US passport
-
ఈవిడ... పాస్‌పోర్ట్‌లో ‘అతను’
వాషింగ్టన్: జన్మత: అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిన ప్రముఖ హెచ్‌బీవో ‘యుఫోరియా’సిరీస్ నటి హంటర్ షాఫెర్ అమెరికా నూతన ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త పాస్‌పోర్ట్‌లో తన పేరుకు ముందు అబ్బాయి అని పేర్కొనడాన్ని నటి తీవ్రంగా తప్పుబట్టారు. 1998లో జన్మించిన హంటర్ 2019 ఏడాదిలో శస్త్రచికిత్స తర్వాత అమ్మాయిగా మారారు. ఆనాటి పాస్‌పోర్ట్‌లో అమ్మాయి అనే ఉంది. డ్రైవింగ్ లైసెన్స్‌లోనూ అలాగే ఉంది. కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక లెస్బియన్, గే తదితర ఎల్జీబీటీక్యూ+ లింగమార్పిడి వర్గాల కోసం ప్రత్యేకంగా ‘ఎక్స్’వంటి పదాలను ఉపయోగించబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్జీబీటీక్యూ+ వర్గాల వ్యక్తులను అమ్మాయి లేదా అబ్బాయిగా మాత్రమే ప్రభుత్వం పరిగణిస్తుంది. పుట్టినప్పటికి స్థితిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. దీంతో హంటర్ కొత్త పాస్‌పోర్ట్‌లో అబ్బాయి అని వచ్చింది. దీనిపై హంటర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘విదేశాల్లో సినిమా షూటింగ్ వేళ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా. దాంతో కొత్తగా దరఖాస్తు చేస్తే అబ్బాయి అని పేర్కొంటూ కొత్త పాస్‌పోర్ట్ ఇచ్చారు. మారిన వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం పట్టించుకోదా?. ప్రజాస్వామ్య అమెరికాలో పౌరుల హక్కులకు విలువ లేదా?. అబ్బాయి అని పేర్కొనడంతో నాకెన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. విదేశాల్లో ‘అబ్బాయి’అని ఉంటే విమానాశ్రయాల్లో, మరెన్నో చోట్ల చాలా సమస్యలొస్తాయి’’అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. -
అమెరికా పాస్‌పోర్టులో కొత్త నిబంధన
వాషింగ్టన్: పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తుల పాస్‌పోర్టులపై వారి నేర చరిత్రను తెలిపేలా మార్పులు చేయాలని అమెరికా నిర్ణయించింది. పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన వారి పాస్‌పోర్టులను రద్దుచేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. తమ నేరచరిత్రను వెల్లడిస్తూ వారు తాజాగా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ‘పిల్లలపై లైంగిక దాడికి పాల్పడిన ఈ పాస్పోర్ట్దారుడు అమెరికా చట్టాల ప్రకారం విచారణ ఎదుర్కొన్నాడు’ అని పాస్‌పోర్ట్ వెనకవైపు ఉన్న కవర్ లోపల ఓ నోటీసును ముద్రిస్తారు. తొలిసారి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ నిబంధన అమలవుతుంది. ఈ చర్య ఒక వర్గానికి చెందిన నేరగాళ్లనే లక్ష్యంగా చేసుకునేలా ఉందని ఉదారవాదులు వ్యతిరేకిస్తున్నారు. 1994లో మేగన్ కంకా అనే ఏడేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి రేప్‌చేసి హత్య చేసిన అనంతరం బాలబాలికల రక్షణకు రూపొందించిన ‘అంతర్జాతీయ మేగన్ చట్టం’ ప్రకారమే ఈ మార్పులు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. -
ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యం
వాషింగ్టన్: సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యమయ్యాయి. భారత్ సహా పలు దేశాల్లో పాస్ పోర్టు, వీసా సేవలు నెమ్మదించాయి. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విదేశాల్లోని తమ పాస్ పోర్టు, వీసా కార్యాలయాల్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా కాన్సులర్ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగా అన్ని దేశాల్లోనూ తమ సేవలు ఆలస్యమయ్యాయని వెల్లడించింది. దరఖాస్తుదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సమస్యను పరిష్కరించి సేవల పునరుద్ధరణకు ప్రయత్నం జరుగుతోందని తెలిపింది. సాంకేతిక సమస్యతో న్యూఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్లలో సేవలు స్తంభించాయి. దీంతో మే 26 తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి పాస్ పోర్టులు ఆలస్యం కానున్నాయి.