
శాంతి ర్యాలీపై ఉగ్ర పంజా!
86 మంది బలి
♦ టర్కీ రాజధాని అంకారాలో పేలుళ్లు
♦ 186 మందికి గాయాలు
♦ ఆత్మాహుతి దాడి అని అనుమానం
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రవాదులు శనివారం పంజా విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకి సిద్ధమవుతున్న అతివాద, కుర్దుల అనుకూల నిరసనకారులు లక్ష్యంగా రెండు వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. అంకారాలోని ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ జంట పేలుళ్లలో 86 మంది మృతిచెందగా మరో 186 మంది గాయపడ్డారు. ఘటనాస్థలిలోనే 62 మంది మృత్యువాతపడగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో 24 మంది కన్నుమూసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మ్యూజినోగ్లు తెలిపారు. పేలుళ్ల ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
పేలుళ్లను ఉగ్రవాదుల ఘాతుకంగా అనుమానిస్తున్నామని...ఇందులో ఆత్మాహుతి దళ సభ్యుడి ప్రమేయం ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. తొలుత ఓ భారీ పేలుడు సంభవించిన కాసేపటికే మరో పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుళ్ల అనంతరం ఘటనాస్థలి వద్ద ఆందోళనకు దిగిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. చేయిచేయి కలిపి నవ్వుతూ నృత్యాలు చేస్తున్న నిరసనకారులంతా తొలి పేలుడు తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలను స్థానిక టీవీ చానల్ ప్రసారం చేసింది. క్షతగాత్రులను ఆదుకునేందుకు వందలాది మంది రక్తదానానికి ఆస్పత్రులకు తరలి వెళ్లారు.
అంకారా నగర చరిత్రలో జరిగిన అత్యంత తీవ్రమైన ఈ దాడిని దేశాధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఖండించారు. దేశ ప్రజల ఐక్యత, శాంతిని దెబ్బతీసే లక్ష్యంతో పేలుళ్లు జరిగినట్లు పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు సైతం ఈ దాడిని ఖండించారు. నాటో సభ్య దేశమైన టర్కీలో నెలకొన్న అనిశ్చితిపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో ఉగ్రవాదంపై పోరులో టర్కీ ఏకతాటిపై నిలబడాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) విదేశాంగ విధానం చీఫ్ ఫెడెరికా మోఘెరినీ సూచించారు. నవంబర్ 1న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరిగిన ఈ పేలుళ్లు ఇప్పటికే కుర్దు మిలిటెంట్లపై ప్రభుత్వ అణచివేతతో పెరుగుతున్న ఉద్రిక్తతలను మరింత రాజేశాయి. కాగా, అంకారాలో జంట పేలుళ్లలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తున్నట్లు ట్వీట్ చేశారు.