ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన హైదరాబాద్ సంస్థానం 8వ నిజాం రాజు టర్కీలో అద్దె ఇంట్లో మరణించాడు. ఇస్తాంబుల్ నగరంలోని ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో జనవరి 14న మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజా బహదూర్ (89) కన్నుమూసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 1967లో కుబేరుడిగా ఉన్న ఆయన తన చివరి రోజుల్లో ఓ సామాన్యుడిలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 1971లో భారత ప్రభుత్వ రాజాభరణాలు రద్దు చేసేంత వరకు ‘ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్’గా ఉన్నారు.
అత్యంత విలాసాలు, నలుగురు భార్యలు, పిల్లలో ఆస్తి వివాదాలతో ముకరంజా దివాళా తీశారు. ఆస్తులు అమ్మకుండా కోర్టు ఆంక్షలు విధించడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయి. 30 ఏళ్ల వయసులోనే 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు వారసుడైన ముకరంజా ఆ తర్వాత నిర్లక్ష్యం కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు.
కాగా ముకరంజా భౌతికకాయం మంగళవారం హైదరాబాద్ చేరుకుంటుందని నిజాంట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. తన అంతిమ సంస్కారాలను హైదరాబాద్ మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల వద్ద నిర్వహించాలన్న ఆయన కోరిక మేరకు పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనుమడే ముకరంజా. 1933 అక్టోబర్ 6న ఫ్రాన్స్‌లో ఆయన జన్మించారు. డెహ్రాడూన్‌లో పాఠశాల విద్య, లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.
1967లో 8వ అసఫ్ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం
1967లో ఎనిమిదవ నిజాంగా..
భారత యూనియన్‌లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్ 6, 1967లో ఎనిమిదవ అసఫ్ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా 1967 భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు.
కాగా, మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల ప్రాంగణంలో ముకరంజా ఖననం కోసం నిజాం ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న నిర్వహించే ముకరంజా అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు సోమవారం పరిశీలించారు. ముందుగా చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించిన అధికారుల బృందం సభ్యులు అక్కడ ఏర్పాట్లు పరిశీలించింది.
ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో..
మంగళవారం ముకరంజా భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకు వచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించనున్నారు. 18న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చౌమహాల్లా ప్యాలెస్‌లో ఆయన పార్థివదేహాన్ని సందర్శించడానికి ప్రజలను అనుమతించనున్నారు. తర్వాత అంత్యక్రియలకోసం పార్థీవ దేహాన్ని తరలిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment