
ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యం
వాషింగ్టన్: సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా సేవలు ఆలస్యమయ్యాయి. భారత్ సహా పలు దేశాల్లో పాస్ పోర్టు, వీసా సేవలు నెమ్మదించాయి. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విదేశాల్లోని తమ పాస్ పోర్టు, వీసా కార్యాలయాల్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా కాన్సులర్ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
సాంకేతిక సమస్య కారణంగా అన్ని దేశాల్లోనూ తమ సేవలు ఆలస్యమయ్యాయని వెల్లడించింది. దరఖాస్తుదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సమస్యను పరిష్కరించి సేవల పునరుద్ధరణకు ప్రయత్నం జరుగుతోందని తెలిపింది. సాంకేతిక సమస్యతో న్యూఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్లలో సేవలు స్తంభించాయి. దీంతో మే 26 తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి పాస్ పోర్టులు ఆలస్యం కానున్నాయి.