లండన్: నిజాం వారసుడు ప్రిన్స్ ముఖరం ఝా యూకేలో తమకు మిగిలి ఉన్న కొన్ని నిధులపై హక్కును కోల్పోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లండ్‌లోని ఒక హైకోర్టులో దీనికి సంబంధించి సాగుతున్న వ్యాజ్యం నుంచి తప్పుకోవాలని ముఖరం ఝా నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లోని ఒక బ్యాంక్‌లో ఉన్న నిధుల్లో తమకూ వాటా ఉందన్న ఆయన కుటుంబ సభ్యుల వాదనను బుధవారం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్స్ తరఫు న్యాయవాది పాల్ హ్యూవిట్ ప్రకటించారు. ఈ కేసు దాదాపు తన క్లయింట్ జీవిత కాలమంతా కొనసాగిందని, ఇకనైనా దీని నుంచి విముక్తిని ఆయన కోరుకున్నారని తెలిపారు.
ఆ మిగిలిన నిధులను కుటుంబం లోని మొత్తం సభ్యులకు పంచాలని ఆయన ప్రతిపాదించారన్నారు. ఇందులో తన వారసత్వ హక్కును ఆయన కోల్పోవడానికి సిద్ధమయ్యారన్నారు. లండన్ బ్యాంక్‌లో ఉన్న సుమారు 3.5 కోట్ల పౌండ్లకు భారత ప్రభుత్వం, ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన సోదరుడు హక్కుదారులని 2019 అక్టోబర్‌లో అక్కడి కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నజాఫ్ అలీ ఖాన్, హిమాయత్ అలీ మీర్జా వేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment