నిజాం నిధులపై పాక్‌కు చుక్కెదురు | UK Court Dismisses Pakistan Claim Over Nizam Funds | Sakshi
Sakshi News home page

నిజాం నిధులపై పాక్‌కు చుక్కెదురు

Published Thu, Oct 3 2019 4:42 AM | Last Updated on Thu, Oct 3 2019 11:21 AM

UK Court Dismisses Pakistan Claim Over Nizam Funds - Sakshi

నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌

లండన్‌: 1948 నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుకు చెందిన 35 మిలియన్‌ పౌండ్ల (రూ. 306.5 వందల కోట్లు)పై దశాబ్దాలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రస్తుతానికి భారత్‌కు అనుకూలంగా ముగిసింది. ఆ నిధులపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదని యూకే హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అవి భారత్‌కు, నిజాం వారసులకే చెందాలని స్పష్టం చేసింది. 1948లో ఏడవ నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్‌ (సుమారు ఒక మిలియన్‌ పౌండ్లు)లను బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌లోని పాకిస్తాన్‌ హై కమిషనర్‌ హబీబ్‌ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

ఇప్పటికి అవి దాదాపు 35 మిలియన్‌ పౌండ్లకు చేరాయి. ఆ నిధులు తమవేనని పాకిస్తాన్‌ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్‌ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్‌ చేసిన వాదనను జస్టిస్‌ మార్కస్‌ స్మిత్‌ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు. ‘ఈ వివాదం ప్రారంభమైనప్పుడు నా క్లయింట్లు చిన్నపిల్లలు.. ఇప్పుడు వారి వయస్సు 80 ఏళ్లకు పైగానే.

ఇప్పటికైనా, వారి జీవిత కాలంలోనే ఈ తీర్పు రావడం, అదీ వారికి అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది’అని నిజాం వారసుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పాల్‌ హెవిట్‌ వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా పాక్‌ రెండు వాదనలు వినిపించింది. పాకిస్తాన్‌ నుంచి ఆయుధాలు కొనుగోలుకు సంబంధించిన డబ్బును లండన్‌ బ్యాంక్‌లో ఏడవ నిజాం జమ చేశారని, అందువల్ల ఆ నిధులు తమకే చెందుతాయన్నది ఒక వాదన. భారత్‌కు ఆ నిధులు చెందకూడదనే ఉద్దేశంతోనే లండన్‌ బ్యాంక్‌కు బదిలీ చేశారన్నది రెండవ వాదన. అలాగే, భారత ప్రభుత్వ ఆధీనంలోకి రాకముందు నిజాం రాజ్యం ప్రభుత్వ హోదాలో ఆ నిధుల బదిలీ చేసిందని కూడా పాక్‌ వాదించింది.

హైదరాబాద్‌ రాజ్యాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కూడా చట్టవ్యతిరేక చర్య అని పేర్కొంది. ఈ వాదనలన్నింటిని కోర్టు తోసిపుచ్చింది. పాక్‌ నుంచి ఆయుధాల కొనుగోలు నిజమే అని నమ్ముతున్నప్పటికీ.. ఈ నిధులు వాటికి సంబంధించినవే అనేది నిర్ధారణ కాలేదని పేర్కొంది. భారత్‌కు చెందకూడదనే నిధుల బదిలీ జరిగిందని భావించినా.. దానర్థం ఆ నిధులు ఏదో ట్రస్ట్‌కు కాకుండా పాకిస్తాన్‌కే చెందాలనేందుకు ఆధారాలు లేవంది. హైదరాబాద్‌ రాజ్యం భారత్‌లో కలిసిన విషయం ఈ కేసుకు అప్రస్తుతమని స్పష్టం చేసింది. ఆ నిధులను తిరిగి తనకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని ఆ తరువాత నిజాం రాజు ఉస్మాన్‌ అలీ ఖాన్‌ కోరిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం, నిజాం వారసులు గత సంవత్సరం ఒక రహస్య ఒప్పందానికి రావడంతో.. ఈ కేసు భారత్‌– పాక్‌ల మధ్య వ్యాజ్యంగా మారింది. తీర్పుపై పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ స్పందించింది. తీర్పును అధ్యయనం చేస్తున్నామని, న్యాయ సలహా తీసుకుని తదుపరి ఏం చేయాలనే విషయం నిర్ణయిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌ను భారత ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించిన విషయాన్ని కోర్టు విస్మరించిందని వ్యాఖ్యానించింది.
ఏడవ నిజాం రాజు మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement