డిజైనర్లు ఆంగ్లేయులు ధరించే సూట్‌ను రూపాంతరం చేసి షేర్వాణీ డిజైన్ చేశారు. అలా 125ఏళ్ల క్రితం ఒకే ఒక్క వేడుక కోసం డిజైన్ చేసిన షేర్వాణీ.. మనకు కానుకగా లభించింది. సాక్షి, సిటీబ్యూరో :ఆరో నిజాం కోసం డిజైన్ చేసిన షేర్వాణీ అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఆయన మరణానంతరం హైదరాబాద్ సంస్థానం పాలకులు, జమిందార్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉన్నత వర్గాల ప్రజలు ప్రతి వేడుకలోనూ షేర్వాణీ ధరించేవారు. అయితే కేవలం ముస్లింలు మాత్రమే షేర్వాణీవేసుకునేవారు. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్థిస్థాయిలో క్లాసులు ప్రారంభమయ్యాక... అక్కడి విద్యార్థులకు ఏదైనా డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుందని విద్యాశాఖ అధికారులు ఏడో నిజాం దగ్గర ప్రతిపాదించారు. దీంతో విద్యార్థులకు డ్రెస్ కోడ్‌గా షేర్వాణీ ఉండాలని నిజాం ఆదేశాలిచ్చారు. అలా షేర్వానీ ఉస్మానియా విద్యార్థుల డ్రెస్ కోడ్ కూడా అయింది. ముస్లిం విద్యార్థులు మోకాళ్ల కింది వరకు షేర్వాణీ ధరిస్తే... హిందూ విద్యార్థులు మోకాళ్ల పైకి ధరించేవారు. దేశవ్యాప్తం... ఉస్మానియా విద్యార్థుల డ్రెస్ కోడ్‌గా షేర్వాణీ ఎంపికైన విషయం దేశంలోని వివిధ విద్యాసంస్థలకు తెలిసింది. దీంతో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోనూ విద్యార్థులు షేర్వానీ ధరించేందుకు అనుమతులు పొందారు. ఇతర విద్యాసంస్థలు, సంస్థానాల్లోనూ షేర్వాణీ ధరించడం ప్రారంభమైంది. రాజకీయ నాయకులు, ఉద్యమ నేతలు ప్రాధాన్యం ఇచ్చేవారు. అలా హైదరాబాద్‌లో డిజైన్ అయిన షేర్వాణీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక అప్పటి నుంచి షేర్వాణీకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు ఉన్నత వర్గాల ప్రజలు ధరించగా.. ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు. ఆధునిక యుగంలో మరిన్ని హంగులద్దుకొన్న షేర్వాణీ యువతను ఆకట్టుకుంటోంది. విభిన్న డిజైన్లలో... దాదాపు 50 ఏళ్ల వరకు షేర్వాణీ ఒకే మోడల్లో మార్కెట్లో అందుబాటులో ఉండేది. అయితే తర్వాత దాని డిజైన్ మారిపోయింది. 1960 దశకం తర్వాత సినిమాల్లోనూ షేర్వాణీలు ధరించడంతో డిజైనర్లు నయా హంగులు అద్దారు. చిన్నగా, పెద్దగా, రౌండ్ గల్లా తదితర డిజైన్లతో మార్కెట్లోకి వచ్చాయి. వేడుక ఏదైనా సంప్రదాయ దుస్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోందని జహాపనా మెన్స్ ఎథ్నిక్వేర్ నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో అందరూ షేర్వాణీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం చిన్నచిన్న ఫంక్షన్లు మొదలు పెళ్లిళ్ల వరకూ షేర్వాణీ ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే తరహాలో కొత్త కొత్త డిజైన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. న్యూలుక్... షేర్వాణీ సంప్రదాయ వస్త్రధారణ. అయితే యువత అభిరుచికి అనుగుణంగా విభిన్న డిజైన్లలో రూపొందిస్తున్నాం. మా షోరూమ్‌లో ఈస్ట్రన్, వెస్ట్రన్, యూరోపియన్, అరేబియన్ తదితర డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని హైదరాబాదీ స్టైల్లో తీర్చిదిద్దుతున్నాం. 1960 దశకంలో పౌరాణిక సినిమాల్లో ధరించిన బాటమ్ కట్, బాటమ్ అప్ అండ్ డౌన్ షేర్వాణీలకు మళ్లీ డిమాండ్ ఉంటోంది. – మహ్మద్ ఇబ్రహీం బుఖారీ, జహాపనా మెన్స్ ఎథ్నిక్వేర్ -
వెయ్యి కోట్ల పేపర్ వెయిట్
హైదరాబాద్ : వజ్రాలు ఎక్కడున్నా సేకరించడం నిజాం పాలకులకు అలవాటు. అందుకే ప్రపంచంలో ఇప్పుడున్న ప్రముఖ వజ్రాలతో హైదరాబాద్‌తో విడదీయరానిసంబంధం ఉంటుంది. గోల్కొండ సామ్రాజ్య గనుల నుంచి వెలికితీసిన కోహినూర్ ఎన్నో రాజ్యాలు తిరిగి విక్టోరియా రాణి కిరీటంలో చేరింది. దానితో సమానమైన జాకబ్ డైమండ్‌ది కూడా పెద్ద చరిత్రే. దక్షిణాఫ్రికా గనుల్లో దొరికిన ఓ వజ్రాన్ని 1891లో యూరోపియన్లు హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఆరో నిజాంకు అమ్మకానికి పెట్టారు. అయితే, బేరం కుదరలేదు. దీంతో వజ్రాల వ్యాపారి మాల్కం జాకబ్ మధ్యవర్తిత్వం నెరపడంతో మహబూబ్ అలీఖాన్ రూ. 46 లక్షలు ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. మరింత మంచి ధర కావాలంటూ డైమండ్ వర్తకులు పట్టుబట్టారు. అయితే, ఈ విషయం కోర్టుకెళ్లడంతో రూ. 23 లక్షలకే జాకబ్ డైమండ్‌ను నిజాం సొంతం చేసుకున్నాడు. కానీ ఎందుకనో ఆరో నిజాం ఈ వ జ్రంపై ఎలాంటి ఆసక్తి చూపలేదు. ఆయన చనిపోయిన కొన్నేళ్లకు కొడుకు ఉస్మాన్ అలీఖాన్ తండ్రి షూలో వజ్రాన్ని కనిపెట్టాడు. అలీఖాన్ దీన్ని పేపర్ వెయిట్‌గా ఉపయోగించాడు. అప్పట్లో ‘గ్రేట్ వైట్ డైమండ్’గా పేరొందిన దీని బరువు 184.5 క్యారట్స్ కాగా(36.90 గ్రాములు). సానబెట్టకముందు 400 క్యారట్స్ (80గ్రాములు) ఉండేది. భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దీని ప్రస్తుతం ధర వెయ్యికోట్ల పైనే. కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహించిన మాల్కం జాకబ్ పేరుతోనే దీనికి ఆ పేరు వచ్చింది. -
మంత్రి పదవికోసం ‘మరాఠా వంటకాలు’
మంత్రిపదవికోసం దీర్ఘకాలంగా ఆకాంక్షిస్తున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, ఎంపీ రాందాస్ అథవాలే తాజాగా, మహారాష్ట్రలోని రెస్టారెంట్లలో స్థానిక ఆహార పదార్థాలనే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. సాంస్కృతిక అస్తిత్వాన్ని రాజకీయాలకోసం ఉపయోగించుకునే సరికొత్త ప్రయత్నం ఇది. నిజాం ప్రభువు మనసుకు ఏదైనా ఆలోచన తట్టి దాన్ని తన దర్బారులో ప్రస్తావించిన ప్పుడు ఆయన అధికారులు ముక్తకంఠంతో ‘అవును, అవు ను’ అనేవారట. వాస్తవానికి దాని అర్థం ‘కాదుకాదు’ అనే. ‘అద్భుతం హుజూర్, మీ వివేచన నుంచి మాత్రమే ఇలాంటివి పుట్టుకొస్తాయి. కాని వాటిని అమలు చేసేముందు కొన్ని అవరోధా లను పరిష్కరించాల్సి ఉంది. దయచేసి మాకు కాస్త సమయాన్ని ఇవ్వండి’ అనేవారట వారు. కాలం గడిచేకొద్దీ నిజాం తన ఆలోచనను పూర్తిగా మర్చి పోయేవాడు. అధికారులు నిట్టూర్పు విడిచేవారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత, ఎంపీ రాం దాస్ అథవాలే విషయంలో కూడా ఇదే జరిగింది మరి. ఇతడు మహారాష్ట్రలో లేదా కేంద్రంలో మంత్రిపదవి కోసం దీర్ఘకాలంగా ఆకాంక్షిస్తున్నారు. ఇటీవలే మహా రాష్ట్రలోని అన్ని రకాల, అన్ని తరగతుల రెస్టారెంట్లలో మహారాష్ట్ర ఆహార పదార్థాలనే తమ మెనూలో పొందు పర్చాలన్న కోరికను ఇతడు వెలిబుచ్చాడు. వేయించిన బియ్యం, ఉల్లిపాయలు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు కలిపి వండే స్థానిక ఖండా పోహె అనే వంటకాన్ని, చిన్న బ్రెడ్‌లో బోండాను దట్టించి తయారు చేసే శాండ్విచ్ వడాపావ్‌ను అన్ని రెస్టారెంట్లలో ఉంటాలని అతడి డిమాండ్. తన ప్రతిపాదనకు రెస్టారెంట్ల యజమానులు ఆమోదం తెలుపుతూనే మంచి మరాటీ వంటగాళ్లు దొరకటం లేదని వినయ పూర్వకంగానే రాందాస్‌కు విన్నవించారు. సరైన కుక్‌లను ఆయన వెతికిపెడితే, తమ వినియోగదా రులందరికీ మరాటీ వంటకాలనే వడ్డిస్తామని వారు సెలవిచ్చారు.రాందాస్ వంటి నేతకు లేదనే సమాధానం చెప్ప డానికి గాను మరాటీ దినపత్రిక పుధారి మాత్రమే ఈ ట్రిక్కును తన పాఠకులకు నివేదించింది. మరి రాందాస్ మామూలు వ్యక్తి కాదు. అవసరమైతే వీధు ల్లోకి సమస్యను తీసుకుపోగల కేడర్ బలం కలిగిన వాడు. హోటల్స్‌కు సంబంధించిన ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వద్దకు తీసుకుపోతామని రాందాస్ పార్టీ ప్రతిపాదించింది కూడా. మహారాష్ట్ర ప్రజలు తమ సాంస్కృతిక అస్తిత్వం, భాష విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. కేవలం సాంస్కృతిక అస్తిత్వం చుట్టూ వారు ఒక రాజకీ య పార్టీనే సృష్టించుకున్నారు. అదే శివసేన. ప్రస్తుతం శివసేనతో, బీజేపీతో పోటీ పడటానికి రాందాస్ సిద్ధమవుతున్నారు. అది పూర్తిగా అవకాశవాదమే అనుకోండి. విమర్శించడానికి అతడికి ఒక సమస్య కావాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గంలోకి రాందాస్‌ను తీసుకో లేదు. ఎంపీగా ఉన్నప్పటికీ అతడిని ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్లోకి ఆహ్వానించలేదు. మొత్తంమీద చెప్పాలంటే మహారాష్ట్ర ప్రజలకు తిండి పట్ల గల మక్కువను ఉపయోగించుకోవడానికి రాందాస్ ఒక చెడు ప్రయత్నం చేశారు. మహా రాష్ట్రీయులు ఇంటి భోజనంపై మక్కువ చూపిస్తారు లేదా వీధుల్లో ఆహారాన్ని ఆరగిస్తారు. అది ప్రత్యేక మైనది కావచ్చు. స్నాక్ కావచ్చు లేదా భోజనమే కావచ్చు వంటగది సౌకర్యం లేనివారికి స్ట్రీట్ ఫుడ్ ఒకటే మార్గం. వీరిలో చాలామందికి తగిన ఇళ్లు కూడా ఉండవు. స్థానికులు అయినా కాకున్నా సరే వీళ్లంతా బయటి తిండిపైనే ఆధారపడి బతికేస్తుంటారు. అయితే ఈ ఆహారం రెస్టారెంట్ మెనూ వంటి గంభీరమైనది కాదు. ఉడిపి కావచ్చు లేదా శెట్టి నడిపే హోటల్ కావచ్చు. ఇవి ఇడ్లీ, దోసె, ఊతప్పం వంటి దక్షిణాది వంటలను ఇవి అందిస్తుంటాయి. ఇక పంజాబీ వంటకాలు ఎలా ఉంటాయంటే పంజా బీయులే వాటిని గుర్తించలేరు. చైనీస్, కాంటినెంటల్ వంటకాలను వారికి వడ్డించకపోవడానికి తగిన కారణ మేదీ కనిపించదు. మీరు వెతుక్కోగలిగితే అవన్నీ వీధి వ్యాపారుల వద్ద కూడా దొరుకుతాయి. మీరు ఆరోగ్యం పట్ల మక్కువ కలిగి ఉండి రెస్టారెంట్ కిచెన్లు, సర్వీస్ బాగుంటుందని భావించి వీధుల్లో వంటకాలకు దూరం జరిగినట్లయితే, ప్రతి రెస్టారెంట్లోనూ రాందాస్ ప్రతిపాదించినట్లు అక్కడ కూడా మహారాష్ట్ర వంటమనిషి కోసం మీరు కాస్త వేచి ఉండాల్సి వస్తుంది. ఇలా ఎంత కాలం? అంటే ఎవరికి తెలుసు. ఈసారి రెస్టారెంట్లో అడుగు పెట్టినప్పుడు ఈ సౌకర్యంకోసం మీరు అడగొద్దు. దానికి బదులుగా, ఆయన బ్యూరో ఏమయినా మహారాష్ట్ర కుక్లచేత పని ప్రారంభించ చేసిందా అని అథవాలేనే అడగండి. అథవాలే నొక్కిచెబుతున్నట్లుగా మీడియా మహా రాష్ట్ర వంటల గురించి నివేదిస్తున్నటప్పుడు ఆ వంట కాలలో వారన్-బాత్, పప్పుకూర, మసాలా బాత్, రసం, వంకాయబజ్జీ వంటివి ఉంటాయని మీడియా మనకు సూచించకపోవచ్చు. ఒకవేళ ఇవన్నీ మెనూలో ఉంటే, ఉడిపి, షెట్టి, చైనీస్ హోటళ్లు కూడా మరాటీ రెస్టారెంట్లుగా మారిపోతాయి. ఇది మితిమీరిన ఏకత్వం కావచ్చు కూడా. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) - మహేష్ విజాపుర్కార్ -
నిజాంను పొగుడుతారా?
-
నిజాంను పొగుడుతారా?
వినాయక్‌నగర్ : నిరంకుశ పాలనతో ప్రజలను వేధించిన నిజాం ప్రభువులను ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడడం ఎంతవరకు సబబని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజాం ప్రభువుల పాలన బ్రహ్మాండం అంటూ కేసీఆర్ పదేపదే పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ‘‘కొమురం భీంను ఎవరు హతమార్చారు, ఎందుకు హతమార్చారు, జోడేఘాట్‌ను కేసీఆర్ ఎందుకు సందర్శించారు, వీరనారి చాకలి ఐలమ్మను హతమార్చింది ఎవరు’’ అన్న అంశాలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని యెండల డిమాండ్ చేశారు. నిజాం అరాచకాలను ఎదిరించి, రజకార్లతో పోరాడినవారికి పెన్షన్ ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. తుపాకీని పరీక్షించేందుకు బైరాన్‌పల్లిలో 84 మందిని కాల్చి చంపిన నిజాం చరిత్రను ప్రజలు మరచిపోలేదన్నారు. కేసీఆర్ చరిత్ర తిరగేసి అక్కడి మర్రిచెట్టుకు వెయ్యి ఉరిల మర్రి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలన్నారు. నిజాం కాలంలో తెలంగాణ ఆడ బిడ్డలు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే వివస్త్రలను చేసి ఆడించిన సంఘట నలు నిజాంచరిత్రలో ఉన్నాయన్నారు. అలాంటి నీచపాలన బాగుందని కేసీఆర్ పేర్కొనడం దురదృష్టకరమన్నారు. నిజాం ముక్కుపిండి పన్నులు వసూలు చేసి, ప్రపంచంలోనే ధనవంతుడిగా మారాడన్నారు. తన పాలనకు వ్యతిరేకంగా కథనాలను ప్రచురించిన జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ కాళ్లను నరికేయించిన చరిత్ర నిజాందని గుర్తు చేశారు. కేసీఆర్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించారు. నిజాం నిరంకుశత్వం తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు. అలాంటి నిజాంను పొగడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నగర అధ్యక్షుడు గజం ఎల్లప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ గుప్తా, బాణాల లక్ష్మారెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శైలజ తదితరులు పాల్గొన్నారు.