jonal system
-
317 జీవోను వెంటనే రద్దు చేయాలి: టీఈఏ
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానం అమల్లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను రద్దు చేయాలని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలన్న డిమాండ్లతో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్‌కుమార్ నేతృత్వంలో ఆదివారం ఇంది రాపార్క్ వద్ద నిరసన దీక్ష జరిగింది. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే నియమించి, పంచాయతీ సెక్రటరీల పైన తీవ్ర పనిభారం తగ్గించాలని కోరారు. సెపె్టంబర్ 2020లో అసెంబ్లీలో సీఎం ప్రకటించిన వీఆర్ఏల పే స్కేల్ జీవో వెంటనే అమలు చేయాలన్నారు. నిషేధం ఎత్తివేసి వెంటనే సాధారణ బదిలీలను చేపట్టాలని, దీర్ఘకాలికంగా రెవెన్యూ శాఖ, విద్య శాఖలో ఆగిపోయిన ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ జీవోలో తెలిపిన విధంగా ఏప్రిల్, 2021.. మే, 2021 రెండు నెలల పీఆర్సీ బకాయిలను మార్చి, 2022లోగా చెల్లించాలని కోరారు. దీక్షలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొట్టబత్తిని పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల పోస్టుల భర్తీపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో ఉద్యోగాల భర్తీపై అయోమయం నెలకొంది. గురుకుల బోర్డు ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వం పలు పోస్టులు మంజూరు చేసినా ఆ మేరకు పూర్తిస్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దాదాపు 1,350 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉండగా కొత్త జోన్లు, మల్టీజోన్లు ఏర్పాటు కావడం, ఆ తర్వాత ప్రభుత్వం రద్దు కావడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వాటి భర్తీపై గురుకుల నియామకాల బోర్డు అయోమయంలో పడింది. కొత్త జోన్ల ప్రకారం భర్తీ చేయాలా లేక పాత జోన్ల ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేయాలా అనే విషయమై సందిగ్ధం నెలకొంది. దీంతో ప్రభుత్వాన్నే వివరణ కోరాలని భావించిన గురుకుల నియామకాల బోర్డు ఆ మేరకు పరిస్థితిని ప్రభుత్వానికి వివరించింది. కొత్తగా ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు కావడంతో ఆ మేరకు సైతం పోస్టులను విభజించుకుని ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే నోటిఫికేషన్లు ఇచ్చేందుకు బోర్డు యంత్రాగం కసరత్తు చేస్తోంది. -
కొత్త జోన్ల వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం
-
త్వరలోనే రాష్ట్రపతి ఉత్తర్వులు!
సాక్షి, న్యూఢిల్లీ: నూతన జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భరోసా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఎంపీలు బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో విభజన అంశాలపై చర్చించారు. తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రధాని ఆమోదం పొందడంలో హోం మంత్రి చొరవ చూపినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల జారీ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరగా, హోం మంత్రి భరోసా ఇచ్చారు. అలాగే హైకోర్టు విభజన తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని, దీనిపై కూడా చొరవచూపి వేగంగా పరిష్కరించాలని కోరారు. షెడ్యూలు 9, 10 సంస్థల విభజనలో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరగా.. ఈ అంశాలను పరిష్కరించే బాధ్యతను సీనియర్ అధికారులకు అప్పగిస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్ఎంఈఎల్) సంస్థ, ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన తదితర సంస్థల విభజన వివాదాలను కూడా ప్రస్తావించారు. ఆర్థిక మంత్రితో సమావేశం హోంమంత్రితో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాలపాటు పలు అంశాలపై నివేదించారు. ఆర్థిక మంత్రి ఆరోగ్య కారణాల రీత్యా సీఎం ఒక్కరే ఈ సమావేశంలో పాల్గొన్నారు. మూడు అంశాలపై వినతిపత్రాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధన మేరకు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 450 కోట్ల చొప్పున మూడు విడతలుగా విడుదల చేశారని, నాలుగో విడత విడుదల చేయాల్సి విన్నవించారు. అలాగే మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలపై వడ్డీలో కేంద్ర వాటాను వెంటనే విడుదల చేయాలని కోరారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) కింద కేటగిరీ–2 జిల్లాలైన నల్లగొండ, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల పొదుపు సంఘాలకు వడ్డీ రాయితీ ఇవ్వాల్సి ఉందని వివరించారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి రూ.102.86 కోట్లు, 2015–16కు రూ.87.15 కోట్లు, 2016–17కు 53.04 కోట్లు, 2017–18కు రూ. 96.20 కోట్లు.. మొత్తంగా రూ.339.25 కోట్లు విడుదల కావాల్సి ఉందని విన్నవించారు. ఎఫ్ఆర్బీఎం సడలింపుపై.. ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితి అయిన జీఎస్డీపీలో 3 శాతానికి అదనంగా రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలకు మరో అర శాతం సడలించేందుకు పద్నాలుగో ఆర్థిక సంఘం అవకాశం కల్పించిందని ఆర్థిక మంత్రికి గుర్తు చేశారు. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రానికి ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3.5 శాతానికి సడలించిందని, 2017–18లో కూడా రాష్ట్రంలో రెవెన్యూ మిగులు ఉన్నందున 2018–19కి సైతం ఎఫ్ఆర్బీఎం పరిమితిని సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సాగునీరు, తాగునీటి పథకాలకు అధిక మొత్తంలో వెచ్చిస్తున్నామని, అందువల్ల మరిన్ని రుణాలు పొందాల్సి ఉందని వివరించారు. పెండింగ్ నిధులు విడుదల చేయండి.. అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ వివరాలను బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. ‘తెలంగాణలో నాలుగు లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులున్నాయి. వీటికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. వడ్డీలో కేంద్ర వాటా కింద గత నాలుగేళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.339 కోట్లు విడుదల చేయాలని కోరారు. దేశంలో అత్యధిక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం తెలంగాణ. దీని ప్రకారంగా అదనంగా 0.5 శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచుకునే అవకాశం ఉంది. తెలంగాణకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని జీఎస్డీపీలో 3.5 శాతంగా సడలించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం నివేదించారు’అని తెలిపారు. కేసు పరిష్కారమైతే హైకోర్టు విభజన... కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రితో సీఎం సమావేశం ముగిసిన అనంతరం ఎంపీలు బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్ మీడియాకు సంబంధిత వివరాలు వెల్లడించారు. ‘రాజ్‌నాథ్‌ను ముఖ్యమంత్రి కలిశారు. రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో విభజన చట్టంలో పేర్కొన్న చాలా విషయాలు పరిష్కరించడానికి కొంత ప్రయత్నం జరిగింది. ఇంకా కొన్ని పరిష్కరించలేదు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 అంశాలను ఇంకా తేల్చాల్సి ఉంది. హైదరాబాద్ రాజధానిగా ఉన్న సందర్భంలో విభజన చట్టంలో ఆస్తుల విషయంలో స్పష్టంగా చెప్పారు. ఎక్కడి ఆస్తులు అక్కడ ఉంటాయని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఇంకా ఈ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని సీఎం కోరారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో కొన్ని గదులు ఏపీ భవన్‌కు, కొన్ని గదులు తెలంగాణ భవన్‌కు ఇచ్చారు. గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కమిషనర్లు, రెసిడెంట్ కమిషనర్లు పనిచేస్తున్నారు. దీని విభజనపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇది వరకే తెలియపరిచినా తెలంగాణ దీనిపై మరింత స్పష్టత కోరింది. అది తెలంగాణ ఆస్తిగా గతంలో మేం చెప్పాం. అయితే 58ః42 నిష్పత్తిలో పంచాలని కేంద్రం చెప్పింది. దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరాం. ఇలాంటి అంశాలన్నింటినీ హోం మంత్రికి వివరించాం. అతి ముఖ్యమైన సమస్య హైకోర్టు విభజన. ఇది న్యాయశాఖ పరిధిలో ఉన్నప్పటికీ కేంద్ర హోం శాఖ నోడల్ ఏజెన్సీ అయినందున త్వరగా పరిష్కరించాలని కోరాం. విభజన చట్టంపై సుప్రీం కోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయి. ఈ వారంలో సంబంధిత కేసు రానుంది. ఆ కేసు పరిష్కారమైతే ఆ వెంటనే హైకోర్టు విభజనపై ఉత్తర్వులు వెలువడేందుకు మార్గం సుగమమవుతుంది’అని వివరించారు. -
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల కోసం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం, ఢిల్లీ పర్యటన వివరాలపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చించారు. అదే విధంగా జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్‌ను సీఎం ఆహ్వానించారు. -
జోనల్ వ్యవస్థపై అఖిలపక్షం
సాక్షి, హైదరాబాద్: జోనల్ వ్యవస్థపై లోతుగా అధ్యయనం చేయడానికి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయా లని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఆగమేఘాలమీద ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. ప్రస్తుత జోనల్ వ్యవస్థపై భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తడానికి వీలుందన్నారు. -
నిరుద్యోగులకే ఉద్యోగాలు దక్కేలా ‘జోనల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు నిరుద్యోగులకే దక్కేలా జోనల్ విధానం తయారు చేయాలని ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వెంటనే ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఉద్యోగుల తరపున తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు వి.మమత, మధుసూదన్, కృష్ణ యాదవ్, రాజ్ కుమార్ గుప్తా, లక్ష్మీనారాయణ సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జోనల్ వ్యవస్థపై టీజీవో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకుందని శ్రీనివాస్‌గౌడ్ మంత్రికి తెలిపారు. త్వరలోనే ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందచేస్తామని వివరించారు. -
ఆర్టీసిలో జోనల్ వ్యవస్థను రద్దు చేయాలి : ఈయు
సాక్షి, అమరావతి : ఆర్టీసీని రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తున్న జోనల్ చైర్మన్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయు) నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రవేశ్ ఆర్టీసీలో జోనల్ వ్యవస్థను రద్దు చేసి గతంలో ఉన్న మూడంచెల వ్యవస్థను ప్రవేశ పెడితే ఏడాదికి 60 కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొనే చర్యలు చేపట్టాలని, నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈయు నాయకులు కె.పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానిది ఒంటెద్దు పోకడ
హైదరాబాద్: ప్రభుత్వం జోన్ల వ్యవస్థ రద్దు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఓయూలో ‘స్థానిక రిజర్వేషన్లు-జోనల్ వ్యవస్థ’పై విద్యార్థి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడుతూ.. జోన్ల వ్యవస్థ పై నిపుణుల స్థాయి కమిటీ వేయాలని కోరారు. యువజన, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు చేయాలన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం వినటము లేదని, ఒంటెద్దు పోకడ పోతుందని విమర్శించారు. -
‘ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రపతిని కలుస్తాం’
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం జోనల్ విధానాన్ని రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ చర్యపై రాష్ట్రపతిని కలువనున్నట్లు తెలిపారు. సోమవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఫ్రీజోన్ విధానాన్ని వ్యతిరేకించి కేసీఆర్ ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవాలనుకోవటం తగదన్నారు. ఈ నిర్ణయంతో గ్రామీణప్రాంత విద్యార్థులు, ఉద్యోగార్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అందుకే తామంతా కలిసి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఫ్రీజోన్ వద్దని కోరుతామన్నారు. -
'జోనల్ వ్యవస్థను తీసిపారేయండి'
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ భేటీ ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి టీచర్ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవీ ప్రసాద్, రవీందర్ రెడ్డి, మమత అన్నారు. గందరగోళానికి కారణమవుతున్న జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న జోనల్ పోస్టులను రాష్ట్ర, జిల్లా స్థాయిలుగా విభజించాలని కోరారు. కొత్త రిక్రూట్ మెంట్ జిల్లా స్థాయిలో జరగాలని, అలాట్ మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉండాలని చెప్పారు.