Recep Tayyip Erdogan
-
తుర్కియే వక్రబుద్ధి.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి 78వ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా తుర్కియే దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. భారత్ పాకిస్తాన్ వ్యవహారాల్లో తలదూర్చవద్దని భారత్ పలుమార్లు హెచ్చరించినా కూడా పట్టించుకోని ఆయన తాజా సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి దక్షిణాసియాలో శాంతి స్థాపన జరగాలంటే భారత్ పాక్ మధ్య సంధి కుదర్చాలని అన్నారు. సహకరిస్తాం..? న్యుయార్క్ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 78వ అసెంబ్లీ సమావేశాల్లో తుర్కియే అధ్యక్షుడు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దక్షిణాసియా ప్రాంతంలో ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు స్థాపించబడాలంటే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు జరగాలని ఇరుదేశాల పరస్పర సహకారం ద్వారా కశ్మీర్లో సుస్థిరమైన శాంతని నెలకొల్పాలని అన్నారు. ఈ చర్చలకు తుర్కియే సహకారం ఉంటుందని చెప్పుకొచ్చారు. భారత్ పాకిస్తాన్ దేశాలు స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం సాధించి 75 ఏళ్లు పూర్తయినా రెండు దేశాల మధ్య శాంతి సంఘీభావం స్థాపించబడాలపోవడం దురదృష్టకరమని అన్నారు. కశ్మీర్లో శాశ్వత శాంతితో పాటు శ్రేయస్సు కూడా స్థాపించబడలని కోరుకుంటూ ప్రార్ధిస్తున్నానన్నారు. చెప్పినా వినకుండా.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ ప్రస్తావన తీసుకురావద్దని భారత్ గతంలో కూడా అనేక మార్లు తుర్కియేను హెచ్చరించింది. ఒకవేళ వారు ఆ పని చేస్తే తాము సైప్రస్ అంశాన్ని లేవనెత్తుతామని కూడా తెలిపింది. ఇటీవల జరిగిన జీ20 సమావేశాల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌తో వాణిజ్యం, మౌలిక సదుపాయాల సంబంధాలను బలోపేతం చేయడానికి చర్చలు కూడా జరిపారు. అయినా కూడా ఎర్డొగాన్ ఐక్యరాజ్య సమితిలో తమ మిత్రదేశమైన పాకిస్తాన్‌కు వత్తాసు పలికారు ఆ దేశ అధ్యక్షుడు. ప్రపంచం వారికంటే పెద్దది.. సమావేశాల్లో ఎర్డొగాన్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఐదు శాశ్వత సభ్యులతో పాటు తాత్కాలిక సభ్యులుగా ఉన్న 15 దేశాలను కూడా శాశ్వత సభ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ 20 సభ్యదేశాలను రొటేషన్ పధ్ధతిలో శాశ్వత సభ్యదేశాలుగా కొనసాగించాలని అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్ కన్నా ప్రపంచం చాలా పెద్దదని ఆయన అన్నారు. President of Turkey's @RTErdogan, powerful speech at the United Nations, advocating for the rights and peace in Kashmir, exemplifies how true leaders take action. "Beyond @ImranKhanPTI, Have any other Pakistani leaders raised their voices on the Kashmir issue at the UN? And the… pic.twitter.com/S79NZsdJiX — Sanaullah khan (@Saimk5663) September 20, 2023 ఇది కూడా చదవండి: ట్రూడో ఆరోపణలు తీవ్రమైనవే: అమెరికా -
Turkey: నరాలు తెగే ఉత్కంఠ.. చారిత్రక విజయం
ఇస్తాంబుల్: టర్కీ(తుర్కీయే) అధ్యక్ష ఎన్నికల్లో రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్(69) మరోసారి ఘన విజయం సాధించారు. సుప్రీం ఎలక్షన్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికలకు తుది ఫలితాలు వెలువడిన అనంతరం.. తన విజయాన్ని ఆదివారం రాత్రి స్వయంగా ప్రకటించారాయన. దారుణమైన ఆర్థిక సంక్షోభం, దానికి తోడు భారీ భూకంపంతో కుదేలు కావడం.. ఆయనకు ఎన్నికల్లో ప్రతికూల అంశాలు అవుతాయని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ, ఆ అంచనాలు తప్పాయి. చారిత్రక విజయం అందుకున్నారాయన. రాబోయే ఐదేళ్ల కాలం తామే దేశాన్ని పరిపాలించబోతున్నామని ప్రకటించారాయన. ఈ మేరకు తన స్వస్థలం ఇస్తాంబుల్‌లో ఓ బస్సు టాప్‌పైకి ఎక్కి తన మద్దతుదారులను ఉద్దేశించి.. ఆయన మాట్లాడారు. మీ నమ్మకాన్ని చురగొనాలన్నది దైవాజ్ఞ అంటూ పేర్కొన్నారాయన. మరోవైపు ఎర్డోగాన్ విజయాన్ని ఆయన మద్దతుదారులు, యువత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న నిర్వహించింది. మే 14వ తేదీన ఓటింగ్ జరగ్గా.. తొలి విడత కౌంటింగ్‌లో ఆసక్తికర ఫలితాలు రావడం ఉత్కంఠ రేపింది. ఒకానొక దశలో ఎర్డోగాన్ ఓడిపోతారేమోనని భావించారంతా. ఎర్డోగాన్‌కు 49.5 శాతం, కిలిక్దారోగ్లుకి 44.9 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో రెండో(తుది) రౌండ్ ఫలితం కోసం టర్కీ ఉత్కంఠగా ఎదురు చూసింది. అయితే కౌంటింగ్‌లో ఎర్డోగాన్ 52 శాతం ఓట్లు సాధించారు. ప్రత్యర్థి కెమల్ కిలిక్దారోగ్లుకు 48 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో.. ఎర్డోగాన్ విజయం ఖరారైంది. Cumhurbaşkanı #RecepTayyipErdoğan: "Milletimizin her iradesi gibi bu sonucun da başımızın üstünde yeri vardır. Kazanan sadece biz değiliz. Kazanan Türkiye'dir, kazanan demokrasimizdir." ADAM KAZANDI BAŞLASIN TÜRKİYE YÜZYILI 🇹🇷 pic.twitter.com/l3AJPSveWI — Emel@259126411 (@EMel259126411) May 29, 2023 గత రెండు దశాబ్దాలుగా ఎర్డోగాన్ పాలకుడిగా కొనసాగుతున్నారు. అధ్యక్షుడిగా, అంతకు ముందు ప్రధానిగా ఆయన పని చేశారు. ఇదిలా ఉంటే.. ఎర్డోగాన్ చారిత్రక విజయం పట్ల పలు దేశాల అధినేతలు, ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుట్రెస్ సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. Congratulations @RTErdogan on re-election as the President of Türkiye! I am confident that our bilateral ties and cooperation on global issues will continue to grow in the coming times. — Narendra Modi (@narendramodi) May 29, 2023 జార్జియా మూలాలు ఉన్న రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కుటుంబం.. ఆయన 13వ ఏట ఇస్తాంబుల్‌కు వలస వచ్చింది. సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆయన.. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఆ విశ్వాసాలను పక్కనపెట్టాడు. సంస్కరణల పేరిట ఆయన తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా మహిళలకు స్వేచ్ఛలాంటివి.. మతపరమైన విమర్శలకు దారి తీశాయి. అయితే పేదల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు మళ్లీ ఆయన్ని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాయి. 2014 నుంచి టర్కీకి అధ్యక్షుడిగా పని చేశారు. 2003 నుంచి 2014 నడుమ.. ఆ దేశ ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు ఆయనపై రాజకీయ నిషేధం కొనసాగడం గననార్హం. బ్యాన్‌కి ముందు.. 1994-98 మధ్య ఇస్తాంబుల్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2001లో ఏర్పాటు చేసిన జస్టిస్ ఫర్ డెవలప్మెంట్ పార్టీ(AKP) సహ వ్యవస్థాపకుడు కూడా. 1954లో రిజ్, గునెయ్జులో పుట్టిన ఎర్డోగాన్.. ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆపై రాజకీయాల వైపు అడుగులేశారు. ఇస్లామిక్ రాజకీయ నేత నెక్మెట్టిన్ ఎర్బకన్కు ప్రియ శిష్యుడిగా కొనసాగి.. స్థానిక రాజకీయాల్లో రాణించాడు. ఆపై ఇస్తాంబుల్‌కు మేయర్ అయ్యాడు. జైలు శిక్ష.. మార్పు 1997లో ఇస్తాంబుల్ మేయర్‌గా కొనసాగుతున్న టైంలో.. ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. టర్కీ ఉద్యమకారుడైన జియా గోకాల్ప్ రచనల్లోని ఓ పద్యాన్ని పఠించే సమయంలో.. మాతృకలో లేని అంశాలను జోడించి చదివి వినిపించారాయన. అయితే ఆ పదాలు అభ్యంతరకరంగా ఉండడంతో.. వివాదం మొదలైంది. ఆయన చేసిన పని హింసకు, విద్వేషానికి దారి తీసేలా ఉందంటూ పది నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. దీంతో.. ఆయన తన మేయర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాదు.. ఆయనపై రాజకీయ నిషేధం అమలులోకి వచ్చింది. ఈలోపు ఆయన తన తన శిక్షను జరిమానా కింద మార్చాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. కోర్టు ఆ శిక్షను నాలుగు నెలల కిందకు కుదించింది. అప్పుడు ఆయన్ని కిర్క్లారెలీలోని పినర్హిసార్ జైలుకు తరలించారు. ఆయన జైలుకు వెళ్లిన రోజునే.. దిస్ సాంగ్ డసన్ట్ ఎండ్ హియర్ అనే ఆల్బమ్ ఒకటి ఆయన రిలీజ్ చేశారు. అందులో ఏడు పద్యాలతో కూడిన ట్రాక్ లిస్ట్ ఉండగా.. 1999లో బెస్ట్ సెల్లింగ్‌గా నిలవడంతో పాటు ఏకంగా మిలియన్ కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టిచింది. అంతేకాదు.. అక్కడి నుంచే జస్టిస్ ఫర్ డెవలప్మెంట్ పార్టీ(AK Parti)కి ఆలోచన చేశాడాయన. ఆ తర్వాత మత విశ్వాసాలను పక్కనపెట్టి.. పాశ్చాత్య ధోరణి తరహా పాలనను తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో వామపక్ష భావజాలంతో ముందుకు సాగారాయన. పేదల మనిషిగా తన పాలన ముద్రపడేలా ముందుకెళ్లారు. 2013లో టర్కీ ప్రధాని హోదాలో పినర్హిసార్ జైలును సందర్శించిన ఆయన.. తనకిది పునర్జన్మ ఇచ్చిన ప్రదేశమని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో టర్కీలో విపరీతమైన ప్రజాదరణ ఆయన వశమైంది. -
ప్రజాస్వామ్యంపై ఎర్డో‘గన్’
నియంతృత్వం బహురూపి. అది ఎప్పుడే రూపంలో ఉంటుందో, ఆద్యంతాలేమిటో ఎవరూ అంచనా కట్టలేరు. దాని ఉనికిని గుర్తించేలోపే అది అందరినీ ముంచేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం సోవియెట్ యూనియన్ పతనమైనప్పుడు కాలక్రమంలో ఆ శిథిలాల్లోంచి పుతిన్ పుట్టు కొస్తాడనీ, మున్ముందు కొరకరాని కొయ్యవుతాడనీ యూరప్ దేశాలు అనుకోలేదు. సరిగ్గా టర్కీ విషయంలోనూ ఇప్పుడదే జరుగుతోంది. గత కొన్నేళ్లుగా టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయీప్ ఎర్డోగాన్ విపరీత పోకడలు పోవడం కనబడుతూనే ఉంది. అయినా యూరొపియన్ యూనియన్(ఈయూ) పట్టనట్టు ఉంటోంది. ఇక ఇప్పుడు ఆయన అచ్చంగా పుతిన్‌ను అనుకరిస్తున్న వైనం కళ్లకు కడుతోంది. ఇస్తాంబుల్ మేయర్‌గా 2019లో ఎన్నికైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ(సీహెచ్‌పీ) నాయకుడు ఎక్రెమ్ ఇమామోలును ఎర్డోగాన్ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఎన్నికల అధికారులను దూషించారన్న ఆరోపణతో ఇమామోలుకు గురువారం న్యాయస్థానం రెండేళ్ల ఏడునెలల జైలు శిక్ష విధించింది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తనకు బలమైన ప్రత్యర్థి అవుతారన్న భయంతోనే ఎర్డోగాన్ పావులు కదిపి ఈ శిక్ష పడేలా చేశారు. దేశంలో ఎన్నికల ప్రక్రియను పర్య వేక్షిస్తున్న ఉన్నత స్థాయి ఎన్నికల బోర్డు అధికార పక్షం చెప్పినట్టల్లా తలూపడం రివాజైంది. ఇటీవల కింది కోర్టులు సైతం అధికార పక్షం అభీష్టానికి అనుకూలంగా తీర్పులివ్వటం మొదలుపెట్టాయి. ఇస్తాంబుల్ మేయర్ ఎన్నిక వ్యవహారం ఆసక్తికరమైనది. 2019 మార్చిలో ఆ పదవికి జరిగిన ఎన్ని కల్లో ఇమామోలు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీన్ని జీర్ణించుకోలేని ఎర్డోగాన్ ప్రభుత్వం ఆ ఎన్నిక రద్దయ్యేదాకా నిద్రపోలేదు. చివరకు అదే ఏడాది జూన్‌లో మరోసారి ఎన్నికలు నిర్వహిం చారు. ఈసారి ఇమామోలు ఏకంగా 8 లక్షల ఓట్ల మెజారిటీతో అధికార పక్ష అభ్యర్థిని చిత్తుచేశారు. రాజకీయంగా తన ఎదుగుదలకు మూలకారణమైన చోట ఎన్ని ఎత్తులు వేసినా ప్రత్యర్థి మేయర్ కావటం ఆయనకు కంటగింపైంది. ఇస్తాంబుల్ నగరం దేశానికి ఆర్థికంగా ఆయువు పట్టు. స్థూల దేశీయోత్పత్తిలో దాని వాటా 40 శాతం. అందుకే ఎర్డోగాన్ ప్రభుత్వం మేయర్ అధికారాలను కత్తి రించి, అడుగడుగునా ఇమామోలుకు అడ్డుపడటం మొదలెట్టింది. ఇది చాలదన్నట్టు అధికారులను దూషించారన్న అభియోగం నమోదైంది. 2019 మార్చి ఎన్నిక రద్దు చేసిన అధికారులు బుద్ధిహీను లని అప్పట్లో ఇమామోలు వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న అధికార గణాన్ని ఇలా అనటం నేరమన్నది సర్కారు అభియోగం. తాజాగా ఈ కేసులో పడిన శిక్షను ఉన్నత న్యాయస్థానం ధ్రువీక రిస్తే అధ్యక్ష ఎన్నికలతో సహా ఏ ఎన్నికలోనూ ఇమామోలు అభ్యర్థిగా నిలబడలేరు. ఓటేసే హక్కు కూడా కోల్పోతారు. ఇప్పటికే సీహెచ్‌పీ పార్టీకి చెందిన మరో నేతకు ఇదే రకమైన శిక్షపడింది. టర్కీ జాతిపిత ముస్తఫా కెమెల్ అటాటుర్క్ నెలకొల్పిన సెక్యులర్ వ్యవస్థనూ, సంక్షేమ రాజ్య భావననూ 2003లో అధికారంలోకి రాగానే ఎర్డోగాన్ ధ్వంసం చేశారు. నయా ఉదారవాద విధానా లను చకచకా అమలుచేశారు. ఆ విధానాల పర్యవసానంగా అంతవరకూ ఒడిదుడుకుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ బలపడిన మాట నిజమే. వృద్ధి రేటు 9 శాతం దాటింది. కానీ సంపదంతా గుప్పెడుమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతమైంది. అవినీతి ఆకాశాన్నంటింది. అటుపై 2008 ఆర్థిక మాంద్యం తీవ్రంగా దెబ్బతీసింది. వృద్ధిరేటు 3 శాతానికి దిగజారింది. ఆ తర్వాత ఇస్లామిక్ భావజాల పరి రక్షకుడిగా ఎర్డోగాన్ అవతారమెత్తారు. ఒకపక్క ఈయూలో భాగస్వామిగా ఉంటూనే అందులోని భాగస్వామ్య దేశాల వల్ల ప్రమాదం ముంచుకొస్తున్నదని ఊదరగొట్టడం ఆయన ప్రత్యేకత. కుర్దులను దేశానికి శత్రువులుగా చిత్రీకరించి వారి ప్రాంతాలపై వైమానిక దాడులు చేయటం, పెను ముప్పును నివారించినట్టు స్వోత్కర్షలకు పోవటం అలవాటు. ఇస్లామిక్ సిద్ధాంతాలు అవలంబిం చకపోతే దేశం నాశనమవుతుందని ఒకపక్క, ఐఎస్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచివుందని మరోపక్క ప్రచారం చేస్తూ 2015 నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అటుపై సైనిక తిరుగుబాటు డ్రామాను నడిపి తన పాలనను మరింత సుస్థిరం చేసుకున్నారు. ఇలా ఎప్పటి కప్పుడు జనం భావోద్వేగాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటూ వస్తున్న ఎర్డోగాన్‌ను 2019 ఇస్తాంబుల్ మేయర్ ఎన్నిక ఊహించని రీతిలో దెబ్బతీసింది. టర్కీలో దాదాపు అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. నిర్మాణ రంగం కుదేలైంది. అన్ని రకాల సరఫరాలూ దెబ్బతిన్నాయి. ఆహారం, ఇంధనం ధరలు ఆకాశాన్నంటి ద్రవ్యోల్బణం 170 శాతం వరకూ పోయిందని ఆర్థికవేత్తల అంచనా. ఇలాంటి సమయంలో ఎర్డోగాన్‌ను ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ఒకవిధంగా ఆదుకుంది. ఈయూకూ, పుతిన్‌కూ ఏర్పడ్డ విభేదా లను తెలివిగా సొమ్ము చేసుకుని లాభపడుతున్న ప్రపంచ నేతల్లో ఎర్డోగాన్ ఒకరు. ఎంతకాలం ఇలాంటి ఎత్తుగడలతో నెట్టుకొస్తారన్నది చూడాల్సి ఉంది. తనకు 2023 అధ్యక్ష ఎన్నికలే ఆఖరివని ఎర్డోగాన్ చెబుతున్నారు. ఆయన గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవని విపక్షాలు భాష్యం చెబు తున్నాయి. పొరుగున పుతిన్ చేసిందేమిటో గమనిస్తే ఇలా అనటంలో వైపరీత్యమేమీ లేదు. మరో పుతిన్‌లా తయారై దేశంలో రాజకీయ ప్రత్యర్థులను సమాధి చేస్తున్న ఎర్డోగాన్‌ను నియంత్రించ టంలో విఫలమైతే, చూసీచూడనట్టు వదిలేస్తే స్వీయ వినాశనం కొనితెచ్చుకున్నట్టేనని ఇప్పటికైనా ఈయూ గుర్తించటం మంచిది. -
పాక్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం: టర్కీ
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: జమ్ము కశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తామన్న టర్కీ అధ్యక్షుడు రెసీప్ తయీప్ ఎర్డోగన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం సహించబోమని మరోసారి స్పష్టం చేసింది. శుక్రవారం నాటి పాక్ పర్యటనలో భాగంగా ఎర్డోగన్.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంలో తాము ఎల్లప్పుడూ న్యాయం వైపే ఉంటామని.. అందుకే పాకిస్తాన్‌కు అండగా నిలుస్తున్నామన్నారు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అయిన అనంతరం ఎర్డోగన్ మాట్లాడుతూ... ‘‘దశాబ్దకాలంగా మా కశ్మీరీ సోదరసోదరీమణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకపక్ష నిర్ణయాల కారణంగా వారికి ఈ దుస్థితి వచ్చింది. కశ్మీర్ గురించి ఈరోజు పాకిస్తాన్ ఎంతగా వేదన చెందుతుందో.. టర్కీ కూడా అంతే బాధపడుతోంది. ఈ విషయంలో అన్ని వర్గాలు న్యాయబద్ధంగా వ్యవహరించాలి. మేం న్యాయం వైపునే నిలబడతాం. కశ్మీర్ అంశంపై శాంతియుత చర్చలు జరిగితేనే చక్కని పరిష్కారం దొరుకుతుంది. ఈ విషయంలో పాకిస్తాన్‌కు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎర్డోగన్ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని టర్కీ నాయకత్వానికి స్పష్టం చేస్తున్నాం. వాస్తవాలను అర్థం చేసుకుంటే బాగుంటుంది. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం కారణంగా భారత్, కశ్మీర్ ప్రాంతానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మీరు తెలుసుకోవాలి. జమ్మూ కశ్మీర్ విషయంలో ఇతరుల జోక్యాన్ని సహించం’’ అని స్పష్టం చేశారు. కాగా గతేడాది ఆగస్టులో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి.. అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను దోషిగా చిత్రీకరించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐరాస వంటి పలు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ తమ అంతర్గత విషయమని భారత్ స్పష్టం చేసింది. -
మోదీ టర్కీ పర్యటన రద్దు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక టర్కీ పర్యటన రద్దయ్యింది. గత నెలలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై టర్కీ అధ్యక్షుడు తుయ్యిప్ ఎర్డోగన్ విమర్శలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పారిస్‌లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలోనూ పాక్‌కు మద్దతుగా ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు కూడా పర్యటనకు రద్దు కు కారణాలుగా తెలుస్తోంది. ఈ నెల్లో జరగనున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు సౌదీ అరేబియాకు వెళ్లనున్న మోదీ.. అక్కడి నుంచి టర్కీ రాజధాని అంకారా వెళ్లాల్సి ఉంది. అయితే తాజా నిర్ణయంతో మోదీ కేవలం సౌదీలో మాత్రమే పర్యటించనున్నారు. ఈ వార్తలపై విదేశాంగ శాఖ స్పందిస్తూ అసలు మోదీ టర్కీ పర్యటన ఖరారే కాలేదని, అలాంటప్పుడు రద్దయ్యే అవకాశమే లేదని పేర్కొంది. తమిళంలో మోదీ కవిత: ఇటీవల మామల్లపురం లో తాను సముద్రంతో సంభాషణ అంటూ రాసిన కవిత తమిళ అనువాదాన్ని తాజాగా ఆది వారం ప్రధాన మంత్రి మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో అనధికార భేటీ సందర్భంగా మహాబలిపురంలో మోదీ ఒక రోజు గడిపిన విషయం తెలిసిందే. భేటీ రోజు ఉదయం బీచ్‌లో ప్లాగింగ్ చేసిన మోదీ.. అక్కడే కాసేపు కూర్చున్నారు. ఆ సందర్భంగా సముద్రంతో మమేకమయ్యానంటూ తన భావావేశాన్ని కవితగా మలిచానని తరువాత చెప్పారు. ఆ కవితనే తమిళంలో ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో తమిళంపై ప్రధాని ప్రత్యేక ప్రేమ చూపుతున్న విషయం తెలిసిందే. ఐరాస వేదికపైనా తమిళం అత్యంత ప్రాచీన భాష అని గుర్తు చేశారు. జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా మామల్లపురంలో తమిళ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. -
ఆమె బ్యాగు ఖరీదు రూ.35 లక్షలు!!
అంకారా : టర్కీ ప్రథమ మహిళ ఎమీనే ఎర్డోగాన్ జీవనశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఉంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వారు ఇలా ప్రవర్తించడమేమిటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు విషయమేమిటంటే.. ఇటీవల జరిగిన జీ 20 దేశాల సదస్సుకు టర్కీ అధ్యక్షుడు రెసీప్ తయీప్ ఎర్డోగన్ తన సతీమణి ఎమీనేతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా భర్తతో కలిసి విమానం దిగుతున్న ఎమీనే ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ క్రమంలో ఎమీనే చేతిలోని బ్యాగు అందరినీ ఆకర్షించింది. దీని ధర 50 వేల అమెరికా డాలర్లు(సుమారు 35 లక్షల రూపాయలు)గా గుర్తించిన నెటిజన్లు ప్రథమ మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమీనే చేతిలోని బ్యాగు విలువ.. దాదాపు 11 మంది టర్కీ పౌరుల వార్షికాదాయానికి సమానమని... దానితో వారి కుటుంబాలు హాయిగా జీవిస్తాయని కామెంట్లు చేస్తున్నారు. దేశ పౌరులు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంటే అధ్యక్ష భవనంలో ఉన్న వ్యక్తులు మాత్రం ఇలా విలాసవంతమైన జీవనం గడుపుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టు నుంచి టర్కీ తీవ్రస్థాయిలో ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయని, అయినప్పటికీ అధ్యక్షుడు ఎర్డోగన్ మాత్రం ఇవేమీ పట్టనట్టు జల్సాగా పర్యటనలు చేస్తున్నారంటూ స్థానిక పత్రికలు దుమ్మెత్తిపోస్తున్నాయి. -
ఖషోగి శరీర భాగాలు గుర్తింపు
ఇస్తాంబుల్: ప్రముఖ పాత్రికేయుడు, వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగి మృతదేహాన్ని ఎట్టకేలకు కనుగొన్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా కాన్సుల్ జనరల్ నివాసంలో ఆయన శరీర భాగాలను గుర్తించినట్టు స్థానిక వార్తా సంస్థ ‘స్కై న్యూస్’ వెల్లడించింది. ముక్కలుగా చేసిన జమాల్ ఖషోగి మృతదేహాన్ని సౌదీ కాన్సుల్ జనరల్ ఇంటి ఆవరణలోని తోటలో పూడ్చిపెట్టినట్టు తెలిపింది. ఖషోగి ముఖం గుర్తుపట్టలేనట్టుగా ఉందని పేర్కొంది. ఈ దారుణానికి ఆదేశించిన వారెవరో బయటపెట్టాలని సౌదీ అరేబియాను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్ కోరిన గంటల వ్యవధిలోనే ఖషోగి మృతదేహం జాడ తెలిసింది. ఈ కేసులో అరెస్టైన 18 మంది నిందితులను తమ దేశ కోర్టులో విచారిస్తామని ఎర్దోగన్ స్పష్టం చేశారు. (వేళ్లు నరికి.. బాడీని ముక్కలు చేసి..) పార్లమెంట్లో మంగళవారం తమ అధికార ఏకే పార్టీని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ... ఖషోగి మృతికి కారణమైనవారు ఎంతటివారైనా శిక్షిస్తామన్నారు. ఖషోగిని హత్య చేసిన తర్వాత ఆయనలా మరొకరిని కాన్సులేట్ బయటకు పంపి నాటకం ఆడారని వెల్లడించారు. సౌదీ అధికారులు చాలా రోజుల ముందే హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. ‘ఇది కచ్చితంగా కుట్రతో చేసిన హత్య. ఖషోగి హత్య జరిగిన రోజున నిందితులు ఇస్తాంబుల్ ఎందుకు వచ్చారు? ఎవరి ఆదేశాలపై వారు ఇక్కడకు వచ్చారు? సౌదీ కాన్సులేట్‌లోనే ఖషోగి చంపబడ్డారని అధికారికంగా ఒప్పుకున్నప్పటికీ మృతదేహాన్ని ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించే వరకు ఈ కేసును మూసివేయరాద’ని ఎర్దోగన్ అన్నారు. ఎర్దోగన్ ప్రకటనతో ఖషోగి హత్యకు గురయ్యారని తేలిపోయింది. అయితే తమ అధికారులతో జరిగిన పెనుగులాటలో ఆయన ప్రమాదవశాత్తు మరణించారని ఇప్పటివరకు సౌదీ అరేబియా చెబుతూ వస్తోంది. ఖషోగి హత్య వెనుక సౌదీ అరేబియా రాజ కుటుంబం హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను సౌదీ అరేబియా ఒప్పుకోవడం లేదు. -
నగ్నసత్యాలు వెల్లడిస్తా: ఎర్దోగన్
ఇస్తాంబుల్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ తమ రాయబార కార్యాల యంలో జరిగిన గొడవలోనే మరణించాడని సౌదీ అరేబియా ఎట్టకేలకు ఒప్పుకోవడం అంతర్జాతీయంగా దుమారం రేపుతోంది. ఖషోగ్గీ హత్య విషయంలో కొన్ని నగ్నసత్యాలను బయటపెడతామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్ ప్రకటించడంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఖషోగ్గీ కేసు విషయానికి సంబంధించి తాను మంగళవారం ప్రసంగిస్తాననీ, అప్పుడు కొన్ని కొత్త విషయాలను చెబుతానని ఎర్దోగన్ గత వారాంతంలోనే ప్రకటించారు. టర్కీ అధికార పార్టీ ప్రతినిధి, ఎర్దోగన్‌కు సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ ‘ఇది పథకం ప్రకారం, క్రూర, దారుణ కుట్రతో జరిగిన హత్య’ అని ఆరోపించారు. అటు జర్మనీ కూడా ఒప్పందం ప్రకారం ఈ ఏడాది సౌదీకి ఎగుమతి చేయాల్సిన 480 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయాన్ని నిలిపేస్తోందని ఆ దేశ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ ఖషోగ్గీ హత్య విషయంలో ఏం జరిగిందో విశ్వసనీయ ఆధారాలతో సౌదీ అత్యవసరంగా బయటపెట్టాల్సిన అవసరం ఉంద న్నాయి. ఖషోగ్గీ మృతి విషయంలో సౌదీ వివరణ నమ్మశక్యంగానే ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మాట మార్చి సౌదీ అబద్ధాలు చెబుతోందన్నారు. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్కు సౌదీ యువరాజుతో సన్నిహిత సంబంధాలున్నాయి. ట్రంప్ సొంత పార్టీ నేతలు కూడా యువరాజుకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు నమ్ముతున్నామన్నారు. 15 ముక్కలుగా నరికేశారు సౌదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, యువరాజు సల్మాన్‌ను విమర్శిస్తూ ఖషోగ్గీ వాషింగ్టన్ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. టర్కీ మహిళను పెళ్లి చేసుకునేందుకు అవసరమైన పత్రాలు పొందే విషయమై ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబసీకి ఈ నెల 2న వెళ్లిన ఆయన అక్కడే హత్యకు గురయ్యారు. హురియత్ అనే పత్రికలో వ్యాసాలు రాసే అబ్దుల్ఖదీర్ మాట్లాడుతూ సౌదీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఖషోగ్గీ గొంతు నులిమి చంపిందన్నారు. అనంతరం లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న సలాహ్ మహ్మద్ అల్–తుబైగీ సంగీతం వింటూ ఖషోగ్గీ శరీరాన్ని 15 ముక్కలుగా నరికేశారన్నారు. -
గెలిచినపుడు మాత్రమే మీ వాడినా..!?
బెర్లిన్ : ‘గెలిపించినప్పుడు మాత్రమే జర్మన్‌గా గుర్తించడం. జట్టు ఓటమి పాలైన సందర్భాల్లో ఒక వలసదారుడి వల్లే ఇదంతా జరిగిందంటూ నిందించడం సరికాదు. నాకు రెండు హృదయాలు ఉన్నాయి. ఒకటి జర్మన్‌గా. మరొకటి టర్కిష్‌గా అంటూ జర్మనీ ఫుట్‌బాల్ ఆటగాడు మెసట్ ఒజిల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇకపై జర్మన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడబోవడం లేదని పేర్కొన్నాడు. జర్మన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, కోచ్‌ల వేధింపుల కారణంగా ఫుట్‌బాల్ జట్టు నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటన చేశాడు. రాజకీయాలతో సంబంధం లేదు.. టర్కీ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒజిల్ కొందరు సహచర ఆటగాళ్లతో కలిసి రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌ను కలిశాడు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శలు రావడంతో ఆవేదనకు గురైన ఒజిల్ వివరణ ఇచ్చాడు. కేవలం టర్కీ మూలాలు ఉన్న కారణంగానే తనను విమర్శిస్తున్నారంటూ ఆరోపించాడు. ‘ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ గత రెండు నెలలుగా నాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. నా పూర్వీకులు టర్కీకి చెందినవారు. కానీ నేను పెరిగిందంతా జర్మనీలోనే. నా సహచరులతో కలిసి టర్కీ అధ్యక్షుడితో దిగిన ఫొటోలను సాకుగా చూపి నాపై జాతి వివక్షకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని భూతద్దంలో చూపి జర్మన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, మా కోచ్ వివరణ ఇవ్వాల్సిందిగా నన్ను డిమాండ్ చేశారు. అయితే నేను కేవలం ఒక ఆటగాడిని మాత్రమే అన్న విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలి’ అంటూ ఒజెల్ వ్యాఖ్యానించాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ జట్టు ఫిఫా ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లోనే మెక్సికో చేతిలో అనూహ్య పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ నుంచి తమ సీనియర్ ఆటగాడు ఒజిల్‌ను తుది జట్టు నుంచి పక్కన పెట్టేసింది. -
టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డోగన్ గెలుపు
ఇస్తాంబుల్: టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ(ఏకేపీ) అభ్యర్థి రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్(64) మరోసారి ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎర్డోగన్‌కు 52.5 శాతం ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి ముహర్రెమ్ ఇన్సేకు 30.6 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో 87 శాతం మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎర్డోగన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినట్లు సుప్రీం ఎలక్షన్ కమిటీ ప్రకటించడంతో టర్కీ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. తాజా ఎన్నికలతో ఎర్డోగన్ మరో ఐదేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. కాగా, అధ్యక్ష ఎన్నికలతో పాటు పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లోనూ ఎర్డోగన్‌కు చెందిన ఏకేపీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. 600 సీట్లున్న టర్కీ పార్లమెంటులో ఏకేపీ పార్టీ 293 స్థానాలను దక్కించుకోగా, మిత్రపక్షం ఎంహెచ్పీ 50 సీట్లలో విజయం సాధించింది. -
కశ్మీర్ ద్వైపాక్షిక అంశం
టర్కీ అధ్యక్షుడికి భారత్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం బహుళ పక్ష చర్చలు జరపాలని, అందులో తామూ పాలుపంచుకుంటామని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్దోగన్ చేసిన సూచనను భారత్ తోసిపుచ్చింది. ఇది ద్వైపాక్షిక అంశమని, సీమాంతర ఉగ్రవాదం దీనికి కారణమని ఆయనకు స్పష్టం చేసింది. భారత పర్యటన ప్రారంభ సందర్భంగా ఎర్డోగన్ ఆదివారం ఓ ఇంటర్వూ్యలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. సోమవారం ఢిల్లీ లో ఆయన ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఉగ్రవాదం, కశ్మీర్‌లపై తమ వాదనను ఎర్దోగన్‌కు స్పష్టం చేశామని విదేశాంగ ప్రతినిధి గోపాల్ బాగ్లే విలేకరులకు చెప్పా రు. ‘ఉద్దేశం ఏదైనా ఉగ్రవాదాన్ని సమర్థించకూడదని తేల్చిచెప్పాం. పాక్‌తో కశ్మీర్ సహా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మేం సిద్ధం. మా వాదనను టర్కీ జాగ్రత్తగా ఆలకించింది’ అనిఅన్నారు. ఉగ్రపోరులో సాయం చేస్తాం: ఎర్డోగన్ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సాయం చేస్తామని మోదీతో భేటీలో ఎర్డోగన్ హామీ ఇచ్చారు. ఉగ్రవాదం ఇరు దేశాలకు ఆందోళనకరమన్న ఇరువురు నేతలు చర్చల తర్వాత విలేకర్లతో మాట్లాడారు. ‘ఉగ్రవాదం సక్రమమైందని ఉద్దేశం, ఏ కారణమూ చెప్పజాలదు. ఈ భూతాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించాం’ అని మోదీ తెలిపారు. ఎర్డోగన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు టెలికం సహా పలు రంగాల్లో మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చర్చలకు ముందు మోదీ, ఎర్డోగన్‌లు భారత్–టర్కీ వ్యాపారుల సదస్సులో మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీతో చర్చలకు ముందు ఎర్డోగన్‌కు రాష్ట్రపతి భవన్లో ఘనస్వాగతం లభించింది. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఎర్డోగన్ డిమాండ్ చేశారు. -
చర్చలతోనే కశ్మీర్‌కు పరిష్కారం: ఎర్డోగన్
న్యూఢిల్లీ: బహుళపక్ష చర్చలతోనే కశ్మీర్లో శాంతి స్థాపన సాధ్యమవుతుందని, అవసరమైతే ఆ చర్చల్లో తామూ పాలుపంచుకుంటామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిబ్ ఎర్డోగన్ పేర్కొన్నారు. రెండ్రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఆయన భారత్‌కు చేరుకున్నారు. అనంతరం ఓ చానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ.. అణు సరఫరాదారుల గ్రూపులో(ఎన్ఎస్జీ) భారత్ సభ్యత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. అఖిలపక్ష చర్చల వల్లే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాపడ్డారు భారత్, పాక్‌ల భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరుదేశాలు తమకు మంచి మిత్రులన్న ఎర్డోగన్, శాంతి స్థాపనతో పాటు చర్చల్ని ప్రారంభించడంతో టర్కీ తనవంతు పాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డారు. -
టర్కీలో తిరుగుబాటు
-
టర్కీలో తిరుగుబాటు
- 265 మంది మృతి - అధ్యక్షుడు ఎర్డోగన్‌పై సైనిక కుట్ర - అణచివేసిన సర్కారు అంకారా : టర్కీలో అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవటం లక్ష్యంగా శుక్రవారం రాత్రి ఆ దేశ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేసింది. తిరుగుబాటును ప్రభుత్వ అనుకూల సైన్యం తిప్పికొట్టింది. రాజధాని అంకారాలోనూ, ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లోనూ శుక్రవారం రాత్రి కాళరాత్రే అయింది. అంకారాలోని పార్లమెంటు భవనంపై యుద్ధ విమానాలతో బాంబుదాడులు, అధ్యక్షుడి భవనం ముట్టడి, వీధుల్లో యుద్ధట్యాంకుల కవాతు, వారికి వ్యతిరేకంగా ఎర్డోగన్ పిలుపుతో ప్రజల భారీ ప్రదర్శనలు, సైనికులతో తలపడేందుకు ప్రయత్నాలు, వారిపై రెబల్ సైనికుల కాల్పులు.. తిరుగుబాటును అణచివేసేందుకు ప్రభుత్వ అనుకూల సైన్యం సాయుధ చర్యలతో టర్కీ అట్టుడికింది. ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉందో, ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుతోందో తెలీనిగందరగోళం నెలకొంది. అయితే.. ప్రభుత్వం తెల్లవారేసరికి తిరుగుబాటును అణచివేసింది. హింసలో 104 మంది తిరుగుబాటు సైనికులు సహా మొత్తం 265 మంది చనిపోయారు. మరో 1,440 మంది గాయపడ్డారు. 3,000 మంది రెబల్ సైనికులను నిర్బంధించారు. దేశం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని ప్రధాని బినాలి ఎల్దిరిమ్ ప్రకటించగా.. తిరుగుబాటును తిప్పికొట్టామని ఎర్డోగన్ ప్రకటించారు. తిరుగుబాటు కుట్ర ఎర్డోగన్‌కు బద్ధశత్రువు, అమెరికాలో నివసిస్తున్న మతగురువు ఫెతుల్లా గులెన్ పనేనని ప్రభుత్వం ఆరోపించింది. కుట్ర నేపథ్యంలో.. పలువురు సైనిక జనరళ్లతో పాటు టర్కీ అత్యున్నత న్యాయస్థానం జడ్జీల్లో ఒకరైన అల్ఫార్స్లాన్ అల్తాన్ను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. మొత్తం 2,700 మంది జడ్జీలను విధుల నుంచి తొలగించింది. అధ్యక్షుడు విహార యాత్రలో ఉండగా ఎనిమిది కోట్ల మంది జనాభా గల టర్కీకి గత 13 ఏళ్లుగా ఎర్డోగన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన టర్కీ ఆధునిక లౌకిక మూలాలను కాలరాస్తున్నారని, నియంతృత్వం దిశగా పయనిస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఎర్డోగన్ తనను వ్యతిరేకించే శక్తులను తప్పించి సైన్యంపై నియంత్రణ సాధించారని చెప్తారు. ముస్తఫా కెమాల్ అటాటర్క్ 1923లో టర్కీలో స్థాపించిన లౌకిక రాజ్యానికి రక్షణ కల్పిస్తుంది తామేనని ఆ దేశ సైన్యం విశ్వసిస్తుంటుంది. 1960 నుంచీ సైన్యం మూడుసార్లు నాటి ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసింది. 1997లో ఇస్లామిక్ సర్కారును కూలదోసింది. ఈ నేపథ్యంలో.. ఎర్డోగన్ శుక్రవారం సముద్రతీర విహార కేంద్రమైన మార్మారిస్‌లో ఓ రిసార్ట్‌లో ఉండగా ఆర్మీలోని ఒక వర్గం తిరుగుబాటుకు దిగింది. సైనిక దళాల అధిపతి హులుసి అకార్ను బంధించి, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు అంకారా, ఇస్తాంబుల్‌లో ప్రధాన వీధులనుఆధీనంలోకి తీసుకుంది. అటాటర్క్ ఎయిర్‌పోర్టును మూసేసింది. పార్లమెంటు భవనంపై ఎఫ్-16 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఇస్తాంబుల్‌లో యూరప్‌ను ఆసియాతో కలిపే రెండు వంతెనలను మూసివేసి రాకపోకలను నిషేధించింది. దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, నిరవధిక సైనిక కర్ఫ్యూ విధించామని అన్నారు. ట్విటర్, ఫేస్టైమ్లలో ఎర్డోగన్ పిలుపు... ఇది ఒక వర్గం సైనిక కుట్ర అని, సైన్యంలో దిగువ స్థాయి అధికారులు ఉన్నతాధికారులపై తిరుగుబాటు చేశారని ఎర్డోగన్ ట్విటర్లో, ఐఫోన్లో ఫేస్‌టైమ్ ద్వారా ఒక టీవీ చానల్లో తెలిపారు. ప్రభుత్వ మద్దతుదారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు వీధుల్లోకి రావాలన్నారు. దీంతో అధికార జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ మద్దతుదారులు వేలమంది జాతీయ పతాకాలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి సైన్యానికి నిరసన తెలిపారు. అయితే.. చాలా కొద్ది మంది రెబల్ సైనికులకు స్వాగతం పలకటం కూడా కనిపించింది. ఇస్తాంబుల్‌లోని ఒక వంతెన వద్ద రెబల్ సైనికులతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. సైనికులు కాల్పులు జరపటంతో డజన్ల మంది గాయపడ్డారు. ఇస్తాంబుల్‌లోని టాక్సిమ్ స్క్వేర్‌లోనూ సైనికుల కాల్పుల్లో నిరసనకారులు గాయపడ్డారు. రెండు నగరాల వీధులూ రణరంగాన్ని తలపించాయి. మరోవైపు.. ప్రభుత్వ అనుకూల సైన్యం రెబల్స్‌పై వైమానిక దాడి చేసింది. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన యుద్ధట్యాంకర్లను పేల్చేసింది. అంకారా, ఇస్తాంబుల్ బాంబు పేలుళ్లు, కాల్పులతో అట్టుడికాయి. తెల్లవారేసరికి.. రెబల్ సైన్యం లొంగిపోయింది. చాలా మంది సైనికులు నిరాయుధులుగా లొంగిపోయారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రధాని ఎల్దిరిమ్ ప్రకటించారు. తిరుగుబాటు సైన్యం బంధించిన సైనిక దళాల అధిపతి హులిసిని విడిపించగా.. ఆయనతో పాటు కలిసి ఎల్దిరిమ్ అంకారాలో మీడియాతో మాట్లాడారు. రాత్రి హింసలో 161 మంది ప్రజలు చనిపోయారన్నారు. రెబల్ సైనికులు 104 మంది హతమైన విషయాన్ని ప్రస్తావించలేదు. పార్లమెంటు భవనం ధ్వంసమై కనిపించింది. దేశ సాయుధ దళాలకు తాత్కాలిక చీఫ్‌గా జనరల్ ఉమిత్ దుందార్ను నియమించినట్లు ఎల్దిరిమ్ ప్రకటించారు. గులెన్కు ఆశ్రయమిస్తున్న అమెరికాపై ధ్వజం... మరోవైపు.. గులెన్ ఉగ్రవాద సంస్థ నాయకుడని పరోక్షంగా ఆరోపిస్తూ.. ఆయనకు అమెరికా ఆశ్రయం ఇవ్వటాన్ని టర్కీ ప్రధాని ఎల్దిరిమ్ తప్పుపట్టారు. గులెన్కు వ్యతిరేకంగా టర్కీ వద్ద ఏదైనా సాక్ష్యముంటే తమకు అందించాలని అమెరికా పేర్కొంది. టర్కీ కుట్రలో పాత్ర పోషించినట్లు భావిస్తున్న ఎనిమిది మంది సైనికాధికారులు శనివారంహెలికాప్టర్లో గ్రీస్ చేరుకుని శరణుకోరారు. తిరుగుబాటు నేపథ్యంలో టర్కీకి వెళ్లాల్సిన చాలా అంతర్జాతీయ విమానాలను శుక్రవారం రాత్రి నుంచి రద్దు చేశారు. శనివారం ఉదయానికి కుట్రను అణచివేయటంతో దేశంలో జనజీవనం మళ్లీ యథాతథస్థితికి చేరుకుంటోంది. అటాటర్క్ విమానాశ్రయాన్ని తెరచి విమాన రాకపోకలను ప్రారంభిస్తున్నారు. టర్కీలో శాంతి నెలకొనేందుకు కృషి చేయాలని ప్రపంచ నేతలు పిలుపునిచ్చారు. ఎర్డోగన్ సర్కారు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. కుట్ర సూత్రధారి గులెన్: ఎర్డోగన్ అధ్యక్షుడు ఎర్డోగన్ రాత్రికి రాత్రే అంకారా చేరుకుని అటాటర్క్ ఎయిర్‌పోర్టు నుంచి, తర్వాత ఇస్తాంబుల్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం తమ నియంత్రణలోనే ఉందని, కుట్రను తిప్పికొట్టామన్నన్నారు. అయితే.. ‘కుట్ర ఏ స్థాయిలో ఉన్నాసరే ఈ రోజు రాత్రి వీధులు మన అధీనంలో ఉండాలి. ఏ క్షణంలోనైనా కొత్త తిరుగుబాటు రాజుకోవచ్చు’ అని అన్నారు. తిరుగుబాటు రాజద్రోహమని, కారకులు భారీ మూల్యం చెల్లిస్తారన్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా నుంచి నడుస్తున్న సమాంతర సర్కారే కుట్ర చేసిందంటూ.. అక్కడున్న గులెన్ను నిందించారు. ఒకనాటి మిత్రుడైన గులెన్ తనను కూలదోయాలని యత్నిస్తున్నట్లు ఎర్డోగన్ ఆరోపిస్తుంటారు. గులెన్ స్పందిస్తూ.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని అన్నారు. 148 మంది భారతీయ బాలలు క్షేమం న్యూఢిల్లీ: వరల్డ్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడానికి టర్కీలోని ట్రాబ్జాన్లో ఉన్న 148 మంది భారతీయ బాలలు, 38 మంది అధికారులు క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ నెల 18 నుంచి వారు భారత్‌కు బృందాలుగా బయల్దేరతారని ట్వీట్ చేశారు. ఈ బాలల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన అథ్లెట్ దండి జ్యోతికా శ్రీ ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతానికి 1,200 కి.మీ దూరంలో ఈ క్రీడలు జరుగుతున్నాయి. కాగా, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరుకు చెందిన ఎ.గౌతమ్ రెడ్డి కూడా టర్కీలో చిక్కుకుపోయారు దక్షిణ కొరియాలోని డేగు వర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న ఆయన న్యూయార్క్ వెళ్తూ మార్గమధ్యంలో ఇస్తాంబుల్‌లో చిక్కుకుపోయారు. ప్రజాస్వామ్యానికి మద్దతివ్వండి .. భారత్: టర్కీలోని అన్ని పక్షాలు ప్రజాస్వామ్యానికి, ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పునకు మద్దతివ్వాలని, రక్తపాతాన్ని నివారించాలని భారత్ కోరింది. భారత ఎంబసీ అంకారా(905303142203), ఇస్తాంబుల్(905305671095)లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. విభిన్న ఆలోచనల ‘సుల్తాన్’ ఇస్తాంబుల్: ఆధునిక టర్కీ చరిత్రలో ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగన్ చాలా ప్రత్యేకం. ఇస్లామిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన ఈయన మిగిలిన నేతలతో పోలిస్తే భిన్నంగా వ్యవహరిస్తారనే పేరుంది. టర్కీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడని.. అభిమానులంటారు. అధ్యక్షుడిగా 2014లో పగ్గాలు చేపట్టిన ఎర్డోగన్ (అభిమానులు సుల్తాన్ అని అంటారు) 2003లో ప్రధానిగా ఉన్నారు. అమెరికా తరహాలో అధ్యక్షుడే సర్వస్వంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఈయన ఆలోచన. అయితే లౌకిక వాదానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రమాదకరంగా మారాయని విపక్షాల ఆరోపణ. దీంతో అసంతృప్తిగా ఉన్న కొందరు సైనికులు చేసిన ఈ తిరుగుబాటుతో చిర్రెత్తిన ఎర్డోగన్.. తన వ్యతిరేకులంతా ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు. తిరుగుబాటుకు.. ఆర్మీ చీఫ్, నిఘా, తదితర విభాగాలు మద్దతు తెలపలేదు. వీరంతా ప్రభుత్వానికి విధేయులగా ఉండటంతోనే.. ఎర్డోగాన్ తిరుగుబాటును విజయవంతంగా అణిచివేయగలిగారు. సైనిక తిరుగుబాట్ల టర్కీ మార్చి 27, 1960: ఆధునిక టర్కీ నిర్మాత ముస్తఫా కెమాల్ అటాటర్క్ ఆలోచనలకు విరుద్ధంగా అప్పటి అధికార పార్టీ వందలాది మసీదులను నిర్మించి అరబిక్‌లో ప్రార్థనలకు అనుమతించింది. అటాటర్క్ రూపొందించిన నిబంధనల సమీక్షకు ఆర్మీ ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకుంది. మార్చి 12, 1971:రాజకీయ సంక్షోభం తలెత్తడంతో మిలటరీ జనరల్ టాగ్మాక్ అల్టిమేటం జారీ చేశారు. రాజ్యాంగ బద్ధమైన, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేవరకు పాలనా బాధ్యతల్ని మిలట్రీ చేపడుతుందన్నారు. సెప్టెంబరు 12, 1980: రాజకీయ అస్థిరతతో 1980, సెప్టెంబరు 12న ఆర్మీ అధికారం చేజిక్కించుకుంది. కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 27, 1997: ఇస్లాం ప్రాబల్యం ఎక్కువవుతుండటంతో.. ‘పోస్ట్‌మాడర్న్ కూప్’ పేరుతో ఆర్మీ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించింది. ఇస్తాంబుల్ మేయర్‌గా ఉన్న ఎర్డోగన్ ఇస్లామిక్ పద్యాన్ని చదవడంతో ఆర్మీ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. మా షూటింగ్‌కు ఇబ్బంది లేదు: బిర్సా కోల్‌కతా: ఇస్తాంబుల్‌లో సినిమా చిత్రీకరణ చేస్తున్న డెరైక్టర్ బిర్సా దాస్‌గుప్తా.. సైనిక తిరుగుబాటులో తమకు ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదని, ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందన్నారు. పశ్చిమబెంగాల్ ఐటీ మంత్రి బ్రాత్యా బసు సహా ఆ రాష్ట్రానికి చెందిన 35 మంది ఈ సినిమా బృందంలో ఉన్నారు. -
యువకుడిని రక్షించిన టర్కీ అధ్యక్షుడు
ఇస్తాంబుల్: టర్కీ దేశంలోని ఇస్తాంబుల్‌లో సుసైడ్ స్పాట్‌గా పేరుగాంచిన ఎత్తైన వంతెనది. అదే బొస్పొరస్ బ్రిడ్జి. దీని ఎత్తు 64 మీటర్లు(211 అడుగులు). తరుచూ ఆత్మహత్యలు చేసుకోవడానికి వచ్చేవారికి ఈ బ్రిడ్జి ఐకాన్‌గా మారింది. అలాంటి ప్రదేశంలోకి ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు ఓ 30 ఏళ్ల యువకుడు. జీవితం మీద విరక్తితో ఆ యువకుడు... తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే సరైన ప్రదేశమని ఎంచుకున్నాడు కాబోలు. అనుకున్నదే తడువుగా ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఇంతలో ఆత్మహత్య చేసుకోవద్దంటూ వెనక నుంచి ఓ పిలుపు వినిపించింది. ఎవరా అని వెనుదిరిగి చూశాడా యువకుడు. ఆయన ఎవరో కాదు టర్కీ అధ్యక్షుడు రీసిప్ త్యాప్ ఈర్డోగన్. సాక్షాత్ దేశ అధ్యక్షుడే ఆ యువకుడి ప్రాణాలను రక్షించాడు. శుక్రవారం ప్రార్థనలు ముగించుకున్న అనంతరం భారీ రక్షకదళాల వాహనాల నడుమ కారులో వెళుతున్న అధ్యక్షుడి రీసిప్‌కు ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ యువకుడు తారసపడ్డాడు. వెంటనే కారును ఆపి యువకుడిని ఆత్మహత్య చేసుకోవద్దంటూ వారిస్తూ అడ్డుకున్నారు. యువకుడిని తీసుకురమ్మని సెక్యూరీటీ అధికారులను ఆదేశించారు. కారులో కూర్చొని విండోలో నుంచి యువకునితో మాట కలిపారు. దాంతో యువకుడు కుటుంబ సమస్యలతో జీవితం మీద విరక్తి చెంది ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పాడు. కొన్ని క్షణాల తరువాత ఆ యువకుడు కృతజ్ఞత భావంతో అధ్యక్షుడు రీసిప్ చేతిని ముద్దుపెట్టుకున్నాడు. -
శాంతి ర్యాలీపై ఉగ్ర పంజా!
86 మంది బలి ♦ టర్కీ రాజధాని అంకారాలో పేలుళ్లు ♦ 186 మందికి గాయాలు ♦ ఆత్మాహుతి దాడి అని అనుమానం అంకారా: టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రవాదులు శనివారం పంజా విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకి సిద్ధమవుతున్న అతివాద, కుర్దుల అనుకూల నిరసనకారులు లక్ష్యంగా రెండు వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. అంకారాలోని ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ జంట పేలుళ్లలో 86 మంది మృతిచెందగా మరో 186 మంది గాయపడ్డారు. ఘటనాస్థలిలోనే 62 మంది మృత్యువాతపడగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో 24 మంది కన్నుమూసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మ్యూజినోగ్లు తెలిపారు. పేలుళ్ల ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. పేలుళ్లను ఉగ్రవాదుల ఘాతుకంగా అనుమానిస్తున్నామని...ఇందులో ఆత్మాహుతి దళ సభ్యుడి ప్రమేయం ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. తొలుత ఓ భారీ పేలుడు సంభవించిన కాసేపటికే మరో పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుళ్ల అనంతరం ఘటనాస్థలి వద్ద ఆందోళనకు దిగిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. చేయిచేయి కలిపి నవ్వుతూ నృత్యాలు చేస్తున్న నిరసనకారులంతా తొలి పేలుడు తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలను స్థానిక టీవీ చానల్ ప్రసారం చేసింది. క్షతగాత్రులను ఆదుకునేందుకు వందలాది మంది రక్తదానానికి ఆస్పత్రులకు తరలి వెళ్లారు. అంకారా నగర చరిత్రలో జరిగిన అత్యంత తీవ్రమైన ఈ దాడిని దేశాధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఖండించారు. దేశ ప్రజల ఐక్యత, శాంతిని దెబ్బతీసే లక్ష్యంతో పేలుళ్లు జరిగినట్లు పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు సైతం ఈ దాడిని ఖండించారు. నాటో సభ్య దేశమైన టర్కీలో నెలకొన్న అనిశ్చితిపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో ఉగ్రవాదంపై పోరులో టర్కీ ఏకతాటిపై నిలబడాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) విదేశాంగ విధానం చీఫ్ ఫెడెరికా మోఘెరినీ సూచించారు. నవంబర్ 1న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరిగిన ఈ పేలుళ్లు ఇప్పటికే కుర్దు మిలిటెంట్లపై ప్రభుత్వ అణచివేతతో పెరుగుతున్న ఉద్రిక్తతలను మరింత రాజేశాయి. కాగా, అంకారాలో జంట పేలుళ్లలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తున్నట్లు ట్వీట్ చేశారు. -
282 చేరిన మృతుల సంఖ్య : టర్కీ బొగ్గు గని విషాదం
సోమా (టర్కీ): పశ్చిమ టర్కీలోని బొగ్గు గనిలో సంభవించిన పేలుడులో మృతుల సంఖ్య 282కు పెరిగింది. ఇంకా చాలా మంది గనిలోనే చిక్కుకునిపోయి ఉన్నారు. వారి పరిస్థితి తెలియరాకుండా ఉంది. గని ఆపరేటర్ల అంచనా ప్రకారం 90 మంది ఇంకా లోపల ఉన్నారు. అయితే సహాయక సిబ్బంది ప్రకారం ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. గనుల యజమానుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేశంలోని నాలుగు పెద్ద యూనియన్లు గురువారం దేశ వ్యాప్తంగా సమ్మె చేశాయి. అధిక లాభాల కోసం యజమానులు తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో యజమానులు బలవంతంగా పని చేయిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. మంగళవారం సోమా పట్టణంలోని గనిలో సంభవించిన ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గనిలో పేలుడుపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. అయితే ఆ దుర్ఘటనలో ప్రభుత్వ నిరక్ష్యం లేదని ప్రధాని రెసిప్ తయిప్ ఎర్డగాన్ చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని ఆయన సమర్థించుకున్నారు. బ్రిటన్‌లో 1862లో 204 మంది, 1864లో 361 మంది గని ప్రమాదాల్లో మృతి చెందిన సంఘటనలు ఆయన గుర్తు చేశారు. గని సందర్శన సమయంలో బాధితులు బంధువుల నిరసనతో ప్రధాని ఎర్డగాన్ ఒక షాపులో తలదాచుకోవాల్సి వచ్చింది. కొంత మంది ఆయన కారుపై దాడి చేశారు. బుధవారం ఉదయం గని ప్రమాదంలో 245 చనిపోయారని ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే.