
వాషింగ్టన్: పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తుల పాస్‌పోర్టులపై వారి నేర చరిత్రను తెలిపేలా మార్పులు చేయాలని అమెరికా నిర్ణయించింది. పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన వారి పాస్‌పోర్టులను రద్దుచేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. తమ నేరచరిత్రను వెల్లడిస్తూ వారు తాజాగా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ‘పిల్లలపై లైంగిక దాడికి పాల్పడిన ఈ పాస్‌పోర్ట్‌దారుడు అమెరికా చట్టాల ప్రకారం విచారణ ఎదుర్కొన్నాడు’ అని పాస్‌పోర్ట్ వెనకవైపు ఉన్న కవర్ లోపల ఓ నోటీసును ముద్రిస్తారు.
తొలిసారి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ నిబంధన అమలవుతుంది. ఈ చర్య ఒక వర్గానికి చెందిన నేరగాళ్లనే లక్ష్యంగా చేసుకునేలా ఉందని ఉదారవాదులు వ్యతిరేకిస్తున్నారు. 1994లో మేగన్ కంకా అనే ఏడేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి రేప్‌చేసి హత్య చేసిన అనంతరం బాలబాలికల రక్షణకు రూపొందించిన ‘అంతర్జాతీయ మేగన్ చట్టం’ ప్రకారమే ఈ మార్పులు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.