త్వరలోనే రాష్ట్రపతి ఉత్తర్వులు! | Rajnath assured to KCR on the modification of the zonal system | Sakshi
Sakshi News home page

త్వరలోనే రాష్ట్రపతి ఉత్తర్వులు!

Published Mon, Aug 27 2018 1:50 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

Rajnath assured to KCR on the modification of the zonal system - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నూతన జోనల్‌ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భరోసా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఎంపీలు బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో విభజన అంశాలపై చర్చించారు. తెలంగాణలో నూతన జోనల్‌ వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాని ఆమోదం పొందడంలో హోం మంత్రి చొరవ చూపినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరగా, హోం మంత్రి భరోసా ఇచ్చారు. అలాగే హైకోర్టు విభజన తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని, దీనిపై కూడా చొరవచూపి వేగంగా పరిష్కరించాలని కోరారు. షెడ్యూలు 9, 10 సంస్థల విభజనలో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరగా.. ఈ అంశాలను పరిష్కరించే బాధ్యతను సీనియర్‌ అధికారులకు అప్పగిస్తామని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ హెవీ మెషినరీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ (ఏపీహెచ్‌ఎంఈఎల్‌) సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ విభజన తదితర సంస్థల విభజన వివాదాలను కూడా ప్రస్తావించారు.  

ఆర్థిక మంత్రితో సమావేశం 
హోంమంత్రితో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాలపాటు పలు అంశాలపై నివేదించారు. ఆర్థిక మంత్రి ఆరోగ్య కారణాల రీత్యా సీఎం ఒక్కరే ఈ సమావేశంలో పాల్గొన్నారు. మూడు అంశాలపై వినతిపత్రాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధన మేరకు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 450 కోట్ల చొప్పున మూడు విడతలుగా విడుదల చేశారని, నాలుగో విడత విడుదల చేయాల్సి విన్నవించారు. అలాగే మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలపై వడ్డీలో కేంద్ర వాటాను వెంటనే విడుదల చేయాలని కోరారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) కింద కేటగిరీ–2 జిల్లాలైన నల్లగొండ, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల పొదుపు సంఘాలకు వడ్డీ రాయితీ ఇవ్వాల్సి ఉందని వివరించారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి రూ.102.86 కోట్లు, 2015–16కు రూ.87.15 కోట్లు, 2016–17కు 53.04 కోట్లు, 2017–18కు రూ. 96.20 కోట్లు.. మొత్తంగా రూ.339.25 కోట్లు విడుదల కావాల్సి ఉందని విన్నవించారు.  

ఎఫ్‌ఆర్‌బీఎం సడలింపుపై.. 
ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితి అయిన జీఎస్‌డీపీలో 3 శాతానికి అదనంగా రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకు మరో అర శాతం సడలించేందుకు పద్నాలుగో ఆర్థిక సంఘం అవకాశం కల్పించిందని ఆర్థిక మంత్రికి గుర్తు చేశారు. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతానికి సడలించిందని, 2017–18లో కూడా రాష్ట్రంలో రెవెన్యూ మిగులు ఉన్నందున 2018–19కి సైతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సాగునీరు, తాగునీటి పథకాలకు అధిక మొత్తంలో వెచ్చిస్తున్నామని, అందువల్ల మరిన్ని రుణాలు పొందాల్సి ఉందని వివరించారు.  

పెండింగ్‌ నిధులు విడుదల చేయండి.. 
అరుణ్‌ జైట్లీతో కేసీఆర్‌ భేటీ వివరాలను బూర నర్సయ్య గౌడ్‌ వెల్లడించారు. ‘తెలంగాణలో నాలుగు లక్షల సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులున్నాయి. వీటికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. వడ్డీలో కేంద్ర వాటా కింద గత నాలుగేళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.339 కోట్లు విడుదల చేయాలని కోరారు. దేశంలో అత్యధిక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం తెలంగాణ. దీని ప్రకారంగా అదనంగా 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుకునే అవకాశం ఉంది. తెలంగాణకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని జీఎస్‌డీపీలో 3.5 శాతంగా సడలించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం నివేదించారు’అని తెలిపారు. 

కేసు పరిష్కారమైతే హైకోర్టు విభజన... 
కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రితో సీఎం సమావేశం ముగిసిన అనంతరం ఎంపీలు బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్‌ మీడియాకు సంబంధిత వివరాలు వెల్లడించారు. ‘రాజ్‌నాథ్‌ను ముఖ్యమంత్రి కలిశారు. రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో విభజన చట్టంలో పేర్కొన్న చాలా విషయాలు పరిష్కరించడానికి కొంత ప్రయత్నం జరిగింది. ఇంకా కొన్ని పరిష్కరించలేదు. షెడ్యూల్‌ 9, షెడ్యూల్‌ 10 అంశాలను ఇంకా తేల్చాల్సి ఉంది. హైదరాబాద్‌ రాజధానిగా ఉన్న సందర్భంలో విభజన చట్టంలో ఆస్తుల విషయంలో స్పష్టంగా చెప్పారు. ఎక్కడి ఆస్తులు అక్కడ ఉంటాయని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఇంకా ఈ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని సీఎం కోరారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కొన్ని గదులు ఏపీ భవన్‌కు, కొన్ని గదులు తెలంగాణ భవన్‌కు ఇచ్చారు.

గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కమిషనర్లు, రెసిడెంట్‌ కమిషనర్లు పనిచేస్తున్నారు. దీని విభజనపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇది వరకే తెలియపరిచినా తెలంగాణ దీనిపై మరింత స్పష్టత కోరింది. అది తెలంగాణ ఆస్తిగా గతంలో మేం చెప్పాం. అయితే 58ః42 నిష్పత్తిలో పంచాలని కేంద్రం చెప్పింది. దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరాం. ఇలాంటి అంశాలన్నింటినీ హోం మంత్రికి వివరించాం. అతి ముఖ్యమైన సమస్య హైకోర్టు విభజన. ఇది న్యాయశాఖ పరిధిలో ఉన్నప్పటికీ కేంద్ర హోం శాఖ నోడల్‌ ఏజెన్సీ అయినందున త్వరగా పరిష్కరించాలని కోరాం. విభజన చట్టంపై సుప్రీం కోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయి. ఈ వారంలో సంబంధిత కేసు రానుంది. ఆ కేసు పరిష్కారమైతే ఆ వెంటనే హైకోర్టు విభజనపై ఉత్తర్వులు వెలువడేందుకు మార్గం సుగమమవుతుంది’అని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement