
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు స్టైలిష్ రాజు అని పేరు. ఎందుకంటే ఆయన ఒక్కసారి ధరించిన దుస్తులను మళ్లీ ధరించరు. ఆ రోజుల్లో దేశవిదేశీ మార్కెట్‌లలోకి వచ్చే ప్రతి డిజైన్‌ను ఆయన ధరించేవారు. దేశవిదేశీ డిజైనర్లను రప్పించి పురానీహవేలీలోని తన నివాసంలోనే దుస్తులు తయారు చేయించేవారు. ఇందుకు ఓ పెద్ద భవనాన్ని కూడా కేటాయించారు. ఈ క్రమంలో 1893లో రాజు ఓ వేడుకలో వేసుకునేందుకు డిజైనర్లు ఆంగ్లేయులు ధరించే సూట్‌ను రూపాంతరం చేసి షేర్వాణీ డిజైన్ చేశారు. అలా 125ఏళ్ల క్రితం ఒకే ఒక్క వేడుక కోసం డిజైన్ చేసిన షేర్వాణీ.. మనకు కానుకగా లభించింది.
సాక్షి, సిటీబ్యూరో :ఆరో నిజాం కోసం డిజైన్ చేసిన షేర్వాణీ అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఆయన మరణానంతరం హైదరాబాద్ సంస్థానం పాలకులు, జమిందార్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉన్నత వర్గాల ప్రజలు ప్రతి వేడుకలోనూ షేర్వాణీ ధరించేవారు. అయితే కేవలం ముస్లింలు మాత్రమే షేర్వాణీవేసుకునేవారు. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్థిస్థాయిలో క్లాసులు ప్రారంభమయ్యాక... అక్కడి విద్యార్థులకు ఏదైనా డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుందని విద్యాశాఖ అధికారులు ఏడో నిజాం దగ్గర ప్రతిపాదించారు. దీంతో విద్యార్థులకు డ్రెస్ కోడ్‌గా షేర్వాణీ ఉండాలని నిజాం ఆదేశాలిచ్చారు. అలా షేర్వానీ ఉస్మానియా విద్యార్థుల డ్రెస్ కోడ్ కూడా అయింది. ముస్లిం విద్యార్థులు మోకాళ్ల కింది వరకు షేర్వాణీ ధరిస్తే... హిందూ విద్యార్థులు మోకాళ్ల పైకి ధరించేవారు.
దేశవ్యాప్తం...
ఉస్మానియా విద్యార్థుల డ్రెస్ కోడ్‌గా షేర్వాణీ ఎంపికైన విషయం దేశంలోని వివిధ విద్యాసంస్థలకు తెలిసింది. దీంతో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోనూ విద్యార్థులు షేర్వానీ ధరించేందుకు అనుమతులు పొందారు. ఇతర విద్యాసంస్థలు, సంస్థానాల్లోనూ షేర్వాణీ ధరించడం ప్రారంభమైంది. రాజకీయ నాయకులు, ఉద్యమ నేతలు ప్రాధాన్యం ఇచ్చేవారు. అలా హైదరాబాద్‌లో డిజైన్ అయిన షేర్వాణీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక అప్పటి నుంచి షేర్వాణీకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు ఉన్నత వర్గాల ప్రజలు ధరించగా.. ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు. ఆధునిక యుగంలో మరిన్ని హంగులద్దుకొన్న షేర్వాణీ యువతను ఆకట్టుకుంటోంది.
విభిన్న డిజైన్లలో...
దాదాపు 50 ఏళ్ల వరకు షేర్వాణీ ఒకే మోడల్‌లో మార్కెట్‌లో అందుబాటులో ఉండేది. అయితే తర్వాత దాని డిజైన్ మారిపోయింది. 1960 దశకం తర్వాత సినిమాల్లోనూ షేర్వాణీలు ధరించడంతో డిజైనర్లు నయా హంగులు అద్దారు. చిన్నగా, పెద్దగా, రౌండ్ గల్లా తదితర డిజైన్లతో మార్కెట్‌లోకి వచ్చాయి. వేడుక ఏదైనా సంప్రదాయ దుస్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోందని జహాపనా మెన్స్ ఎథ్నిక్‌వేర్ నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో అందరూ షేర్వాణీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం చిన్నచిన్న ఫంక్షన్లు మొదలు పెళ్లిళ్ల వరకూ షేర్వాణీ ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే తరహాలో కొత్త కొత్త డిజైన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి.
న్యూలుక్...
షేర్వాణీ సంప్రదాయ వస్త్రధారణ. అయితే యువత అభిరుచికి అనుగుణంగా విభిన్న డిజైన్లలో రూపొందిస్తున్నాం. మా షోరూమ్‌లో ఈస్ట్రన్, వెస్ట్రన్, యూరోపియన్, అరేబియన్ తదితర డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని హైదరాబాదీ స్టైల్‌లో తీర్చిదిద్దుతున్నాం. 1960 దశకంలో పౌరాణిక సినిమాల్లో ధరించిన బాటమ్ కట్, బాటమ్ అప్ అండ్ డౌన్ షేర్వాణీలకు మళ్లీ డిమాండ్ ఉంటోంది.
– మహ్మద్ ఇబ్రహీం బుఖారీ, జహాపనా మెన్స్ ఎథ్నిక్‌వేర్
Comments
Please login to add a commentAdd a comment