
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు నిరుద్యోగులకే దక్కేలా జోనల్ విధానం తయారు చేయాలని ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వెంటనే ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఉద్యోగుల తరపున తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు వి.మమత, మధుసూదన్, కృష్ణ యాదవ్, రాజ్ కుమార్ గుప్తా, లక్ష్మీనారాయణ సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
జోనల్ వ్యవస్థపై టీజీవో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకుందని శ్రీనివాస్‌గౌడ్ మంత్రికి తెలిపారు. త్వరలోనే ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందచేస్తామని వివరించారు.