Hyderabad State
-
విలీనం తర్వాత 12 మందికి ఉరిశిక్ష..చివరి క్షణాల్లో దిగొచ్చి..
సాక్షి, మిర్యాలగూడ, కోదాడ: నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అక్కినెపల్లి, షా అబ్దుల్లాపురం గ్రామాల్లో జరిగిన దొరల, రజాకార్ల హత్య కేసులో నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి (నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే), దోమల జనార్ధన్ రెడ్డి, గార్లపాటి రఘుపతిరెడ్డి, దూదిపాల చినసత్తిరెడ్డి, మేర హనుమంతు, మాగి వెంకులు, దాసరి నారాయణరెడ్డి, వడ్ల మల్లయ్య, ఎర్రబోతు రాంరెడ్డి, మిర్యాల లింగయ్య, కల్లూరి ఎల్లయ్య, గులాం దస్తగిరికి ప్రత్యేక ట్రిబ్యునల్ 1949 ఆగస్టు 13, 14న మరణశిక్ష వేసింది. ఉరిశిక్ష పడిన వెంకులు (14), ఎర్రబోతు రాంరెడ్డి(15), నంద్యాల శ్రీనివాసరెడ్డి (20) తోపాటు నల్లా నర్శింహులు (22) నల్లగొండ జైల్లో ఉండగా టైమ్ పత్రికకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు వారిని కలిసి మైనర్ అయిన ఎర్రబోతు రామిరెడ్డి ఫొటోతో వ్యాసం రాసింది. అది పెను సంచలనంగా మారింది. లండన్ న్యాయవాది డీఎన్ ప్రిట్, బొంబాయ్ నుంచి డేనియల్ లతీఫ్, గణేష్ షాన్‌బాగ్ వంటి న్యాయవాదులు స్థానిక న్యాయవాది మనోహర్‌లాల్ సక్సేనాతో కలిసి మరణశిక్ష ఆపేందుకు ప్రయత్నించారు. అంతర్జాతీయంగా ఉరిశిక్ష లకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జెకొస్లోవేకియాలో 10 వేల మందితో భారీ నిర్వహించారు. దీంతో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ క్షమాభిక్షతో మరణశిక్ష కాస్తా యావజ్జీవ శిక్షగా మారింది. 1956లో కొందరు, దీంతో 1958లో మరికొందరు విడుదలయ్యారు. నిజాంపై గర్జించిన కృష్ణా జిల్లా సాక్షి, అమరావతి: తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉధృతం చేయడంలో, రజాకార్లను ఎదుర్కోవడంలో కృష్ణా జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. 1944లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్యను రజాకార్లు కాల్చేయడంతో తీవ్రరూపం దాల్చింది. నల్లగొండ జిల్లాలో మొదలైన ఉద్యమం క్రమంగా విస్తరించింది. కృష్ణా జిల్లా నుంచి అనేక మంది నేతలు ఈ సాయుధ పోరుకు ఊతమిచ్చారు. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య విజయవాడ నుంచే ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. సోవియట్ యూనియన్ తరహాలో విజయవాడలో ‘కమ్యూన్’ఏర్పాటు చేశారు. వడిసెలు, రాళ్లు, కత్తులు వంటి ఆయుధాల ప్రయోగం, తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చారు. పగలంతా కలిసికట్టుగా శ్రమ చేసి సంపాదించిన సొమ్ముతో ఒకే చోట వండుకుని భోజనాలు చేసేవారు. రాత్రి సమయాల్లో యుద్ధ విద్యల్లో శిక్షణ పొందేవారు. ఇక్కడ శిక్షణ పొంది వెళ్లి నల్గొండ జిల్లాలో దళాలు ఏర్పాటు చేశారు. దళాల నేతృత్వంలోనే సాయుధ దాడులు జరిగాయి. ఈ పోరాటాల్లో జిల్లాకు చెందిన 13 మంది ప్రాణత్యాగాలు చేశారు. ‘దారి’ చూపిన ‘మెతుకుసీమ’ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంపై పోలీసు చర్య చేపట్టాలని నిర్ణయించిన రోజులవి. అప్పటి కేంద్రహోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో ఇండియన్ యూనియన్ సైన్యం హైదరాబాద్ రాజ్యాన్ని చుట్టుముట్టింది. ఉత్తరాన ఉన్న ఔరంగాబాద్ వైపు నుంచి సైనికచర్య మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లా మీదుగానే హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించింది. అదెలా జరిగిందంటే.. నిజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్లు లాతూర్(మహారాష్ట్ర) నుంచి జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా)కు రైలులో బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా భారత సైన్యం బాంబుల మోత మోగించింది. దీంతో రజాకార్లు రైలు దిగి పరుగెత్తారు. ట్రక్కుల్లో పారిపోయారు. కొన్నిట్రక్కులు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతల్లో కూరుకుపోయాయి. అప్పటికే దౌల్తాబాద్, హుమ్నాబాద్, జాల్న ప్రాంతాలు భారతసైన్యం వశమయ్యాయి. 1948 సెప్టెంబర్ 16 భారత సైన్యం జహీరాబాద్ వైపు రోడ్డుమార్గంలో వస్తుండగా రజాకార్లు ఎక్కెల్లి (ప్రస్తుతం కర్ణాటకలో ఉంది) వంతెనను కూల్చేశారు. అయితే భారత సైన్యం తాత్కాలిక వంతెన నిర్మించుకుని ముందుకు సాగడంతో నిజాంసేన చెల్లాచెదురైంది. ఇలా జహీరాబాద్‌ను భారత సేనలు వశపరుచుకున్నాయి. 1948 సెప్టెంబర్ 17 భారతసైన్యం జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా పటాన్చెరు ప్రాంతంలో రజాకార్లు రోడ్డుకు ఇరువైపులా పేలుడు పదార్థాలు ఉంచారు. అప్రమత్తమైన భారతసైన్యం రూట్ మార్చి బొల్లారం మీదుగా ముందుకు సాగాయి. 1948 సెప్టెంబర్ 18 (సాయంత్రం 4 గంటలు): భారత సైన్యం బొల్లారం చేరింది. నిజాం సైన్యాధ్యక్షుడైన ఎల్.ఎద్రూస్ తన ఆయుధాలను వీడి భారత సైన్యం మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఎదుట లొంగిపోయారు. దీంతో ప్రజలు జయజయ ధ్వానాలతో భారత సైనికులకు స్వాగతం పలికారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందామని ఆనందోత్సవాలు చేసుకున్నారు. -
బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని
సాక్షి, హైదరాబాద్: ఏడో నిజాం నవాబు హయాంలో హైదరాబాద్ సంస్థానం ప్రధానమంత్రి మీర్ లాయఖ్ అలీ.. నరనరాన భారత దేశంపై ద్వేషాన్ని, హిందువులపై కోపాన్ని నింపుకున్న వ్యక్తి. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కాకుండా చివరివరకూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నిజాంకు విశ్వాసపాత్రుడైన లాయఖ్ అలీ చివరలో ప్రాణభయంతో పాకిస్తాన్‌కు పారి పోయాడు. ఇక్కడే పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. అచ్చు సినిమా ఫక్కీలో ఆయన పరారీ కథ నడిచింది. మీర్ లాయఖ్ అలీ ఓ ఇంజనీరు, పారి శ్రామిక వేత్తగా నిజాం ఆంతరంగికుల్లో ఒకడిగా ఉండేవాడు. ఈ క్రమంలోనే రజాకార్ల నేత కాసిం రజ్వీ దారుణాలకు అండదండలందిస్తూ హిందువుల ఊచకోతలను ప్రోత్సహించాడని చెబుతారు. దేశ విభజన అనంతరం అనేక కుట్రలు చేశా డనీ అంటారు. ఈయన ఎత్తుగడలకు మెచ్చే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మీర్ లాయఖ్ అలీని నిజాం నవాబు ప్రధానమంత్రిగా నియమించారు. కథ క్లైమాక్స్‌కు వచ్చేసరికి.. నిజాం నవాబు కూడా భారత సేనల ముందు దోషిగా నిలబడక తప్పలేదు. దిల్కుషా నుంచి పరారీ.. నిజాం నవాబు తన ఓటమిని అంగీకరించిన వెంటనే భారత సైన్యం రజాకర్ల నేత ఖాసిం రజ్వీని అరెస్టు చేసింది. హైదరాబాద్ సంస్థానం ప్రధాన మంత్రి మీర్ లాయఖ్ అలీ సహా ఇతర నేతలను గృహనిర్బంధంలో ఉంచింది. తొలుత లాయఖ్ అలీని ఆయన ఇంటిలోనే ఉంచి ఆ తర్వాత దిల్కుషా (తర్వాత ప్రభుత్వ వసతి గృహంగా మార్చారు) భవనానికి మార్చారు. అప్పటికే నిజాం రేడియో ప్రసంగం ద్వారా కాసిం రజ్వీ, లాయఖ్ అలీలను దోషులుగా తేల్చి.. స్వయంగా ప్రాసిక్యూషన్‌కు ఆదేశించారు. చదవండి: ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ కాదు.. కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్ అయితే ఇక్కడే నిజాం దుష్టబుద్ధి చూపించుకున్నారు. లాయఖ్ అలీకి స్వయంగా నిజామే లోపాయికారిగా సహాయం చేశారని చెబుతారు. ఆయన పారిపోయేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. దిల్‌కుషాకు కారును పంపారు. దీంతో లాయఖ్ అలీ బురఖా ధరించి మహిళ వేషంలో గోడదూకి ఆ కారులో బొంబాయికి పారిపోయాడు. అక్కడి నుంచి విమానంలో పాకిస్తాన్ చేరుకున్నాడు. కానీ ఈ విషయం బయటకు పొక్కకుండా నిజాం చక్రం తిప్పారు. పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ పార్టీ జరుగుతోంది. అందులో పాకిస్తాన్లో భారత రాయబారి కూడా పాల్గొన్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి, భారత రాయబారిని పరిచయం చేసుకోవటంతో ఆశ్చర్యపోవటం ఆ రాయబారి వంతైంది. తాను మీర్ లాయఖ్ అలీ అని, హైదరాబాద్ సంస్థానం మాజీ ప్రధానినంటూ ఆయన పేర్కొనటమే దీనికి కారణం. వెంటనే ఆయన భారత అధికారుల దృష్టికి ఈ విషయం తెచ్చారు. అప్పటికి గాని లాయఖ్ అలీ పారిపోయిన విషయం తెలియలేదు. 4రోజుల తర్వాత.. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ భారత్‌కు రాని లాయఖ్ అలీకి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రముఖ స్థానమిచ్చింది. తర్వాత ఆయన న్యూయార్క్‌లో స్థిరపడ్డాడు. 1971లో అక్కడే చనిపోగా ఆయన శవాన్ని సౌదీ అరేబియాలోని మదీనాలో ఖననం చేసినట్టు చరిత్ర చెబుతోంది. -
Telangana Vimochana Dinotsavam: గంగాపూర్ ఘటనతో స్పీడ్ పెంచిన సర్దార్
భారత్‌లో విలీనం కావడం ముందు నుంచి నిజాంకు ఇష్టం లేదు. భారత స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే తాను భారత్‌లో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండే అవకాశం ఉందా అని నిజాం తన సలహాదారు సర్ వాల్టర్ మాంగ్టన్‌ను అడిగాడు. అయితే వాల్టర్ మాంగ్టన్ భారత్ మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం లేదని పాకిస్థాన్‌లో విలీనం కావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. అయినా ఏదో విధంగా స్వతంత్రంగా ఉండాలనేదే నిజాం అభిలాష. మరోవైపు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడైన ఖాసీం రజ్వీ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ సంస్థానం విలీనం చేయకూడదంటూ నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. రజాకార్ల పేరుతో ఖాసీం రజ్వీ ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం అప్పటికే తెలంగాణాలో అరాచాకాలు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో సభ పెట్టి తాము ఎర్రకోటపై నిజాం జెండా ఎగరేస్తామని ఖాసీం రజ్వి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రారంభించాడు. హైదరాబాద్ సంస్థానంపై సైనికచర్యకు సంబంధించి నెహ్రూ-పటేల్ మధ్య వైరుధ్యం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోడానికి సైనికచర్య చివరి ప్రత్యామ్నాయం కావాలని నెహ్రూ భావించారు..పటేల్ మాత్రం తాత్సారం చేయకూడదనే ఆలోచనతో ఉన్నారు. దీనికోసం ఆపరేషన్ పోలో పేరుతో ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఈ ఆపరేషన్ అత్యంత వేగంగా పూర్తవ్వాలనేది పటేల్ వ్యూహం. గంగాపూర్ రైల్వేస్టేషన్లో రజాకార్లు చేసిన దాడి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీంతో అప్పటి వరకు సహనంతో ఉన్న పటేల్ వెంటనే హైదరాబాద్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. వెంటనే కాశ్మీర్లో ఉన్న సైన్యాధ్యక్షుడు కరియప్పను ఢిల్లీకి పిలిపించిన పటేల్.. హైదరాబాద్‌పై చర్యకు సిద్ధం కావాలని ఆదేశించారు. దీంతో సైనికాధికారులు అత్యంత వేగంగా సైనిక చర్య పూర్తి చేసే విధంగా వ్యూహాలు రూపొందించారు. ఒకవేళ హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం చర్యకు దిగితే పాకిస్థాన్ ఏదైనా ప్రతీకార దాడులు చేస్తుందా అనే కోణంలోనూ పటేల్ వ్యూహాలు సిద్ధం చేశారు. దీనికోసం నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పడు సమాచారం సేకరించి పాకిస్థాన్ ఎత్తుగడలపై సమీక్షలు జరిపారు. ఇక భారత్ సైనిక చర్యను నిజాం సైన్యం ఎంతకాలం ఎదుర్కోగలదనే విషయంపై ప్రాథమికంగా కొంత గందరగోళం ఉండింది. ముఖ్యంగా నిజాం యుద్ధవిమానాలు కొనుగోలు చేస్తున్నాడని కొంతమంది సైనిక జనరల్స్ సమాచారం ఇచ్చారు. దీంతో సైనిక చర్యకు దిగాలా.. వద్దా అనే మీమాంస ఎదురైంది. -
నిజాం నిధులపై పాక్‌కు చుక్కెదురు
లండన్: 1948 నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో డిపాజిట్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుకు చెందిన 35 మిలియన్ పౌండ్ల (రూ. 306.5 వందల కోట్లు)పై దశాబ్దాలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రస్తుతానికి భారత్‌కు అనుకూలంగా ముగిసింది. ఆ నిధులపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదని యూకే హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అవి భారత్‌కు, నిజాం వారసులకే చెందాలని స్పష్టం చేసింది. 1948లో ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్ (సుమారు ఒక మిలియన్ పౌండ్లు)లను బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోని పాకిస్తాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికి అవి దాదాపు 35 మిలియన్ పౌండ్లకు చేరాయి. ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్ చేసిన వాదనను జస్టిస్ మార్కస్ స్మిత్ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు. ‘ఈ వివాదం ప్రారంభమైనప్పుడు నా క్లయింట్లు చిన్నపిల్లలు.. ఇప్పుడు వారి వయస్సు 80 ఏళ్లకు పైగానే. ఇప్పటికైనా, వారి జీవిత కాలంలోనే ఈ తీర్పు రావడం, అదీ వారికి అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది’అని నిజాం వారసుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పాల్ హెవిట్ వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా పాక్ రెండు వాదనలు వినిపించింది. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలుకు సంబంధించిన డబ్బును లండన్ బ్యాంక్‌లో ఏడవ నిజాం జమ చేశారని, అందువల్ల ఆ నిధులు తమకే చెందుతాయన్నది ఒక వాదన. భారత్‌కు ఆ నిధులు చెందకూడదనే ఉద్దేశంతోనే లండన్ బ్యాంక్‌కు బదిలీ చేశారన్నది రెండవ వాదన. అలాగే, భారత ప్రభుత్వ ఆధీనంలోకి రాకముందు నిజాం రాజ్యం ప్రభుత్వ హోదాలో ఆ నిధుల బదిలీ చేసిందని కూడా పాక్ వాదించింది. హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కూడా చట్టవ్యతిరేక చర్య అని పేర్కొంది. ఈ వాదనలన్నింటిని కోర్టు తోసిపుచ్చింది. పాక్ నుంచి ఆయుధాల కొనుగోలు నిజమే అని నమ్ముతున్నప్పటికీ.. ఈ నిధులు వాటికి సంబంధించినవే అనేది నిర్ధారణ కాలేదని పేర్కొంది. భారత్‌కు చెందకూడదనే నిధుల బదిలీ జరిగిందని భావించినా.. దానర్థం ఆ నిధులు ఏదో ట్రస్ట్‌కు కాకుండా పాకిస్తాన్‌కే చెందాలనేందుకు ఆధారాలు లేవంది. హైదరాబాద్ రాజ్యం భారత్‌లో కలిసిన విషయం ఈ కేసుకు అప్రస్తుతమని స్పష్టం చేసింది. ఆ నిధులను తిరిగి తనకు ట్రాన్స్ఫర్ చేయాలని ఆ తరువాత నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ కోరిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం, నిజాం వారసులు గత సంవత్సరం ఒక రహస్య ఒప్పందానికి రావడంతో.. ఈ కేసు భారత్– పాక్‌ల మధ్య వ్యాజ్యంగా మారింది. తీర్పుపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. తీర్పును అధ్యయనం చేస్తున్నామని, న్యాయ సలహా తీసుకుని తదుపరి ఏం చేయాలనే విషయం నిర్ణయిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌ను భారత ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించిన విషయాన్ని కోర్టు విస్మరించిందని వ్యాఖ్యానించింది. ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ -
హిందూ రాజు ముస్లిం రాజ్యం
స్వాతంత్య్రానంతర పరిణామాల్లో రెండు రాచరిక పాలనల్లోని రాజ్యాంగ అంశాలు కీలకంగా మారాయి. అవే హైదరాబాద్, కశ్మీర్ సంస్థానాలు. ఈ రెండు సంస్థానాల మధ్య ఒక పోలిక ఉంది. హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు కాగా, రాజ్యాధికారం ముస్లింల చేతిలో ఉండేది. కశ్మీర్లో మెజారిటీ ప్రజలు ముస్లింలు కాగా, అధికారం హిందూ రాజు చేతిలో ఉండేది. భారత్‌లో విలీనానికి నిజాం రాజు అంగీకరించకపోవడంతో ‘ఆపరేషన్ పోలో’తో భారత్ సైన్యాన్ని దించడంతో, హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. పాకిస్తాన్ సైన్యం దురాక్రమణకు రావడంతో కశ్మీర్ రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు, ఒప్పందాలకు లోబడి కశ్మీర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రాన్ని సాధించుకునేటప్పటికి 562 ప్రాంతాలు రాచరిక పాలనలో ఉన్నాయి. అయితే అందులో మూడు మాత్రం 1947 స్వాతంత్య్రానంతరం కూడా అదే రాచరిక వ్యవస్థలో కొనసాగాయి. కశ్మీర్, హైదరాబాద్, గుజరాత్ కతీవార్ ప్రాంతంలోని జునాగఢ్‌లు మాత్రం 1947 నాటికి భారత్‌లో భాగం కాలేదు. హైదరాబాద్ సంస్థానం ప్రత్యేకత... బ్రిటిష్ పాలన సమయంలోనే హైదరాబాద్ సంస్థానానికి ప్రత్యేక సైన్యముండేది. ప్రత్యేకంగా రైల్వే, పోస్టల్ విభాగాలున్నాయి. హైదరాబాద్ సంస్థానంలో 80 శాతంగా ఉన్న హిందువులను ముస్లిం రాజు పాలించేవాడు. భారత్ పాకిస్తాన్ విభజన సందర్భంగా హైదరాబాద్ సంస్థాన నిజాం రాజు 1947 జూన్ 26న హైదరాబాద్ సంస్థానం ఇటు పాకిస్తాన్‌లోకానీ, భారత్‌లో కానీ విలీనం కాబోదని ఫర్మానా జారీ చేశాడు. హైదరాబాద్ సంస్థానంపై సంపూర్ణాధిపత్యాన్ని కొనసాగించాలని భావిం చాడు. ఆయనకు టోరీ పార్టీ నాయకుడు విన్స్టన్ చర్చిల్ వెన్నుదన్నుగా నిలిచాడు. 1947 ఆగస్టు 15 నాటికి నిజాం రాజు తేల్చుకోలేకపోవడంతో భారతప్రభుత్వం మరో రెండు నెలల సమయమిచ్చింది. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ హైదరాబాద్ స్వతంత్రతను ఒప్పుకునే ప్రసక్తే లేదని నిజాంని హెచ్చరించారు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలపై నిరంకుశ పోకడలను మానుకోవాలని నిజాం రాజును భారత సర్కార్ 1948 సెప్టెంబర్ 7న హెచ్చరించింది. భారతసైన్యం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో అడుగుపెట్టడంతో హైదరాబాద్ సంస్థానం ఎట్టకేలకు భారత్‌లో విలీనమైంది. అదేసమయంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న కశ్మీర్ సంస్థానాన్ని రాజా హరిసింగ్ పాలిస్తున్నారు. కశ్మీర్‌పై పాకిస్తాన్ దండెత్తడంతో రాజా హరిసింగ్ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు ముందుకొచ్చారు. చివరకు కొన్ని షరతులకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ భారత్‌లో విలీనం అయ్యింది. -
బందూకు నుంచి.. బ్యాలెట్ దాకా..
సాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను పోరాటంలోనే కాకుండా ఎన్నికల్లో కూడా ఓటర్లు ఆదరించారు. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని అప్పటి నిజాంనవాబు ప్రకటించారు. దాంతో పాటు ఖాసిం రజ్వీ రాజకార్ల ఉద్యమాన్ని ప్రారంభించి దోపిడీతో పాటు అణచివేతకు తెరలేపాడు. దీంతో తెలంగాణ రైతాంగసాయుధ పోరాటం లో అప్పటి కమ్యూనిస్టు ఉద్యమ నేతలు పాల్గొన్నారు. ఆ ఉద్యమంతో హైదరాబాద్ సంస్థానం దేశంలో కలిసింది. తెలంగాణ సాయుధ పోరాటం అప్పట్లో ఉవ్వెత్తున ఎగిసింది. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంతో మంది నాయకులు ఆస్తిపాస్తులను సైతం లెక్కచేయకుండా నిజాంనవాబును ఎదిరించారు. ఉద్యమంలో పాల్గొన్న నేతలు భారత దేశంలో తొలిసారిగా ప్రజా స్వామ్య పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో పోటీ చేశారు. ఉద్యమంలో ప్రజల మద్దతు కూడగట్టిన నేతలకు ఓటర్లు కూడా మద్దతు తెలిపి శాసనసభకు పంపారు. సాయుధపోరాటం నుంచి.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన దంపతులు ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, అదే విధంగా అన్నాచెల్లెళ్లు భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం ఉన్నారు. వారితో పాటు బొమ్మగాని ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డి, నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, నర్రా రాఘవరెడ్డి ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించారు. ‘ఆరుట్ల’ దంపతులు : తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి దంపతులు. కమలాదేవిది ఆలేరు మండలం మంతపురి. ఆమె మేనమామ కుమారుడు రామచంద్రారెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆమె అసలు పేరు రుక్మిణి కాగా వివాహ అనంతరం కమలాదేవిగా పేరు మార్చుకున్నారు. ఆమె ఆంధ్రామహాసభలో పాల్గొనడంతో పాటు రజాకార్లను ఎదుర్కోవడానికి గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసింది. నిజాం విమోచన ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లింది. ఆమెతో పాటు భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డిది భువనగిరి సమీపంలో ఉన్న కొలనుపాక గ్రామం. హైదరాబాద్‌లోని రెడ్డిహాస్టల్లోఉండి చదువుకుని 1947లో గెరిళ్లా శిక్షణ పొంది ఉద్యమం వైపునకు అడుగులు వేశారు. పోరాట సమయంలో పోలీసులకు చిక్కి 1952 వరకు నిర్బంధంలోనే ఉన్నాడు. వీరిద్దరు 1962లో ఒకేసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా ఒకేసారి శాసనసభలో ఉండటం విశేషం. ఆరుట్ల కమలాదేవి ఆలేరు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు 1952, 1957, 1962లో విజయం సాధించారు. ఆమె భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి భువనగిరి నియోజకవర్గం నుంచి 1962లో ఒకసారి, మ రోసారి మెదక్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి శాసనసభకు ఎన్నికయ్యారు. భీమిరెడ్డి, మల్లు స్వరాజ్యం : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి భీమిరెడ్డి నర్సింహారెడ్డి గుండెకాయ. ఉద్యమ నేతగా ఉన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం అన్నాచెల్లెళ్లు. వీరిది సూర్యాపుట తాలూకాలోని కరివిరాల గ్రామం.వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సాయుధపోరాటంలో పాల్గొని ప్రజలను చైతన్యం చేశారు. వీరిద్దరు కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి 1957లో గెలిచారు. ఆ తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో సీపీఎం తరఫున పోటీ చేసిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి 1967లో గెలిచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన చెల్లెలు మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి 1978, 1983లో గెలిచారు. అదే విధంగా భీమిరెడ్డి నర్సింహారెడ్డి మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి: భూస్వామ్య కుటుంబంలో పుట్టిన నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్నారు. నిజాం నవాబును ఎదిరించడానికి ఉద్యమంలో పాల్గొన్నాడు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి నకిరేకల్ నియోజకవర్గంలో 1962లో విజయం సాధించారు. తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్నారు. సీపీఐ తరఫున పోటీ చేసి గెలుపొందారు నర్రా రాఘవరెడ్డి: రాజకీయ నేతలకు ఆదర్శ నాయకుడు. అహంబావాలు, ఢాంబికాలు లేని శాసనసభ్యుడిగా పేరెన్నికగన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నర్రా రాఘవరెడ్డి ఉద్యమంలో ఆయన బుర్రకథల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. ఆయన మొట్టమొదటిసారి 1959లో చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. ఆయన నకిరేకల్ అసెంబ్లీ నియోకవర్గంలో తిరుగులేని వ్యక్తిగా విజయం సాధించారు. వరుసగా ఐదు పర్యాయాలు విజయం సాధించి రికార్డు బ్రేక్ చేశారు. మొత్తంగా ఆరు పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు ఎన్నికై ఎమ్మెల్యేగా పని చేశారు. 1967 నుంచి 1972 మినహా వరుసగా 1978, 1983, 1985, 1989, 1994లో విజయం సాధించారు. ధర్మభిక్షం : సూర్యాపేటకు చెందిన బొమ్మగాని ధర్మభిక్షం తెలంగాణ సాయుధ పోరాటంలో పాటాలు నేర్పిన వ్యక్తి. విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ధర్మభిక్షం పేరు వింటే నిజాంనవాబుకు వణుకు పుట్టేది. ఆయన శాసనసభతో పాటు పార్లమెంట్‌కు కూడా ఎన్నికయ్యారు. సూర్యాపేట, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సూర్యాపేటలలో 1952లో, నకిరేకల్‌లో 1957లో పీడీఎఫ్ తరఫున పోటీ చేశారు. అదే విధంగా 1962లో సీపీఐ తరఫున నల్లగొండలో పోటీ చేసి విజయం సా«ధించారు. అంతే కాకుండా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి రెండు పర్యాయాలు 1991, 1996లో ఎంపీగా ఎన్నికయ్యారు. రావి నారాయణరెడ్డి: ఆంధ్రా మహాసభ, ఆంధ్రా జనసంఘం ఏర్పాటు చేశారు. రెడ్డి హాస్టల్లో విద్యార్థిగా ఉండి స్వాతంత్య్ర పోరాటంలో సైతం పాల్గొన్నారు. ఆయన స్వగ్రామం భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామం. తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న రావి నారాయణరెడ్డి ఎన్నికల తొలినాళ్లలో పోటీ చేసి విజయం సాధించారు. ఆయన భువనగిరి నియోజకవర్గంలో 1952లో పీడీఎఫ్ తరఫున పోటీ చేశారు. అదే సమయంలో నల్లగొండ లోక్‌సభకు కూడా ఎన్నిక కావడం వల్ల రాజీనామా చేశారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి భారతదేశ ప్రధాని నెహ్రూకంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిం చారు. అనంతరం 1957లో మరోసారి భువనగిరి ఎమ్మెల్యేగా పీడీఎఫ్ తరఫున పోటీచేసి గెలుపొందారు. -
ఏపీ భవన్‌ను తెలంగాణకు అప్పగించండి
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం కేసీఆర్ లేఖ అది నిజాం ఆస్తి.. తెలంగాణకే చెందుతుంది ఆరో నిజాం కాలంలోనే ఈ ఆస్తి హైదరాబాద్ స్టేట్‌కు సమకూరింది అక్కడ మేం కొత్త భవన్, సాంస్కృతిక కేంద్రం నిర్మిస్తాం బదులుగా జనాభా నిష్పత్తి ప్రకారం ఏపీకి పరిహారమిస్తాం సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని ఏపీ భవన్, దాని అధీనంలో ఉన్న మొత్తం స్థలాన్ని తెలంగాణకు అప్పగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ స్థలం హైదరాబాద్ స్టేట్‌కు చెందిందని, దానిపై పూర్తి హక్కు తెలంగాణకే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు గురువారం లేఖ రాశారు. దేశ రాజధానిలో త్వరలోనే తెలంగాణవాసులకు సాంస్కృతిక కేంద్రం, ప్రణాళికాబద్ధం గా తెలంగాణ భవన్ నిర్మించాలనుకుంటున్నామని అందులో తెలిపారు. అందుకే ఆ స్థలాన్ని తమకు అప్పగించే విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. ‘‘విదేశీ వ్యవహారాల శాఖ రికార్డుల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన నిజాం ప్రభుత్వం 1917, 1928, 1936లో ఢిల్లీలో 18.18 ఎకరాల స్థలాన్ని భారత ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఈ స్థలంలో ప్రస్తుత హైదరాబాద్ హౌజ్, తెలంగాణ భవన్, ఏపీ భవన్ ఉన్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో హైదరాబాద్ హౌజ్‌ను కేంద్రం స్వాధీనం చేసుకుంది. 7.56 ఎకరాల పటౌడీ హౌస్, 1.21 ఎకరాల నర్సింగ్ ఇన్స్టిట్యూట్ను అప్పటి ఏపీ ప్రభుత్వానికి కేటాయించింది. ఆరో నిజాం కాలంలోనే ఈ స్థలమంతా హైదరాబాద్ ప్రభుత్వానికి సమకూరింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ స్థలం ఉంది. 1948లో దేశంలో విలీనమైన తర్వాత కూడా ఈ స్థలం హైదరాబాద్ స్టేట్‌కే బదిలీ అయింది. 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు సదరు స్థలం హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం అధీనంలోనే ఉంది. రెండేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతమే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. నిజాం రాజుల నుంచి హైదరాబాద్ స్టేట్‌కు బదిలీ అయిన ఈ స్థలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది. దాన్ని ఏపీ, తెలంగాణకు విభజించటం కుదరదు’’ అని సీఎం లేఖలో వివరించారు. చారిత్రక ఆధారాలు చూడండి ‘‘1956 వరకు వేర్వేరు రాష్ట్రాలుగా చెలామణి అయిన రెండు రాష్ట్రాలకు ఢిల్లీలో రెండు వేర్వేరు భవన్లు ఉండాల్సి ఉండేది. నిజాం రాజుల నుంచి వచ్చిన స్థలాన్ని హైదరాబాద్‌కు కేటాయించినట్లే, మద్రాస్ నుంచి వేరుపడిన ఆంధ్రకు ఢిల్లీలో ప్రత్యేకంగా స్థలం కేటాయించాల్సి ఉండేది. అలా కాకుంటే జనాభా నిష్పత్తి ప్రకారం మద్రాస్ (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రానికి ఉన్న స్థలంలో ఆంధ్రకు వాటా ఇచ్చి ఉండాల్సింది. ఈ చారిత్రక ఆధారాలు, వాస్తవాలు గమనించి ఏపీ భవన్ అధీనంలో ఉన్న మొత్తం స్థలాన్ని తెలంగాణకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. ‘‘ప్రత్యామ్నాయంగా ఏపీకి స్టేట్ భవన్, రెసిడెంట్ కమిషనర్ ఆఫీసు ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో వేరే స్థలాన్ని కేటాయించాలి. ఈ స్థలంలో ఉన్న భవనాలను ఉమ్మడి వనరులతో నిర్మించారు. అందుకే బుక్ వాల్యూను లెక్కగట్టి జనాభా నిష్పత్తి ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన పరిహారం తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. వీలైనంత తొందరగా ఈ స్థలంలో తెలంగాణ సాంస్కృతిక కేంద్రంతో పాటు పద్ధతి ప్రకారం తెలంగాణ భవన్ నిర్మించాలనే ఆలోచన ఉంది. అందుకే సదరు స్థలాన్ని తెలంగాణకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను’’ అని కోరారు. -
'పటేల్ లేకుంటే హైదరాబాద్ భారత్‌లో కలిసేదికాదు'
హైదరాబాద్: దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ భారత్‌లో విలీనమయ్యేదికాదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం పటేల్ 139 జయంతి సందర్భంగా రాజ్‌నాథ్ హైదరాబాద్‌లో సమైక్యత పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా పటేల్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైందని అన్నారు. పటేల్ లేకుంటే హైదరాబాద్ భారత్‌లో కలిసేదికాదని చెప్పారు. పటేల్ 70 రోజుల్లో 562 సంస్థానాలను భారత్‌లో విలీనం చేశారని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పరేడ్‌లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. -
‘విలీన ఉత్సవాలను’ నిర్వహించాలి
హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనమైన సెప్టెంబర్ 17ను స్వాతంత్య్రదినంగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వమే అధికారిక ఉత్సవాలు నిర్వహించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ కు సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్యే ఆర్. రవీంద్రకుమార్ వినతిపత్రాన్ని సమర్పించారు. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని, ఇప్పుడు దానిపై ఆలోచించలేమని సీఎం అన్నారని తెలిసింది. ఈ ఉత్సవాలపై ఎంఐఎం ఒత్తిడి గత ప్రభుత్వాలపై పనిచేసిందని, ఈ ప్రభుత్వంపై కూడా ఉంటుందా అనేది సీఎం స్పందనను బట్టి తెలుస్తుందని చాడ వెంకటరెడ్డి మీడియాతో అన్నారు.