- ప్రజాస్వామ్యం కోసం పోరాటంతో గుర్తింపు
- తర్వాత ఎన్నికల్లో వరుస విజయాలు
- తిరుగులేని అధికారం చెలాయింపు
- నియంతృత్వ విధానాలతో ప్రతిష్టకు మసక
- ప్రతిపక్షాలపై ఉక్కుపాదం
- తారాస్థాయికి చేరిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు
- చివరకు దేశం వీడిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనా
బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనా ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే ముగిసింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్యస్థాపన కోసం సైనికపాలకులతో పోరాడిన నాయకురాలు.. నేడు నియంత అనే పేరు మూటగట్టుకుని దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం నడిపిన షేక్‌ముజిబుర్ రెహ్మాన్ వారసత్వంతో దేశ రాజకీయాల్లోకి వచ్చిన హసీనా 1975లో దేశం మిలిటరీ పాలనలోకి వెళ్లిన తర్వాత యూరప్‌తో పాటు భారత్‌లో ఆశ్రయం పొందారు. 1981లో ఇండియా నుంచే బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి ప్రత్యర్థి ఖలీదా జియాతో కలిసి దేశంలో ప్రజాస్వామ్య పోరాటం నడిపారు. తర్వాతి పరిణామాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగి ఐదుసార్లు అధికారాన్ని చేపట్టారు. తాజాగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలపై దేశంలో చెలరేగిన ఆందోళనలు, హింసకు తలొగ్గి దేశం విడిచి తిరిగి భారత్‌కే వచ్చారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
పోరాటం నుంచి తిరుగులేని అధికారం వైపు..
మిలిటరీ పాలనపై పోరాడేందుకు హసీనా 1981లో ప్రవాసం వీడి బంగ్లాదేశ్‌కు వచ్చారు. రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్‌పీ)చీఫ్ ఖలీదా జియాతో చేతులు కలపి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడారు. 1990లో ఈ పోరాటంలో విజయం సాధించి సైనిక నియంత హుస్సేన్ మహమ్మద్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించారు. అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్, బీఎన్‌పీ సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి. కాకపోతే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీపై విజయం సాధించి షేక్‌హసీనా తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. కానీ ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ చేతిలో హసీనా తిరిగి ఓటమి చవిచూశారు. సైనిక తిరుగుబాటు తదనంతర పరిణామాల తర్వాత మళ్లీ 2007లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారంలోనే ఉండి బంగ్లాదేశ్‌కు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ వచ్చారు.
ప్రతిపక్షమే లేకుండా అణిచివేశారు..
2007లో రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత హసీనా అసలు స్వరూపం బయటపడింది. నియంతృత్వ విధానాలు అమలు చేయడం మొదలు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులు, ప్రజాసంఘాల నేతల మూకుమ్మడి అరెస్టులకు పాల్పడ్డారు. ఒక్కోసారి కొందరు నేతలు ఉన్నట్టుండి అదృశ్యమయ్యేవారు. వారి మిస్సింగ్ మిస్టరీగానే మిగిలింది. ఇంతే కాకుండా హసీనా పాలనలో ఫేక్ ఎన్‌కౌంటర్లు సర్వసాధారణమైపోయాయి. ఆమె హయాంలో ఐదుగురు ముస్లిం అగ్రనేతలను యుద్ధనేరాల్లో ఉరితీశారు. హసీనా నాయకత్వంలో దేశంలో ఎన్నికలు జరిగితే ప్రతిపక్షం వాటిని బహిష్కరించి పోటీకి దూరంగా ఉందంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యం ముసుగులో నియంతగా ఎలా మారారన్నదానికి హసీనా రాజకీయ జీవితం ఒక ఉదాహరణ అని ఢాకా యూనివర్సిటీ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ నజ్రుల్ అన్నారు.
15 ఏళ్ల హసీనా పాలనలో పాజిటివ్ కోణం..
షేక్ హసీనా వరుస 15 ఏళ్ల పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందిందని చెబుతారు. వస్త్ర తయారీ రంగంలో మహిళలకు అత్యధికంగా ఉద్యోగాలు కల్పించడం వల్లే ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి సాధ్యమైందన్న వాదన ఉంది. హసీనా పాలనలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ కంటే ముందుకు వెళ్లింది. హసీనా పాలనలో దేశంలో పేదిరికం తగ్గడంతో పాటు దేశంలోని 17 కోట్ల మంది ప్రజల్లో 95 శాతంమందికి కరెంటు అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు దేశం ఎందుకు వీడాల్సి వచ్చింది..
ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. తొలుత ప్రభుత్వం తీసుకున్న ఈ కోటా నిర్ణయాన్ని తర్వాత ఆ దేశ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన ఈ హింసలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో హసీనా ప్రభుత్వం దిగివచ్చి కోటా విధానంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఆందోళనలు ఆగలేదు. హసీనా గద్దె దిగాల్సిందేనని, ఆమె ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు తీవ్రమయ్యాయి. చివరకు ప్రధాని అధికార నివాసాన్ని ఉద్యమకారులు చుట్టుముట్టడం.. సైన్యం హెచ్చరికల నేపథ్యంలో.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సోదరితో కలిసి హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment