
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక టర్కీ పర్యటన రద్దయ్యింది. గత నెలలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై టర్కీ అధ్యక్షుడు తుయ్యిప్ ఎర్డోగన్ విమర్శలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పారిస్‌లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలోనూ పాక్‌కు మద్దతుగా ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు కూడా పర్యటనకు రద్దు కు కారణాలుగా తెలుస్తోంది. ఈ నెల్లో జరగనున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు సౌదీ అరేబియాకు వెళ్లనున్న మోదీ.. అక్కడి నుంచి టర్కీ రాజధాని అంకారా వెళ్లాల్సి ఉంది. అయితే తాజా నిర్ణయంతో మోదీ కేవలం సౌదీలో మాత్రమే పర్యటించనున్నారు. ఈ వార్తలపై విదేశాంగ శాఖ స్పందిస్తూ అసలు మోదీ టర్కీ పర్యటన ఖరారే కాలేదని, అలాంటప్పుడు రద్దయ్యే అవకాశమే లేదని పేర్కొంది.
తమిళంలో మోదీ కవిత: ఇటీవల మామల్లపురం లో తాను సముద్రంతో సంభాషణ అంటూ రాసిన కవిత తమిళ అనువాదాన్ని తాజాగా ఆది వారం ప్రధాన మంత్రి మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో అనధికార భేటీ సందర్భంగా మహాబలిపురంలో మోదీ ఒక రోజు గడిపిన విషయం తెలిసిందే. భేటీ రోజు ఉదయం బీచ్‌లో ప్లాగింగ్ చేసిన మోదీ.. అక్కడే కాసేపు కూర్చున్నారు. ఆ సందర్భంగా సముద్రంతో మమేకమయ్యానంటూ తన భావావేశాన్ని కవితగా మలిచానని తరువాత చెప్పారు. ఆ కవితనే తమిళంలో ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో తమిళంపై ప్రధాని ప్రత్యేక ప్రేమ చూపుతున్న విషయం తెలిసిందే. ఐరాస వేదికపైనా తమిళం అత్యంత ప్రాచీన భాష అని గుర్తు చేశారు. జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా మామల్లపురంలో తమిళ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment