ఇదే బంగారు తెలంగాణ | This is golden Telangana, says cm KCR | Sakshi
Sakshi News home page

ఇదే బంగారు తెలంగాణ

Published Sat, Dec 30 2017 2:25 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

This is golden Telangana, says cm KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  
‘‘బంగారు తెలంగాణ అంటే ఏమిటో కాదు.. మన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవడమే. మూడున్నరేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోంది. కులవృత్తులపై ఆధారపడ్డ వారికి ఆర్థిక సహకారమిస్తూ సంపదను సృష్టిస్తున్నాం. ఆర్నెల్లలో రాష్ట్రవ్యాప్తంగా 1.6 లక్షల మందికి 33 లక్షల గొర్రెలు పంపిణీ చేశాం. వాటికి 13 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయి. కదిలే ఆస్తిని సృష్టించాం. వాటిని విక్రయిస్తే ఆర్థిక అభివృద్ధి జరిగినట్లే. అభివృద్ధి, బంగారు తెలంగాణ అంటే ఇదే. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీ గొర్రెలు ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్నాయి. వాటిని నేను అస్సలు పట్టించుకోను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అన్ని విధాలా పురోగతి బాట పట్టించడమే నా లక్ష్యం’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం కోకాపేట్‌ సమీపంలో యాదవ, కురుమ సంక్షేమ భవన నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. పదెకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో ఈ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘‘యాదవ, కురుమ భవనాలు దేశానికే ఆదర్శంగా నిలవాలి. ఇక్కడ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు వసతి, విద్య, శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా ఉండాలి. పేద కురుమ, యాదవ పిల్లలకు పెళ్లిళ్లు సైతం ఇక్కడే జరిగేలా చూడాలి. యాదవులు, కురుమల సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోండి. ఐక్యంగా ఉంటే సాధ్యం కానిదేదీ ఉండదు. సంక్షేమ నిధి భారీగా ఉండాలి. మూలధన నిధి కింద నేను బీసీ సంక్షేమ శాఖ ద్వారా రూ.కోటి ఇస్తున్నా. యాదవ, కురుమ వ్యాపారులు, నేతలు, విదేశాల్లో స్థిరపడిన వారు విరాళాలు ఇవ్వండి. వందల కోట్లలో నిధి జమ చేయండి. మీ సామాజిక వర్గాల అభివృద్ధికి వినియోగించుకోండి’’అని పిలుపునిచ్చారు. దీంతో సభికులు ఒక్కసారిగా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

‘‘రాష్ట్రంలో మాంసం, చేపలకు భారీ డిమాండ్‌ ఉంది. ప్రతిరోజు 650 లారీల గొర్రెలు, 25 లారీల చేపల్ని మార్కెట్లో విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాదవ, కురుమ, ముదిరాజ్‌లు 70 లక్షల మంది ఉన్నారు. అంటే సుమారు 1.4 కోట్ల చేతులున్నాయి. వీళ్లకు పనిచెప్తే పరిస్థితి మరోలా ఉంటుందని భావించా. ఇందులో భాగంగానే గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టా. రూ.5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ, చేప విత్తనాల పంపిణీ చేశాం. దేశంలో అత్యంత ఎక్కువ గొర్రెల సంపదç ఉన్నది మన రాష్ట్రంలోనే. ఈ ఏడాది 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలనుకున్నాం. ఇప్పటివరకు 33 లక్షలు పంపిణీ చేశాం. అర్హులైన ప్రతి కుటుంబానికీ వీటిని ఇచ్చి తీరుతాం. అవసరమైతే మరో రూ.5 వేల కోట్లు కేటాయిస్తాం’’అని సీఎం స్పష్టం చేశారు. కొన్నిచోట్ల గొర్రెలు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, మీడియాలో వార్తలు సైతం వస్తున్నట్లు పేర్కొన్నారు. అలా విక్రయించవద్దని, అలాంటివారిని యాదవ, కురుమ సంఘ సభ్యులు కట్టడి చేయాలని, సంపదను మధ్యలో విక్రయిస్తే లాభం ఉండదని సూచించారు.

ప్రాసెసింగ్‌ యూనిట్లపై అధ్యయనం
లక్షల సంఖ్యలో ఉన్న గొర్రెలను నేరుగా కాకుం డా మాంసాన్ని ప్రాసెసింగ్‌ చేసి విక్రయిస్తే మంచి ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో మటన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు కురుమ, యాదవ యువత నడుం బిగించాలన్నారు. ‘‘ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా అధ్యయనం చేయాల్సి ఉంది. మంత్రి తల సాని నేతృత్వంలో జర్మన్‌లాంటి దేశాల్లో పర్యటించాలని సూచిస్తున్నా. పూర్తిస్థాయి అధ్యయనం చేశాక ఇక్కడి యువతకు అవగాహన కల్పించాలి. ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటా’’అని సీఎం వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవ, కురుమలే కాకుండా అన్ని వర్గాల సంక్షేమాన్ని చూస్తోం దన్నారు. ‘‘బీసీల్లో వెనుకబడ్డ వారిని అభివృద్ధి చేసేందుకు ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించాం. రజకు లు, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు ఇచ్చాం. రజకులకు అత్యాధునిక సదుపాయాలతో ధోబీ ఘాట్‌లు, వాషింగ్‌ మిషన్లు కొనుగోలు చేయిస్తాం. నాయీ బ్రాహ్మణులకు గ్రామాల్లో మోడల్‌ సెలూన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. విశ్వబ్రాహ్మణులకు పనిముట్లు, చేనేతలకు 50% రాయితీపై రసాయనాలు, రంగులు ఇస్తున్నాం. సంచార జాతులకు మరిన్ని పథకాలు తెస్తాం’’ అని సీఎం తెలిపారు.

మా మంత్రులు సమర్థులు
రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు అత్యంత సమర్థవంతులని సీఎం కేసీఆర్‌ కితాబిచ్చారు. పశువులు, గొర్రెలు రోగాల బారిన పడకుండా వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంచార వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చిందని, అది ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆలోచనే అని పేర్కొన్నారు. అలాగే ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌.. వసతిగృహాల్లో పిల్లలకు సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందించాలని చెప్పినట్లు గుర్తుచేశారు. కేబినెట్‌లో సమర్థ నాయకులు ఉన్నందునే రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలుస్తోందని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌(ఈఓడీబీ)లో రాష్ట్రం దేశంలోనే టాప్‌ స్థానంలో ఉందన్నారు. అలాగే అత్యంత ఎక్కువ సంఖ్యలో గురుకులాలు స్థాపించి ఆదర్శంగా నిలిచిందని, రైతులకు 24 గంటల కరెంట్‌ ఇచ్చి మరో మెట్టు ఎక్కిందని అన్నారు.

రాజ్‌నాథ్‌ షాక్‌ తిన్నారు
వచ్చే ఏడాది నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.8 వేలు అందజేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘‘రూ.8 వేల ఆర్థిక సాయంపై ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నన్ను అడిగారు. రైతులకు ఇంతమొత్తంలో డబ్బులు ఇస్తున్నావు. వాటిని తిరిగి ఎలా చెల్లిస్తారని ఆయన నన్ను ప్రశ్నించారు. వెంటనే నేను స్పందిస్తూ అవి రైతులు తిరి గి ఇవ్వాలని కాదు. ప్రభుత్వం తరఫున సాయం మాత్రమే అని చెప్పా. వెంటనే ఆయన షాక్‌ తిని కుర్చీలో కూలబడ్డారు. ఆ తర్వాత స్పందిస్తూ ‘కేంద్ర రాజకీయా ల్లోకి వస్తున్నావా..?’అని ప్రశ్నించారు. నేను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లను. రాష్ట్రం లోనే ఉంటా. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా’’అని వివరించారు. ఎగ్గె మల్లేశాన్ని ఎమ్మెల్సీ చేస్తానని, యాదవుల నుంచి ఒకరికి రాజ్యసభలో అవకాశం కల్పిస్తానని ప్రకటించారు. ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా కర్ణాటక మంత్రి రెవన్న హాజరై రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశా నికే ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చారు. కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రి ఇక్కడి ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడం సభికుల్లో ఆసక్తి కలిగించింది. సమావేశంలో మంత్రులు జోగు రామన్న, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, పట్నం మహేందర్‌రెడ్డి, ఈటల, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement