జర్మన్ ఫుట్‌బాల్ ఆటగాడు ఒజిల్
బెర్లిన్ : ‘గెలిపించినప్పుడు మాత్రమే జర్మన్‌గా గుర్తించడం. జట్టు ఓటమి పాలైన సందర్భాల్లో ఒక వలసదారుడి వల్లే ఇదంతా జరిగిందంటూ నిందించడం సరికాదు. నాకు రెండు హృదయాలు ఉన్నాయి. ఒకటి జర్మన్‌గా. మరొకటి టర్కిష్‌గా అంటూ జర్మనీ ఫుట్‌బాల్ ఆటగాడు మెసట్ ఒజిల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇకపై జర్మన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడబోవడం లేదని పేర్కొన్నాడు. జర్మన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, కోచ్‌ల వేధింపుల కారణంగా ఫుట్‌బాల్ జట్టు నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటన చేశాడు.
రాజకీయాలతో సంబంధం లేదు..
టర్కీ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒజిల్ కొందరు సహచర ఆటగాళ్లతో కలిసి రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌ను కలిశాడు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శలు రావడంతో ఆవేదనకు గురైన ఒజిల్ వివరణ ఇచ్చాడు. కేవలం టర్కీ మూలాలు ఉన్న కారణంగానే తనను విమర్శిస్తున్నారంటూ ఆరోపించాడు. ‘ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ గత రెండు నెలలుగా నాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. నా పూర్వీకులు టర్కీకి చెందినవారు. కానీ నేను పెరిగిందంతా జర్మనీలోనే. నా సహచరులతో కలిసి టర్కీ అధ్యక్షుడితో దిగిన ఫొటోలను సాకుగా చూపి నాపై జాతి వివక్షకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని భూతద్దంలో చూపి జర్మన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, మా కోచ్ వివరణ ఇవ్వాల్సిందిగా నన్ను డిమాండ్ చేశారు. అయితే నేను కేవలం ఒక ఆటగాడిని మాత్రమే అన్న విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలి’ అంటూ ఒజెల్ వ్యాఖ్యానించాడు.
కాగా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ జట్టు ఫిఫా ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లోనే మెక్సికో చేతిలో అనూహ్య పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ నుంచి తమ సీనియర్ ఆటగాడు ఒజిల్‌ను తుది జట్టు నుంచి పక్కన పెట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment