- కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం కేసీఆర్ లేఖ
- అది నిజాం ఆస్తి.. తెలంగాణకే చెందుతుంది
- ఆరో నిజాం కాలంలోనే ఈ ఆస్తి హైదరాబాద్ స్టేట్‌కు సమకూరింది
- అక్కడ మేం కొత్త భవన్, సాంస్కృతిక కేంద్రం నిర్మిస్తాం
- బదులుగా జనాభా నిష్పత్తి ప్రకారం ఏపీకి పరిహారమిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని ఏపీ భవన్, దాని అధీనంలో ఉన్న మొత్తం స్థలాన్ని తెలంగాణకు అప్పగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ స్థలం హైదరాబాద్ స్టేట్‌కు చెందిందని, దానిపై పూర్తి హక్కు తెలంగాణకే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు గురువారం లేఖ రాశారు. దేశ రాజధానిలో త్వరలోనే తెలంగాణవాసులకు సాంస్కృతిక కేంద్రం, ప్రణాళికాబద్ధం గా తెలంగాణ భవన్ నిర్మించాలనుకుంటున్నామని అందులో తెలిపారు. అందుకే ఆ స్థలాన్ని తమకు అప్పగించే విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. ‘‘విదేశీ వ్యవహారాల శాఖ రికార్డుల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన నిజాం ప్రభుత్వం 1917, 1928, 1936లో ఢిల్లీలో 18.18 ఎకరాల స్థలాన్ని భారత ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఈ స్థలంలో ప్రస్తుత హైదరాబాద్ హౌజ్, తెలంగాణ భవన్, ఏపీ భవన్ ఉన్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో హైదరాబాద్ హౌజ్‌ను కేంద్రం స్వాధీనం చేసుకుంది.
7.56 ఎకరాల పటౌడీ హౌస్, 1.21 ఎకరాల నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను అప్పటి ఏపీ ప్రభుత్వానికి కేటాయించింది. ఆరో నిజాం కాలంలోనే ఈ స్థలమంతా హైదరాబాద్ ప్రభుత్వానికి సమకూరింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ స్థలం ఉంది. 1948లో దేశంలో విలీనమైన తర్వాత కూడా ఈ స్థలం హైదరాబాద్ స్టేట్‌కే బదిలీ అయింది. 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు సదరు స్థలం హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం అధీనంలోనే ఉంది. రెండేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతమే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. నిజాం రాజుల నుంచి హైదరాబాద్ స్టేట్‌కు బదిలీ అయిన ఈ స్థలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది. దాన్ని ఏపీ, తెలంగాణకు విభజించటం కుదరదు’’ అని సీఎం లేఖలో వివరించారు.
చారిత్రక ఆధారాలు చూడండి
‘‘1956 వరకు వేర్వేరు రాష్ట్రాలుగా చెలామణి అయిన రెండు రాష్ట్రాలకు ఢిల్లీలో రెండు వేర్వేరు భవన్‌లు ఉండాల్సి ఉండేది. నిజాం రాజుల నుంచి వచ్చిన స్థలాన్ని హైదరాబాద్‌కు కేటాయించినట్లే, మద్రాస్ నుంచి వేరుపడిన ఆంధ్రకు ఢిల్లీలో ప్రత్యేకంగా స్థలం కేటాయించాల్సి ఉండేది. అలా కాకుంటే జనాభా నిష్పత్తి ప్రకారం మద్రాస్ (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రానికి ఉన్న స్థలంలో ఆంధ్రకు వాటా ఇచ్చి ఉండాల్సింది. ఈ చారిత్రక ఆధారాలు, వాస్తవాలు గమనించి ఏపీ భవన్ అధీనంలో ఉన్న మొత్తం స్థలాన్ని తెలంగాణకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని సీఎం తన లేఖలో పేర్కొన్నారు.
‘‘ప్రత్యామ్నాయంగా ఏపీకి స్టేట్ భవన్, రెసిడెంట్ కమిషనర్ ఆఫీసు ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో వేరే స్థలాన్ని కేటాయించాలి. ఈ స్థలంలో ఉన్న భవనాలను ఉమ్మడి వనరులతో నిర్మించారు. అందుకే బుక్ వాల్యూను లెక్కగట్టి జనాభా నిష్పత్తి ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన పరిహారం తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. వీలైనంత తొందరగా ఈ స్థలంలో తెలంగాణ సాంస్కృతిక కేంద్రంతో పాటు పద్ధతి ప్రకారం తెలంగాణ భవన్ నిర్మించాలనే ఆలోచన ఉంది. అందుకే సదరు స్థలాన్ని తెలంగాణకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను’’ అని కోరారు.