గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలసి పుష్పగుచ్ఛం అందిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ
తెలంగాణలో ప్రతిపాదిత ఎయిమ్స్‌కు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి ఇక్కడి నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో జైట్లీతో ఆయన భేటీ అయ్యారు. అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం వెంట టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నారు. 2017–18 బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా తెలంగాణకు ఎయిమ్స్‌పై జైట్లీ మాటిచ్చారని సీఎం గుర్తు చేశారు. అయినా తాజా బడ్జెట్‌లో అందుకు కేటాయింపులు జరపలేదని గుర్తు చేశారు. ఆర్థిక బిల్లుకు ఆమోదం పొందే సందర్భంలో తెలంగాణ ఎయిమ్స్‌కు తప్పనిసరిగా నిధులు కేటాయించాలని ఆయన్ను కోరారు. ఎయిమ్స్ మంజూరు చేసి నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా స్థలం కేటాయించడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు సిద్ధంగా ఉందని వివరించారు. సీఎం విజ్ఞప్తికి జైట్లీ సానుకూలంగా స్పందించారు. కేంద్రం గతంలో తెలంగాణకు హామీ ఇచ్చిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) త్వరగా మంజూరయ్యేలా చూడాలని కూడా ఆయన్ను సీఎం కోరారు. ‘‘విభజన చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు 2014–15 నుంచి 2016–17 ఆర్థిక సంవత్సరాలకు రూ.450 కోట్లు విడుదల చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రూ.450 కోట్లు ఇంకా విడుదల కాలేదు. వాటిని వెంటనే విడుదల చేయండి’’ అని కూడా జైట్లీకి విజ్ఞప్తి చేశారు. ద్రవ్య బాధ్యత, విత్త నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిపై ప్రస్తుత 3.5 శాతం పరిమితిని కొనసాగించాలని కోరినట్టు ప్రభుత్వ సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
నేడు రాజ్‌నాథ్‌తో భేటీ
కేసీఆర్ శుక్రవారం ఉదయం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు. విభజన చట్టంలో ఇంకా అమలవని అంశాలను ప్రస్తావిస్తారని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ కూడా సీఎం కోరారని, అది ఖరారైతే శుక్రవారమే ఆయన్ను కలుస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రైతులకు పెట్టుబడి సాయం పథకం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా మోదీని సీఎం ఆహ్వానించవచ్చని చెప్పాయి.
పెట్టుబడి సాయంపై ప్రశంసలు
రైతులకు పెట్టుబడి సాయం పథకాన్ని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ ప్రశంసించారు. జైట్లీని కలిసేందుకు నార్త్ బ్లాక్ వెళ్లిన సీఎంకు ఆయన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా సీఎంతో కాసేపు ముచ్చటించారు. ‘మీరు రూపొందించిన పెట్టుబడి సాయం పథకానికి నేను పెద్ద అభిమానిని. ఈ పథకం చాలా అద్భుతంగా ఉంది. దీనిపై మేం అధ్యయనం చేయాలనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. సీఎం స్పందిస్తూ, ‘చాలా కృతజ్ఞతలు. తప్పకుండా మా రాష్ట్రానికి రండి. అంతకంటే ముందు శుక్రవారం మధ్యాహ్నం భోజనానికి రండి. వివరంగా మాట్లాడుకుందాం’ అని ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని అర్వింద్ బదులిచ్చారు. సోమవారం తాను హైదరాబాద్‌లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. పథకంపై పూర్తి వివరాలను ఆయనకు అందజేయాలని రాజీవ్ శర్మకు సీఎం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment