వినాయక్‌నగర్ : నిరంకుశ పాలనతో ప్రజలను వేధించిన నిజాం ప్రభువులను ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడడం ఎంతవరకు సబబని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజాం ప్రభువుల పాలన బ్రహ్మాండం అంటూ కేసీఆర్ పదేపదే పేర్కొనడాన్ని తప్పుపట్టారు.
‘‘కొమురం భీంను ఎవరు హతమార్చారు, ఎందుకు హతమార్చారు, జోడేఘాట్‌ను కేసీఆర్ ఎందుకు సందర్శించారు, వీరనారి చాకలి ఐలమ్మను హతమార్చింది ఎవరు’’ అన్న అంశాలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని యెండల డిమాండ్ చేశారు. నిజాం అరాచకాలను ఎదిరించి, రజకార్లతో పోరాడినవారికి పెన్షన్ ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. తుపాకీని పరీక్షించేందుకు బైరాన్‌పల్లిలో 84 మందిని కాల్చి చంపిన నిజాం చరిత్రను ప్రజలు మరచిపోలేదన్నారు. కేసీఆర్ చరిత్ర తిరగేసి అక్కడి మర్రిచెట్టుకు వెయ్యి ఉరిల మర్రి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలన్నారు.
నిజాం కాలంలో తెలంగాణ ఆడ బిడ్డలు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే వివస్త్రలను చేసి ఆడించిన సంఘట నలు నిజాంచరిత్రలో ఉన్నాయన్నారు. అలాంటి నీచపాలన బాగుందని కేసీఆర్ పేర్కొనడం దురదృష్టకరమన్నారు. నిజాం ముక్కుపిండి పన్నులు వసూలు చేసి, ప్రపంచంలోనే ధనవంతుడిగా మారాడన్నారు. తన పాలనకు వ్యతిరేకంగా కథనాలను ప్రచురించిన జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ కాళ్లను నరికేయించిన చరిత్ర నిజాందని గుర్తు చేశారు. కేసీఆర్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించారు.
నిజాం నిరంకుశత్వం తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు. అలాంటి నిజాంను పొగడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నగర అధ్యక్షుడు గజం ఎల్లప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ గుప్తా, బాణాల లక్ష్మారెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శైలజ తదితరులు పాల్గొన్నారు.
నిజాంను పొగుడుతారా?
Published Sat, Jan 3 2015 4:01 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement