NIZAAM
-
మిగిలిన ఆ నిధులు వద్దు: ప్రిన్స్ ముఖరం
లండన్: నిజాం వారసుడు ప్రిన్స్ ముఖరం ఝా యూకేలో తమకు మిగిలి ఉన్న కొన్ని నిధులపై హక్కును కోల్పోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లండ్‌లోని ఒక హైకోర్టులో దీనికి సంబంధించి సాగుతున్న వ్యాజ్యం నుంచి తప్పుకోవాలని ముఖరం ఝా నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లోని ఒక బ్యాంక్‌లో ఉన్న నిధుల్లో తమకూ వాటా ఉందన్న ఆయన కుటుంబ సభ్యుల వాదనను బుధవారం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్స్ తరఫు న్యాయవాది పాల్ హ్యూవిట్ ప్రకటించారు. ఈ కేసు దాదాపు తన క్లయింట్ జీవిత కాలమంతా కొనసాగిందని, ఇకనైనా దీని నుంచి విముక్తిని ఆయన కోరుకున్నారని తెలిపారు. ఆ మిగిలిన నిధులను కుటుంబం లోని మొత్తం సభ్యులకు పంచాలని ఆయన ప్రతిపాదించారన్నారు. ఇందులో తన వారసత్వ హక్కును ఆయన కోల్పోవడానికి సిద్ధమయ్యారన్నారు. లండన్ బ్యాంక్‌లో ఉన్న సుమారు 3.5 కోట్ల పౌండ్లకు భారత ప్రభుత్వం, ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన సోదరుడు హక్కుదారులని 2019 అక్టోబర్‌లో అక్కడి కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నజాఫ్ అలీ ఖాన్, హిమాయత్ అలీ మీర్జా వేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు కొట్టివేసింది. -
మరోసారి కోర్టుకెక్కిన నిజాం వారసులు..
లండన్: ఏడవ నిజాం రాజు వారసులు మరోసారి లండన్ కోర్టు మెట్లెక్కారు. 35 మిలియన్ పౌండ్ల విషయంలో తలెత్తిన వివాదం వారిని మరోసారి కోర్టును ఆశ్రయించేలా చేసింది. గతేడాది 8 వ నిజాంకు ఆయన సోదరుడికి ఈ సంపద చెందుతుందని ఇంగ్లాండ్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా నిజాం ఎస్టేట్ కార్యనిర్వహణాధికారి నమ్మకద్రోహానికి పాల్పడ్డాడంటూ ఏడవ నిజాంకు చెందిన 116 మంది వారసుల తరపున నజఫ్ అలీఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నిధులను భారతదేశానికి సరిగ్గా విడుదల చేయలేదని ఖాన్ కోర్టుకు తెలిపారు. అదేవిధంగా ఇద్దరు యువరాజులు - ప్రిన్స్ ముఖరంఝా, అతని తమ్ముడు ముఫఖం ఝా దీర్ఘకాలిక ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి 2019లో తీర్పునిచ్చిన న్యాయమూర్తి స్మిత్ కేసును తిరిగి తెరవడాన్ని తోసిపుచ్చారు. ‘ఆ సంపదకు వారసులెవరో తీర్పు వెలువరిచాం. కేసును తిరిగి తెరవడానికి వారికి అర్హత లేదు. దీనిని అంగీకరించడం అసాధ్యం’ అని పేర్కొన్నారు. అయినప్పటికీ ఏడవ నిజాం ఎస్టేట్ నిర్వాహకుడి చేత అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలపై న్యాయస్థానం వాదనలు విననుంది. ముకర్రంజ పరివారం: భార్యలు: ఎస్త్రా(టర్కీ)హెలెన్, మనోలియా ఒనూర్, జమీల (మొరాకో), ఒర్చిడ్ (టర్కీ), వీరందరికీ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరంతా ఇప్పుడు టర్కీ, ఆస్ట్రేలియా, లండన్‌లో స్థిరపడ్డారు. ముఫకంజ: భార్య ఏసెస్(టర్కీ), పిల్లలు: రఫత్ జా, ఫర్హత్ జా వీరు కాకుండా నిజాం వారసులుగా మరో 3,600 మంది చలామణి అవుతున్నారు. ప్రస్తుతం ముకర్రంజ ఆస్ట్రేలియా, టర్కీలలో, ముఫకంజ లండన్, హైదరాబాద్‌లలో నివసిస్తున్నారు. అసలేం జరిగిందంటే: హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసే దిశగా భారత సైన్యాలు వస్తున్నాయన్న సమాచారంతో ఆరో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1948లో 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్ (సుమారు ఒక మిలియన్ పౌండ్లు)లను పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి బదిలీ చేశారు. అయితే ఈ నిధులపై అప్పటి నుంచి భారత్, పాకిస్తాన్‌లు న్యాయ పోరాటం చేస్తుండగా, ఇందులో నిజాం వారసులు ముకర్రంజ, ముఫకంజ కూడా నిధులు తమకే చెందుతాయంటూ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న బ్రిటన్ హైకోర్టు వచ్చే నెలలో తీర్పు ఇవ్వనుందని నిజాం వారసులు పేర్కొంటున్నారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌లో బ్యాంక్‌లో జమ అయిన నిధులు.. ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.304 కోట్లకు చేరాయి. ఈ నిధులు మావంటే, మావేనని ఇరు దేశాలు నాలుగున్నర దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాయి. 306 కోట్లకు చేరిన నిధులు.. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనానికి కొన్ని గంటల ముందు నాటి ఆర్థికమంత్రిగా పనిచేసిన మీర్ నవాజ్ ఝంగ్‌కు చెందిన హైదరాబాద్‌లోని ఎస్బీహెచ్ అకౌంట్ నుంచి రూ.3.5 కోట్లు (1,007,940 పౌండ్ల 9 షిల్లింగ్లు) లండన్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ రహమ తుల్లా అకౌంట్లోకి బదిలీ అయ్యాయి. భారత్‌లో హైదరాబాద్ విలీనం కావటం, ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్‌గా నియామకం అయ్యాక ఈ నిధులు తిరిగి తనకు పంపాలంటూ ఉస్మాన్ అలీఖాన్ పాకిస్తాన్‌ను కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న ఆ నిధులు, వడ్డీలు కలుపుకుని ప్రస్తుతానికి రూ.306 కోట్లకు చేరాయి. అయితే ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్ చేసిన వాదనను జస్టిస్ మార్కస్ స్మిత్ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు. భారత ప్రభుత్వం ఇంప్లీడ్.. ఈ నిధుల వివాదంపై పాకిస్తాన్‌తో న్యాయపరంగా కొట్లాడుతున్న నిజాం మనుమలు ముకర్రం ఝా, ముఫకం ఝాలకు మద్దతుగా 2013లో భారత ప్రభుత్వం లండన్ కోర్టులో ఇంప్లీడ్ అయింది. దీంతో పాకిస్తాన్ తన వాదనల వేగాన్ని పెంచి ‘భారత్ మాపై ఆక్రమణ చేస్తున్న సమయంలో ఆయుధాల కోసం నిజాం ఆ నిధుల్ని మాకు పంపారు.’ అని వాదనలను వినిపించినా.. కోర్టు కొట్టేసి నిధులను భారత్, నిజాం వారసులకు కేటాయించింది. అయితే ఈ విషయం సమసిపోయిందకున్న సమయంలో నిజాం వారసులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. చదవండి: లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు -
‘మేరా మహబూబ్‌నగర్ మహాన్’
సాక్షి, స్టేషన్ మహబూబ్‌నగర్: సర్వమత సహనానికి ప్రతీకగా విరాజిల్లిన మహబూబ్‌నగర్ పట్టణం ఆవిర్భవించి మంగళవారం నాటికి 128 ఏళ్లు అవుతుంది. గంగా జమునా తహజీబ్‌కు ఆలవాలంగా ప్రముఖులచే కీర్తించబడుతున్న ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించేవని, చుట్టూర ఉన్న అడవుల్లో పాలుగారే చెట్లు అధికంగా ఉండేవని, అందుకే ఈ పట్టణంలోని కొంత భాగాన్ని పాలమూరు అనే వారని వేర్వేరు కథనాలు ఉన్నప్పటికీ.. ఖండాంతరాలు మహబూబ్‌నగర్‌ను ఆసిఫ్ జాహి వంశస్థుడైన 6వ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ పేరు మీద నామకరణం చేశారు. గతంలో రుక్మమ్మపేట, చోళవాడి, పాలమూరుగా పిలవబడిన ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఆసిఫ్‌జాహి రాజులు 1890 డిసెంబర్ 4వ తేదీన మహబూబ్‌నగర్‌గా మార్చారని చరిత్రకారులు పేర్కొన్నారు. శాతవాహన, చాళుక్యరాజుల పాలన అనంతరం గోల్కొండ రాజుల పాలన కిందకి వచ్చింది. 1518 నుంచి 1687 వరకు కుతుబ్షాహి రాజులు, అప్పటి నుంచి 1948 వరకు ఆసిఫ్‌జాహి నవాబులచే పాలించబడింది. భారత స్వాతంత్య్రానంతరం 1948 సెప్టెంబర్ 18వ తేదీన నైజాం సారథ్యంలోని హైదరాబాద్ రాష్ట్రాన్ని జాతీయ స్రవంతిలో కలిపిన సందర్భంగా ఇక్కడ ఉన్న భవంతులను, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తుంది. నిజాం భవనాలే.. నిజాం పాలనలో నిర్మించబడిన భవనాలను జిల్లాకేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. వాటిలో అత్యధిక భవంతులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ప్రజాహిత కార్యక్రమాలకు అందుబాటులో కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ సముదాయ భవనం, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కోర్టుల సముదాయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, మైనర్ ఇరిగేషన్ ఈఈ ఆఫీస్, ఫారెస్టు ఆఫీసెస్ కాంప్లెక్స్, పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథి గృహం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, డీఈఓ, ఆర్అండ్బీ ఈఈ, జిల్లా జైలు, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, బ్రాహ్మణవాడిలోని దూద్‌ఖానా, పాత పోస్టల్ సూపరింటెండెంట్, షాసాబ్‌గుట్ట హైస్కూల్, మోడల్ బేసిక్ హైస్కూల్, జిల్లా రైల్వేస్టేషన్ తదితర భవనాలు ప్రముఖ చోటును సంపాదించాయి. -
నిజం.. మీరే నిజాం..!
సాక్షి, హైదరాబాద్: తలపై రూమీ టోపీ.. పై నుంచి కిందికి షేర్వానీ.. మెడలో అందమైన ఆభరణాలతో రాజదర్పాన్ని తలపిస్తున్న వీరంతా ఆసఫ్జాహీ నవాబుల రాజ్యానికి చెందిన వారనుకుంటే పొరపాటే.. ఎందుకంటే వీరంతా సామాన్య పౌరులే.. చౌమొహల్లా ప్యాలెస్‌కు వచ్చిన సందర్శకులే. వీరే కాదు. మీరూ నవాబులా మారొచ్చు..! కొన్ని గంటల పాటు ఆ గెటప్‌లో అందర్నీ ఆకట్టుకోవచ్చు. పడక కుర్చీలో కూర్చొని మంతనాలు సాగించొచ్చు. రాజుగారిలా స్టిల్ ఇచ్చి అందర్నీ కట్టిపడేయొచ్చు. జిగేల్మనే దుస్తుల్లో మెరిసిపోవచ్చు. ఇంతకీ ఇదంతా ఎలా అనుకుంటున్నారు కదా..? అయితే ఇది చదవండి. చౌమొహల్లా ప్యాలెస్ చార్మినార్ సమీపంలో ఉంది. ఆసఫ్జాహీ నవాబుల రాజసానికి, గంభీరానికి ఈ ప్యాలెస్ నిలువెత్తు నిదర్శనం. మొగలాయి తర్వాత అంతటి గొప్ప రాజ్యానికి ప్రసిద్ధి. ఈ ప్యాలెస్‌లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నివాసం ఉండేవారు. ఇక్కడ ఆ రోజుల్లో ఉపయోగించిన ఎన్నో ప్రసిద్ధమైన వస్తువులున్నాయి. వాటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఇక్కడే ఒక ఫొటో స్టూడియో కూడా ఉంది. మిగతా వాటికంటే ఇది భిన్నమైంది. ఇక్కడ కేవలం నిజాం నవాబుల దుస్తుల్లో మాత్రమే ఫొటోలు తీస్తుంటారు. వెల వంద రూపాయలు మాత్రమే. సందర్శన వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు. ఈ ఫొటో స్టూడియోలో అలనాడు నిజాం కుటుంబ సభ్యులు వేసుకున్న దుస్తుల్లాంటివి ఉంటాయి. పురుషులకు షేర్వానీ, పైజామా, రూమీ టోపీ, కుర్తా, కోటుతో పాటు పలు రకాలు దుస్తులు ఇక్కడ ఉంటాయి. షేర్వానీల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. మహిళలకు గాగ్రా, చోళీ, దుప్పట్టా తదితర దుస్తులున్నాయి. వీటితో పాటు రకరకాల ఆభరణాలు ఉంటాయి. క్షణాల్లో వీటిని వేసుకోవచ్చు. ప్యాలెస్ చూడటానికి వచ్చే వందలాది మంది యాత్రికులు వీటితో రెడీ అయితే అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్ క్షణాల్లో ఫొటో తీసి ఇస్తాడు. నలుపు తెలుపులో అలనాటి వైభవాన్ని గుర్తుకుతెచ్చేలా ఉండే ఈ ఫొటోలను చూసి సందర్శకులు మురిసిపోతుంటారు. తమ బంధువులు, మిత్రులకు చూపించి సంతోషాన్ని పంచుకుంటున్నారు. -
‘ఆపరేషన్ పోలో’కు నేటితో 68 ఏళ్లు
సాక్షి, సిటీబ్యూరో: ‘ఆపరేషన్ పోలో’... సరిగ్గా 68 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం నిజాం రాజ్యంపై చేసిన పోలీసు చర్య పేరిది. అప్పట్లో దేశమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నా... హైదరాబాద్ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పదఘట్టనల కింద నలిగిపోతున్నారు. రజాకార్ల అకృత్యాలు... రాక్షసకాండ మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. ఆ సమయంలోనే ప్రభుత్వం ‘ఆపరేషన్ పోలో’ పేరుతో పోలీసు చర్యకు దిగింది. నిజాం నియంతృత్వ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. హైదరాబాద్ సంస్థానంలోనూ స్వేచ్ఛా వాయువులు వీచాయి. ఇదంతా ఒకవైపు... మరోవైపు నియంతృత్వ పాలన సాగించిన ఉస్మాన్ అలీఖాన్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధికి సైతం బలమైన పునాదులు పడ్డాయి. విద్య, వైద్యం, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, తదితర రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి కనిపించింది. ఎన్నో చారిత్రక కట్టడాలు వెలిశాయి. రహదారులు, జలాశయాలు నిర్మించారు. నిజాం కాలంలో నియంతృత్వం ఎంత కఠోరమైన వాస్తవమో... అభివృద్ధీ అంతే. సెప్టెంబర్ 17వ తేదీన ఆయన భారత ప్రభుత్వానికి లొంగిపోవడంతో నిజాం శకం అంతమైంది. భయానకం హైదరాబాద్ రాజ్యంలో ఎన్నో అరాచకాలు... అకృత్యాలు... రక్తపాతం సృష్టించిన రజాకార్లు నగరంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతికేవారు. ఏ క్షణంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోననే భయం. రాత్రివేళల్లో మహిళలు కారంపొడి దగ్గర ఉంచుకొనే వారు. కాంగ్రెస్ సారథ్యంలో వెలువడిన ‘ఇమ్రోజ్’ పత్రికలో మజ్లిస్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు, వార్తలు విరివిగా వచ్చేవి. వాటిని ఖాసీం రజ్వీ జీర్ణించుకోలేకపోయాడు. ‘తమకు వ్యతిరేకంగా వార్తలు రాసేవాళ్ల చేతులు నరికేస్తామని’ తీవ్రంగా హెచ్చరించాడు. ఆ తరువాత వారం రోజులకే ఓ అర్ధరాత్రి షోయబ్ చేతులు నరికి, పిస్తోలుతో కాల్చి చంపారు రజాకార్లు. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వ పరిపాలనలో ఈ దాడులు చీకటి అధ్యాయం. రాచరిక నియంతృత్వ వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ దిశగా రాజకీయ రంగం పరిణామం చెందింది కూడా ఈ కాలంలోనే కావడం గమనార్హం. ముగిసిన శకం.. హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య 1948 సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్టినెంట్ జనరల్ మేజర్ రాజేంద్రసింగ్ నేతత్వంలో మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి దీనికి సారథ్యం వహించారు. భారత సైన్యం నాలుగు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి... ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ.రుద్ర విజయవాడ వైపు నుంచి... బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది. భారత ఎయిర్ మార్షల్ ముఖర్జీ తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. 1948 సెప్టెంబర్ 14న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాలలో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబర్ 16న రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల పాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్, తదితర ప్రాంతాల్లో మందుపాతర లు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించారు. ‘ఆపరేషన్ పోలో’ పూర్తయింది ప్రగతికి బాటలు చారిత్రక, రాజకీయ, సామాజిక రంగాల్లో నియంతృత్వం రాజ్యమేలుతున్న సమయంలోనే హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధికీ బలమైన పునాదులు పడ్డాయి. విద్య, వైద్య, రవాణా, పారిశ్రామిక రంగాల్లో అద్భుతమైన ప్రగతి కనిపించింది. పారిశ్రామిక రంగంలో 1929 గొప్ప మైలురాయి. ప్రభుత్వం రూ.కోటితో ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ (ఐటీఎఫ్)ను ఏర్పాటు చేసింది. పెద్ద పరిశ్రమలకు అప్పులు ఇచ్చి వాటిపై వచ్చే ఆదాయంతో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించింది. నిజాం రాజ్య గ్యారెంటీడ్ రైల్వే ఆధ్వర్యంలో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. 1932 నాటికి నిజాం రోడ్డు రవాణా సంస్థ, 1938లో దక్కన్ విమానయాన సంస్థ ఏర్పాటయ్యాయి. 1885లోనే టెలిఫోన్ అందుబాటులోకి వచ్చింది. 1938–39లో నిజాం ప్రభుత్వం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ద్వారా 20 మిలియన్ కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఒక మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. ఈ అభివృద్ధి అప్పట్లో హైదరాబాద్‌ను అత్యధిక సంపన్నమైన సంస్థానంగా నిలిపింది. ►1874 జూలై 14న గుల్బర్గా నుంచి సికింద్రాబాద్ వరకు రైల్వే లైన్ ప్రారంభమైంది. ►మహ్మద్‌కులీ కుతుబ్‌షా మూసీ నది ఒడ్డున దాదార్మహల్ (న్యాయ మందిరం) కట్టించారు. ఆ ప్రాంగణంలోనే 1920 ఏప్రిల్ 20న నిజాం హైకోర్టును ప్రారంభించారు. ►1921లో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన సిటీ కాలేజ్ హిందూ ముస్లిం వాస్తుకళల మేలు కలయిక. ►బ్రిటిష్ రాణి విక్టోరియా జ్ఞాపకార్థం 1906లో మూసీనది ఒడ్డున జజ్గీఖానా నిర్మించారు. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు ఆస్పత్రి చాలా వరకు కొట్టుకుపోయింది.1911లో ఉస్మాన్అలీ ఖాన్ దీనిని పునర్నిర్మించారు. ►మక్కా మసీదుకు ఎదురుగా, చార్మినార్‌కు ఆగ్నేయ దిశలో 1928లో నిర్మించిన యునాని ఆస్పత్రి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ►రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం 1936లో మూసీ తీరాన నిర్మించారు. ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషు భాషల్లోని అనేక గ్రంథాలు, చేతిరాత గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. ►బెల్జియంకు చెందిన రూపశిల్పి మాన్సియర్ జాస్పర్ ఆర్ట్స్ కళాశాలకు రూపకల్పన చేశారు. 1939 నాటికి ఈ కళాశాల పూర్తయింది. ►1925లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించారు.