Autocratic rule
-
షేక్ హసీనా.. నియంతగా మారిన ప్రజాస్వామ్య ప్రతీక!
బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనా ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే ముగిసింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్యస్థాపన కోసం సైనికపాలకులతో పోరాడిన నాయకురాలు.. నేడు నియంత అనే పేరు మూటగట్టుకుని దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం నడిపిన షేక్ముజిబుర్ రెహ్మాన్ వారసత్వంతో దేశ రాజకీయాల్లోకి వచ్చిన హసీనా 1975లో దేశం మిలిటరీ పాలనలోకి వెళ్లిన తర్వాత యూరప్‌తో పాటు భారత్‌లో ఆశ్రయం పొందారు. 1981లో ఇండియా నుంచే బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి ప్రత్యర్థి ఖలీదా జియాతో కలిసి దేశంలో ప్రజాస్వామ్య పోరాటం నడిపారు. తర్వాతి పరిణామాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగి ఐదుసార్లు అధికారాన్ని చేపట్టారు. తాజాగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలపై దేశంలో చెలరేగిన ఆందోళనలు, హింసకు తలొగ్గి దేశం విడిచి తిరిగి భారత్‌కే వచ్చారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం.పోరాటం నుంచి తిరుగులేని అధికారం వైపు.. మిలిటరీ పాలనపై పోరాడేందుకు హసీనా 1981లో ప్రవాసం వీడి బంగ్లాదేశ్‌కు వచ్చారు. రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ)చీఫ్ ఖలీదా జియాతో చేతులు కలపి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడారు. 1990లో ఈ పోరాటంలో విజయం సాధించి సైనిక నియంత హుస్సేన్ మహమ్మద్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించారు. అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్, బీఎన్పీ సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి. కాకపోతే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీపై విజయం సాధించి షేక్‌హసీనా తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. కానీ ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ చేతిలో హసీనా తిరిగి ఓటమి చవిచూశారు. సైనిక తిరుగుబాటు తదనంతర పరిణామాల తర్వాత మళ్లీ 2007లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారంలోనే ఉండి బంగ్లాదేశ్‌కు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ వచ్చారు.ప్రతిపక్షమే లేకుండా అణిచివేశారు..2007లో రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత హసీనా అసలు స్వరూపం బయటపడింది. నియంతృత్వ విధానాలు అమలు చేయడం మొదలు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులు, ప్రజాసంఘాల నేతల మూకుమ్మడి అరెస్టులకు పాల్పడ్డారు. ఒక్కోసారి కొందరు నేతలు ఉన్నట్టుండి అదృశ్యమయ్యేవారు. వారి మిస్సింగ్ మిస్టరీగానే మిగిలింది. ఇంతే కాకుండా హసీనా పాలనలో ఫేక్ ఎన్కౌంటర్లు సర్వసాధారణమైపోయాయి. ఆమె హయాంలో ఐదుగురు ముస్లిం అగ్రనేతలను యుద్ధనేరాల్లో ఉరితీశారు. హసీనా నాయకత్వంలో దేశంలో ఎన్నికలు జరిగితే ప్రతిపక్షం వాటిని బహిష్కరించి పోటీకి దూరంగా ఉందంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యం ముసుగులో నియంతగా ఎలా మారారన్నదానికి హసీనా రాజకీయ జీవితం ఒక ఉదాహరణ అని ఢాకా యూనివర్సిటీ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ నజ్రుల్ అన్నారు.15 ఏళ్ల హసీనా పాలనలో పాజిటివ్ కోణం.. షేక్ హసీనా వరుస 15 ఏళ్ల పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందిందని చెబుతారు. వస్త్ర తయారీ రంగంలో మహిళలకు అత్యధికంగా ఉద్యోగాలు కల్పించడం వల్లే ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి సాధ్యమైందన్న వాదన ఉంది. హసీనా పాలనలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ కంటే ముందుకు వెళ్లింది. హసీనా పాలనలో దేశంలో పేదిరికం తగ్గడంతో పాటు దేశంలోని 17 కోట్ల మంది ప్రజల్లో 95 శాతంమందికి కరెంటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దేశం ఎందుకు వీడాల్సి వచ్చింది..ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. తొలుత ప్రభుత్వం తీసుకున్న ఈ కోటా నిర్ణయాన్ని తర్వాత ఆ దేశ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన ఈ హింసలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో హసీనా ప్రభుత్వం దిగివచ్చి కోటా విధానంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఆందోళనలు ఆగలేదు. హసీనా గద్దె దిగాల్సిందేనని, ఆమె ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు తీవ్రమయ్యాయి. చివరకు ప్రధాని అధికార నివాసాన్ని ఉద్యమకారులు చుట్టుముట్టడం.. సైన్యం హెచ్చరికల నేపథ్యంలో.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సోదరితో కలిసి హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. -
రాష్ర్టంలో నిరంకుశ పాలన
♦ తెలంగాణాను కాదు.. కుటుంబాన్ని బంగారం చేసుకుంటున్నారు ♦ కేసీఆర్ మాటలన్నీ అబద్దాలే ♦ రైతుల వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ♦ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ వికారాబాద్ రూరల్ : రాష్ర్టంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని రాష్ర్ట మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్ అక్రమాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తే ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. కొత్త కొత్త జీఓలను తీసుకువచ్చి అక్రమంగా భూములను రైతుల నుంచి తక్కువ ధరకు లాక్కుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం పొద్దున లేవగానే అబద్దాలతో స్టార్ట్ చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ప్రసాద్‌కుమార్ అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని లేనిపోని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు కుటుంబాన్ని బంగారం చేసుకుంటున్నారన్నారు. రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ చేయలేదన్నారు. రైతుల పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ రాష్ర్టంలో చాతకాని పాలన కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రత్నారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టులో లేనిపోని హామీలు ఇచ్చి ఇప్పుడు గద్దెనెక్కి రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను పట్టించుకోకుండా రాష్ర్టంలో కుటుంబ పాలన కొనసాగిస్తున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వానికి అసలు రైతాంగంపై ఇంతకుండా అవగాహన లేదన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆవుటి రాజశేఖర్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సుభాన్‌రెడ్డి, కౌన్సిలర్ మధు, సర్పంచ్ నారాయణరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, వెంటయ్యగౌడ్, ఖాలేద్, మతీన్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాంను పొగుడుతారా?
-
నిజాంను పొగుడుతారా?
వినాయక్‌నగర్ : నిరంకుశ పాలనతో ప్రజలను వేధించిన నిజాం ప్రభువులను ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడడం ఎంతవరకు సబబని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజాం ప్రభువుల పాలన బ్రహ్మాండం అంటూ కేసీఆర్ పదేపదే పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ‘‘కొమురం భీంను ఎవరు హతమార్చారు, ఎందుకు హతమార్చారు, జోడేఘాట్‌ను కేసీఆర్ ఎందుకు సందర్శించారు, వీరనారి చాకలి ఐలమ్మను హతమార్చింది ఎవరు’’ అన్న అంశాలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని యెండల డిమాండ్ చేశారు. నిజాం అరాచకాలను ఎదిరించి, రజకార్లతో పోరాడినవారికి పెన్షన్ ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. తుపాకీని పరీక్షించేందుకు బైరాన్‌పల్లిలో 84 మందిని కాల్చి చంపిన నిజాం చరిత్రను ప్రజలు మరచిపోలేదన్నారు. కేసీఆర్ చరిత్ర తిరగేసి అక్కడి మర్రిచెట్టుకు వెయ్యి ఉరిల మర్రి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలన్నారు. నిజాం కాలంలో తెలంగాణ ఆడ బిడ్డలు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే వివస్త్రలను చేసి ఆడించిన సంఘట నలు నిజాంచరిత్రలో ఉన్నాయన్నారు. అలాంటి నీచపాలన బాగుందని కేసీఆర్ పేర్కొనడం దురదృష్టకరమన్నారు. నిజాం ముక్కుపిండి పన్నులు వసూలు చేసి, ప్రపంచంలోనే ధనవంతుడిగా మారాడన్నారు. తన పాలనకు వ్యతిరేకంగా కథనాలను ప్రచురించిన జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ కాళ్లను నరికేయించిన చరిత్ర నిజాందని గుర్తు చేశారు. కేసీఆర్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించారు. నిజాం నిరంకుశత్వం తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు. అలాంటి నిజాంను పొగడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నగర అధ్యక్షుడు గజం ఎల్లప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ గుప్తా, బాణాల లక్ష్మారెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శైలజ తదితరులు పాల్గొన్నారు.