
వాషింగ్టన్: జన్మత: అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిన ప్రముఖ హెచ్‌బీవో ‘యుఫోరియా’సిరీస్ నటి హంటర్ షాఫెర్ అమెరికా నూతన ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త పాస్‌పోర్ట్‌లో తన పేరుకు ముందు అబ్బాయి అని పేర్కొనడాన్ని నటి తీవ్రంగా తప్పుబట్టారు. 1998లో జన్మించిన హంటర్ 2019 ఏడాదిలో శస్త్రచికిత్స తర్వాత అమ్మాయిగా మారారు. ఆనాటి పాస్‌పోర్ట్‌లో అమ్మాయి అనే ఉంది. డ్రైవింగ్ లైసెన్స్‌లోనూ అలాగే ఉంది. కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక లెస్బియన్, గే తదితర ఎల్‌జీబీటీక్యూ+ లింగమార్పిడి వర్గాల కోసం ప్రత్యేకంగా ‘ఎక్స్’వంటి పదాలను ఉపయోగించబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్‌జీబీటీక్యూ+ వర్గాల వ్యక్తులను అమ్మాయి లేదా అబ్బాయిగా మాత్రమే ప్రభుత్వం పరిగణిస్తుంది. పుట్టినప్పటికి స్థితిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. దీంతో హంటర్ కొత్త పాస్‌పోర్ట్‌లో అబ్బాయి అని వచ్చింది. దీనిపై హంటర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘విదేశాల్లో సినిమా షూటింగ్ వేళ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా. దాంతో కొత్తగా దరఖాస్తు చేస్తే అబ్బాయి అని పేర్కొంటూ కొత్త పాస్‌పోర్ట్ ఇచ్చారు. మారిన వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం పట్టించుకోదా?. ప్రజాస్వామ్య అమెరికాలో పౌరుల హక్కులకు విలువ లేదా?. అబ్బాయి అని పేర్కొనడంతో నాకెన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. విదేశాల్లో ‘అబ్బాయి’అని ఉంటే విమానాశ్రయాల్లో, మరెన్నో చోట్ల చాలా సమస్యలొస్తాయి’’అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment