రాజా హరిసింగ్, మీర్ ఉస్మాన్ అలీఖాన్
స్వాతంత్య్రానంతర పరిణామాల్లో రెండు రాచరిక పాలనల్లోని రాజ్యాంగ అంశాలు కీలకంగా మారాయి. అవే హైదరాబాద్, కశ్మీర్ సంస్థానాలు. ఈ రెండు సంస్థానాల మధ్య ఒక పోలిక ఉంది. హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు కాగా, రాజ్యాధికారం ముస్లింల చేతిలో ఉండేది. కశ్మీర్‌లో మెజారిటీ ప్రజలు ముస్లింలు కాగా, అధికారం హిందూ రాజు చేతిలో ఉండేది. భారత్‌లో విలీనానికి నిజాం రాజు అంగీకరించకపోవడంతో ‘ఆపరేషన్ పోలో’తో భారత్ సైన్యాన్ని దించడంతో, హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. పాకిస్తాన్ సైన్యం దురాక్రమణకు రావడంతో కశ్మీర్ రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు, ఒప్పందాలకు లోబడి కశ్మీర్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు.
బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రాన్ని సాధించుకునేటప్పటికి 562 ప్రాంతాలు రాచరిక పాలనలో ఉన్నాయి. అయితే అందులో మూడు మాత్రం 1947 స్వాతంత్య్రానంతరం కూడా అదే రాచరిక వ్యవస్థలో కొనసాగాయి. కశ్మీర్, హైదరాబాద్, గుజరాత్ కతీవార్ ప్రాంతంలోని జునాగఢ్‌లు మాత్రం 1947 నాటికి భారత్‌లో భాగం కాలేదు.
హైదరాబాద్ సంస్థానం ప్రత్యేకత...
బ్రిటిష్ పాలన సమయంలోనే హైదరాబాద్ సంస్థానానికి ప్రత్యేక సైన్యముండేది. ప్రత్యేకంగా రైల్వే, పోస్టల్ విభాగాలున్నాయి. హైదరాబాద్ సంస్థానంలో 80 శాతంగా ఉన్న హిందువులను ముస్లిం రాజు పాలించేవాడు. భారత్ పాకిస్తాన్ విభజన సందర్భంగా హైదరాబాద్ సంస్థాన నిజాం రాజు 1947 జూన్ 26న హైదరాబాద్ సంస్థానం ఇటు పాకిస్తాన్‌లోకానీ, భారత్‌లో కానీ విలీనం కాబోదని ఫర్మానా జారీ చేశాడు. హైదరాబాద్ సంస్థానంపై సంపూర్ణాధిపత్యాన్ని కొనసాగించాలని భావిం చాడు. ఆయనకు టోరీ పార్టీ నాయకుడు విన్‌స్టన్ చర్చిల్ వెన్నుదన్నుగా నిలిచాడు. 1947 ఆగస్టు 15 నాటికి నిజాం రాజు తేల్చుకోలేకపోవడంతో భారతప్రభుత్వం మరో రెండు నెలల సమయమిచ్చింది.
నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ హైదరాబాద్ స్వతంత్రతను ఒప్పుకునే ప్రసక్తే లేదని నిజాంని హెచ్చరించారు. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలపై నిరంకుశ పోకడలను మానుకోవాలని నిజాం రాజును భారత సర్కార్ 1948 సెప్టెంబర్ 7న హెచ్చరించింది. భారతసైన్యం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో అడుగుపెట్టడంతో హైదరాబాద్ సంస్థానం ఎట్టకేలకు భారత్‌లో విలీనమైంది. అదేసమయంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న కశ్మీర్ సంస్థానాన్ని రాజా హరిసింగ్ పాలిస్తున్నారు. కశ్మీర్‌పై పాకిస్తాన్ దండెత్తడంతో రాజా హరిసింగ్ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు ముందుకొచ్చారు. చివరకు కొన్ని షరతులకు లోబడి 1948 అక్టోబర్ 27న కశ్మీర్ భారత్‌లో విలీనం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment