ఆసిఫ్‌జాహి నవాబుల పాలనలో నిర్మించిన కలెక్టరేట్ భవనం
సాక్షి, స్టేషన్ మహబూబ్‌నగర్: సర్వమత సహనానికి ప్రతీకగా విరాజిల్లిన మహబూబ్‌నగర్ పట్టణం ఆవిర్భవించి మంగళవారం నాటికి 128 ఏళ్లు అవుతుంది. గంగా జమునా తహజీబ్‌కు ఆలవాలంగా ప్రముఖులచే కీర్తించబడుతున్న ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించేవని, చుట్టూర ఉన్న అడవుల్లో పాలుగారే చెట్లు అధికంగా ఉండేవని, అందుకే ఈ పట్టణంలోని కొంత భాగాన్ని పాలమూరు అనే వారని వేర్వేరు కథనాలు ఉన్నప్పటికీ.. ఖండాంతరాలు మహబూబ్‌నగర్‌ను ఆసిఫ్ జాహి వంశస్థుడైన 6వ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ పేరు మీద నామకరణం చేశారు.
గతంలో రుక్మమ్మపేట, చోళవాడి, పాలమూరుగా పిలవబడిన ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఆసిఫ్‌జాహి రాజులు 1890 డిసెంబర్ 4వ తేదీన మహబూబ్‌నగర్‌గా మార్చారని చరిత్రకారులు పేర్కొన్నారు. శాతవాహన, చాళుక్యరాజుల పాలన అనంతరం గోల్కొండ రాజుల పాలన కిందకి వచ్చింది.
1518 నుంచి 1687 వరకు కుతుబ్‌షాహి రాజులు, అప్పటి నుంచి 1948 వరకు ఆసిఫ్‌జాహి నవాబులచే పాలించబడింది. భారత స్వాతంత్య్రానంతరం 1948 సెప్టెంబర్ 18వ తేదీన నైజాం సారథ్యంలోని హైదరాబాద్ రాష్ట్రాన్ని జాతీయ స్రవంతిలో కలిపిన సందర్భంగా ఇక్కడ ఉన్న భవంతులను, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తుంది.
నిజాం భవనాలే..
నిజాం పాలనలో నిర్మించబడిన భవనాలను జిల్లాకేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. వాటిలో అత్యధిక భవంతులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ప్రజాహిత కార్యక్రమాలకు అందుబాటులో కొనసాగుతున్నాయి.
కలెక్టరేట్ సముదాయ భవనం, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కోర్టుల సముదాయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, మైనర్ ఇరిగేషన్ ఈఈ ఆఫీస్, ఫారెస్టు ఆఫీసెస్ కాంప్లెక్స్, పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, డీఈఓ, ఆర్‌అండ్‌బీ ఈఈ, జిల్లా జైలు, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, బ్రాహ్మణవాడిలోని దూద్‌ఖానా, పాత పోస్టల్ సూపరింటెండెంట్, షాసాబ్‌గుట్ట హైస్కూల్, మోడల్ బేసిక్ హైస్కూల్, జిల్లా రైల్వేస్టేషన్ తదితర భవనాలు ప్రముఖ చోటును సంపాదించాయి.
Comments
Please login to add a commentAdd a comment